* * *
Continued from Part II
షిల్లాంగ్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో మాలినాంగ్ అనే చిన్న గ్రామం ఉంది. ఇది 2003 లో ఆసియాలోనే అతి శుభ్రమైన గ్రామం గా, 2005 సంవత్సరంలో భారత దేశంలో అతి శుభ్రమైన గ్రామంగా పేరుకెక్కింది .ఇది గాడ్స్ ఓన్ గార్డెన్ గా పేరు పొందింది.
ఇక్కడ రివర్ వ్యాలీ ఇకోపార్క్ 2014, డిసెంబరులో ఏర్పాటైంది. దీనిని చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ప్రక్కనే నడక దూరంలో ఉన్న రివాయ్ గ్రామంలో లివింగ్ రూట్ బ్రిడ్జిలు ఉన్నాయి. మేఘాలయలోని ఈ లివింగ్ రూట్ బ్రిడ్జిలు డబుల్ డెక్కర్ బ్రిడ్జిలు, సింగిల్ డెక్కర్ బ్రిడ్జిల రూపంలో ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. చిరపుంజి నుండి లివింగ్ రూట్ బ్రిడ్జి చేరేందుకు ట్రెక్కింగ్ చెయ్యటం ఒక సాహసం. దీనికి ధైర్యం, శక్తి రెండూ అవసరమే. ట్రెక్కింగ్ ద్వారా వెళ్లలేనివారు కొండమార్గంలో ప్రయాణించి ఇక్కడికి చేరవచ్చు.ఈ లివింగ్ రూట్ బ్రిడ్జిలు ప్రకృతిలోనే సహజంగా బలమైన వేళ్లు పెనవేసుకునిపోయి (బ్రిడ్జి) వంతెనల రూపాన్ని సంతరించుకుని ఇక్కడి వాగులు పైన ఏర్పడ్డాయి.
కొన్ని బ్రిడ్జిలు సుమారు 100 అడుగుల పొడవు కలిగి ఉంటాయి. ఇంత పొడవు కలిగిన (బ్రిడ్జి)వంతెన పూర్తిగా తయారయేందుకు పదిహేనేళ్ల దాకా పడుతుంది. ఒకసారి పూర్తిగా తయారైన (బ్రిడ్జి)వంతెన ఒకేసారి దాదాపు యాభై మంది బరువును తట్టుకోగలిగిన శక్తిని కలిగి ఉంటుంది. ఈ వేళ్లు జీవశక్తితో నిరంతరం పెరుగుతూనే ఉండి ఆ వంతెనలని మరింత శక్తిమంతం చేస్తున్నాయి. అది వాటి ప్రత్యేకత.
మాలినాంగ్ గ్రామంలోకి ప్రవేశించేందుకు పది రూపాయలు ప్రవేశ రుసుము చెల్లించాలి. ఆక్కడి వీధులు శుభ్రంగా తళతళలాడుతూ ఉంటాయి. 4,5 సంవత్సరాల చిన్నచిన్న పిల్లలు కూడా చీపురు, చేట పుచ్చుకుని నిరంతరంగా అలా శుభ్రం చేస్తూ ఉంటారు.
ఇళ్లు కళాత్మకంగా కట్టబడి ఉండి, డిష్ టీవీ వంటి సౌకర్యాలతో ఉన్నాయి. ప్రతి ఇంటికి పూలమొక్కలతో ఫెన్సింగ్ ఉంది. బట్టలు ఆర వేసుకుందుకు తీరైన చక్కని తీగలు కట్టుకున్నారు. ముఖ్యంగా చెప్పుకోవలసింది అక్కడ ఏ వీధిలోకూడా మురికి నీరు, మరేవిధమైన నీరూ వృధాగా ప్రవహిస్తూ కనిపించలేదు. వాళ్లు తమ పల్లెలో ఆ అడవి మధ్య చక్కని డ్రైనేజీలను కట్టుకున్నారు. అక్కడ ఇంజనీర్లు ప్రత్యేకం ఎవరూ లేరు. స్థానికులే ఆ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు.
బయటి ప్రపంచం నుండి వచ్చే పర్యాటకులు వాళ్ళ ప్రైవసీ కి అడ్డం అనిపించింది . కాని పర్యాటకుల వలన వాళ్లకి ఆదాయం వస్తుంది కనుక వాళ్లు సందర్శకులను సాదరంగా ఆహ్వానిస్తారు.అక్కడ కొందరు ఆడవాళ్లు పళ్ళు, తేనె , పాకం పట్టిన మరమరాలు అమ్ముతున్నారు . ఆ అడవి నీరు , స్వచ్చమైన గాలి , అక్కద దొరికే పళ్ళు , అక్కడి సాత్విక భోజనం వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతున్నాయి .
ఆ గ్రామం, చుట్టుప్రక్కల ప్రకృతి సౌందర్యాన్ని చూసేందుకు 85 అడుగుల ఎత్తులో చెట్ల పైన వెదురు కర్రలతో, కర్రలతో చేసిన నిచ్చెనలతో ఒక మంచె ఏర్పాటు చేసారు. అది ఎక్కేందుకు 20 రూపాయల రుసుము వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేసిన సొమ్ము గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఉపయోగిస్తారు. ఆ మంచె మీద నుండి అక్కడి ప్రకృతిని విహంగ వీక్షణం చెయ్యవచ్చు.
ఆ సమీపంలోనే బంగ్లా దేశ్ సరిహద్దు చూసేందుకు నాలుగు పొడవాటి చెట్లపైన ఏర్పాటుచేసిన మంచె కూడా ఉంది. ఈ మంచెల పైకెక్కిఅక్కడి పరిసరాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభవం.
మాలినాంగ్ లో రాత్రి బస చేసేందుకు గెస్ట్ హౌస్ లు రెండు ఉన్నాయని చెప్పారు. అది కాక చెట్ల మీద ఏర్పాటు చేసిన కాటేజీలు ఉన్నాయి. అక్కడ జనాభా దాదాపు 150-200 వరకూ ఉంటుంది. రాళ్లను కొట్టే పనిలో ఆడపిల్లలు ఉన్నారు. చాలా మంది పదిహేనేళ్లు ఇరవై ఏళ్ల మధ్య వయసున్నతల్లులు కనిపించారు. 5,6 సంవత్సరాల వయసున్న అబ్బాయిలు అక్కడ అడవిలో దొరికే పైనాపిల్, అరటి, కమలా ఫలాలను ముక్కలు చేసి అమ్ముతున్నారు. ఆ పసి వాళ్లని చూసినప్పుడు జీవితాల్లోని కాఠిన్యం అర్థమైంది .
ఈ ప్రాంతంలో అందరూ ఇంగ్లీషులో కూడా మాట్లాడుతున్నారు . అక్కడ ఇంగ్లీషు మీడియంలో నడుపుతున్న స్కూల్లో 8 వతరగతి వరకూ ఉంది. ఆపైన చదువులకు షిల్లాంగ్ కానీ దగ్గరలోని పట్టణాలకి కానీ వెళ్తారు. మేము మాలినాంగ్ లో ఆ మధ్యాహ్నం భోజనం చేసేం. చిన్న చిన్న టీ దుకాణాలు, భోజన దుకాణాలు ఉన్నాయి. అవన్నీ ఆడపిల్లల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. 80 రూపయలకు ప్లేటునిండా తెల్లని వరి అన్నం, చిక్కుడుకాయ కూర, బంగాళాదుంప కూర , పలుచని పప్పు వడ్డించారు. ఆహారం చాలా సాత్వికంగా ఉంది. కూరలు వుడికించి ఉప్పు వేసి వడ్డించారు.భోజనం చాలా బావుంది. మాతృ స్వామ్య విధానం అక్కడి సమాజంలో ప్రతిఫలిస్తొంది. సీజన్ లో కొన్ని వందల మంది సందర్శకులు వస్తూంటారని చెప్పారు అక్కడివారు.
ఇక్కడి అడవుల్లో చెట్ల క్రింద పడిన ఆకుల్ని కూడా తుడిచి,ఎత్తి బుట్తలకు ఎత్తుతున్నారు. ప్రధాని మోదీ మనకు ఇచ్చిన ‘స్వచ్చభారత్’ నినాదానికి అచ్చమైన ప్రతీక లా ఉంది ఆ గ్రామం.
ఆ అపురూపమైన గ్రామాన్ని వదిలి వస్తూంటే ఒక్కటే అనిపించింది………. ఇక్కడి గ్రామంలోని డ్రైనేజీ వ్యవస్థకానీ, లివింగ్ రూట్ బ్రిడ్జిలు కాని, ఇక్కడి ప్రజలు కానీ తమవైన ప్రత్యేకమైన అస్థిత్వాలను తామే స్వయంగా రూపుదిద్దుకుంటున్నారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దానికి బయటనుండి వేరెవరూ తోడ్పడే అవసరము లేదు.
గౌహతి నుండి కాజీరంగా నేషనల్ పార్క్ కి రోడ్డు దారిలో ప్రయాణం చేసాము. అస్సాంలోని గోలఘాట్, నాగావ్ జిల్లాల మధ్యలో ఈ పార్క్ ఉంది. గౌహతి నుండి ఇది 217 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ జాతీయ మార్గం చాలా బావుంది. ఈ పార్క్ 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లో ఉంది. 1985 సంవత్సరంలో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపద గా ప్రకటించింది . దీని ప్రధాన ద్వారం కొహరా గ్రామంలో ఉంది. దీనికి దగ్గరలోని నగరాలు జోర్హట్, తేజ్పూర్. చలికాలంలో ఇక్కడ వలస పక్షులు చూడవచ్చు.
ఈ పార్క్ లో ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవి దున్నలు, జింకలు, ఇంకా అనేక వన్య మృగాలు, పక్షులు ఉన్నాయి. ప్రపంచంలోని ఒంటి కొమ్ము ఖడ్గమృగాల్లో మూడింట రెండోవంతు ఇక్కడ ఉన్నాయి.
ఈ పార్క్ జూన్ నెల నుండి సెప్టెంబరు వరకూ మూసి ఉంటుంది అక్టోబర్ నుండి మే వరకు కొంత వరకూ వాతావరణ అనుకూలత ను బట్టి తెరిచి ఉంటుంది. నవంబరు ఒకటి నుండి ఏప్రిల్ ముప్ఫై వరకు ఆరునెలల పాటు పూర్తిగా తెరిచి ఉంటుంది. ప్రొద్దున్న 5.15 నుండి సాయంత్రం ౩.౩౦ తెరిచి ఉంటుంది.
ఇక్కడ ఏనుగు సఫారి, జీప్ సఫారి లు ఉన్నాయి. జీప్ సఫారి కి వెళ్లేందుకు వాహనానికి పదిహేను వందలు నుండి రెండువేల వరకు జోన్ల వారీగా నిర్ణయించిన రుసుము ఉంది. ఒక్కో జీప్ కు ఐదుగురు ప్రయాణించొచ్చు. మనిషికి ఒక్కోవంద చొప్పున రుసుము ఉంటుంది.
Continued in Part IV
Pingback: ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part IV – ద్వైతాద్వైతం
Pingback: ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part II – ద్వైతాద్వైతం
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike