* * *
అతనూ, ఆకాశం నిరంతరం నా వెంట వస్తూనే ఉంటారనుకున్నా,
అప్పుడెప్పుడో………
దశాబ్దాల క్రితం అతని చేతిలో చెయ్యేసి నడవటం నేర్చుకున్నా
అది మొదలు అలవాటుగా నడుస్తూనే ఉన్నాను.
అలుపే తెలియనట్లు నడుస్తూనే ఉన్నాను.
కిటికీలోంచి ఉరిమే మేఘం ఝడిపించినా
వాకిలి దాటితే వెల్లువెత్తే జనప్రవాహం ఉక్కిరిబిక్కిరి చేసినా
‘భయం నీ ప్రకృతి, అంతే’ అంటూ నవ్వేవాడు!
నిజమేనేమో!
ఆరోజు అకసాత్తుగా ఒక అస్వస్థత అతన్ని కమ్మినప్పుడు మాత్రం భయం మర్చేపోయాను.
ఆ క్షణమే నన్నొక ఆరిందాతనం అల్లుకుపోయిందనీ తెలియనేలేదు.
ప్రపంచానికి నేను నేనుగా కాక మరో నేనుగా ఎదురుపడ్డాను.
పోరాటంలో గాయాలు లెక్కలేదు, విజయమే కదూ గమ్యం!
ఆపరేషన్ థియేటర్ దాటి వచ్చి ఒంటరిపోరాటం చేస్తున్న అతన్ని
చూస్తూ గడిపిన రాత్రులు…
చెయ్యి చాస్తే అందే దూరంలోనే ఉన్నా
బాథని ఇసుమంత కూడా పంచుకోలేనితనానికి నివ్వెరపోయాను.
అతనికీ, నాకూ మధ్య విచిత్రంగా ఈ దూరాలెక్కడివో?!
క్రొత్తగా ఈ ‘ఏమీకానితనం’ ఎక్కడిదో?!
ఇది భౌతికమా? మానసికమా? ఆధ్యాత్మికమా?
ఇదివరకెన్నడూ పరిచయమే లేదు.
లోలోపల ఎక్కడో ఘనీభవించినట్లున్నదేదో
అంతలోనే వెల్లువై ఉరికింది, ఎక్కడిదో ఒక జ్ఞాపకం…
రిషీకేష్ వెళ్లాలి, గంగ దూకుడు చూడాలని పేచీపెట్టి మరీ వెళ్లి,
ఆ శీతాకాలపు ఉదయాన
వడివడిగా ఉరుకుతున నదీమతల్లిని చూసి
నిశ్చేష్టనై కన్నీరెట్టుకున్న నన్ను చూసి అతను నవ్విన నవ్వు…!
* * *