* * *
రొటీన్ లోంచి కాస్త మార్పు తెచ్చుకుని, జీవితం పట్ల మళ్లీ ఉత్సాహం కలిగించుకుందుకు దేశం నలుమూలలకీ వెళ్లి రకరకాల అనుభవాల్ని మూటగట్టుకుని తెచ్చుకోవటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు వారం రోజులుగా ఈ అమృతయాత్రలో ఉన్నాను. చిన్ననాడు భూగోళ పాఠాల్లో చదువుకుని, చూడాలని కలలుగన్న ప్రాంతం ఇది. వచ్చివెళ్లిన అనుభవం, మళ్లీ వచ్చివెళ్లిన జ్ఞాపకమూ ఉన్నా మరోసారి వెళ్దామంటూ మనసు మారాం చేస్తూనే ఉంటుంది. తీరని దాహంలా తయారైంది ఈ ప్రాంతం పట్ల నా ఆశ. తిరుగుప్రయాణం దగ్గర పడుతున్న కొద్దీ మరి కొన్నాళ్లుందామని మనసు కొసరుతోంది.
ఆరోజు సాయంత్రం దిగులుగా మరోసారి పట్టణ వీధుల్లోకి నడిచా. ఆ పట్టణమేదో సాధారణమైంది కాదుసుమా. అత్యంత విశిష్టతను కలిగినది. శతాబ్దాలుగా గొప్ప చరిత్రను స్వంతం చేసుకుంది. దేశవిదేశాలనుంచీ జనాన్ని తన ఆకర్షణతో లాక్కొచ్చేస్తుంటుంది.
అక్కడ ఉన్నది ఆధ్యాత్మికమైన శక్తో మరేదో తెలియదు. అనంతంగా ప్రవహించే ఆ గంగానది, అతి నిరాడంబరంగా నిలిచి ప్రపంచాన్ని నిశ్శబ్దంగా చూసే ఆ శివాలయం, చిరునవ్వుతో పిలిచే ఆ అన్నపూర్ణాలయం, ఒకదాని వెనుక ఒకటిగా రెండు విగ్రహాలను ప్రతిష్టించుకున్న ఆ విశాలాక్షి ఆలయం, ఆ జనసమ్మర్దం నిండిన వీధులు, ఆ కిటకిటలాడే బనారస్ చీరల దుకాణాలు, లెక్కకు తేలని మఠాలు, స్టేషన్ లో దిగిన వారిని ఆప్యాయంగా పలకరించి బస గురించి వివరాలిచ్చి, వారిని ఎక్కించుకుని పరుగెత్తే టాంగాలు, రిక్షాలు, పెద్దపెద్ద ఆటోలు, రోడ్ల మధ్య స్వేచ్ఛగా…