ఉచితం – వెలకట్టలేనిది! – బడి బయటి పాఠాలు

* * *

                                                                 కొందరు పిల్లలు ప్రైవేటు స్కూళ్లనుంచి గవర్నమెంటు స్కూళ్లకి మారారు. నాకు సంతోషమనిపించింది. దానికి కారణముంది. సాయంకాలం క్లాసులకి వచ్చేపిల్లలందరికీ ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా, తల్లిదండ్రులిద్దరూ పనులకి వెళ్లినా నిత్యం సమస్యలతో నలుగు తుండటం చూస్తున్నాను.

క్రితం సంవత్సరం ప్రైవేట్ స్కూల్లో చదివే హారిక, ఆమె చెల్లెలు హరీష మొదటి టర్మ్ అయినతర్వాత స్కూలుకి వెళ్లటం మానేసారు. సాయంత్రాలు క్లాసుకి కూడా రావటం మానేసారు. ఎప్పుడూ ఆటల్లో మునిగిపోయి కనిపించేవారు. ఎందుకు వెళ్లటం లేదంటే మమ్మీ పంపించటంలేదని సమాధానం.

ఒకరోజు హారిక ఇంటికి వెళ్లి ఆమె తల్లిని అడిగాను.

“ఫీజులు కట్టలేదు మేడమ్. బడికి పంపద్దన్నారు పిల్లల్ని” అంది దిగులుగా.

“ఇక్కడికి దగ్గరగా గవర్నమెంటు స్కూలు ఉంది, దానిలో చేర్పించండి. అనవసరంగా ఒక సంవత్సరం వృధా అవుతుంది.”

“లేదులే మేడమ్, ఎట్టాగోట్టా డబ్బు అప్పు తీసుకురాటానికి ఆయన ప్రెయత్నం చేస్తున్నాడులే”

“అప్పా?” అన్నాను ఖంగారుగా. ఎలా తీరుస్తాడు వడ్డీ మీద తీసుకొచ్చిన డబ్బు?

“అప్పులు మాలాటోళ్లకి మామూలేలే మేడమ్” అంది సన్నగా నవ్వుతూ.

అంతలో ఆమె భర్త వచ్చాడు, “నమస్తే మేడమ్” అంటూ.

అతనికీ చెప్పాను పిల్లల్ని ఇక్కడి స్కూల్లో చేర్చమని.

“ఆ బళ్లు బాగోవు టీచరుగారూ, నా చిన్నప్పుడే మానాన్న ఇంగ్లీషు మీడియం బళ్లో చేర్పించాడు. చాలా పెద్ద బడి.” అన్నాడు గర్వంగా, మళ్లీ అంతలోనే,

“నాకు చదువు అబ్బలేదు, కానీ నా పిల్లల్ని మంచి ఇంగ్లీషు బళ్లో చదివియ్యాలని కష్టపడతన్నా.”

“అక్కడి ఫీజులు మీకు బరువు కాదా? అనవసరంగా పిల్లలు, మీరు ఇబ్బంది పడుతున్నారు.”

“లేదులే టీచరుగారూ, బరువనుకుంటే బరువవుద్ది. రెండు నెలల్నించి చేతిలో పనిలేక కానీ పని దొరికితే ఇదేం బరువుకాదు.” అతని ధైర్యం చూస్తే ముచ్చటేసింది.

“ప్రభుత్వం నడిపే స్కూళ్లలో మంచి టీచర్లుంటారు. పిల్లల భవిష్యత్తు బావుంటుంది.” నేనూ నా ధోరణి వదల్లేదు.

అతను మర్యాదకి నవ్వాడు కానీ తన అభిప్రాయం మార్చుకుందుకు సిధ్ధంగా లేడు.

“కాదులే టీచరుగారూ. ఆడపిల్లలే కదా, గవర్నమెంటు బడికి పంపమని మావోళ్లంతా చెప్పినా వాళ్లని ప్రైవేటు బడికే పంపుతున్నా. మా పిల్లలూ మంచి చదువులు చదువుకోవాలిగా. ఆ యూనిఫారాలు, బూట్లు, ఆ బిల్డింగులు, ఆ స్కూలు బస్సులు రమ్మంటే ఈ బళ్లకొస్తయ్యా? డబ్బుదేముందిలే టీచరుగారూ, ఈరోజొస్తుంది, రేపు రాదు. అప్పు చేసినా తీర్చగలనులే” అన్నాడు సంభాషణ ముగిస్తూ. అప్పు దొరుకుతుంది, తీర్చగలనన్న నమ్మకం సరే, ప్రైవేటు స్కూళ్ల ఆర్భాటాల పట్ల ఇంత ఆకర్షణ ఎందుకో?!

ఆ తర్వాత పని నిమిత్తం మహారాష్ట్ర కు వలస వెళ్లిపోయాడని విన్నాను కుటుంబంతో.

దివ్య ఈ సంవత్సరం గవర్నమెంటు స్కూల్లో చేరింది. అంతక్రితం ప్రైవేటు స్కూల్లో చదివింది. అక్కడైతే కొత్త పుస్తకాలు ఇచ్చేవారనీ, ఇక్కడ స్కూల్లో ఎవరో వాడేసిన పుస్తకాల్నిస్తున్నారనీ దిగులుగా చెప్పింది.  సాంఘిక శాస్త్రం అచ్చుపుస్తకం మరీ పాతదిచ్చేరని చెప్పింది. పుస్తకాల్ని చక్కగా అట్టలు వేసి పెట్టుకునే తను ఆ పాత పుస్తకాల పట్ల అయిష్టంతో వాటికి అట్టలు వేయనేలేదు.

“దివ్యా, పుస్తకం తయారుచేయటంలో ఎంతో ఖర్చు, శ్రమ ఉంటుంది. ఒక పుస్తకాన్ని ఒక్క సంవత్సరం నువ్వు చదివి పడెయ్యటం అంటే మనకి ప్రకృతి ఇచ్చిన వనరుల్ని వృధా చేస్తున్నట్టే. అందుకే వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. అదీకాక కొత్త పుస్తకాలు అచ్చై వచ్చాక ఈ పాత వాటిని వెనక్కి తీసేసుకుని కొత్తవిస్తారు” నా మాటలు దివ్య పట్టించుకోలేదు.

“అసలు ఊర్కే ఎవరిక్కావాలి? డబ్బు కట్టించుకుని  ముందే మంచి పుస్తకం ఇవ్వచ్చుగా” అంటూ గొణిగింది. ప్రైవేటు స్కూలు నుంచి మార్చి ఇక్కడ చేర్పించటంలో ఉన్న ఆర్థికసమస్య ఆమె వయసుకి అర్థం కాలేదు.

పెన్ను కొనుక్కొస్తానంటూ వెళ్లిన సౌమ్య పరుగెత్తుకుంటూ వచ్చింది క్లాసులోకి.

“టీచర్, ఈ కొత్త షాపు బలే మంచిది. ఒక పెన్ను కొంటే ఇంకో పెన్ను ఉచితమంట” సంతోషంగా చేతిలో పెన్నుల్ని చూబించింది.

“ఆ పెన్నులు పనిచెయ్యవులే” అంది దివ్య వెంటనే.

“ఏం, ఎందుకు పనిచెయ్యవు?”

“మన బళ్లో ఉచితంగా పుస్తకాలిస్తున్నారుగా. అవి ఎంత చెత్తగా ఉన్నాయో చూళ్లేదా?” అంది ఉక్రోషంగా.

సౌమ్యకి ఈబడి అలవాటే. కనుక తనకి ఎలాటి ఫిర్యాదు లేనేలేదు. “కొత్త పుస్తకాలిస్తారులే, కొన్నాళ్లాగు” అంది కొన్న పెన్నులు చూసుకుంటూ.

“సౌమ్యా, మీరంతా ఎప్పుడూ రాజు కొట్లో కొంటారుగా. కొత్త షాపుకెళ్ళేవేం?” అంటే,

“ఒక పెన్ను కొంటే ఒక పెన్ను ఉచితం అని బోర్డ్ పెట్టేరు టీచర్ ఇక్కడ” అంది.

మరునాడు క్లాసుకి వస్తూనే సౌమ్య కోపంగా వచ్చింది,

“టీచర్, నిన్న కొన్న పెన్నుల్లో ఒకటి రాయట్లేదు. ఇంటికెళ్ళంగానే మా అన్నయ్య ఒక పెన్ను తీసేసుకున్నాడు. ఇంకోపెన్ను స్కూలుకి పట్టుకెళ్లాను. అది అస్సలు రాయలేదు. కొత్త షాపులో మోసం చేసారు.” అంది.

వ్యాపారం పెంచుకుందుకు ఆ కొత్త షాపువాళ్లు ఆఫర్ ఇస్తున్నారు. కానీ వాళ్లుమాత్రం ఒక పెన్ను ఖరీదుకి రెండు ఎక్కణ్ణుంచి ఇవ్వగలరు?  పెద్దపెద్ద వ్యాపారాలు నడిపేవాళ్లు కూడా ఈ ఉచితం అనే ఆశ చూబించి వ్యాపారాల్ని పెంచుకుంటున్నారు. ఊర్కే వచ్చేదైతే నాణ్యత విషయం కొంత తేడా ఉన్నా కొంచెం అదనంగా అందటం బావుంటుంది జనానికి.

దివ్య రోజూ బడిలో జరిగే విషయాలపట్ల నిరసనగా చెబుతూనే ఉంది. తను ఇదివరలో చదివిన ప్రైవేటు స్కూలు డిసిప్లిన్ విషయంలో ఎంత బావుండేదో, ఒక్కరోజు యూనిఫారం వేసుకురాకపోయినా, ఆలస్యంగా స్కూలుకొచ్చినా ఫైన్ వేసేవారని, అందుకే అందరూ రూలు ప్రకారం నడుచుకునేవారని చెబుతుండేది. అలా ఇక్కడ ఉండదని, అందుకే కొందరు రూల్సు అతిక్రమిస్తున్నారని, మొత్తానికి ఇక్కడ తనకు నచ్చట్లేదని తీర్మానించింది. నా గొడవ పడలేక పుస్తకాలకి అట్టలు వేసింది. కానీ చదువు విషయంలో కాస్త వెనకపడిందని గమనించాను.

ఒకరోజు సాయంత్రం దివ్య వాళ్ల అమ్మ వచ్చింది.

“టీచరుగారూ, ఈ పిల్ల స్కూలుకి సరిగా వెళ్లట్లేదు. అడిగితే ఇక్కడ నచ్చలేదంటుంది. ఫీజులు కట్టలేక ఇక్కడికి మార్చాం అని చెబితే అర్థం చేసుకోదు. మీరు కాస్త బుధ్ధి చెప్పండి” అంది.

“ఏం, దివ్యా, చదువుకుని పెద్ద ఇంజనీర్ అవుతానని చెప్పేదానివి. స్కూలుకి వెళ్లకపోతే ఎలా అవుతావు?”

“చెప్పానుగా టీచర్, నాకు ఇక్కడ నచ్చలేదు” అంది ఎటో చూస్తూ. ఈ రెండు నెలల్లో ఆమెలో చాలా మార్పు వచ్చింది.

“నీకు నచ్చనిదేమిటిక్కడ? బాగా చదువుకున్న టీచర్లు, బాగా చదువుచెప్పే టీచర్లు ఉన్నా నీకు ఎందుకు నచ్చట్లేదు.”

మౌనంగా నిలబడింది. ఆమె తల్లి పనుందంటూ వెళ్లిపోయింది. క్లాసులో పిల్లలంతా దివ్యకేసి, నాకేసి చూస్తున్నారు.

“దివ్యా, నీకు నచ్చలేదంటున్న గవర్నమెంటు స్కూళ్లలో చదువుకుని ఎందరో కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు సైంటిస్టులు తయారవుతున్నారు. స్కూల్లో ఇచ్చే యూనిఫారాలు, పుస్తకాలు నువ్వనుకున్నట్టు ఉచితంగా ఏమీ ఇవ్వటంలేదు. మనం ప్రభుత్వానికి ఇంటిపన్ను, నీటిపన్నులాటి ఎన్నో పన్నుల్ని కడతాం. ఆడబ్బుతో ప్రభుత్వం మనకి అవసరమైన సౌకర్యాలు చేస్తుంటుంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒక నీటిపంపులోంచి నీళ్లు వృధాగా పోతుంటే కట్టేస్తావా లేదా?”

బుధ్ధిగా తలాడించింది.   

“ప్రైవేటు స్కూల్లోలాగా ఇక్కడ ప్రతిదానికీ ఫైన్ వేస్తే ఎవరు కట్టగలరు? నీలాటి చురుకైన అమ్మాయి ఫైన్లు వేస్తేనే స్కూల్లో క్రమశిక్షణ ఉంటుందనటం బావులేదు. మీ ఇంట్లో గడియారం లేదని చెప్పావు ఒకసారి. మరి మీఅమ్మ ఎప్పుడైనా ఆలస్యంగా నిన్ను బడికి పంపిందా? అమ్మని చూసి నువ్వు డిసిప్లిన్ నేర్చు కోవట్లేదా? కొత్త క్లాసులోకి వచ్చాక ముందుగా పాత అచ్చు పుస్తకాలిచ్చారని నచ్చలేదంటున్నావ్. కాగితాన్ని ఎలా తయారుచేసుకుంటున్నామో తెలుసా?”

“చెట్లనుంచి” అంది వెంటనే.

“అంటే కాగితాన్నితయారుచెయ్యటానికి చెట్లని నరుకుతున్నామన్న సంగతి నీకు తెలుసు. పర్యావరణం గురించి వ్యాసం రాయమంటే చెట్లను కాపాడుకోవాలని రాసేవు. ఉన్న పుస్తకాల్ని కొన్నాళ్లు వాడుకోమంటే ఇష్టంలేదంటావ్. పర్యావరణం పట్ల మనకి ఎలాటి బాధ్యతా లేదా?”

దివ్య కొత్త విషయమేదో వింటున్నట్టు చూస్తోంది.

“మనం పీల్చే గాలి, తాగే నీళ్లు ప్రకృతిలో దొరుకుతున్నాయి. ప్రకృతిని సంరక్షించుకుంటూ, వాటిని మనం సంతోషంగా ఉపయోగించుకుంటున్నాం. ఉచితంగా దొరుకుతున్నాయి కనుక విలువలేనివి కాదుగా. వాటికి మనం వెల కట్టలేము. ఇప్పుడు చెప్పు, మనకి అందే  ఈసౌకర్యాలు విలువలేనివా? ఇవన్నీ నువ్వు చదువుకోవట్లేదా?”

“సారీ టీచర్. నేను ఎప్పుడూ ఇదంతా ఆలోచించలేదు. ఊర్కే దొరుకుతున్నాయనుకున్నవన్నీ నిజానికి ఇంత విలువైనవన్న విషయం గ్రహించుకోలేదు. ఇకనుంచి బాధ్యతగా ఉంటాను.” స్థిరంగా చెప్పింది దివ్య.

* * *

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.