బిట్టు – తాతయ్య డ్రగ్స్ – ఆరవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Apr, 2018

* * *

నేపథ్యం : ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు- అందుకని చాలా అనుమానాలు వస్తుంటాయి వాడికి. ఊళ్లో సైకిల్ రిపెయిర్ షాపు నడిపించే వీరబాబు కూతురి పిల్లలు దావీదు, చిట్టి వాడి స్నేహితులు. ఇక చదవండి…

అర్థ రాత్రి అవుతుండగా బిట్టుకి మెలకువ వచ్చింది. చుట్టూ చూస్తే అందరూ నిద్రలో ఉన్నారు. వరండాలోకి వెళ్లి చప్పుడు చేయకుండా చూసాడు… రెయిన్బో కనిపించలేదు! “ఏమయ్యాడు వాడు?” అని ఒక్క నిముషం ఖంగారు పడినా, లోపలికి వచ్చి చూస్తే తాతయ్య మంచం క్రింద మరింత ముడుచుకుని పడుకుని ఉన్నాడు వాడు.

ఇంతలో ఎవరో దగ్గిన శబ్దం వినిపించింది బిట్టుకి. అందరివైపు చూసాడు. ఎవరూ కదల్లేదు. తాతమ్మ గదిలోకి వెళ్లి చూసి వచ్చాడు. ఆవిడ నిద్రపోతోంది.. అంతలోనే మళ్ళీ శబ్దం వచ్చింది…బయట వాన శబ్దంలోంచే.. నిద్రపోతున్నవాళ్లకి వినపడకపోయినా, మెలకువగా ఉన్న బిట్టుకి తెలుస్తోంది.

శబ్దం ఇంటి ప్రక్కన ఉన్న సందులోంచి వస్తున్నట్లుంది… “ఎవరై ఉంటారు? ఏమి చెయ్యాలి?” అని ఆలోచించాడు. “తాతయ్యని కానీ, అమ్మమ్మని కానీ లేపాలా? తనే చూడాలా? లేక దావీదుని లేపాలా?” అని తేల్చుకోకుండానే టార్చి లైటు వేసి వాకిలి ముందు, పెరటి వైపు చూసాడు. ఎవరూ కనిపించలేదు.

“సందులో సన్ షేడ్ లో ఎవరైనా వచ్చి నిలబడ్డారా? అక్కడ చూడాలంటే తలుపులు తాళం తియ్యాలి. ఎలా? చప్పుడైతే తాతయ్య లేస్తారేమో…”

నెమ్మదిగా దావీదుని లేపాడు. సైగలతో వరండాలోకి తీసుకొచ్చి గుసగుసలాడాడు. రెయిన్బోగాడు లేచాడు ఇంతలో. చిట్టి కదులుతోంది. రెయిన్బో గాడు ఎప్పుడూ అనవసరంగా అరవడు. అందులో అందరూ నిద్రపోతున్నప్పుడు. చిట్టి లేచి వరండాలోకి వచ్చింది. ఏమిటన్నట్టు సైగ చేసింది. చుట్టూ చూసి వీధి గేటు గడియ తీసి ఉందని గమనించింది. బిట్టు ఆశ్చర్య పోయాడు. తను కానీ, దావీదు కానీ గమనించనే లేదు. అందుకే అమ్మమ్మ చిట్టిని మెచ్చుకుంటూ ఉంటుంది. ‘ఆడపిల్ల, అన్నీ వివరంగా చూస్తుంది’ అంటూ. తమకి ఏదైనా పని అప్పజెప్తే చేసి వచ్చేస్తారు. కానీ చిట్టి మాత్రం ఆ పని పూర్తిగా చేసి చుట్టూ పరిసరాలు మరోసారి గమనించి మరీ వస్తుంది.

“అయితే ఎవరో ఇంట్లోకి వచ్చారన్న మాట. దొంగలేమో!” ఆ ఆలోచన బిట్టుకి భలే థ్రిల్ ని ఇచ్చింది. “సినిమాల్లో చూసినట్టు ఇప్పుడు తామంతా దొంగని పట్టుకుని పోలీసులకి అప్పగిస్తారా?” గుసగుసగా అన్నాడు ‘పోలీసులకి ఫోన్ చేద్దమా, దొంగ వచ్చాడు మన ఇంట్లోకి, అని?!’ అంటూ.

చిట్టి తల అడ్డంగా ఊపింది. “వానలో దొంగ ఎందుకొస్తాడు? పట్టుబడితే వాడు పరుగెత్తాలన్నాకష్టమే కదా. ఎవరో వానలో తడిసి ఉంటారు, తల దాచుకోవటం కోసం ఇంట్లోకి వచ్చి ఉంటారు” అంది. రెయిన్బో గాడికి ఏమర్థమైందో ఏమోగానీ తోక మాత్రం తెగ ఊపేస్తున్నాడు. అంతలోనే తాతయ్య లేచి వచ్చారు ఈ గుసగుసలకి. వస్తూనే వరండాలో లైటు వేసారు.

‘ఏమిటర్రా, నిద్ర్రపోకుండా ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ?’ అన్నారు.

‘తాతయ్యా, ఎవరో గేటు తీసుకుని మన ఇంటి లోపలికి వచ్చారు. నేను దొంగ అంటుంటే చిట్టి మాత్రం ఒప్పుకోవట్లా. ఎవరో వాన వస్తోందని, నీడ కోసం లోపలికి వచ్చారని అంటోంది’ అన్నాడు బిట్టు.

తాతయ్య ఇంటి చుట్టూ లైట్లు వేసి వరండా తాళం తీసి, ‘ఎవరదీ’ అంటూ బయటకి నడిచారు. పిల్లలు, రెయిన్బో కూడా వెనకే వెళ్లారు.

ఎవరో ఒక అపరిచితుడు- యాభై ఏళ్లకు పైబడి ఉంటాయి- తలమీదుగా దుప్పటి ముక్క కప్పుకుని, చలికి వణుకుతూ, నిలబడి ఉన్నాడక్కడ: ‘అయ్యా, తప్పైపోయింది! చలికి, వానకి తట్టుకోలేక గేటు తీసుకుని లోపలికి వచ్చాను. దొంగని కాదు బాబూ!’ అన్నాడు దీనంగా.

తాతయ్య వెంటనే అతన్ని వరండాలోకి పిలిచి కూర్చోమని చెప్పి, లోపలికెళ్లి పాత పైజమా, చొక్కా తెచ్చి తొడుక్కోమని ఇచ్చారు. వంటింట్లోకెళ్లి అన్నం గిన్నె చూసి అన్నం, కూర తెచ్చి ఇచ్చి, వేడిగా టీ కూడా పెట్టి ఇచ్చారు.

బిట్టు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు: రాత్రి పూట అందరూ నిద్రపోతుంటే గేటు తీసుకుని వచ్చి, సందు గుమ్మంలో షేడ్ క్రింద కూర్చున్న క్రొత్త మనిషిని, ‘ఇట్లా లోపలికి ఎందుకు వచ్చావు?’ అని కోప్పడకుండా, అతని ఆకలిని పట్టించుకొని, అన్నం పెట్టి, పొడి బట్టలు ఇచ్చిన తాతయ్య- “బలే గొప్పవాడు కదా!” అనుకున్నాడు. “నేను కూడా అలా తాతయ్యలా గొప్పగా ఉండాలి!” అనుకున్నాడు.

తెల్లవారే సరికి తాతమ్మ కొంచెం కొంచెం దగ్గుతోంది. వాన తగ్గిపోయింది; అయినా కాస్త చల్లగా ఉన్నది వాతావరణం. అదే తాతమ్మకి దగ్గు తెప్పించినట్లుంది.

తాతయ్య ఆఫీసునుంచి వచ్చి ‘అమ్మా, మిరియాల కషాయం త్రాగేవా?’ అని అడిగేరు. ‘తాగేనురా. ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఏదైనా మాత్ర పట్టుకురా’ అంది తాతమ్మ.

తాతయ్య సైకిల్ తీసేసరికి బిట్టు సిద్ధంగా ఉన్నాడు. తాతయ్యతోపాటు తనూ మందుల షాపుకి వస్తానని బయలుదేరాడు. తాతాయ్య షాపులోకి వెళ్లాక, బయట మెట్ల మీద నుంచుని చుట్టూతా చూసాడు. అటుపైన తలెత్తి షాపు పేరు చదివితే ఇంకేముంది- అమ్మో,!! ‘చిన్ని డ్రగ్ హౌస్’ అని ఉంది!

“తాతయ్య ఆరోజు ‘డ్రగ్స్ చెడ్డవి’ అని చెప్పాడు కదా?! మరి ఇప్పుడు ఇక్కడ ఏదో కొంటున్నాడు ఏమిటి?” అని బిట్టుకి చాలా అనుమానం వచ్చింది.

అంతలోనే తాతయ్య దుకాణం నుండి ఏదో కొనుక్కొచ్చి ‘పదరా’ అన్నారు. వెంటనే బిట్టు ‘తాతయ్యా, మీరు తెచ్చింది డ్రగ్సేనా?” అని అడిగాడు.

“అవును, తాతమ్మకోసం!” అన్నాడు తాతయ్య. ‘ఎందుకు ఇలా అడుగుతున్నాడు?’ అని ఆశ్చర్యపోతూ. “వెంటనే ఆ డ్రగ్స్ తీసుకెళ్ళి దుకాణంలో వెనక్కి ఇచ్చెయ్ తాతయ్యా!’ అన్నాడు బిట్టు సీరియస్‌గా. తాతయ్య తెల్లబోయాడు. ‘ఏమైంది బిట్టూ?’ అన్నాడు.

‘తాతయ్యా, నువ్వు ఆరోజు ఏమి చెప్పేవు? ‘డ్రగ్స్ చెడ్డవి’ అన్నావా లేదా? ఇప్పుడేమో తాతమ్మకి డ్రగ్స్ కొంటున్నావా?’ అన్నాడు బిట్టు అసహనంగా.

తాతయ్య పడీ పడీ నవ్వాడు: ‘సారీ నాన్నా!

* * *

Advertisements

బిట్టు-మట్టివాసన – ఐదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Feb, 2018

* * *

నేపథ్యం : ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు కదా, చాలా అనుమానాలు వస్తుంటాయి వాడికి. ఇక ఊళ్లో సైకిల్ రిపెయిర్ షాపు నడిపించే వీరబాబు కూతురి పిల్లలు దావీదు, చిట్టి. ‘వాళ్ళు చదువుకోవాలి’ అని వీరబాబు కోరిక. ఇక చదవండి..

 

మొదటి రోజు దావీదు అయిష్టంగానే వచ్చాడు. వాడు వీరబాబుతో చెప్పాడుట, ‘నేను సైకిల్ పని బాగా నేర్చుకుని, పెద్ద కొట్టు పెట్టుకుంటాను, చదువొద్దు’ అని.
‘కానీ చదువు ఎందుకు అవసరం’ అని బిట్టు వాళ్ల తాతయ్య వివరంగా చెప్పారు అందరికీ: “ఏ పని చేసినా కొంచెం చదువు, కొంచెం ఆలోచన ముఖ్యం. ఆ కొంచెం చదువు కూడా లేకపోతే ఆలోచించే శక్తి సరిగ్గా రాదు. అంతేకాదు, ఈ రోజుల్లో చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది; జీవితం బావుంటుంది. మరొకరికి సాయం చేసే అవకాశం ఉంటుంది కూడా” అని. పిల్లలు ముగ్గురూ బుద్ధిగా విన్నారు.

తాతయ్య చెబుతుంటే మెల్ల మెల్లగా తెలుగు అక్షరాలు నేర్చుకోవటం మొదలెట్టారు బిట్టు, దావీదు. అప్పటికే చిట్టికి తెలుగు చదవటం, రాయటం వచ్చు బాగానే. అందుకని ఇప్పుడు తను వీళ్ళతోబాటు కూర్చొని ఇంగ్లీషు అక్షరాలు, హిందీ అక్షరాలు మొదలెట్టింది.

కొన్ని రోజులు గడిచే సరికే చాలా మార్పు వచ్చింది. పిల్లలిద్దరికీ కూడా చిన్న చిన్న పదాలు చదవటం వస్తోంది ఇప్పుడు. తాతయ్య రోజూ వాళ్లకి వార్తా పత్రిక హెడ్డింగులు చూపించటం మొదలు పెట్టాడు. వాటిలో కొన్ని పదాలు, కొన్ని అక్షరాలు గుర్తు పట్టటం, చదవటం, ఫలానా పదం ఎక్కడ ఉన్నది? అని ఒకరు అడిగితే మిగిలిన ఇద్దరూ పేజీలో అంతా వెతికి కనుక్కోవటం- అదొక ఆటలాగా తయారైంది పిల్లలకి.

‘చదువు అనేది అసలు ఇంత సులభం అని గానీ, ఇంత ఆనందం కలిగిస్తుంది’ అని గానీ అనుకోలేదు దావీదు. స్వతహాగా వాడు చాలా తెలివైన వాడు. ఒకసారి చదువు రుచి తెలిసాక, ఇక వాడు దూసుకు పోయాడు. అక్షరాలు చదవటం, పదాలు చదవటంలోంచి, వాక్యాలు చదవటంలోకీ, వాక్యాలు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించటంలోకీ వచ్చేసాడు. ప్రతిరోజూ మధ్యాహ్నం పూటంతా వీరబాబు దగ్గర సైకిల్ షాపులో కూర్చుంటున్నాడు. వాడిలో మంచి మార్పు కనిపించటం మొదలెట్టింది వీరబాబుక్కూడా… ఆరోజు వార్తాపత్రిక మొదటిపేజీలో ‘డ్రగ్స్ వినియోగంతో చెడు దారి పడుతున్న యువత’ అంటూ ఒక వార్త కనిపించింది వీళ్లకి.

‘డ్రగ్స్ అంటే ఏమిటి తాతయ్యా? అవి ఎందుకు చెడ్డవి?’ అంటూ ప్రశ్నలు అడిగేసేరు దావీదు, బిట్టు.

“కొన్ని రకాల కెమికల్స్‌కు మత్తు ఎక్కించే లక్షణం ఉంటుంది. వాటిని ఎవరైనా వాడారనుకో, ఆ తర్వాత వాళ్ళకి ఇంక ఎప్పుడూ ‘అవే కావాలి, మళ్ళీ కావాలి’ అని అనిపిస్తుంటుంది. అవి చాలా ఖరీదువి కూడా. అందుకని చూస్తూండగానే వాళ్ల దగ్గరున్న డబ్బులు అన్నీ ఖర్చయిపోతాయి. అంతే కాక అవి వాళ్ల నెర్వస్ సిస్టంని నాశనం చేసేస్తాయి. దాంతో ఇంక వాళ్ళకు ఏ పని చేసేందుకూ శక్తి లేకుండా పోతుంది. అందుకనే ప్రభుత్వం వాటిని ఎవ్వరూ వాడకూడదు అని రూల్స్ పెట్టింది” చెప్పాడు తాతయ్య.

“సారాయి కూడా అంతే కదండి” అన్నాడు దావీదు, అకస్మాత్తుగా కళ్లనీళ్ళు పెట్టుకొని. వాడికిప్పుడిప్పుడే తమ కుటుంబ పరిస్థితి అర్థం అవుతోంది. వాళ్ల నాన్న రోజూ తాగి వచ్చి, వాళ్ల అమ్మని కొడతాడు; వాళ్ల అమ్మ సంపాదించిన డబ్బుల్ని కూడా ఎత్తుకుపోతాడు; ఇంకా కావాలంటాడు- ఇవన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చి వాడు దిగులుగా అయిపోయాడు.

తాతయ్య తల ఊపాడు. “సారాయిని ఊరి బయట దుకాణాల్లో అమ్ముతారు, కానీ డ్రగ్స్‌ ఇంకా ప్రమాదం. వాటిని ఎవ్వరూ అట్లా కూడా అమ్మేందుకు లేదు, కొనేందుకు లేదు.

‘మా నాన్న రోజూ తాగి ఇంటికి వచ్చి మా అమ్మని కొడతాడు తాతగారూ’ అన్నాడు దావీదు.‘నువ్వు బాగా చదువుకోవాలి దావీదూ! అప్పుడు నువ్వు చెప్పిన మాటకి విలువ ఉంటుంది. మీ నాన్న చెడు అలవాటుని మాన్పించచ్చు. సరేనా, దిగులు పెట్టుకోకు!’ అంటూ బుజ్జగించారు తాతయ్య. ‘బీడీ కూడా మంచిది కాదా తాతగారూ?’ అని అడిగాడు దావీదు, బీడీలు కాల్చే తాత వీరబాబుని గురించి ఆలోచిస్తూ.

‘మంచిది కాదురా దావీదు, అలాంటి అలవాట్లు ఊపిరి తిత్తుల వ్యాధులకీ, కాన్సర్‌కీ దారితీస్తాయి’ చెప్పాడు తాతయ్య.

“బీడీలు కూడా మంచివి కావట. తాతచేత బీడీలు మాన్పించాలి” మనసులోనే నిశ్చయం చేసుకున్నాడు దావీదు.రోజూ సాయంత్రం చదువులయ్యాక, పిల్లలకి ఏదో ఒక ఫలహారం పెడుతుంది అమ్మమ్మ. పెరట్లో జామచెట్టు నీడన కూర్చుని, అందరూ కబుర్లు చెప్పుకుంటూ తినాలంటే బిట్టుకి, చిట్టికి, దావీదుకి బలే సరదాగా ఉంటుంది. వీళ్లందరి మధ్యా రెయిన్బో కుక్క గాడు బుద్ధిగా కూర్చుని తను కూడా ఫలహారాన్ని రుచి చూస్తూ ఉంటాడు. అలాటి సన్నివేశం తమ కుటుంబంలో ఎప్పటికైనా చూస్తానా అని ఆలోచన వచ్చినప్పుడలా దావీదుకు మనసులో చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడే వాడు నిశ్చయించుకున్నాడు: “మా చెల్లెల్ని, తమ్ముళ్లని నేనే పైకి తీసుకు రావాలి’ అని.

బిట్టుకి తనకుగా తాతమ్మతో సమస్య లేదు- పైగా తనను బోలెడు ముద్దు కూడా చేస్తుంది. కానీ రెయిన్బో గాడిని చూస్తే గొడవ చేస్తుంది. వాడిని తన గదిలోకి అస్సలు రానివ్వదు. ‘రెయిన్బోకి స్నానం చేయించాను తాతమ్మా’ అని చెప్పినా ఊరుకోదు. ‘ఒరేయ్, నువ్వు ఆ కుక్కపిల్లని వేసుకు తిరిగేవంటే మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పేస్తా, నిన్ను తీసుకెళ్లి పొమ్మని’ అంటూ బెదిరిస్తుంది కూడా. “‘ప్రాణులందరినీ ప్రేమించాలి’ అని తాతయ్య, అమ్మమ్మ చెబుతుంటే, ఈ తాతమ్మ ఏంటి, అందరికంటే అంత పెద్దదై ఉండి కూడా రెయిన్బోని విసుక్కుంటోంది?” అని బిట్టుకి కోపం.

ఆఖరికి తాతయ్యని అడిగేసేడు: “తాతయ్యా, తాతమ్మ ఎప్పుడూ రెయిన్బోని విసుక్కుంటుంది. వాడిని అసలు ప్రేమించదు- ఎందుకు?’” అని. వాడి ముఖంలో సీరియస్‌నెస్ చూసి తాతయ్య నవ్వేసాడు. “తాతమ్మకి ఇష్టమేరా! కానీ తన బట్టలు, పక్క తొక్కుతాడని భయం. రెయిన్బో ఇంట్లోనూ, పెరట్లోనూ తిరుగుతూ ఒళ్లంతా మట్టి చేసుకుంటాడు కదా, మనమైతే మట్టి అంటుకుంటే వెంటనే కడిగేసుకుంటాం. కానీ తాతమ్మ గబుక్కున లేవలేదు. ఆవిడకి ఎవరైనా సాయం చేస్తే కానీ ఏ పనీ చేసుకునే ఓపిక ఉండదు. అందుకే తన గురించి ఎవరిననీ ఇబ్బంది పెట్టకూడదని, జాగ్రత్తగా ఉంటుందిరా బిట్టూ! ఎప్పుడైనా మనం ఎదుటివారిని అర్థం చేసుకోవాలి కానీ తప్పుగా అనుకోకూడదు, తెల్సిందా?” అది విన్న తర్వాత బిట్టూకి తాతమ్మ అంటే మరింత ఇష్టం కలిగింది.

అప్పటినుంచీ వాడు తాతమ్మని మరింత జాగ్రత్తగా చూసుకోవటం కూడా మొదలెట్టాడు. రోజూ ప్రొద్దున్నే తాతమ్మకి రాగి జావ తీసుకెళ్లటం, ఆవిడ జావ త్రాగేసాక ఖాళీ కప్పుని తీసుకెళ్ళి వంటింట్లో పెట్టటం, రాత్రి పడుకోబోయే ముందు తాతమ్మకి దుప్పటి కప్పి, చిన్న లైటు వేయటం, ‘నిద్ర వస్తోందా’ అని అడిగి తెలుసుకుని, ‘రావట్లేదు’ అంటే కాస్సేపు దగ్గర కూర్చొని కబుర్లు చెప్పటం.. “నేను ఇక్కడే ఉంటే బావుండు కదా, తాతమ్మకి సాయంగా?!” అని కూడా కొద్ది కొద్దిగా ఆలోచించటం మొదలెట్టాడు.

ఆరోజు ప్రొద్దున అకస్మాత్తుగా వాన పడింది. తర్వాత ఇక రోజంతా మబ్బు మబ్బుగానే ఉంది. మధ్యాహ్నం అవుతుండగా మళ్ళీ ఓ చిన్న వాన మొదలైంది. వాననీటిలో తడుస్తున్న మొక్కల్ని చూస్తూ వరండాలో కూర్చున్న బిట్టూ,మెల్లగా లేచి వరండా అంచుకు వెళ్ళాడు. వాన నీటి తుంపరలు మీద పడుతుంటే కిలకిలా నవ్వుతూనే “హాచ్..చ్చ్” మని రెండు తుమ్మలు తుమ్మేసాడు. అమ్మమ్మ గబుక్కున లోపల్నించి వచ్చి, వాడి రెక్క పుచ్చుకుని లోపలికి తీసుకొచ్చింది:

“వానలో తడిస్తే జలుబు చేస్తుందిరా, బిట్టూ! తడవకు. కావాలంటే కాగితం పడవలు చేసుకుందాం- నువ్వూ నేర్చుకున్నట్లు ఉంటుంది. పారే నీళ్లలో పడవలు వదలచ్చు- సరదాగా ఉంటుంది. ఉండు, కాగితాలు తెస్తాను!’ అంటూ అమ్మమ్మ లోపలికి వెళ్ళింది. ‘ఈ పడవలు ఏమిటి?’ అని చూస్తున్నాడు బిట్టు. అంతలో అమ్మమ్మ కాగితాలు తెచ్చి పడవలు ఎట్లా చెయ్యాలో నేర్పింది. వాన సన్నగా కురుస్తున్నప్పుడు నీళ్లు కాలువ కట్టిన చోట పడవలు వదిలి పెట్టి చూపించింది బిట్టూకి. పడవలన్నీ ఒకదానినొకటి ఒరుసుకుంటూ వంగిపోతూ, ఊగుతూ పోతుంటే బిట్టు సంతోషంతో గెంతులు వేసాడు. అకస్మాత్తుగా బిట్టు గట్టిగా శ్వాసను ఎగబీల్చి అన్నాడు: ‘అమ్మమ్మా, ఏదో వాసన వస్తోంది. ఏం వండుతున్నావ్, నాకోసం?!’

‘స్టవ్ మీద ఏమీ లేదురా, నీకు ఏం వాసన వస్తోంది?!‘ అని వాడిని అడిగిన క్షణంలో ఆ వాసనని పసిగట్టింది అమ్మమ్మ. ‘ఇది మట్టి వాసనరా!’ అంది. బిట్టు అర్థం కానట్టు చూసాడు. ‘మట్టి వాసన?!” అమ్మమ్మ వివరంగా చెప్పింది- “చాలా రోజుల తర్వాత కొత్తగా వాన పడినప్పుడు, మట్టి తడుస్తుంది కదా, అప్పుడు ఇట్లా ఒకలాంటి కమ్మని వాసన వస్తుందిరా! దీన్ని మట్టి వాసన అంటారు. సిటీల్లో‌ చాలా ప్రాంతాల్లో మట్టికి ఈ వాసన ఉండదు మరి ఎందుకో” అని.

బిట్టు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. ‘అబ్బ, ఎంత బావుందో!’ అనుకున్నాడు. వెంటనే వాన మీద ఒక కవిత రాసేసాడు కూడా :

టప్ టప్ మంటూ వాన, అల్లరి చేస్తూ వాన
మట్టిని తడిపే వాన
కమ్మని వాసన వాన
ఎండని తరిమిన వాన
ఎంచక్కా వాన!
ఏడురంగుల ఇంద్రధనస్సుని తెచ్చేవాన!

రెయిన్బో ప్రసక్తి వచ్చి బిట్టు ముఖం మీద నవ్వులు పూసాయి.

మధ్యాహ్నం వానతో వాతావరణం చల్లబడింది. వేసవి వాన అందరికీ గొప్ప సంతోషాన్నిచ్చింది. సాయంకాలం చదువులు పూర్తి అయ్యే సరికి మళ్ళీ సన్నగా వాన మొదలైంది. “దావీదూ, చిట్టీ, మీరిద్దరూ ఇవాళ్ల ఇంటికి వెళ్లకండి- ఇక్కడే పడుకోండి సరదాగా ” అన్నది అమ్మమ్మ. వాళ్లని తీసుకెళ్ళేందుకు గొడుగు వేసుకొచ్చిన వీరబాబుతోటీ ఆ మాటే అన్నది. ‘ఎందుకులేమ్మా, తమకు శ్రమ’ అన్న వీరబాబు మాటల్ని తాతయ్య కొట్టి పారేసాడు: ‘మంచి పిల్లలు…శ్రమ ఏముంది వీరా!’ అంటూ.

దాంతో అందరూ భోజనాలు చేసేసి పెందరాడే పక్కల మీదకి చేరారు. వరండాలో గ్రిల్ తలుపు ఉంటుంది. దానికి తాళం వేసేసి, పోయి రెయిన్బోని చూసొచ్చారు అందరూ. వాడు పాలన్నం తినేసి, చక్కగా దుప్పట్లో ముడుచుకొని పడుకున్నాడు అప్పటికే .

మట్టి వాసన కమ్మదనం నిద్రలోనూ తెలుస్తోంది బిట్టూకి- “దిల్లీలో ఎప్పుడూ ఇలాటి వాసన రాదు: అసలు వానే రాదుగా?!” అనుకున్నాడు నిరాశగా. “అమ్మకి చెప్పాలి.. వాన, మట్టి కలిసిన వాసన గురించి” అనుకున్నాడు నిద్రపోతూనే.

 

* * *

జాన్ జాక్ రూసో ‘సామాజిక ఒడంబడిక’ అనువాదం – అలకనంద ప్రచురణలు – Jan, 2018

* * *

IMG_20180121_175526759

రూసో 18 వ శతాబ్దంలో రాసిన సోషల్ కాంట్రాక్ట్ పుస్తకం అనువదించే అవకాశం నాకు చాలా థ్రిల్లిచ్చింది. కాలేజీ రోజుల్లో చదువుకున్న రాజనీతి శాస్త్ర పాఠాలు జ్ఞాపకానికొచ్చాయి.

‘మనిషి పుట్టుకతో స్వేచ్చాజీవి అయినా సర్వత్రా సంకెళ్ల మధ్య జీవిస్తున్నాడన్న’ రూసో ప్రతిపాదన అప్పటి సమాజాన్ని ఒక కుదుపు కుదిపింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి సూత్రాల ఆధారంగా ఏర్పడిన ఫ్రెంచి విప్లవాన్ని ఇది అమితంగా ప్రభావితం చేసింది.

స్వేచ్ఛ వ్యక్తికి ప్రాణవాయువు. సమాజంలోని ఇతర వ్యక్తులతో కలిసి శాంతియుత వాతావరణంలో భద్రంగా జీవించేందుకు ఇలాటి స్వేచ్ఛని, తన ప్రయోజనాల్ని వదులుకుని సమిష్టి  ప్రయాజనాలకోసం ఒక ఒప్పందానికి వస్తాడు. సహజంగానే తను వదులుకున్న వాటికంటే ఉత్తమమైన ప్రయోజనాన్నే పొందదలచుకుంటాడు.

వ్యక్తులు, ప్రభుత్వాలు, సమాజాలు వీటన్నిటి మధ్యా ఉన్న సంబంధాలను రూసో చర్చించాడు. అదే ఈ పుస్తకానికి ప్రత్యేక అస్తిత్వాన్ని ఇచ్చింది. క్రొత్త ఆలోచనలు రేకెత్తించింది.

రూసో వ్యక్తిగత జీవితంలో పదేళ్ల పిల్లవాడుగా తల్లిదండ్రుల ఆదరణ కోల్పోయి, పరుగు పందెంలాటి జీవితాన్ని గడపవలసి రావటం స్వేచ్ఛ, సంకెళ్ల మధ్య సంబంధాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందుకు దారితీసిందేమో అనిపిస్తుంది.

ఏ విషయాన్నైనా మెదడుతో కాక మనసుతో మాత్రమే చూసే అలవాటు వల్ల నేను ఇంతకు మించి ఈ పుస్తకం గురించి చెప్పను.

ఈ అనువాదం ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ గా మాత్రం చెప్పగలను.

* * *

రాత్రి గడిచింది – అడుగు – అంతర్జాల సాహిత్య మాసపత్రిక – Dec, 2017

* * *

రాత్రి గడిచింది!

దీపపు సెమ్మెల పహరాతో అలసిన అరేబియా

బద్ధకంగా ఒత్తిగిల్లింది!

అలలెరుగని సముద్రపు వాకిట్లో గోర్వెచ్చని స్పర్శ

నగరాన్ని నిద్ర లేపింది!

నీటి అంచున ఆటలాడిన ఆకాశహర్మ్యాలు

అంతలో అంతర్ముఖమైపోయాయి!

శతాబ్దాల విక్టోరియా టెర్మినస్ పేరు మార్చేసుకుంది,

సడలని రాచదర్పం నిటారుగా నిలబడే ఉంది!

నగరపు అడుగుల కింద పరుగెడుతున్న కాలం,

గమ్యం చేరే తొందరలో ప్రవాహ జనం.

అగమ్య గోచరమవుతున్నలయ!

తోసుకొచ్చే వేలవేల ముఖాలు,

తిరిగి చూసే వ్యవధి లేవంటున్నాయి.

పగటిని చీకట్లు పలకరించే వేళ

గమ్యాలు మారాయి, దిక్కులూ మారాయి.

వాలుతున్న సాయంకాలాల వెనుక

వడితగ్గిన మానవ సమూహాలు!

సనాతనమైన పరుగు ఆపి వెనక్కి చూడాలని ఉంది,

అలసిన ముఖాలు, అలజడి నిండిన ముఖాలు

అభావంగా కదులుతున్న చైతన్యాలు,

క్షణమాగి ఈ దారిలో నిలబడనా?

నువ్వూ నిలబడు,

మనం ఎన్నో పంచుకోవలసి ఉంది.

ఒకరినొకరం పొదువుకోవలసి ఉంది.

దుఃఖపు జీరల గొంతుల్ని పెనవేసుకోవలసి ఉంది.

అరక్షణమాగితే,

చిరునవ్వుల బురఖాలు వదిలి,

మేకప్ లు కడిగి, ఆరేసి, స్వచ్ఛంగా వెలిగే క్షణాలకోసం,

పగలంతా ఇంటిదన్ను వెతుక్కున్న ముఖాలు

* * *

 

తాతమ్మ పళ్లు – బిట్టు కథలు – నాలుగవ భాగం – కొత్తపల్లి కథల పుస్తకం – Jan, 2018

* * *

ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. అక్కడ తాతయ్య వాళ్ళ అమ్మ- ‘తాతమ్మ’ కూడా ఉంది. బిట్టుకు తాతమ్మని చూస్తే ఆశ్చర్యం. మరి తాతమ్మ ఎప్పుడూ పళ్ళు తింటుంది!

తాతమ్మ కబుర్లు చెబుతుంది, కానీ బిట్టుకి మటుకు ఆ కబుర్లు అన్నీ అర్థం కావు.

వాడికి చాలా అనుమానాలు: ‘ఆవిడ తాతయ్య దగ్గర చంటిపిల్లలా ప్రవర్తిస్తుందేమిటి? తాతయ్యకి అమ్మ కదా, అయినా అన్ని విషయాలు తాతయ్యనే అడుగుతుంది ఎందుకు? చేతికర్ర ఉన్నది కదా, అయినా తాతయ్య చెయ్యి పట్టుకుని నడుస్తుంది ఎందుకు?

చేతికర్ర ఎప్పుడూ వదలదేమి? చిన్నపిల్లలాగా తప్పటడుగులు వేస్తుంది ఎందుకనో? ఒక్క పన్నూ లేదు; అయినా ఎప్పుడూ నోరు కదుపుతూనే ఉంటుంది- ఏం తింటుంది, అస్తమానూ?’ అని బిట్టుకి ప్రశ్నలు.

అయినా తాతమ్మని అడగలేదు. ‘అడిగితే ఏమనుకుంటుందో!’ అని అనుమానపడ్డాడు వాడు. ‘చిన్నప్పుడు చాలా ఎక్కువ స్వీట్లు తినేసి ఉంటుంది! అమ్మ చెబుతుందిగా, ‘స్వీట్లు ఎక్కువ తింటే పళ్లు పాడైపోతై; ఊడిపోతై’ అని; బహుశ: తాతమ్మకి ఎవ్వరూ చెప్పలేదేమో, ఆ సంగతి!’

ఒక రోజు తాతమ్మ మరీ వింతగా చేసింది. “నాకు అన్నం తినాలని లేదురా, నిద్రవస్తోంది” అని చెప్పేసి, అట్లాగే పడుకొని నిద్రపోయింది. అమ్మమ్మ వచ్చి ఎన్నిసార్లు లేపినా లేవదు! “నన్ను లేపకే మణీ! నాకు ఆకలి వేసినప్పుడు లేచి తింటాను. మీరంతా తినెయ్యండి!’ అనేసి ఒత్తిగిలి, మరోప్రక్కకి తిరిగి, పడుకుంది.

‘ఆరోగ్యం బాగాలేదో, ఏమో. మనం తినేద్దాం. సాయంత్రానికి కూడా లేవకపోతే అప్పుడు తాతయ్య డాక్టరును పిలుచుకువస్తారు’ అంది అమ్మమ్మ.

మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి, పడుకుని, లేచి, చూస్తే ఇంకా తాతమ్మ నిద్రపోతూనే ఉంది.

తాతయ్య వెళ్ళి ఆవిడ దగ్గరగా కూర్చుని,’అమ్మా, నీరసం వస్తుంది- లే, లేచి ఏదైనా తిని, మళ్లీ పడుకో!’ అన్నారు. ఆవిడ అతి కష్టం మీద కళ్లు తెరిచి, లేచి కూర్చుంది. “ఇప్పుడు అన్నం తినలేనురా; వేడిగా వేడిగా కాస్తంత కాఫీ త్రాగి, ఇట్లా కాసిని పళ్లు తింటా’ అంది.

తాతయ్య ప్రక్కనే కూర్చుని ఇదంతా గమనిస్తున్నాడు బిట్టు. తాతమ్మ మాటలకి వాడు ఉలిక్కిపడ్డాడు. వాడి మనసులోకి ఒక్కసారిగా మళ్ళీ ప్రశ్నలు వచ్చేసాయి. ముఖాన్ని ప్రశ్నార్థకంలాగా మార్చి, తాతయ్యవైపు తిరిగి, ఆయన్ని ఏదో అడగాలని అనుకున్నాడు. అయితే తాతయ్య ఆ సరికే లేచి వెళ్ళిపోయారు: “ఇదిగో, మణీ! వేడి వేడిగా కాస్త కాఫీ అట, ఇవ్వు. ఆ తర్వాత కొంతసేపటికి పళ్ళు తింటుందట!” అంటున్నారు అమ్మమ్మతో.

పోయిన ఏడాదంతా బిట్టూ పళ్ళు ఒక్కటొక్కటిగా ఊడాయి. అవన్నీ నెమ్మదిగా మళ్ళీ వచ్చేసాయి. బిట్టూ ఆ సంగతిని తలచుకుంటూ, నిన్ననే అడిగాడు తాతమ్మని: “ఎప్పుడొస్తాయి నీ పళ్ళు?” అని.తాతమ్మ బోసి నోరు తెరిచి భలే నవ్వింది.

“నా పళ్లు ఎప్పుడొస్తాయా? నీ అంత అయ్యాక వస్తాయిలే, మళ్లీ!” అంది.

తాతమ్మ మళ్లీ తనంత ఎలా అవుతుందో అర్థం కాలేదు బిట్టూకి. అమ్మమ్మని అడుగుదామంటే పనిలో ఉంది. ‘కాల్షియం బాగా తింటే, నాకు వచ్చేసినట్లు తొందర తొందరగా, గట్టి పళ్లు మళ్ళీ వచ్చేస్తాయి! ఆ సంగతి తాతమ్మకు తెలుసో, మరి తెలీదో’ అనుకున్నాడు. “ఫ్రూట్స్, నట్స్ ఎక్కువగా తినాలని చెప్పాలి, తాతమ్మకి!” అని కూడా అనుకున్నాడు.

ఇంతలో తాతయ్య వచ్చారు గదిలోకి. ’బిట్టూ, అమ్మమ్మని కాఫీ పెట్టమన్నాను. ఎంతవరకు వచ్చిందో, ఏంటో ఓసారి వెళ్ళి చూడు! తాతమ్మకి కాఫీ పట్టుకురా, కొంచెం’ అనేసరికి అమ్మమ్మ దగ్గరకి వెళ్లాడు.

అమ్మమ్మ కాఫీ కాచే పనిలోనే ఉంది. తన సందేహం ఎవరు తీరుస్తారో తెలియలేదు బిట్టూకు. వెనక్కి తిరిగి మళ్లీ తాతమ్మ గదిలోకి వెళ్లాడు, ‘సంగతేంటో మొత్తం తనే తేల్చుకోవాలి’ అని నిర్ణయించుకుంటూ. అంతలోనే అమ్మమ్మ కాఫీ పట్టుకొని వచ్చింది. తాతమ్మకి కాఫీ ఇచ్చి, తను మళ్ళీ వంట గదిలోకి వెళ్ళింది. బిట్టు కూడా అక్కడే, కొంచెం దూరంగా కుర్చీ మీద కూర్చున్నాడు.

తాతమ్మ కాఫీ త్రాగటం పూర్తయింది. ‘ఇప్పుడు ఇంక ఏమి చేస్తుందా’ అని కనిపెట్టుకుని కూర్చున్నాడు బిట్టు.

ఆలోగా అమ్మమ్మ ఆపిల్ చెక్కు తీసి, చిన్న చిన్న ముక్కలు కోసి, దానితో పాటు అరటిపండు కూడా ఒకటి తొక్క తీసి, పళ్లెంలో పెట్టి, తీసుకొచ్చింది. తాతయ్య ఏవో కబుర్లు చెబుతూ తాతమ్మ ప్రక్కనే కూర్చుంటే, తాతమ్మ తినటం మొదలు పెట్టింది. అమ్మమ్మ వంటింట్లో పని చూసుకుంటోంది. బిట్టు బుర్ర్రలో ప్రశ్నలు వాడిని స్థిమితంగా కూర్చోనివ్వటం లేదు. లేచి అమ్మమ్మ వెనకే వంటింట్లోకి వెళ్లాడు: ‘అమ్మమ్మా, పళ్లు ఎలా తింటారు?!’ అని అడిగేసాడు.

అమ్మమ్మకి వాడి ప్రశ్న అర్థం కాలేదు.

‘ఏం తినాలన్నా నోటితోనే కదరా, ఇంకెలా తింటారు?!’ అంది, ‘అసలు మనవడి ప్రశ్న ఏమిటా’ అని ఆలోచిస్తూ.

‘కాదు- ముందు ఇది చెప్పు- పళ్లు ఎందుకు తింటారు?’ అడిగాడు బిట్టు.

‘’ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం’ అని మీ టీచర్ చెప్పారన్నావు కదా!’ చేతిలోని పనిని ఆపి వాడివైపు చూసింది అమ్మమ్మ.

‘అవుననుకో, ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం. కానీ మరి, పళ్లు ఎందుకు తినటం? అసలు పళ్లు ఎలా…ఎలా తింటారసలు? తాతమ్మకి పళ్లు లేవు కదా, ఆవిడ పళ్లు తినాలంటే ఎక్కడినుండి తెచ్చిస్తారు?

పళ్ళు తింటే మళ్లీ పళ్ళు వచ్చేస్తాయా?’ వరస ప్రశ్నలు వేసాడు బిట్టు.

అప్పుడు అర్థం అయింది అమ్మమ్మకి! బిట్టుకి తెలుగులో కొన్ని పదాలు మాత్రమే తెలుసు. ‘పళ్లు’ అంటే ‘నోట్లో పళ్లు’ అనుకుంటున్నాడు వాడు!

“ఫ్రూట్స్ ని కూడా తెలుగులో పళ్ళు అనే అంటారు” అని వాడికి తెలిసినట్లు లేదు! ‘అరటి పండు’ అంటాడు; కానీ ‘అరటి పళ్లు’ అని బహువచనం వాడుక తెలీదన్నమాట, వాడికి!

అమ్మమ్మకు చెప్పలేనంత నవ్వొచ్చింది. కానీ తను నవ్వితే వాడు ఉక్రోషపడతాడు. అందుకని బలవంతంగా నవ్వు ఆపుకున్నది. వాడిని దగ్గరకి పిలిచి, పెరట్లో జామ చెట్టు క్రిందకి తీసుకెళ్లింది. అక్కడ తీరిగ్గా కూర్చుని, వాడికి ‘పళ్లు’ అనే మాటకు ఉన్న మరో అర్థం కూడా చెప్పింది, అర్థం అయ్యేట్లు.

బిట్టు ఆశ్చర్యానికి అంతు లేదు. “ఓహ్! నేను ఇంకా నేర్చుకోవలసిన తెలుగు చాలానే ఉంది” అన్నాడు. “తెలుగు రాయటం, చదవటం నేర్చుకుంటాను అమ్మమ్మా! అప్పుడు ఇంక అన్నీ నేనే చదువుకోవచ్చు. నిన్నో, తాతయ్యనో అడగాల్సిన అవసరం ఉండదు!” అన్నాడు.

“అవునురా!

* * *

 

 

అమ్మమ్మ ఊళ్లో దావీదు (పార్ట్ – 2) – బిట్టు కథలు – మూడవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Dec, 2017

* * *

జరిగిన కథ : ఢిల్లీ లో ఉండే బిట్టు, వాళ్ల అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. దావీదు అనే పిల్లాడు సైకిల్ రిపేరు చేసి, తాతయ్య దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు. దాంతో వాడు బిట్టుకి శత్రువైపోయాడు. కానీ అమ్మమ్మకి వాడి గురించి తెలీదు.. ఇక చదవండి, ‘..దావీదు”- రెండో భాగం. “ఆ రోజు తాతయ్యతో వీడు ఎట్లా మాట్లాడాడో తెలుసా, నీకు అసలు?” అని అమ్మమ్మని కోపంగా అడుగుదామనుకు-న్నాడు బిట్టూ. కానీ ‘ఎవరి గురించైనా అట్లా చెడ్డగా చెప్పటం బావుండద’ని ఊరుకున్నాడు.

‘అయినా అమ్మమ్మా, బట్టలు ఉతికేందుకు వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చుగా, వీళ్లతో చేయించుకునేదెందుకు?’ అన్నాడు, అమ్మమ్మకి సులువు చెబుతూ.

‘ఎందుకురా, మనకు ఎన్నో ఏళ్లుగా బట్టలు కమలమ్మే ఉతుకుతోంది. మనం మిషన్ కొనుక్కున్నామంటే మరి ఆవిడ చేతిలో పని పోతుంది కదా!

అయినా, నలుగురూ ఇంటికొచ్చి వెళ్తూంటే ఇల్లంతా సందడిగా బావుంటుంది- ఒట్టి మిషన్లతో ఏం బావుంటుందిరా? మీకైతే, మరి సిటీలో బట్టలు ఉతికే మనుషులు కావాలన్నా దొరకరు; దొరికినా ఇంట్లో కూర్చుని ఉతికించుకునే తీరిక కూడా ఎవరికీ ఉండదు- అందరూ ఉద్యోగాలకి పరుగెడతారు కదా; మరి ఇక్కడైతే అట్లాంటి హడావిడి ఉండదు: చాలామంది నాలాగే బట్టలు ఉతికించుకుంటారు’ అంది అమ్మమ్మ.

“నలుగురూ ఇంటికి వచ్చి వెళ్తుంటే ఇల్లంతా సందడిగా బావుంటుంది” అని అమ్మమ్మ చెప్పింది బిట్టుకి కూడా నచ్చింది..

“నిజమే..దిల్లీలో అయితే ఎవరి ఇంటికి ఎవ్వరూ వెళ్లేందుకు సమయం చిక్కదు- అంతా బిజీనే! ఎవరి ఇంటికైనా వెళ్లాలంటే ముందు ఫోన్ చేసి, ‘ఇంట్లో ఉంటారా?’ అని అడిగి, అప్పుడు వెళ్లాలి.

అమ్మ ఆఫీసుకి వెళ్తూ ఇంటిపని చేసే తారా దీదీకి ‘చాబీ’ (తాళం చెవి) ఇచ్చి వెళ్లిపోతుంది. అమ్మ వచ్చేసరికి తారా దీదీ పని చేసి వెళ్ళిపోతుంది! ఇంక తనతో మాట్లాడేంత తీరిక ఎందుకుంటుంది అమ్మకి?

మరి ఆదివారాల్లో మాట్లాడచ్చుగా అంటే ఆదివారంనాడు తారాదీదీ పనిలోకి రాదు. దాంతో అసలు ఎవరూ ఎవ్వరితోటీ తీరిగ్గా మాట్లాడుకోనే మాట్లాడుకోరు! తనకైతే జావేద్ అంకుల్ ఉన్నారనుకో; కానీ అమ్మకి, నాన్నకి ఎవరున్నారు, రోజూ మాట్లాడేందుకు?…

జావేద్ అంకుల్ కూడా అమ్మని అడిగారట- ‘బిట్టు ఎప్పుడొస్తాడు?’ అని. ఇక్కడ చూస్తే తాతయ్య, అమ్మమ్మ, తాతమ్మ అందరూ మంచివాళ్లే. అమ్మని, నాన్నని వదిలి ఇక్కడ ఉండాలంటే కొంచెం బాధగానే ఉంటుంది; కానీ ఇక్కడ వీళ్ల దగ్గర ఉంటే తనకు చాలా బావుంటుంది కూడా. అయితే మరి ఈ సంగతి అమ్మకి చెబితే పాపం, తను బాథ పడుతుందేమో. ‘బిట్టూ‌ ఇంక దిల్లీకి రాడు’ అనుకుంటుందేమో!

అయినా, రాత్రి పడుకునేప్పుడు అమ్మ తనకి కథలు కూడా చెప్పదు- అమ్మమ్మ అయితే చాలా కథలు చెబుతుంది! అమ్మకి అసలు సమయమే చిక్కదు.. ఈ సారి ఫోన్ లో అడగాలి అమ్మని- నాకన్నా అమ్మకి తన ఉద్యోగం, మొబైల్‌ఫోన్ ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది” బిట్టు ఆలోచనలు అట్లా సాగాయి ఆరోజంతా.

“..ఇక్కడ ఉన్నవాళ్ళందరిలోకీ చెడ్డవాడంటే ఒక్క దావీదే. వాడు కూడా మరి, ‘నిజంగా చెడ్డవాడా’ అంటే.. అంటే.. ఏమో, ఇంతకీ వాడు ఏం చెడ్డ పని చేసాడు? తాతయ్య చెప్పినట్టు వాడు మంచివాడేనేమో..?! అయినా సైకిల్ రిపేర్ భలే చేస్తాడు.. పోనీ వాడికి చదువు నేర్పిస్తే?! చదువుకోవట్లేదని కదా, వాళ్ల అమ్మ వాడిని ఇక్కడ వదిలేసింది?! వాడికి మటుకు ఉండదూ, వాళ్ల అమ్మ దగ్గరకి వెళ్లాలని? తాతయ్యకి చెప్పాలి- ‘ఇక్కడ అందరికీ హిందీ, ఇంగ్లీషు నేర్పండి; నాకేమో తెలుగు నేర్పండి అని’..” అనుకున్నాడు బిట్టు.


ఒక రోజు ప్రొద్దున్నే కమలమ్మ ఒక చిన్న పిల్లను వెంటపెట్టుకొని వచ్చింది. దావీద్ చెల్లెలట. ‘చిట్టి’- పది, పదకొండేళ్లు ఉంటాయేమో.

ఆ అమ్మాయి వాళ్ల అమ్మమ్మ వెనుకే తిరుగుతూ పనులు చేస్తోంది. బిట్టు నిద్ర లేచి కూర్చొని, ఆ అమ్మాయి చేసే పనుల్నే గమనిస్తున్నాడు. ‘అంత చిన్నపిల్ల చేత పనులు చేయించకు కమలా’ అంటోంది అమ్మమ్మ.

“ఏం చెయ్యనమ్మా, అక్కడ నా కూతురు ఇంటి బరువు మొయ్యలేక కష్టపడుతోంది; అల్లుడా, ఇల్లు పట్టించుకోడు; నాకు ఆరోగ్యం బాగోలేక నీరసం అయిపోయానని, ‘నీకు తోడుగా ఉంటుంది- దీనికి కూడా పని నేర్పు’ అని పంపింది ఈ చిన్నదాన్ని. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలమ్మా, దీని చురుకుదనమూ, తెలివితేటలూ- మీలాంటి పెద్దవారి ఇళ్లల్లో ఉండాల్సిన పిల్ల!’ అంటూ కళ్లు తుడుచుకుంది కమలమ్మ.

‘అయ్యో, బాథపడకు. దీన్ని, దావీదుని ఇద్దరినీ చదివిద్దాంలే; మన సారున్నారు, చూసుకుంటారు!’ అంటూ ఓదార్చుతోంది అమ్మమ్మ.

బిట్టుకి ఎందుకనో చిట్టి చాలా నచ్చింది. అమ్మమ్మ వెనకాలే చిన్న చిన్న పనులు అందుకుంటోంది ఆ పాప. తాతమ్మకి కళ్లజోడు, చేతికర్రా అందిస్తోంది.

ఆ రోజు సాయంత్రం తాతయ్యతో సైకిల్ మీద వెళ్తుంటే వీరబాబు షాపు దగ్గర దావీదు కనిపించలేదు. ‘తాతయ్యా, దావీదు చెల్లెలు వచ్చింది ఈ రోజు. దావీదు ఊరెళ్లిపోయాడా? షాపులో కనిపించటం లేదు?!’ అంటూ ఆరా తీసాడు.

‘అవునా?! వీరబాబు మరి నాకు ఏమీ చెప్పలేదే?! సరే పద, వాళ్ల ఇంటివైపు వెళ్లి చూద్దాం!’ సైకిలును వీరబాబు ఇంటివైపు తిప్పారు తాతయ్య.

బిట్టూ సైకిల్ దిగి, వాళ్ళ ఇంటి గుమ్మం ముందు నిలబడి, ‘చిట్టీ’ అంటూ పిలిచాడు. ఇంట్లోంచి ఎవ్వరూ రాలేదు గానీ, ఇంటి వెనకనుండి ఎక్కడినుండో పరుగెత్తుకొ-చ్చారు దావీదు, వాడి చెల్లెలు. దావీదు చేతిలో ఏమున్నదో చూడగానే బిట్టు కళ్లు సంతోషంతో మెరిసిపోయాయి: ఏముంద-నుకుంటున్నారు? ఒక చిన్న- నల్ల- కుక్కపిల్ల!! దాని మెడకి తాడు కట్టి, చేతిలో పట్టుకొని ఉన్నాడు దావీదు! బిట్టు ఎన్నాళ్ళుగానో అడుగుతున్నాడు అమ్మని-నాన్నని: “మనం ఒక కుక్కపిల్లని పెంచుకుందాం” అని. ఇప్పుడు ఆ కుక్కపిల్లని చూసాక, అకస్మాత్తుగా దావీదు తన ప్రాణ స్నేహితుడిలా కనిపించాడు బిట్టుకి: ‘దావీదూ, నాకు ఆ కుక్కపిల్లని ఇస్తావా?’ ఆశగా అడిగేసాడు.

“అలా ఎవరినీ, ఏదీ అడక్కూడదు” అని అమ్మ ఎప్పుడూ చెప్పేదంతా మరిచే-పోయాడు వాడు ఆ క్షణాన. అట్లా వాడు ఆశగా అడగ్గానే దావీదు కూడా ఏమీ మాట్లాడకుండా కుక్కపిల్లని బిట్టుకి అందించాడు.

‘రెయిన్ బో! కమాన్!’ అని పిలిచాడు బిట్టూ.

‘అదేంటి, దాని పేరు మార్చేసావు? నేను టైగర్ అని పెట్టాను, దాని పేరు?!’ అన్నాడు దావీదు.

‘కానీ రెయిన్‌బో ఇంకా బావుంది కదా? మనందరికీ ఇంద్రధనస్సు చూస్తే బోలెడు ఇష్టం కదా, అలాగే దీన్ని చూసినా అంతే సంతోషంగా ఉందని, అట్లా పిలిచాను. టైగర్ అంటే పాత పేరే కదా!’ అది తన సొంత కుక్కపిల్ల అన్నట్టు చెప్పేసాడు బిట్టు. ఏమనుకున్నాడో కానీ దావీదు చెల్లి వైపు చూసాడు. చిట్టితల ఊపింది ‘అవును- రెయిన్‌బో పేరు బావుందన్నయ్యా’ అంటూ బిట్టు పెట్టిన పేరుని బలపరిచింది.

తను అడగ్గానే దావీదు అలా రెయిన్‌బోని ఇచ్చెయ్యటం బిట్టుకి చాలా నచ్చింది.

అంతలో పెరట్లోంచి కమలమ్మ బయటికొచ్చి, ‘పట్టుకెళ్లు బాబూ! మీరైతే దీనికి పాలు, అన్నం, బిస్కెట్లు పెడతారు’ అంది నవ్వుతూ.

‘అక్కడ నువ్వు ఏం చేస్తున్నావ్?’ అన్నాడు, లోపలేదో తనకి తెలియని విషయం ఉందని పసిగట్టిన బిట్టు.

కమలమ్మ వాడిని పెరట్లోకి పిలుస్తూ ‘ఇలా రా, బాబూ, ఇదిగో, మా గేదెని చూడు, దావీదు దీనికి ‘కరీనా’ అని పేరెట్టేడు. అంటే ఏంటో నాకు తెలీదు కానీ, ‘కరీనా!’ అని పిలిస్తే చాలు- మా అమ్ములు- అదే, మా గేదె- పలుకుతుందిప్పుడు’ అంది ఉత్సాహంగా.

బిట్టు వెంటనే ‘కరీనా!’ అని పిలిచాడు. గేదె తలత్రిప్పింది. బిట్టు మళ్లీ మళ్లీ పిలిచాడు. అది వాడివైపే చూసింది కొంత సేపు. ‘దాని పొట్ట ఎందుకు అంత లావుగా ఉంది?’ అన్నాడు బిట్టూ దానివంక పరీక్షగా చూస్తూ.

‘మా కరీనా ఈ రోజో రేపో ఈనుతుంది బాబూ, అందుకే…’

‘ఈనుతుందా, అంటే….?’ అంటే?!

‘ఒక బుజ్జి గేదె పిల్ల పుడుతుంది’ సమాధానం చెప్పింది చిట్టి.

బిట్టు సంతోషానికి అంతులేదు. ఒక చేత్తో రెయిన్బో గాణ్ణి పట్టుకుని గేదె వైపు ఆసక్తిగా 

* * *

నేను లేని ప్రపంచం – ఈమాట వెబ్ మ్యాగజైన్ – Dec, 2017

* * *

ఆమె గడుసైనది!
తన పనిని ఎక్కడున్నా ఏ పరిస్థితిలోనైనా
నెరవేర్చుకోగల సమర్థురాలు!
అలాటి సమర్థత నేనెవరిలోనూ చూడలేదు, నిజం!
ఈమధ్య తరచుగా ఇక్కడిక్కడే తిరుగుతోంది
అసలు ఇక్కడేమిటి అక్కడేమిటి
అన్నిచోట్లకీ వెళుతుంది! ఏవేళలోనైనా వెళ్తుంది!

నేను గమనించలేదనుకుంటోంది!
వాకిట్లోనూ వంటింటి గుమ్మంలోనూ
డాబా మీద పిట్టగోడ దగ్గర
ఆరుబయట ఆకాశం క్రింద
పడకగది కిటికీ ప్రక్కన, సరేసరి.
ఉదయపు నిశ్శబ్దంలో కాఫీకప్పుతో కూర్చుంటే…
డైనింగ్ టేబిల్ అంచున నిలబడి నన్నే చూస్తున్నట్లుంటుంది!

నా దృష్టి మళ్లించేందుకన్నట్టు
పెళ్లికో పేరంటానికో వచ్చినట్టు
నావాళ్లు నలుగురూ కూడబలుక్కునే వచ్చారు!
అప్పుడే పుట్టిన పసి దేహాన్ని చూసినట్టు
అంతా వివరంగా తెలుసున్నట్టే నన్ను చూస్తున్నారు!
నా కళ్లు కప్పి గుసగుసలాడుకుంటున్నారు!
నిజంగా వీళ్లంతా అనుకుంటున్నట్టే నేను ఇదివరకటి నేను కాను.

నా ఒళ్లంతా కళ్లు, చెవులు
క్రొత్తగా మొలుచుకొస్తున్నట్టున్నాయి!
ఇంటి నిండా పరుచుకున్న పండుగ సంరంభం
నా పెరటి గాలి అబద్ధం కాదంటోంది!
దేశ దిమ్మరినై తిరిగే నా యాత్రాకాంక్ష తెలిసున్నట్టు

* * *

రండి, కుటుంబ గౌరవాలు కాపాడుకుందాం! – చైతన్య మానవి, ఐద్వా – Nov, 2017

                       * * *                        

కుటుంబం అంటేనే ఒక ‘గౌరవవాచకం’ అయిపోయిందిప్పుడు !

జీవించేందుకున్న పరిస్థితులన్నీ కుటుంబాల విచ్ఛిన్నతకి పనిచేస్తుంటే,

కుటుంబం ‘గౌరవవాచకం’ కాక ఇంకేమవుతుంది?

అంతేకాదు, కుటుంబానికి తనదైన ‘స్వంత గౌరవం’ అనే అదనపు హోదా కూడా తోడైందిప్పుడు !

ఈ గౌరవాలూ, హోదాలు గురించి ఇంకా చెబుతాను,

చెప్పేముందు ఒక్క క్షణం,

మీకు మైత్రి తెలుసా ?

పది పన్నెండేళ్ల క్రితం పూలపూల గౌనుతో, రెండు జడలుతో ఒక చురుకైన అమ్మాయి

సైకిలు తొక్కటం నేర్చుకుంటూ మా వీధంతా తెగ హడావుడి చేసేది,

సైకిలుకి అడ్డం వచ్చిన వాళ్లని ‘దూరం జరగండి’ అంటూ కేకలు పెట్టేది,

సైకిల్ని బ్యాలన్స్ చేసే ప్రయత్నంలో బెల్ మాట మర్చేపోయేది!

పెద్దపిల్లల ఆటల్లో చేర్చుకోని పసివాళ్లందర్నీ ఆరిందాలా పోగేసేది,

అందరి హోంవర్కుల్ని తొందరగా తెమిల్చి ఆటలకి లాక్కెళ్ళేది,

పెద్దయ్యాక ‘మదర్ థెరీసా’ అవుతాననేది !

ఆ అమ్మాయి మైత్రి!

వీధిలో పిల్లలందరికీ ఆదర్శం మా మైత్రి!

ఇప్పుడు చదువు పూర్తిచేసుకుని పెద్ద ఉద్యోగం చేస్తోంది!

మీకు బాచి తెలుసా,

మా వీధిలో నిత్యం మైత్రితో తగువులు పెట్టుకునే బాచి!

క్రికెట్ ఆటలో మునిగి తేలుతూ, ఎవరికేం సాయం కావాలన్నా పరుగెత్తుకొచ్చే బాచి!

క్రికెట్ టీమ్ కే కాదు, ఆ వీధి మగ పిల్లలందరికీ కెప్టెన్ !

చదువులోనూ చురుకైన బాచి పెద్ద ఉద్యోగంలో కుదురుకున్నాడు.

తగువులు మరిచి, మైత్రికి మంచి స్నేహితుడయాడు!

వాళ్లిద్దరికీ మా వీధన్నా, మా ఊరన్నా, మొత్తంగా దేశమన్నా భలే ఇష్టం !

దేశం కోసం బోలెడు పథకాలు కూడా వేసుకున్నారు !

ఆశయాల సాధనకి అడుగులు జంటగా వెయ్యాలనుకున్నారు !

ఇంతకీ….చెప్పనేలేదు కదూ,

ఇద్దరి వెనుకా రెండు గౌరవప్రదమైన కుటుంబాలున్నాయి !

ఆ కుటుంబాలు పిల్లల మధ్య అల్లుకున్న స్నేహాన్ని చూడలేదు,

ఒఠ్ఠిగా తమవైన కులాల్ని, మతాల్ని, నమ్మకాల్ని చూసేయి!

ఆశీస్సులకి బదులుగా ఆక్రోశాన్ని తెలియజేసాయి!

మానవత్వపు కులాన్ని నమ్మిన మైత్రి, బాచి ఒక కుటుంబం ఇప్పుడు!

ఇంతకీ, ఆ కుటుంబ అస్తిత్వం ఒక్కరోజే!

ఎందుకో తెలుసా?…….

ఆమె కుటుంబం అతడి మీద దాడి చేసింది, పట్టపగలు నడిరోడ్డు సాక్షిగా!

పగతోనూ కాదు, ప్రతీకారంతోనూ కాదు,

ఆమె జీవితాన్ని దుఃఖపూరితం చేసేందుకూ కాదు,

కేవలం కుటుంబ గౌరవం కోసం మాత్రమే సుమా, అర్థం చేసుకోండి!

అవును మరి, కులం అంటే కుటుంబ గౌరవం కాదూ?!

‘అంబేద్కర్’ కులాంతర వివాహాల గురించి ప్రస్తావించినప్పుడు ఏనాడో చెప్పాడు,

‘రాజకీయ నిరంకుశత్వం కంటే సామాజిక నిరంకుశత్వం మరింత బలమైనదని ‘

దశాబ్దాల తర్వాత కూడా ఆమాటల్నినిత్య సత్యంగా నిలబెడుతున్నందుకు గర్వపడదాం మనం!

రండి, మన కుల పంచాయితీలను, కుటుంబ గౌరవాలను కాపాడుకుందాం !

ప్రేమతో పెంచుకున్న పిల్లల ఇష్టాలు, జీవితాలు కంటే

కుటుంబ గౌరవాలు ముఖ్యం కదా మనకి !

కులాల్ని కాదని జీవన సహచరుల్ని వెతుక్కునే హక్కు వ్యక్తుల కెక్కడిది?

అలాటి హక్కులేమిటో ఈ సమాజానికి తెలియవు, ఇది పుణ్యభూమి!

కులాల్ని, మతాల్ని కాదని వ్యక్తుల్ని వ్యక్తులుగా ప్రేమించటం నేరమిక్కడ.

ఇక్కడ గౌరవ ప్రదమైన కుటుంబాలున్నాయి, వాటికి పునాదిగా కులాలున్నాయి, మతాలూ ఉన్నాయి !

దేశ సమైక్యతకు ఇలాటి ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి !

(దేశమంతా కూడా సమానంగా వ్యాపించిన కుల, మత జాడ్యం నిత్యం బలి తీసుకుంటున్న పచ్చని, లేత జీవితాలకి సాయం చెయ్యలేని అసహాయ స్థితికి సిగ్గుపడుతూ…………..)

* * *