* * *
Continued from Part I
గౌహతిలో గడిపిన సమయంలో ఒక అస్సామీ స్నేహితురాలు నీషాడేకా ని కలిసాను. ఆమె ఒక గాయని. మధ్య తరగతి మహిళ. ఆమె భర్త ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి. మనవైపు ప్రాంతాల్లో అలాటి హోదాలో ఉండే వ్యక్తులకంటే చాలా సాదా సీదాగా కనిపించారాయన. అది వ్యక్తిగతమనే కాక అక్కడివారి జీవన విధానాన్నిసూచిస్తోందనిపించింది.
నేను చూసిన దాదాపు పది స్థానిక కుటుంబాల్లో ఒక్కరే సంతానం. అబ్బాయి లేదా అమ్మాయి ఎవరో ఒకరే. ఎవరైనా సరే బాగా చదివించుకోవాలన్న ఆలోచన ఉంది. పిల్లల్ని పెద్ద చదువుల కోసం, ఉద్యోగాలకోసం దూరంగా పెద్ద,పెద్ద నగరాలకి పంపించే ఆలోచనలో ఉన్న తల్లితండ్రులు చాలామందే కనిపించారు. అక్కడి స్థిరత్వంలేని వాతావరణం దీనికి కొంత కారణం అనిపించింది.
నీషా ని నేను కలిసినప్పుడు మొదటిసారిగా అడిగిన ప్రశ్న ‘ఆడపిల్లకి అక్కడ సమాజం ఎలాటి అవకాశాల్ని స్థానాన్ని కలిపిస్తోంది’ అని.
నీషా వాళ్ల అమ్మమ్మ కాలంలో ఆడపిల్లకి చదువులు లేవని, బాల్య వివాహాలు ఉండేవని, ఇప్పుడు మాత్రం తల్లిదండ్రులు ఆడపిల్లకి చక్కని చదువు, కెరియర్ ని అందిస్తున్నారని, ఆతర్వాతే పెళ్లి అని చెప్పిందామె.
‘2015 జనవరి నెలలో అస్సాం ముఖ్యమంత్రి ఆడపిల్లలకి ప్రోత్సాహకాల్ని ప్రకటించారు కదా, అలాంటిది ఎందువల్ల అవసరం అయిందని’, అడిగినప్పుడు , గౌహతి నగరం కాక మారుమూల ప్రాంతాల్లో,గిరిజనుల్లోని వివిధ తెగల్లో అవిద్య ఎక్కువగా ఉందని, అందువల్ల ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతూ వస్తోందని ,అందువల్లే ఈలాటి ప్రోత్సాహకాలు అవసరం అవుతున్నాయని అంది.
గౌహతిలో తమిళుల ఆద్వర్యంలో ప్రైవేటుగా నడుపబడుతున్న ఒక బాలాజీ మందిరం ఉంది.ఇది విశాలమైన ఆవరణలో అందంగా కట్టబడిన దేవాలయం. శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయం గౌహతిలో నీలాంచల్ కొండ మీద ఉంది. నగరం ప్రధాన రహదారి నుండి మూడు కిలోమీటర్ల ఘాట్ రోడ్ మీద ప్రయాణించి ఇక్కడికి చేరవలసి ఉంది. సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న అతి ప్రాచీన మైన దేవాలయం ఇది. దేశంలో అత్యంత శక్తి వంతమైన , ప్రాముఖ్యత కల్గిన దేవాలయాల్లానే ఇక్కడా భద్రతా ఏర్పాట్లు అంతంత మాత్రంగానే కనిపించాయి.
లెదర్ బ్యాగులు, ఆడవాళ్ల హ్యాండ్ బ్యాగులు బయట లాకర్లలో పెట్టినా, మొబైల్ ఫోన్లు, కేమరాలు మాత్రం దేవాలయం లోపలికి అనుమతించారు. దర్శనానికి 50,100,500 రూపాయల టికెట్లు ఉన్నాయి. శెలవు దినాలు, పర్వ దినాలు ఇక్కడ అత్యంత రద్దీ ఉంటుంది. అలాంటప్పుడు ధర్మ దర్శనం చాలా సమయం పడుతుంది. రద్దీ ఉన్న రోజుల్లో ప్రత్యేక దర్శనం చేసుకోవాలంటే కేవలం 500 రూపాయల టిక్కెట్లు మాత్రమే లభ్యమవుతాయి.
మేము హోలీ రోజున వెళ్లటం వలన దేవాలయమంతా ఖాళీగా ఉంది. ధర్మ దర్శనం క్యూలో నిలబడి కేవలం రెండు గంటల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. ఇక్కడ మేకల్ని, పావురాలని ఆలయ ప్రాంగణంలోనే బలి ఇస్తున్నారు. వాటి హృదయ విదారకమైన ఆర్తనాదాలు గుండెల్లో మోయలేని దిగులుని పుట్టీస్తాయి. హోలీ రోజు కావటంతో, సందర్శకుల సంఖ్య అతి తక్కువగా ఉండటం వలన కాబోలు దేవాలయానికున్న మరో ప్రవేశ మార్గంలో ఎలాటి భద్రతాఏర్పాట్లూ కనిపించలేదు. అనేక మంది యువతీ, యువకులు హోలీ రంగులు చల్లుకుంటూ దేవాలయ ప్రాంగణమంతా రంగునీళ్లతో ముంచెత్తారు. బహుశా పండుగ పేరుతో అలాటి అనుమతి లభించి ఉండవచ్చు.
గర్భాలయంలోకి ప్రవేశించేందుకు అతి చిన్నవైన మెట్ల మీదుగా క్రిందకి దిగవలసి ఉంటుంది. అక్కడ ఉన్న పూజారి చిన్న ప్రమిద వెలుగులో దేవతా మూర్తిని చూబిస్తారు. అక్కడ ఒక ప్రక్కనుండి జల నిరంతరం ఊరుతూంటుందని చెప్పారు . ఆలయం బయట దాదాపు పది పన్నెండు దుకాణాల్లో పూజాసామగ్రి, వెదురు, తోలు తో చేసిన హ్యాండ్బ్యాగులు, బొమ్మలు అమ్మకానికి ఉన్నాయి.
ప్రపంచంలోనే చిన్నదైన నదీద్వీపం ‘పీకాక్ ఐల్యాండ్’ గౌహతిలోని బ్రహ్మపుత్ర నదిలో ఉంది. ఆ ద్వీపంలో ఉమానంద ఆలయం ఉంది. పడవలో ప్రయాణించి ఆ ద్వీపాన్ని చేరుకోవచ్చు. శివుడు, అమ్మవారు, ఆంజనేయుడు అక్కడ కొలువైఉన్నారు . నది మీద పడవ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంది.
బ్రహ్మపుత్ర వరదల గురించి ప్రతి సంవత్సరం అలవాటుగా వినే మనకు ఆ పడవ ప్రయాణంలో సడిలేకుండా నెమ్మదిగా కదిలే బ్రహ్మపుత్ర ప్రవాహం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇక్కడొక తమాషా జరిగింది. ఉమానందా ఆలయం చేరేందుకు సందర్శకులకోసం అస్సాం ప్రభుత్వం లాంచిలను నడుపుతోంది. అది కాక అనేక చిన్న చిన్న పడవల వాళ్లు స్వతంత్రంగా నడుపుతున్నారు. ఒక చిన్న పడవ నడిపే వ్యక్తి మమ్మల్ని నది దాటించి, వెనక్కి తీసుకురావటానికి 1200 రూపాయల రుసుము అడిగేడు. మాకు తోచినంత బేరం చేసి మొత్తానికి పడవలో మాయాత్ర ముగించుకు వచ్చేం. కాని ఒడ్డుకు చేరేక ప్రభుత్వ లాంచిలో కేవలం పది రూపాయలతో నదిని దాటించి వెనక్కి తీసుకువస్తున్నారని తెలిసి ఆశ్చర్యం వేసింది.అమాయకంగా కనిపించే ఈ స్థానికుల గడుసుదనం చూసి నవ్వొచ్చింది. కానీ వారి జీవికకి ఈ పడవ ప్రయాణాలలో వచ్చిందే ఆధారమని తెలిసినప్పుడు వారి స్థితికి బాధ కలిగింది.
సువాల్ కుచ్చి అనే ప్రాంతంలో ప్రతి సంవత్సరం పడవపందేలు జరుగుతాయని తెలిసింది.
గౌహతి నుండి మేఘాలయ ముఖ్య పట్టణం షిల్లాంగ్ వెళ్ళేందుకు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసేం. అది 132 కిలోమీటర్ల దూరం. రోడ్ బావుంది. దారిలో కొన్ని చోట్ల రోడ్డును మరింత వెడల్పు చేస్తున్నారు. రోడ్ పనిలో నిమగ్నమైన వాళ్లు చాలా వరకూ టీనేజ్ యువకులే. 3 గంటల్లో షిల్లాంగ్ చేరాం. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండి, దారి పొడావునా కొండలు, ఆకుపచ్చని వృక్ష సంపదా, ముఖ్యంగా పైనాపిల్ చెట్లు, పైన్ చెట్లు రోడ్ కి ఇరువైపులా తోడు వచ్చాయి. మేఘాలయ రాష్ట్రం పేరుకి తగినట్లుగానే అక్కడ ఆకాశంలో మేఘాలు మనకు అతి సమీపంలో చేతికి అందుతాయా అన్నట్లు కదులుతూంటాయి.
షిల్లాంగ్ 1972 లో అస్సాం నుండి విడగొట్టిన మేఘాలయ రాష్ట్రంలో కలిసిపోయింది. దీనిని ‘స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్’ అని పిలుస్తారు. జనాభా 3లక్షల దాకా ఉన్నారు. రోడ్లన్నీ ఎత్తుపల్లాలతో ఉన్నాయి. రోడ్లమీద ద్విచక్రవాహనాలు చాలా తక్కువగాకనిపించాయి. ఆ రోడ్లు ట్రాఫిక్ జామ్ కి పెట్టింది పేరు అని మాక్యాబ్ డ్రైవర్ ముందుగానే హెచ్చరించాడు. అది చాలా చోట్ల మా అనుభవం లోకి రానే వచ్చింది. ఈ నగరం సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ప్రజలు ప్రధానంగా క్రిస్టియన్ మతస్థులు. ఇక్కడ ఇంగ్లీషు, హిందీ, ఖాసీ, గారో, అస్సామీస్ భాషలు మాట్లాడుతారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అతి సుందరమైన నగరం షిల్లాంగ్. ఇక్కడ ముఖ్యంగా ఖాసి, గారో, జెయిన్ టియా తెగల వాళ్లు ఉన్నారు. సందర్శకులకు అక్టోబర్-నవంబరు మాసాలు, లేదా మార్చ్, ఏప్రిల్ మాసాలు అనుకూలమైనవి.
ఇక్కడ వేసవులు ఎక్కువ ఉష్ణోగ్రతను, చలికాలం అతి తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. జూన్ నుండి ఆగష్ట్ నెల వరకూ వర్షం కురుస్తుంది.
షిల్లాంగ్ నగరంలో ‘వార్డ్ సరస్సు’ కృత్రిమమైన సరస్సు. దీని చుట్టూ ఏర్పాటు చేసిన విశాలమైన పార్క్ చిన్న వైన ద్వీపాలతో , నీటి పైన ఏర్పాటు చేసిన అందమైన వంతెనతో కనువిందుచేస్తుంది. ఈ సరస్సులో పడవ విహారానికి ఏర్పాట్లున్నాయి. సరస్సు చుట్టూ పూల మొక్కలు, పచ్చిక బయళ్లతో చాలా అందంగా ఉంది. ఈ పార్క్ ‘హార్స్ షూ’ ఆకారంలో ఉంది. ఇది రాజ్ భవన్ కు అతి సమీపంలో ఉంది. ఇక్కడ కేఫెటేరియా సందర్శకులకు అవసరమైన టీ, స్నాక్స్ అందిస్తుంది.ప్రక్కనే బొటానికల్ గార్డెన్స్ కూడా ఉన్నాయి.
సమీపంలోని ఉమియామ్ లేదా బారాపానీ అనే పెద్ద సరస్సు వాటర్ స్పోర్ట్ స్ కు పేరు పొందింది. ఇక్కడున్న స్టేట్ మ్యూజియమ్ ఖాసీ తెగ ప్రజల గురించిన వివరాలను అందిస్తుంది. అలాగే బటర్ ఫ్లై మ్యూజియమ్ కూడా అనేకరకాల సీతాకోకచిలుకలతో చూడముచ్చటగా ఉంది.
ఇక్కడ గోల్ఫ్ కోర్స్ ప్రసిధ్ధి చెందింది. ఆసియా లో ఉన్న అత్యున్నతమైన గోల్ఫ్ కోర్సుల్లో ఇది ఒకటి . నగరంలో అనేక సుందరమైన చర్చిలు ఉన్నాయి. షిల్లాంగ్ నగరం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలెఫెంట్ జలపాతాలు చూడదగ్గవి. ఇది ఈ ప్రాంతంలో ప్రసిద్ధిపొందిన పిక్నిక్ స్పాట్.ఇక్కడ కొన్ని హిందీ సినిమా షూటింగులు కూడా జరిగేయని చెప్పారు స్థానికులు.
పోలీసు బజార్ ప్రాంతం షిల్లాంగ్ నగరంలో అతి ముఖ్యమైన ప్రాంతం. సాయంత్రాలు అక్కడ రోడ్ల మీద జరిగే అనేక వ్యాపారాలు చూసేందుకు, షాపింగ్ చేసేందుకు సరదాగా అనిపిస్తాయి. మేము సాయంత్ర సమయంలో అక్కడికి చేరినప్పుడు చాలా చలిగా ఉంది. అక్కడ ఉన్ని దుస్తుల్లో సందర్శకులూ, స్థానికులూ ఆ రద్దీ రోడ్లలో హడావుడిగా తిరుగుతూ కనిపించారు. రోడ్ మీద ఒక ప్రక్కన కుంపట్ల మీద సిధ్ధంచేసిన శనగలు, వేరుశనగకాయలు, కండెలు వేడి,వేడిగా అమ్ముతున్నారు. వీటన్నిటిమధ్యా అక్కడి వాతావరణం మమ్మల్ని మరొక లోకంలోకి తీసుకుపోయింది.
ఆ రోడ్ల మీద బ్యాగులు, చేతితో నేసిన షాల్స్, రకరకాల ఫ్యాన్సీ వస్తువులు గుట్టలు పోసి అమ్ముతున్నారు. ఇక్కడ షాల్స్, ముఖ్యంగా ఎరుపు, నలుపు చారలతో నేసిన షాల్స్ ఈ ప్రాంతానికే ప్రత్యేకమైనవి. అవికాక వెదురు తో అల్లిన వివిధ వస్తువులు, కమలా పూలతో చేసిన తేనె ప్రత్యేకంగా అమ్ముతున్నారు ఇక్కడ.
నగరంలోని ‘షిల్లాంగ్ పీక్’ పైన నివసించినట్లుగా నమ్మే ఒక సూపర్ పవర్ ‘లీషిలాంగ్’ పేరు మీదుగా షిల్లాంగ్ కి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఈ పీక్ కొనదేలినట్లు కాక అర్థవృత్తాకారంలో ఉండి , సముద్ర మట్టానికి 6,500 అడుగుల ఎత్తున ఉంది. ఇక్కడ నుండి షిల్లాంగ్ నగరాన్ని విహంగ వీక్షణం చెయ్యవచ్చు.
మేఘాలయ రాష్ట్రంలో మాతృస్వామ్య సమాజాన్ని చూస్తాము. ఆడ మగ నిష్పత్తి ఇక్కడ వెయ్యిమంది పురుషులకి 974 ఉండగా, భారతదేశంలో ఆ నిష్పత్తి 923మాత్రమే ఉంది . క్యాబ్బ్ డ్రైవర్ చెప్పిన సమాచారం ప్రకారం ఇక్కడి ఖాసీ తెగల కుటుంబాలలో ఆడపిల్ల పుట్టినప్పుడు కలిగే ఆనందం మగ పిల్లవాడు పుట్టినప్పుడు కనపడదు. పెళ్లి తర్వాత అబ్బాయి తను పుట్టిపెరిగిన ఇల్లు వదిలి భార్య ఇంటికి వెళ్లిపోవాలి. ఆడపిల్లలకి మాత్రమే ఆస్తి హక్కు ఉంది. కుటుంబంలోని ఆఖరి ఆడపిల్లకి తల్లిదండ్రుల బాధ్యతతో పాటు వారి ఇల్లు, ఆస్తి స్వంతం అవుతాయి.
అబ్బాయిలు ఇంటి పనులకి, పిల్లల పనులకి పరిమితమవుతారు. మగవారు ఆర్థిక పరమైన నిర్ణయాలు చేయలేరని అక్కడి వారి అభిప్రాయం. ఇంకా మగవాళ్లు నిర్వహించే పనులేమిటని అడిగినప్పుడు మా క్యాబ్ డ్రైవర్ నిరాశగా చెప్పాడు, ‘లడ్కాలోగ్ క్యా కరేగా, ఖాలీ ఘర్ కా కామ్ కరేగా, దారూ పీకే సోయేగా’ అంటూ.
ఇక్కడ రెస్టొరెంట్లలో రుచికరమైన ఉత్తరాది భోజనం దొరుకుతుంది.చక్కని రోటీ, బిర్యానీ, రకరకాల కూరలు దొరుకుతాయి. మేఘాలయలో కుక్కమాంసాన్ని కూడా ఆహారంగా ఉపయోగిస్తారు. అందువలన కాబోలు కుక్కలు అస్సలు కనిపించలేదు .
షిల్లాంగ్ నుండి తూర్పు ఖాసీ కొండల్లో ఉన్న చిరపుంజికి బయలు దేరేం.అది దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దారులన్నీ కొండలను తొలిచి వేసినవే.కొండలను ఆనుకుని,లోయల అంచుల్లో ఆ సన్నని దారుల వెంట ప్రయాణం, అదీ ప్రక్కన ఎలాటీ రెయిలింగ్ లేకపోవటం కొన్నిచోట్ల భయం కలిగిస్తుంది. క్యాబ్ డ్రైవర్ మాత్రం రోడ్లను వెడల్పు చెయ్యటం వలన కొన్ని కొన్ని చోట్ల డ్రైవింగ్లో మజా పోయింది అని చెప్పాడు.
చిరపున్జి ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతంకలిగిన ప్రాంతంగా పేరుపొందింది. అయితే కొద్ది సంవత్సరాలుగా చిరపుంజి కి బదులు మాసిన్రామ్ అనే మరో ప్రాంతం పేరు వినిపిస్తోంది. రెండుప్రాంతాలు మధ్య దూరం కేవలం 12కిలో మీటర్లు మాత్రమే. ఇక్కడ వర్షపాతాన్ని మిల్లీ మీటర్ల రూపంలో కాకుండా అడుగులలో కొలుస్తారంటే ఆ తీవ్రతను ఊహించవచ్చు. మేము ఇక్కడ తిరిగినప్పుడు కూడా సన్నని జల్లులు పలకరిస్తూనే ఉన్నాయి.
చిరపున్జి సముద్ర మట్టానికి 1290 మీటర్ల ఎత్తులో ఉంది. నవంబరునుండీ ఫిబ్రవరి వరకూ చలికాలం . మార్చ్ నుండి మే వరకు వేసవికాలం. కానీ అప్పుడుకూడా వర్షాలు పడుతూంటాయి.*ఇక్కడ వర్షాలు లేని ఆరు నెలల కాలం మంచినీటికి కటకట లాడవలసిన పరిస్థితులు. ఇది విస్మయాన్ని కలిగించే వాస్తవం.ఎత్తైన ఈ ప్రాంతంలో కురిసిన ప్రతి వర్షం చుక్కా క్రిందనున్న లోయల్లోకి ప్రవహించటమే దీనికి కారణం.
మే నెల నుండి సెప్టెంబరు దాకా కురిసే భారీ వర్షాల వలన ఏర్పడిన వర్షపునీరు ఈ ప్రాంతమంతా చిన్నచిన్న నదులుగా రూపాంతరం చెంది ప్రవహిస్తూ ఉంటుంది.
చిరపున్జి కి వెళ్తున్న దారిపొడవునా అనేక జలపాతాలు, కళ్ళు తిప్పుకోనివ్వని ఆకుపచ్చని లోయలు కనువిందు చేస్తాయి. ఇక్కడ నోకా లికాయ్ అనే జలపాతం భారతదేశంలోనే ఎత్తైన ది. ఇది ప్రపంచంలో నాలుగవ ఎత్తైన జలపాతం.
ఇక్కడ కాలికాయ్ అనే మహిళ పేరు మీదుగా ఈ జలపాతం పేరు వచ్చిందని చెబుతారు. భర్తను పోగొట్టుకున్న కా లికాయ్ తన కూతురితో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఆమె మరొక వివాహం చేసుకున్నప్పుడు రెండవ భర్త సవతి కూతుర్ని ద్వేషిస్తూంటాడు. కా లికాయ్ ఒకరోజు పొలం పనికి వెళ్ళినప్పుడు అతను ఆ సవతి కూతుర్ని చంపి,ఆ మాంసంతో వంట చేస్తాడు. ఆమె పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చికూతురికోసం చూస్తుంది. అంతలోనే అలసటతో భర్త వండిపెట్టిన భోజనం చేస్తుంది. ఆ తర్వాత ఆమె అక్కడి ఆనవాళ్లను బట్టీ తన కూతుర్ని ఆ రోజు భోజనంగా వండినట్లు గ్రహించి, అంతులేని దుఃఖంతో ఇల్లు వదిలి పరుగెత్తి ,పరుగెత్తి వెళ్లి అక్కడ ఉన్న ఎత్తైన జలపాతంలో దూకి ఆత్మ హత్య చేసుకుంటుంది. అప్పటి నుండి ఆ జలపాతానికి నో కా లికాయ్ ఫాల్స్ అనే పేరు వచ్చింది. నో కా లికాయ్ అంటే ‘లీప్ ఆఫ్ లికాయ్’ అని అర్థం. ఇక్కడ దాల్చినచెక్క, తేనె అమ్ముతున్నారు గిరిజనులు.
ఇక్కడ సెవెన్ సిస్టర్స్ జలపాతం ఒకటి ప్రసిధ్ధి చెందింది. ఈ జలపాతాల అందాలను విస్మయంతో చూసి ఆనందించటమే కానీ వర్ణింపశక్యం కాదు.
చిరపుంజి ప్రాంతాన్నిప్పుడు సొహ్రా అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది పూర్వపు పేరే. బ్రిటిష్ వాళ్లు పలకలేక దానిని చుర్రా అని పిలవటంతో క్రమేపీ చిరపుంజిగా మారింది. కాని ఇప్పుడు తిరిగి సోహ్రా అని వ్యవహరిస్తున్నారు. భారతదేశ పటంలో కూడా ఈ పేరే కనపడుతుంది.
చిరపుంజికి ఆరు కిలోమీటర్ల దూరంలో మాస్మాయ్ గుహలు ఉన్నాయి. చాలా అందమైన పర్యాటక స్థలం ఇది. ఇవి లైమ్ స్టోన్ తో ఏర్పడినవి. దీని మొత్తం పొడవు కేవలం నూటయాభై మీటర్లు. కానీ దీనిలోకి ప్రవేసించినప్పుడు దారి క్రమంగా సన్నబడి , మరింత సన్నని దారుల్లోకి ప్రవేసిస్తాము. కొంచెం ప్రయత్నం తో లోపలికి వెళ్లచ్చు. గుహలోపల విద్యుత్తు ఏర్పాటు ఉంది. లైమ్ స్టోన్ నిలవలు సంవత్సరాల తరబడి రకరకాల ఆకారాలు ప్రోది చేసుకుని ఈ గుహలకు అద్భుతమైన రూపును ఇచ్చాయి. దీనిలోనికి ప్రవేసించేందుకు ఇరవై రూపాయల ప్రవేశ రుసుము ఉంది. ఒక మార్గం గుండా గుహలోనికి వెళ్లి మరొక మార్గం గుండా బయటకు వచ్చే దారి ఉంది. ఇది కొంచెం కష్టమనిపిస్తుంది కానీ చక్కని అనుభవం .గుహల చుట్టూ అరణ్యం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది జైన్టియా కొండల మీద ఉంది.
సందర్శకులు ఇక్కడ ఖాసీ ప్రజల వస్త్రధారణలో ఫోటో తీసుకునే అవకాశం ఒక స్టూడియో కల్పిస్తోంది.
చిరపుంజిలొ ఆకాశవాణి రిలే స్టేషన్ ఉంది. ఇది ఎఫ్.ఎమ్ . ఫ్రీక్వెన్సీ మీద ప్రసారాల్ని అందిస్తోంది.
చిరపుంజి లో రామకృష్ణ మిషన్ స్కూల్ ఉంది. దాదాపు నూటపాతిక మంది విద్యార్థులు, విద్యర్థినులు అక్కడ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నారు. స్కూల్లో ఈశాన్య రాష్ట్రాల గురించిన చరిత్ర , ప్రజల జీవనశైలెని వివరించే ఒక మ్యూజియుమ్ ఉంది. అది తప్పక చూడతగినది.
చిరపున్జి అందాలు ఎంత వర్ణించినా తక్కువే. ఈ ప్రాంతాలన్నీ కేవలం రోడ్డు దారిన ప్రయాణించవలసి ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రయాణించేందుకు 37వ, 40 వ నెంబరు జాతీయ రహదారులు ఉన్నాయి. అవి ఇంకా వెడల్పు చేస్తున్నారు. మోదీ గవర్నమెంటు ఈశాన్య రాష్ట్రాలలో రహదారులకు, రవాణాకు భారీ బడ్జెట్ ను కేటాయించింది.
*కానీ ఇంకా ఇక్కడ టోల్ గేట్లు లేక పోవటం ఆశ్చర్య పరుస్తుంది. ఇప్పుడిప్పుడే టోల్ గేట్ల నిర్మాణం జరుగుతోంది. మన వైపు రహదారులు పూర్తి కాకుండానే వసూలు చేసే టోల్ పధ్ధతికి ఇది భిన్నంగా ఉంది.
ఈశాన్య రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పెంచుకుందుకు, జీవనప్రమాణాల్ని మెరుగుపరుచుకుందుకు మార్గాల్ని వెతకవలసిన అవసరం చాలా ఉంది.దాని వలన ఇక్కడి ప్రజలలో ఆర్థిక పరమైన ఒక భద్రతని కలిగించవలసిఉంది.
Continued in Part III
Pingback: ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part I – ద్వైతాద్వైతం
Pingback: ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part III – ద్వైతాద్వైతం
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike