* * *
కమ్మగా కూనిరాగాలు తీస్తుంది, అందమైన కథలూ రాస్తుంది. కానీ భావోద్వేగాల్ని మాత్రం తన గాంభీర్యం మాటున దాచుకుంటుంది. అంత నిండుగా ఉండటం ఎలా సాధ్యం అంటే మాత్రం చిరునవ్వే సమాధానం. పేరు ఎంత సున్నితమో అంతే సున్నితమైన వ్యక్తి ఆమె. తనను ఒక్కమాటలో నిర్వచించమంటే ‘’స్నేహం’’ అని చెబుతాను.
ఆమె ప్రపంచం విశాలమైంది. ఆమె సంభాషణలో ఎందరెందరి ప్రస్తావనలో వస్తుండేవి. వారి సమస్యలు, వారి సుఖదుఃఖాలు అన్నీ ఆమెవే. వేరెవరి దుఃఖాలనో ప్రస్తావించినప్పుడు దానికి కారణమైన వ్యక్తుల వైపు ఆలోచిస్తూ ‘’వారి పరిస్థితులేమిటో!” అనేసేవారు. నిందాపూరిత వ్యాఖ్యలు ఎప్పుడూ లేవు. ఆర్థిక పరమైన అవసరాలు ఉన్నవారెవరైనా తటస్థపడితే అది తీర్చటం తన బాధ్యత అని నమ్మే మానవతావాది. ఇంతకీ ఎవరు ఆమె? ఈ ‘’ఆమె’’ దాసరి శిరీష!
1989-90 ప్రాంతాల్లో ఏలూరులో ఉన్నప్పుడు ఆంధ్రప్రభ వీక్లీలో ‘’దూరతీరాలు’’ సీరియల్ చదువుతూ ఆ రచయిత్రికి ఒక ఉత్తరం రాసాను. ఆమె వెంటనే తన అత్తవారి ఊరు ఏలూరేననీ, త్వరలో రాబోతున్నాననీ, కలుస్తాననీ జవాబిచ్చారు. అప్పటికింకా రచయిత్రులెవరినీ చూడలేదు. వాళ్ళు ఎలా ఉంటారో అన్న కుతూహలం. ఆ ఉత్తరం నాకు భలే థ్రిల్ ఇచ్చింది.
ఒకరోజు సాయంత్రం తన కుటుంబంతో సహా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. నాకైతే పెద్ద సత్కారమే అది. శేషుబాబు గారు కూడా కొత్త లేకుండా కబుర్లు చెప్పారు. వారిది ప్రేమ వివాహం అని చెబుతూ, ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకునేప్పుడు శిరీషగారు ఉత్తరాలు రాస్తూ ‘’శేషుబాబు, ఆంధ్రా యూనివర్సిటీ’’ అని అడ్రస్ రాసేవారట. అంతే. నేరుగా ఉత్తరం అందేదట. యూనివర్సిటీలో ఆయనకున్న పాప్యులారిటీ గురించి చెబుతుంటే ఆమె నవ్వేసేరు. అరుణ్ ఆ వయసుకే గంభీరంగా ఉండేవాడు. అపర్ణ అచ్చం ఇప్పటి అపర్ణే.
ఒకసారి ఏలూరు నుంచి వాళ్ళ కుటుంబం నిడదవోలులో సుబ్రహ్మణ్యం గారు, ఈశ్వరి గార్ల దగ్గరకు వెళ్తున్నామనీ ఆ రాత్రంతా పాత పాటలు పాడుకుని వస్తామని చెప్పి, నన్నూ, మా పిల్లల్నీ కూడా తీసుకెళ్లారు. పుస్తకాల్ని, పాటల్ని ప్రేమించే నాకు ఆ రాత్రి నిడదవోలులో తెల్లవార్లూ పాట కచేరీ చూసి ఎంత ఆనందమో. అద్భుతమైన అనుభవం!
ఏలూరు వచ్చినప్పుడు కలుస్తుండేవారు. నేను సి. ఆర్. రెడ్డి స్కూల్లో పనిచేస్తుండేదాన్ని. శిరీషగారికి టీచింగ్ అంటే ఇష్టమని చెప్పారు. ఎప్పటికైనా తను కూడా పిల్లలకోసం ఏదైనా చెయ్యాలనేవారు. ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్లం. నా కథ ఏదైనా అచ్చైతే ఎంత బిజీ గా ఉన్నా ప్రత్యేకంగా ఉత్తరం రాసేవారు.
మా ఇంటికొచ్చినప్పుడు అరుణ్, అపర్ణలకి, మా పిల్లలతో పాటు భోజనం కలిపి తినిపించేదాన్ని. పిల్లలకి బంగాళాదుంపల వేపుడు ఎంతో ఇష్టం కదా.
అరుణ్ ని ఇంటర్ లో ఏలూరులోని రెసిడెన్షియల్ లో చేర్చినప్పుడు చూసేందుకు వచ్చేవారు. ఇద్దరం కలిసి హాస్టల్ కి వెళ్లేవాళ్లం.
‘’ఉద్యోగ జీవితంలో వాడిని సరిగా చూసుకోలేకపోతున్నాననిపిస్త్తుంది. అందుకే ఏదో ఒకటి కొని వాడికి సంతోషం కలిగించాలనిపిస్తుంది. అంతలోనే గిల్టీగా ఉంటుంది’’ అని బాధపడేవారు.
ఈ ముప్ఫై ఏళ్లలో ఆమె ఇనీషియేటివ్, సిన్సియారిటీ మా స్నేహాన్ని తాజాగా ఉంచిందనటంలో ఎలాటి అతిశయం లేదు.
మేము బదిలీల మీద ఎక్కడ ఉన్నా తను వచ్చేవారు. నాకు ఆశ్చర్యం వేసేది. నరగ జీవితం, ఉద్యోగం, కుటుంబ జీవితం ఇన్నింటి మధ్యా స్నేహితులకి ఆమె ఇచ్చే విలువ బహుశా ఇంకెవ్వరూ ఇవ్వరేమో. నాకు ఆమె పరిచయం, స్నేహం ఒక అపురూపమైన, అరుదైన అనుభవం. జీవితాన్ని ఒక అందమైన పాటలా గడపవచ్చన్న నమ్మకాన్ని ఆమె కలిగించారు.
అపర్ణ కాలేజీ చదువు గురించి విజయవాడలో హాస్టల్ లో ఉంచవలసి వస్తోంది అని చెప్పినప్పుడు (అప్పుడు మేము విజయవాడలో ఉన్నాం)
‘’హాస్టల్ వద్దు, మా ఇంట్లో ఉంచండి’’ అని చెప్పాను. ఆమె ఆలోచించి ‘’అలాకాదు. ఇండిపెండెంట్ గా ఉండటం, బాధ్యత తెలుస్తుంది. హాస్టల్ అయితేనే మంచిది.’’ అన్నారు.
పుత్తూరులో స్నేహితులను కూడగట్టుకుని చదువుకునే పిల్లలకోసం ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో. ఎందరినో మోటివేట్ చేసేరు.
బ్యాంకులో స్వచ్ఛంద పదవీ విరమణ చేసినపుడు అన్నారు,
‘’నాకు వచ్చిన డబ్బుని రెండు భాగాలుగా చేసాను. ఒకటి నా అవసరాలకోసం. రెండవది నేను చెయ్యబోయే పిల్లల కార్యక్రమం కోసం.’’
‘’ఆలంబన’’ మొదలైన దగ్గర్నుంచీ ఎందరి పిల్లల జీవితాలకి చక్కని పునాదుల్ని వేసిందో మనందరికీ తెలిసున్నదే. ఆలంబన ఎదుగుదల, వృధ్ధి ఆమె సంకల్పంలో నిజాయితీని చెబుతుంది. ఎందరో తమకు తోచిన విధంగా ఆలంబనకు చేయూతనిచ్చారని చెప్పారు. పదిమంది కోసం చేసే మంచి పనికి సమాజం నుంచి ఏవిధంగా ప్రోత్సాహం వస్తుందో ప్రత్యక్షంగా చూసాను.
హైదరాబాదు వెళ్లినప్పుడల్లా ఆమె ప్రోత్సాహంతో ఆలంబనలో ఒక పూట పిల్లల మధ్య గడిపేదాన్ని.
నాలుగు నెలలకో, ఆరునెలలకో ఎప్పుడు మాట్లాడుకున్నా సుదీర్ఘమైన ఫోన్ సంభాషణలు మామధ్య ఉండేవి. ఫోన్ చేసే అలవాటు లేని నన్ను ఎప్పుడూ విసుక్కోలేదు. తనే ఫోన్ చేసి ఎంతో ప్రేమగా పలకరించేవారు. తన జీవితంలోనూ, తన చుట్టు ఉన్న వారి జీవితాల్లోనూ జరుగుతున్న ఎన్నో విషయాలను చర్చించేవారు.
1999 లో మహీధర రామ్మోహనరావుగారు కొండాపూర్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయనను చూసేందుకు వస్తున్నానని ఫోన్ చేసి చెబితే డైరెక్టుగా తమ ఇంటికి రమ్మని చెప్పారు. ఆరోజు పరిపూర్ణగారు, శేషుబాబు గారు, శిరీషగారు, నేను కలిసి మహీధరని చూసేందుకు వెళ్లాం.
చుట్టూ ఉన్న అందరినీ ప్రేమించి, స్నేహించే శిరీష గారు తన పిల్లలపట్ల, తనవారి పట్ల డిటాచ్డ్ గానే ఉండేవారనిపిస్తుంది. తనదంటూ వ్యక్తిగతం ఏదీ లేదని నమ్మేవారు. అలాటి మెచ్యూరిటి ఎక్కడో కానీ చూడము.
శేషుబాబు గారు అకస్మాత్తుగా వెళ్లిపోయాక మాత్రం ఒకలాటి స్తబ్దత తోస్తోంది అని చెప్పారు. ఎంత వద్దనుకున్నా శేషుబాబు గారు రోజూ ఇంటికొచ్చి కారు పార్క్ చేసే ఒక పరిచితమైన సవ్వడి తనని వెంటాడుతోందని చెప్పారు.
రెండేళ్ల క్రితం అనుకుంటా ఆమె నుంచి చాలా నెలలు ఫోన్ రాలేదు. గ్యాప్ వచ్చిందనుకుంటూ నేనే ఫోన్ చేసాను.
‘’మీరీమధ్య ఫోన్ ఎందుకు చెయ్యలేదు?’’ అని గట్టిగా అడిగేసాను.
ఆ మాట విని ఎంత హాయిగా నవ్వేసేరో! ఆమె మనసు అతి సున్నితం. ప్రతి విషయానికి స్పందించేవారు. పైగా నన్ను అంటుండేవారు, ‘’జీవితంలో సున్నితత్వాన్ని కోల్పోలేదు’’ అని. కానీ ఆ మాటలు ఆమెకు వంద శాతం వర్తిస్తాయి.
నగరజీవితం తనను ఉక్కిరిబిక్కిరి చేస్తోందనేవారు. విజయవాడ అంటే అపరిమితమైన ప్రేమ. ఎప్పటికైనా ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండాలి అనేవారు. కానీ హైదరాబాదులో ఉంటే పిల్లలు తరచుగా కనిపిస్తారన్న వ్యామోహం కలుగుతోందన్నారు.
ఆమె లేరన్న విషయం నమ్మలేను. ఉన్నారు అన్న ఆలోచనే! కానీ ఏమి పోగొట్టుకున్నానో తలుచుకుంటే గుండె పట్టేసినట్టుంది.
ఆమె లేని లోటు ఎందరెందరిదో! ఎందరి జీవితాలనో స్పృశించారామె. సమాజం కోసం నిస్వార్థంగా ఆలోచించి, తన వంతు సేవను అందించి, ఆ స్ఫూర్తిని చుట్టు ఉన్నవారిలో కలిగించారు. అర్థవంతంగా జీవించటమనే కళను పక్కవారికి నేర్పిన కళాకారిణి. ఆమె ప్రేమ మన అందరిదీ. ఈ లోటు తీరే మార్గం లేదు.
రెండు నెలల క్రితం ఫోన్ లో మాట్లాడుతూ, ‘’విజయవాడ వస్తాను, స్నేహితులందరినీ కలవాలి’’ అని చెప్పారు. ఆ మాటల్ని నిలబెట్టుకోనియ్యకుండా కాలం తనను మననుంచి లాక్కుంది.
* * *