* * *
డాక్టరు రాసిన మందులు తెచ్చేందుకు హాస్పిటల్ లో ఉన్న ఫార్మసీ వైపు నడిచింది నీహారిక. కౌంటర్ లో ప్రిస్క్రిప్షన్ ఇచ్చేంతలో ఫోన్ రింగయింది. చైతన్య! సిగ్నల్ సరిగా లేదు. కనెక్షన్ ఉన్నట్టు కనిపిస్తోంది, ఏమీ వినపడక అప్రయత్నంగా స్పీకర్ లో వినే ప్రయత్నం చేసింది. చుట్టూ ఎవరూ లేకపోవటంతో ఊపిరి పీల్చుకుంది.
‘’అక్కా, నీ బుజ్జి నాన్నకేమైంది? ఏక్సిడెంట్ ఎలా అయిందసలు?’’ తమ్ముడి గొంతులో ఆందోళన. ‘’అక్కా’’ అంటూ ఎప్పుడో కానీ పిలవడు. చిన్నప్పుడైనా తనకి ఏదైనా కావలసి వచ్చినప్పుడో, ఏదైనా అసహాయ స్థితిలో ఉన్నప్పుడో మాత్రమే అలా పిలిచేవాడు. ఇప్పటి పరిస్థితి దూరంగా ఉన్న వాడి మనసుకి ఎంత దిగులు పుట్టిస్తోందో ఆ గొంతే చెబుతోంది. జవాబు చెప్పేంతలో ఇన్ని ఆలోచనలు ఆమె మనసులో మెదిలాయి.
‘’ఖంగారు పడకురా. మరీ పెద్ద గాయాలు కావు. నాన్న వయసుకి అవి కాస్త ఎక్కువే కానీ నేనున్నానుగా. డాక్టర్ ని కలవాలి. మళ్లీ మాట్లాడతాను.’’ భరోసా ఇచ్చింది.
ఫార్మసీలో అమ్మాయి ముఖంలో చిన్ననవ్వుతో మందులు, చిల్లర అందించింది. అర్థమైంది. తమ సంభాషణ స్పీకర్ లో ఉండటంతో విన్నట్టుంది. నవ్వేసింది. ‘’బుజ్జి నాన్న’’ అంటూ స్నేహితులు ఇప్పటికీ తనను ఆటపట్టిస్తారు.
మందుల ప్రభావం కాబోలు ప్రభాకరరావు నిద్రలోనే ఉన్నాడు. రెండు, మూడు రోజులు హాస్పిటల్ లో ఉండాలని డాక్టర్ చెప్పారు. ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చుంది నీహారిక.
తనకి జ్ఞాపకం లేకపోయినా ‘’బుజ్జినాన్న’’ పదాన్ని తాను చిన్నప్పుడు ఏ సందర్భంలో కాయిన్ చేసిందీ తన మేనత్తలు, బాబాయ్ మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటారు. సంక్రాంతి పండుగ అంటే అందరూ తాతగారి ఊరు చేరాల్సిందే. ఇద్దరు బాబాయ్ లు, ఇద్దరు అత్తయ్యలు కుటుంబాలతో వచ్చేవారు.
పండుగనాడు భోజనాలయ్యాక తాతగారు అందరికీ బహుమతులు ఇచ్చేవారు. అందరూ ముందుగదిలో చేరేరు. పిల్లలంతా చుట్టూ కూర్చుని తల్లి ఒడిలోనో, తండ్రి పక్కనో సర్దుకున్నారు. కబుర్లు నడుస్తున్నాయి. పెద్ద అత్తయ్య అంది,
’’ఒరేయ్ అన్నయ్య, నా కొడుక్కి నీ పోలికే వచ్చిందిరా. చెల్లెల్ని ఏడిపించుకు తింటాడు.’’ అంది.
‘’మా ఇంట్లోనూ ఉంది ఒక గయ్యాళి పిల్ల, పెదనాన్న పోలిక వచ్చిందని రోజూ అనుకుంటాను.’’ అన్నాడు రామం బాబాయ్. నీహారిక తండ్రి పక్కనే కూర్చుంది. వాళ్ల మాటలు అర్థంకాక పక్కనే కూర్చున్న తల్లివైపు చూసింది. ఆవిడ వాళ్లతో కలిసి నవ్వుతోంది. తండ్రి ముఖంలోనూ చిరునవ్వుంది.
‘’మిమ్మల్ని చిన్నప్పుడు ఏడిపించే ఉంటారులెండి. ఇప్పుడు నావంతు. ఏం చెప్పినా వినిపించుకోరు. ఆఫీసు, స్నేహితులు ఆయన ప్రపంచం. పిల్లల చదువులు, ఇంటి విషయాలు చూసే బాధ్యత నా ఒక్కదానిదీను. కానీ కూతురు అడిగిందంటే మాత్రం చక్కగా చేసిపెడతారు.’’ తల్లి మాటలతో ఐదోక్లాసు చదువుతున్న నీహారికకి అప్పుడర్థమైంది అత్తయ్య, బాబాయ్, అమ్మ అందరూ కల్సి నాన్నని అంటున్నారని. గబుక్కున లేచి తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి,
‘’ఎవరూ ఏమీ అనకండి మా బుజ్జినాన్నని.’’ అంది కళ్లనీళ్లు పెట్టేసుకుంటూ. అందరూ గొల్లుమన్నారు. గట్టిగా ఏడ్చేసింది నీహారిక. ‘’మా బుజ్జినాన్న’’ అంటూ ఆయన ఒళ్లో ఒదిగిపోయి కూర్చుంది.
చివరికి అందరూ కలిసి ‘’మీ నాన్నని ఏమీ అనలేదే హారీ. వాడు చిన్నప్పుడు నిజంగానే మమ్మల్ని ఏడిపించేవాడు. మా జంతికలు లాక్కుని తినేసేవాడు. ఎందుకులే, అవన్నీ చెబితే మళ్లీ ఏడుస్తావు.’’ అంటూ నీహారికని బుజ్జగించారు. అయినా ఆపూట అందరితో ‘’కట్టి’’ చెప్పేసింది. ఆటలకీ వెళ్లలేదు.
నానమ్మ దగ్గరకు తీసుకుని పెరట్లో పూలమొక్కల మధ్య కూర్చోబెట్టుకుని బోలెడు విషయాలు చెప్పింది. ఆవిడకి చాలా రోజులకి నాన్న పుట్టారట. ఆయనకి ఐదేళ్లొచ్చేవరకు అత్తయ్యలు, బాబాయ్ లు పుట్టకపోవటంతో కాస్త గారం అలవాటైందట. తర్వాత పుట్టిన అత్తయ్యలు, బాబాయ్ లు పెద్దవాడైన నాన్న పెత్తనం భరించాల్సివచ్చేదట.
‘’హారీ, మీ నాన్న బంగారు తండ్రే. తమ్ముళ్లు, చెల్లెళ్ళు ఉంటే అన్నయ్యగా అన్నీ చెప్పాలి కదా. నువ్వు చైతన్యకి చెప్పవూ, అలాగన్నమాట.’’
‘’అవును, వాడికి ఏం తెలీదు.’’ అంది. నానమ్మ నవ్వింది.
‘’బాబాయ్ లకి, అత్తయ్యలకి నాన్నంటే ఎంత ప్రేమో నీకు తెలీదు. ఏ పని చెయ్యాలన్నా నాన్ననే సలహా అడుగుతారు. ఈ పండక్కి నాన్నకి రావటం కుదరదంటే మిగిలిన అందరూ అన్నయ్య ఎప్పుడొస్తే అప్పుడు వస్తాం ఇప్పుడు రాము అనేసారు. మేము ఎదురుచూస్తుంటాం అని నాన్న ఎలాగో వీలు చేసుకుని బయలుదేరి వచ్చాడు. అందరం హాయిగా పండుగ చేసుకున్నాం ఇక్కడ. నీ బుజ్జి నాన్నే నాకు బుజ్జి కన్న. వాళ్లంతా కలిసినప్పుడు సరదాగా కబుర్లాడుకుంటారు.’’ నానమ్మ మాటలతో స్థిమితపడింది నీహారిక.
….
నర్స్ వచ్చి ఆయనకు ఇవ్వవలసిన మందులేవో ఇచ్చివెళ్లింది. గత రెండు రోజులుగా జరిగిన విషయాల్ని తల్లి నోట వింది.
రెండు రోజులక్రితం మధ్యాహ్నం బయటకి వెళ్లి వస్తూంటే ఆయన స్కూటర్ ని వెనకనుంచి వస్తున్న బైక్ గుద్దెయ్యటంతో క్రింద పడిపోయాడు. చిన్న చిన్న దెబ్బలతో ఇంటివరకు వేరేవాళ్ల సాయంతో వచ్చిన భర్తని చూసి ఆవిడ హడిలిపోయింది.
స్కూటర్ వాడద్దని చెప్పినా వినడన్నది ఆమె కంప్లైంట్. ఆయన ఎప్పుడు స్కూటర్ తీసుకుని బైటకెళ్లినా ఆమె భయపడుతూనే ఉంటుంది. డెబ్భై ఏళ్లొచ్చాయి. భర్త ఆ రెండుచక్రాల వాహనం తీసినప్పుడల్లా ఇద్దరిమధ్యా పెద్ద యుధ్ధమే జరుగుతుంది.
‘’పెద్ద దెబ్బలు కావు, కానీ ఆయన కాస్త షాక్ అయ్యారు. పడిపోయి అలా కూర్చుండిపోయారు. ఆ బైక్ అతను కనీసం ఆగకుండానే వెళ్లిపోయాడు.’’ అంటూ ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఆయన్ని ఇంట్లో దింపి వెళ్లారు.
కాళ్లు, చేతులు కడుక్కొచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నాక ఆయన కాళ్లమీద తగిలిన దెబ్బలకి మందు రాసిందావిడ. తన ఆందోళన తెలియనీయకుండా నెమ్మదిగా అడిగింది,
‘’కాఫీ తాగుతారా?’’ వద్దన్నట్టు తలూపాడు.
ముఖం చిన్నబుచ్చుకుని కూర్చున్న ఆయన్ని ఎందుకెళ్లారంటూ అడగటం ఎలా? మంచినీళ్లు అక్కడున్న బల్ల మీద పెట్టి వంటింట్లో తన పని చూసుకుని వచ్చేసరికి ఆయన నిద్రకి జోగుతున్నాడు.
‘’భోజనం చేస్తారా? తిని ఏదైనా నొప్పి మాత్ర వేసుకుందురుగాని’’ అంది.
వద్దన్నట్టు సైగ చేసి నెమ్మదిగా నడిచి లోపలికి వెళ్లి పడుకున్నాడాయన.
డోర్ బెల్!
వాచ్మన్, ‘’ఏమైందమ్మా, మన సార్ తో పాటు ఎవరో కుర్రాళ్లొచ్చారు. బండికి దెబ్బలు తగిలాయి.’’ అన్నాడు.
‘’స్కూటర్ ని ఎవరో గుద్దేసరికి కింద పడిపోయారు. ఆ పిల్లలు తీసుకొచ్చి దింపారు.’’
‘’అయ్యో, దెబ్బలు బాగా తగల్లేదుకదా. చూడండమ్మా. ఏదైనా అవసరం పడితే పిలవండి.’’ అంటూ వెళ్లిపోయాడు.
అతను వెళ్లిన పావుగంటకి కాబోలు మళ్లీ డోర్ బెల్. ఎదురింటి నారాయణ, కిందింటి భాస్కరం వచ్చారు ‘’ప్రభాకరం గారికి ఏదో ఏక్సిడెంట్ అయిందట…’’ అంటూ. చెప్పింది.
వాళ్లు గదిలోకి వెళ్లి చూసారు.
‘’ఆయన నిద్రలో ఉన్నట్టున్నారు. లేపి భోజనం పెట్టండి, సాయంకాలం వచ్చి చూస్తాం’’ అని వెళ్లిపోయారు. ఆయన్ని లేపే ప్రయత్నం చేసింది.
‘’లేవాలని లేదు, కాసేపు పడుకుంటాను.’’ అంటూ ఆయన మళ్లీ నిద్రపోయాడు.
ఏమీ తోచలేదు. దూరంగా ఉన్న పిల్లలకు ఏం చెబుతుంది. అనవసరంగా ఖంగారు పెట్టటమే అవుతుంది అనుకుంటూ ఓ కప్పు కాఫీ కలుపుకుని అలా కూర్చుండిపోయింది. మొబైల్ మోగటంతో లేచి చూసింది. ప్రభాకరరావు స్నేహితుడు మూర్తి.
‘’ఏం చేస్తున్నాడు మావాడు’’ అన్నాడాయన.
విషయం చెప్పింది. ‘’అరెరె చెప్పలేదేమమ్మా, ఇప్పుడే వస్తున్నాను.’’ అంటూ రెండు వీధుల ఆవతల ఉన్న ఆయన వెంటనే వచ్చాడు.
‘’ప్రభాకరం, లే’’ అంటూ చొరవగా లేపి కూర్చోబెట్టాడు. తలంతా దిమ్ముగా ఉందంటూ లేచి కూర్చున్నాడు.
’భోజనం కూడా చెయ్యలేదటకదా. ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్నాయా?’’ అంటూ ఒకటికి రెండుసార్లు అడుగుతున్న మూర్తి ప్రశ్నలకి అయోమయంగా చూస్తుండిపోయాడు.
‘’పద, హాస్పిటల్ కి వెళ్దాం.’’ అంటూనే క్యాబ్ బుక్ చేసి బయలుదేరదీశాడు. అలా వెళ్లిన మనిషికి రకరకాల టెస్టులు చేసి డాక్టర్ల పర్యవేక్షణలో రెండు రోజులు ఉంచాలని చెప్పేసరికి మూర్తి తను సమయానికి వచ్చాననుకున్నాడు. తలకి తగిలిన దెబ్బ పైకి తెలియలేదన్నారు డాక్టర్.
ఆవిడకి ఫోన్ చేసి, ఖంగారేంలేదని, ఆ పూట హాస్పిటల్ లో ఉండేలా రమ్మని చెప్పాడు. పిల్లలకి అవసరమనుకుంటే తెలియజెయ్యమన్నాడు.
చిన్నప్పటి రోజుల్ని తలుచుకుంటూ కూర్చుంది నీహారిక. బుజ్జినాన్న! తనకి మాత్రమే సొంతం!
తమ్ముడు, తను చదువుల గురించి ఎప్పుడూ అమ్మనాన్నల్ని ఇబ్బంది పెట్టలేదు కానీ చిన్నచిన్న కోరికలంటూ కాస్త విసిగిస్తూనే ఉండేవారు.
స్నేహితుల ఇంటికి వెళ్లాలంటే అమ్మ పర్మిషన్ ఇచ్చేది కాదు. తనకేమో ఊరంతా స్నేహితులే. నాన్నని ఎలాగో ఒప్పించేసేది. ఆదివారం పొద్దున్న ఆయన ఆఫీసు కాగితాలు చూసుకుంటుంటే,
’నాన్నా’’ అంటూ పక్కన చేరేది. కాస్సేపటికి తలెత్తి,
‘’అయితే ఈ పూట ఎక్కడికెళ్లాలో మా నీహారికతల్లి?’’ అనేవాడు.
‘’నాన్నా, పరిమళ లేదూ. చిన్నచిన్న పోనీటైల్స్ వేసుకుంటుంది. నువ్వు అప్పుడు స్కూల్ కి వచ్చినప్పుడు చూబించాను కూడా. ఈరోజు తన పుట్టినరోజు. వాళ్ల ఇంటికి వెళ్దామని నేనే అందరితోనూ ప్లాన్ చేసాను. అమ్మేమో హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరుగుతున్నాయి. మధ్యలో ఈ పెత్తనాలు వద్దు. పరీక్షలయ్యాక వెళ్లమంది. పుట్టిన్రోజు ఈరోజు కదా నాన్నా.’’అంది.
తండ్రి తన మాటలు సమర్ధిస్తాడని చూసింది. ఆయన సీరియస్ గా పనిలో మునిగిపోయాడు మళ్లీ.
‘’అబ్బ, నాన్నా, వింటున్నావా లేదా?’’అంటూ రెట్టించేసరికి,
‘’వింటున్నానురా. అమ్మకి నేను చెబుతానులే పంపమని. కాస్సేపు చదివేసుకో ఇప్పుడు. మధ్యాహ్నం భోజనం చేసి వెళ్దువుగాని.’’
‘’అన్నీ చదివేసాను నాన్నా. మేమంతా వస్తామని ఆంటీకి చెప్పింది పరి. ఈరోజు వాళ్లింట్లోనే మాకు లంచ్. ఆంటీ బిర్యానీ చేస్తారట.’’ ఉత్సాహంగా చెబుతున్న కూతురి ముఖంలోకి చూసి, ‘’సరేరా తల్లీ.’’ అన్నాడు.
‘’మా బుజ్జి నాన్న.’’ ఎగురుకుంటూ వెళ్లి తల్లితో బీరువాలో బట్టలు అడిగి తీయించుకుంది. ‘’పరీక్షలవుతుంటే ఇప్పుడు పంపటం ఎందుకు? నేను ఇవతల చెబుతున్నదేదీ వినిపించుకోరు.’’ తల్లి సణుగుతూనే ఉన్నా పట్టించుకోలేదు.
తమ్ముడు ‘’బుజ్జి నాన్న అంటూ నాన్న దగ్గర గారాలు పోతుందిగా.’’ అంటూ వెక్కిరించాడు.
‘’నేనూ పరీక్షలయ్యాక రోజూ క్రికెట్ ఆడుకుందుకు గ్రౌండ్ కి వెళ్తాను.’’ అన్నాడు ధీమాగా. ‘’అంతదూరం నిన్ను పంపరులే నాన్న’’ తమ్ముణ్ణి ఉడికించింది.
‘’నేనూ నీలాగ బుజ్జినాన్నా అని అడుగుతాలే’’ అన్నాడు పన్నెండేళ్ల చైతన్య నవ్వుతూ.
‘’నువ్వు అమ్మ పార్టీగా. వండినవన్నీ పెద్ద వాటా నీకే పెడుతుంది అమ్మ.’’
‘’నేను బలంగా ఉండాలని నానమ్మ చెప్పలేదూ.’’
‘’నేను ఉండక్కర్లేదా? నాన్న ఒక్కరే నన్ను సపోర్ట్ చేస్తారు. అందుకే నా బుజ్జి నాన్న.’’ ధీమాగా చెప్పి పుట్టినరోజు పార్టీకి వెళ్లిపోయింది.
పరీక్షలయ్యాక తాతయ్యకు బావులేదని తల్లి ఊరెళ్లింది. నానమ్మ ఇంటి బాధ్యత తీసుకుంది. సెలవులన్నీ కూడా చైతన్య క్రికెట్ ఆడుకుందుకు వెళ్లకుండానే గడిచిపోయాయి.
సెలవులు మొదలైన ఆదివారం తండ్రి పక్కన చేరి క్రికెట్ కి వెళ్తానంటూ అడిగాడు. ఆయన ఆఫీసులో పని ఉందని, వెళ్లబోతూ,
‘’అక్కకి స్పెషల్ క్లాసులున్నాయి, స్కూలుకి వెళ్తుంది. నానమ్మ నువ్వొచ్చేవరకు ఒక్కతీ ఉండలేదు. అదీకాక గ్రౌండ్ ఐదారు కిలోమీటర్లు దూరం. అంతదూరం వెళ్లిరాలేవు, నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి.’’ తండ్రి చెప్పిన కారణాలు కొట్టిపారేస్తూ బోలెడు ఉపాయాలు చెప్పాడు వాడు.
‘’నానమ్మ కేం భయం లేదులే. పక్కింటి పార్వతి ఆంటీ రోజూ మనింటికొస్తుంది కబుర్లు చెప్పుకుందుకు. హర్ష తన సైకిల్ మీద నన్ను తీసుకెళ్తానన్నాడు.’’ అన్నా వాడి మాట నెగ్గలేదు.
పండుగరోజు సెలవు కావటంతో కొడుకుని బుజ్జగించేందుకు తండ్రి తనే గ్రౌండ్ కి తీసుకెళ్లినా ఆ రోజు పిల్లలు ఎక్కువగా రానేలేదు ఆడుకుందుకు. ముఖ్యంగా చైతన్య స్నేహితులెవరూ రానేలేదు. వాడికి దుఃఖం ఎక్కువైంది. తల్లి రాగానే తన బాధ చెప్పుకున్నాడు.
‘’పోనీలే. ఈసారి సెలవులకి నేను పంపుతాను.’’ అంటూ ఆవిడ చెప్పబోయినా వాడు చాలారోజులు అలిగాడు. తండ్రి గురించి ఏదైనా చెప్పాలంటే, అక్కతో, ‘’నీ బుజ్జి నాన్న’’ అనేవాడు ఉక్రోషంగా.
ఆమె తల్లిదండ్రుల్ని చూసి వెళ్లి ఆరునెలలైంది. ఉన్న నాలుగురోజులు ఊళ్లో స్నేహితుల్ని, బంధువుల్ని కలవటం, షాపింగులతో హడావుడిగా గడిపి వెళ్లిపోయింది. తల్లిదండ్రుల దగ్గర కూర్చుని సావకాశంగా మాట్లాడింది లేదు.
తండ్రి దగ్గర్లో లేనప్పుడు,
‘’హారీ, నాన్నకి వినికిడి బాగా తగ్గిందని అనిపిస్తోంది. ఆయన ఎదురుగా అంటే బాధ పడతారు. నువ్వొకసారి ఆయన్ని కనుక్కుని ఇ. ఎన్. టి. డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లవే,’’
‘’ఏమిటమ్మా, చిన్నప్పటినుంచీ చూస్తున్నాను. నువ్వు చెప్పినదేదీ నాన్న వినిపించుకోరన్నది నీ కంప్లైంట్. నాకు తెలియదా?’’ అంది నవ్వేస్తూ.
‘’లేదే. ఆ వినిపించుకోకపోవటం వేరు. అది ఎప్పుడూ ఉన్నదేలే. ఇప్పుడు వయసు మూలంగా సమస్య వచ్చిందనిపిస్తోంది. నానమ్మకీ పెద్ద వయసులో వినికిడి సమస్య వచ్చింది. మూర్తి అంకుల్ కూడా
‘’వీడికి సరిగా వినిపించట్లేదల్లే ఉంది. డాక్టర్ కి చూబించుకుని, హియరింగ్ ఎయిడ్ తీసుకుంటే మంచిదేమో. చెబితే మాట్లాడడు. ఒక్కడూ బయటకి వెళ్తుంటాడు కూడాను. ఏమ్మా, మీకు వాడి ఇబ్బంది తెలుస్తోందా?’’ అని అడిగారు.
నీహారిక తల్లి మాటల్ని బేరీజు వేస్తోంది, ఆయనకి సమస్య ఉందన్నది తనకి తోచట్లేదు. ఏదో పరధ్యానంలో ఉండి వినిపించుకోకపోవచ్చు. మరి మూర్తి అంకుల్ ఎందుకు అలా చెప్పారో.
ఈ మధ్య ఇదే అపార్ట్మెంటులో ఉండే చిరకాల స్నేహితుడు అకస్మాత్తుగా చనిపోయినప్పటినుంచి తండ్రి దిగులు పడినట్టు అమ్మ చెప్పింది. రోజులో ఎక్కువసేపు సిస్టం ముందు కూర్చుని ‘’సుడోకు’’ చేస్తూనో, ఏదో ఆలోచనల్లోనో ఉంటున్నారంది. వాకింగ్ కూడా మానేసారని చెప్పింది.
‘’అదీ ఒకందుకు మంచిదే. రోడ్ల మీదకి వెళ్లాలంటేనే ఆ ట్రాఫిక్ భయపెడుతుంది. అసలే పరధ్యానం మనిషి. ఇప్పుడు సరిగా వినిపించట్లేదని అనిపిస్తోంది. అలా అంటే కోపం వస్తుంది. అందుకే ఆయన బయటకి వెళ్లే అవసరం రాకుండా కావలసిన వాటిని చాలావరకు ఆన్లైన్ లో తెప్పించుకోవటం మొదలెట్టా.’’ చెప్పిందావిడ.
‘’అందుబాటులోకొచ్చిన సర్వీసుల్ని వాడుకోవాలి. నువ్వు చేస్తున్న పని మంచిదేనమ్మా.’’ అంది నీహారిక.
కానీ తండ్రికి వినిపించటం లేదన్న విషయం ఒప్పుకోలేకపోయింది. తను ఆయనతో మాట్లాడినప్పుడు ఎప్పటిలాగే నవ్వుముఖంతో వింటున్నాడు. ఎదురుగా కూర్చున్న తనకా సందేహం రానేలేదు మరి. మధ్యమధ్య పిల్లల చదువుల గురించి ఏవో ప్రశ్నలూ వేసేడాయన.
ఏడాది క్రితం కాబోలు ఆయన వాకింగ్ కి వెళ్లొస్తుంటే ఒకమ్మాయి ఎదురై ‘’అంకుల్ మీరు రోడ్డుకి ఎడమవైపు కాక కుడివైపే నడవండి. వెనక నుంచి వచ్చే వెహికిల్స్ మీదకొచ్చేసే ప్రమాదం ఉంది. కుడివైపు నడిస్తే కనీసం ఎదురుగా వచ్చే వెహికిల్ కనిపిస్తుంది, అవసరమైతే మనం తప్పుకోవచ్చు.’’ అందని తల్లి చెప్పినప్పుడు ఆ అమ్మాయి తండ్రికి ఎందుకలా చెప్పిందో అర్థంకాలేదు.
తల్లి చెప్పినట్టు ఆయన్ని వినికిడిలో ఏదైనా సమస్య ఉందేమో అని అడగను కూడా లేదు తను. ఉన్న నాలుగురోజులూ బయటకి వెళ్లిరావటం. పొద్దున్న కాఫీ సమయంలోనో, రాత్రి భోజన సమయంలోనో కాస్సేపు తల్లితోనూ, తండ్రితోనూ గడిపింది.
తండ్రికి మెలకువ వచ్చినట్టుంది, ఆయన కదలటం చూసి, ‘’నాన్నా’’ అంది. ఆయన కళ్లు విప్పి చిన్నగా నవ్వాడు.
‘’పిల్లల్ని వదిలి వచ్చావా? అమ్మ ఉందిగా. నాకేం కాలేదసలు. అనవసరంగా ఖంగారు పెట్టి, నిన్ను రమ్మంది కాబోలు.’ అన్నాడాయన బలహీనంగా.
రెండురోజుల తర్వాత ఆమాత్రంగా నోరువిప్పి మాట్లాడుతున్న తండ్రిని చూస్తుంటే గుండె చెమర్చింది. ఇంకా ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్టు చెప్పలేమని డాక్టర్ అన్న మాటలు జ్ఞాపకమొచ్చాయి.
‘’హారీ, చైతన్యకి చెప్పు. నేను బావున్నానని. వాడికీ నేను బుజ్జి నాన్ననే అని చెప్పు. అమ్మ ఎలాఉంది? చాలారోజులుగా మోకాళ్లు నొప్పులంటూ అవస్థ పడుతోంది. నువ్వు గమనించే ఉంటావు. ఆపరేషన్ చేయించుకొమ్మంటే ఇప్పుడు కాదు అంటుంది.’’ ఆ కాస్త మాట్లాడినందుకే ఆయన ఆయాసపడుతుండటం చూసి,
‘’మాట్లాడకు నాన్నా. కాస్త ఓపిక రానీ కబుర్లు చెబుదువుగాని.’’అంది ఆయన చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఆయన ఊరుకున్నాడు. మరో క్షణం అయ్యాక,
‘’ఆరు నెలల క్రితం నువ్వొచ్చినప్పుడు అమ్మ మోకాళ్ల ఆపరేషన్ గురించి నువ్వు చెబితే వింటుందేమోనని ఆశపడ్డాను. కానీ నువ్వుండే నాలుగు రోజులు ఆ ప్రసక్తి తెచ్చేందుకే వీల్లేదంది.
‘’అక్కడ దాని అత్తమామల ఆరోగ్యాలు అంతమాత్రంగానే ఉన్నాయి. నా సంగతి మాట్లాడకండిప్పుడు. ఈ బాధలు, నొప్పులు ఎప్పుడూ ఉండేవే.’’ అని కొట్టిపారేసింది.
గాయపడి హాస్పిటల్ లో ఉన్న తండ్రి పక్కన ఇప్పుడు కూర్చున్నంత తీరిగ్గా తను ఈమధ్య కాలంలో ఎప్పుడైనా కూర్చుని ఆయన్ని విందా?
తన పెళ్లై వెళ్లిపోయి దాదాపు ఇరవై ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్లల్లో ఎప్పుడొచ్చినా తన పనుల మీదే వచ్చింది. తల్లిదండ్రుల సేవలు తన హక్కన్నట్టు చేయించుకుంది. తన పిల్లలూ చేయించుకున్నారు అమ్మమ్మ, తాతయ్యల చేత. అమ్మా, నాన్న పెద్దవాళ్లవుతున్నారు, వాళ్ల సమస్యలేమిటో, వాళ్ల జీవితాలు ఎలా నడుపుకుంటున్నారో తను ఏనాడైనా ఆలోచించిందా?
ఆరునెలల క్రితం,
‘’మామగారు, నేను ఇక్కడికి వచ్చేసాక నీకు కాస్త ఒత్తిడి, పని పెరిగింది నీహారికా. ఒక్క నాలుగురోజులు మీ నాన్నగారు, అమ్మగారు ఎలా ఉన్నారో చూసిరా. నీకూ, వాళ్లకీ కూడా మార్పుగా ఉంటుంది. నేను ఇక్కడ మ్యానేజ్ చేస్తాను.’’ అంటూ అత్తగారు పట్టుబట్టి పంపితేనే వచ్చింది. వచ్చాక తను రిలాక్స్ అవటం వరకే ఆలోచించింది.
తిరుగుప్రయాణమై వెళ్తుంటే అమ్మ, నాన్నలతో అసలు గడిపినట్టే లేదనుకుంది. ఇంకో నాలుగు రోజులు ఉన్నా తనకి ఏవో వ్యాపకాలు పుట్టుకొస్తాయి కానీ ఇంటిపట్టున ఉంటుందా? ఎందుకని అలా?
ఇంటికి వెళ్లేసరికి అత్తగారు అడిగిన ప్రశ్న తనలో ఒక అపరాధభావాన్ని తాత్కాలికంగా మాత్రమే రేపింది,
‘’అమ్మ, నాన్నగార్ల ఆరోగ్యాలు బావున్నాయా? రెండు రోజులు సరదాగా వండిపెట్టావా? మీ తమ్ముడు దూరంగా ఉన్నాడు. దగ్గరలో ఉన్నది నువ్వే కనుక వాళ్లకేం కావాలో చూసుకోవాలి.’’ కాఫీ గ్లాసు అందిస్తూ ఆవిడ చెబుతుంటే తను మౌనంగా కూర్చుండిపోయింది.
అమ్మ ఇంటికి వెళ్లొచ్చింది తను. ఇంటిని, పిల్లల్ని అత్తగారికి అప్పజెప్పి! ఆవిడ వయసుకు అది పెద్ద బాధ్యతే అయినా సంతోషంగా తనకు తానుగా తీసుకున్నారు. అక్కడ అదే వయసులో ఉన్న పెద్దవాళ్లిద్దరినీ చూసేందుకు వెళ్లటమే తను చేసిన గొప్ప పని అనుకుని వాళ్ల దగ్గర ఇంకా గారాలు చెల్లించుకుని వచ్చింది.
అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉండేది,
‘’మా అమ్మచేత బోలెడు సేవ చేయించుకున్నాను నా అనారోగ్యాలతో. ఆవిడకి ఒక్కనాడూ ఏమీ చెయ్యలేదు’’ అని.
‘’పోనీలే అమ్మా, నీ కుటుంబ బాధ్యతలు నీకున్నాయిగా. అయినా అమ్మమ్మకి సుఖంగానే గడిచిపోయిందిగా మామయ్య దగ్గర’’ అనేసేది తను. ఎంత స్వార్థం ఆ మాటల్లో! కూతురిగా తల్లికి ఏమీ చెయ్యలేదన్న లోటు గ్రహించి ఆవిడ బాధ పడినప్పుడు అంత తేలిగ్గా తను ఓదార్పు ఇచ్చేసింది.
ఉలిక్కిపడింది నీహారిక. తను ఏం చేస్తోంది? వారానికోసారి తీరిక చేసుకుని ‘’హలో అంటూ ఫోన్ లో పలకరిస్తుంది.
‘’అంతా బాగానే ఉంది. మేము బావున్నాం’’ అన్న మాటల్నే ఎప్పుడూ వినాలనుకుంటుంది. వింటోంది. అంతటితో తృప్తిపడిపోతోంది.
ఇప్పుడు హాస్పిటల్ పాలైన బుజ్జినాన్న తనకి చాలా వాస్తవాల్ని తెలియజేస్తున్నారు! నీహారికకి తను చేస్తున్న లోటు పూర్తిగా అర్థమైంది.
***