* * *
పిల్లల్లో పుస్తకాలు చదవాలన్న కుతూహలం ఎంతవరకు ఉంటోంది? ఎలాటి పుస్తకాలు చదవాలనుకుంటున్నారు? ఇప్పటి పాఠశాల చదువులు చాలా ఒత్తిడిని కలగజేస్తున్నాయి. పోటీతత్త్వం పెరగటంతో ఎక్కువ గంటలు క్లాసు పుస్తకాలతోనే గడపవలసి ఉంటోంది. అలాటప్పుడు ఇంకా వేరే పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉంటుందా అంటే, ఉంటుందని చెబుతున్నారు నేను పలకరించిన కొందరు పిల్లలు.
దాదాపు డెబ్భై మంది పిల్లల్ని పుస్తకాల పట్ల ఎలాటి అభిప్రాయం ఉందో అడిగినప్పుడు రకరకాల విషయాలు తెలిసాయి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు, రిలాక్స్ అయేందుకు పుస్తకాలు చదవుతామని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ వంటి వస్తువుల్నుంచి పిల్లల్ని దూరంగా ఉంచగలిగితే మరింతమంది పుస్తకాలు కావాలంటారు. కావాలంటున్నారనో, గొడవపెడుతున్నారనో పెద్దవాళ్లు పిల్లల చేతులకి ఫోన్ ఇస్తున్నారు. అరచేతిలో అందుబాటులోకి వచ్చే రకరకాల వినోద కార్యక్రమాలు పిల్లల్నిఆకర్షిస్తున్నాయి. ఇది ప్రోత్సహించదగ్గది కాదు. పుస్తకాలను నెట్ లో చదవటమూ ఉంది. కానీ పుస్తకాన్ని చేతుల్లో పట్టుకుని చదవటంలో దాని తాలూకు స్పర్శ పుస్తకంతో మనకొక బంధాన్ని ఏర్పరుస్తుంది. అలాటి అలవాటు పెంచినపుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల అవసరం ఉండదు.
ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. పుస్తకాలు చదివే పెద్దలున్న ఇళ్లల్లో పుస్తకాల పట్ల పిల్లలకీ అభిరుచి ఏర్పడుతుంది. పిల్లల్లో చదివే అలవాటుని చిన్నప్పట్నుంచీ చెయ్యాలి. పిల్లలు పుట్టకముందునుంచీ కూడా కథలు చదివి వినిపించటమో, చెప్పటమో చెయ్యాలని, అవి వారి మానసిక, బౌధ్ధిక పెరుగుదలకి సాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చుట్టూ ఉన్న ప్రపంచం పరిచయం చేసేందుకు అమ్మ, నాన్నలు ముందుగా రంగురంగుల బొమ్మలతో ఉన్న పుస్తకాల్ని అలవాటు చేస్తారు. చదవటం రాకపోయినా తెల్సిన వస్తువుల్ని, పువ్వులు, పళ్లు, పక్షులు ఇలా తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోని వాటిని బొమ్మలరూపంలో చూసి గుర్తుపడుతుంటారు పిల్లలు. అక్షరాల్ని కూడా బొమ్మల సాయంతోనే నేర్చుకుంటారు. అలా పుస్తకాలకి ఆకర్షితులవుతారు.
స్కూలుకి వెళ్లే పిల్లలు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఇంటికొచ్చి ప్రశ్నలు వేస్తారు. తల్లిదండ్రులు వాళ్ల ప్రశ్నలకి జవాబులు చెప్పాలి. పుస్తకాలు చదవటం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయని చెప్పి మంచి పుస్తకాల్ని వాళ్లకి అందుబాటులో ఉంచి చదివేలా ప్రోత్సహించాలి. ముఖ్యంగా మాతృభాషలో చదివితే భాష మీద పట్టు వస్తుంది. తమ అభిప్రాయాల్ని సులువుగా, స్పష్టంగా చెప్పే నైపుణ్యం వస్తుంది.
గాంధీజీ, అబ్దుల్ కలామ్, విరాట్ కోహ్లీ, షారుఖ్ ఖాన్, సైనా నెహ్వాల్, మదర్ థెరిసా…వీళ్ళందర్నీ మనం ఎందుకు గుర్తుంచుకుంటున్నాం? వాళ్ళు తాము ఎన్నుకున్న రంగంలో ఉత్తమ సేవలు అందించి, తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కృషి, పట్టుదలతో పాటు తమ శక్తి మీద ఉన్ననమ్మకం వల్లనే విజయాన్ని సాధించగలిగారు.
మన క్లాసులో మనం కూర్చునే సీట్లో ఎవరైనా కూర్చుంటే, అది తాత్కాలికంగా అయినా ఒప్పుకోము. అలాగే సమాజంలో మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించాలంటే మిగిలిన వారికంటే ఎక్కువ విషయాలు తెలిసి ఉండాలి. అందుకు పుస్తకాలు సాయం చేస్తాయి.
చిన్నప్పటినుంచీ కథలు వింటూ పెరుగుతాము. కథల పుస్తకాలు మరింత ఆసక్తి కలిగిస్తాయి. కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని సాహసాల గురించి, కొన్నిపజిల్స్ ని, ఛాలెంజీలను, మరికొన్నికొత్తకొత్త ఆలోచనల్ని చెబుతాయి. ఇవన్నీఒక వ్యక్తి సంపూర్ణంగా పెరిగేందుకు అవసరమే. స్కూల్ చదువులు అవసరమైన వృత్తి నైపుణ్యాల్నిస్తాయి. కానీ పిల్లల్లో ఉండే సహజమైన ఆసక్తిని, అపరిమితమైన శక్తిని వెలికి తియ్యాలంటే వాళ్లతో పుస్తకాలు చదివించటం మంచి మార్గం. దీనివలన పిల్లలు ఒక ఆరోగ్యకరమైన, ఆలోచన కలిగిన వ్యక్తులుగా తయారవుతారు.
అసలు పిల్లలకోసం ప్రత్యేకమైన పుస్తకాలు అవసరమా? అవును. ఈ విషయం కొన్ని శతాబ్దాల క్రితమే జాన్ లాక్, రూసో అనే ప్రపంచ ప్రసిధ్ధ తత్త్వవేత్తలు గట్టిగా చెప్పారు. చిన్నపిల్లల మైండ్ తెల్లని కాగితం లాటిదని, వాళ్లని సహజంగా, ఆనందంగా పెరిగేలా మంచి పుస్తకాల్ని అందించాలని చెప్పారు.
భారతదేశంలో మొదటిసారిగా కేశవ్ శంకర్ పిళ్లై అనే రాజకీయ కార్టూనిస్ట్ 1957 సం..లో ‘చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్’ అనేది ప్రారంభించారు. అప్పటినుంచి అనేక భాషల్లో పిల్లలకోసం ఉత్తమ బాలసాహిత్యం రావటం మొదలైంది. ఈ ట్రస్ట్ 1979 లో మొదటి సారిగా అంతర్జాతీయ పిల్లల పుస్తక మహోత్సవం దిల్లీలో జరిపింది.
మా చిన్నప్పుడు ఎక్కువగా నీతి కథలే చదివేవాళ్లం. కానీ ఇప్పుడు పిల్లలు నీతి కథలొద్దు అని చెప్పేస్త్తున్నారు. అయితే ఒక విషయం చూడండి,
మన చెల్లెలో, తమ్ముడో నిప్పు ముట్టుకోబోతే చూస్తూ ఊరుకుంటామా? వాళ్లకి చెయ్యికాలుతుందని జాగ్రత్త చెబుతాము. అలాగే పెద్దవాళ్లు తమ అనుభవాన్ని పిల్లల క్షేమం కోసం, మంచికోసం చెబుతారు. అంతమాత్రాన అది నీతులు చెప్పినట్టుకాదు. ముందుగా ఎవరేం చెప్పినా వినటం నేర్చుకోవాలి. అందులో ఉన్న మంచి గ్రహించుకోగలగాలి. అలా మంచి, చెడుల్ని చూడగలిగే దృష్టి పుస్తకాలే నేర్పుతాయి.
ఉదాః ఆవు, పులి అనే పుణ్యకోటి కథ లోఆవు తన బిడ్డకు పాలు ఇచ్చి వచ్చి పులికి ఆహారమవుతానని చెప్పి వెళ్తుంది. అన్నప్రకారం పులి దగ్గరకి వెళ్తుంది. ఇలాటి కథ వింటే, నిజం చెప్పటం, మాటమీద నిలబడటం మంచి గుణాలని, వాటి ఫలితం మంచే అవుతుందని నమ్మేవాళ్లం. ఇప్పటి పిల్లలు, ఆకలిగా ఉన్న పులి ఆవుని ఎందుకు తినెయ్యలేదు, ఆవు చెప్పే కబుర్లు విని నమ్ముతుందా? అయినా ఆవు వెనక్కి రాకపోతే పులి ఏమీ చెయ్యలేదుకదా… అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.
పిల్లల్లో ఇలాటి క్రిటికల్ థింకింగ్ ప్రశంసించదగ్గదే. ప్రశ్నించటం, విశ్లేషించటం, పోల్చటం, తీర్పులివ్వటం నేర్చుకుంటూన్నారంటే అవగాహన స్థాయి పెరుగుతున్నట్టే. కానీ,
వాళ్ళు ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని మిస్సవుతున్నారు…
తోటిప్రాణుల పట్ల సహానుభూతిని, నమ్మకాన్నీ కల్గి ఉండాలన్నది అర్థం చేసుకోవట్లేదు. ఇలాటి ఇమోషన్స్ ని పిల్లల్లో కలిగించటం పుస్తకాలు చేస్తాయి.
చిన్నపిల్లల్లో పరిశీలన, అనుకరణ ఎక్కువ. ప్రతి విషయమూ చూసి తమకి తెలిసిన విషయంతో అన్వయం చేస్తుంటారు. వాళ్ల ఊహలు పెద్దవారికందనంత విశాలంగా ఉంటాయి. ఒక మూడేళ్ళ పాపాయి ఒక వెన్నెల రాత్రి అమ్మ ఒళ్లో కూర్చుని ఇంటిముందు పరుచుకున్న వెన్నెలని చూసి, అమ్మా, పాలు ఆకాశంలోంచి ఒలికిపోతున్నాయి. అని చెప్పటం ఆ పాప ఊహా శక్తికి నిదర్శనం. పాపాయికి పాలు తెల్లగా ఉంటాయన్నది తెలుసు కనుక అన్వయించుకుంది. అలాగే వివిధ రంగుల్ని గుర్తుపట్టే వయసులో ఆకాశాన్ని చూసి, ఆకాశం బ్యూగా ఉందని చెప్పటం గమనించచ్చు. అప్పటికి పాపాయికి బ్లూ అని చెప్పే భాష కూడా రాదు.
అందుకే పిల్లల ఊహాశక్తిని మరింత విశాలం చేసేందుకు వాళ్లకి మంచి పుస్తకాల్ని అందుబాటులో ఉంచాలి. వాళ్లు తమకి తోచిన విషయాల్ని స్వేచ్ఛగా, వివరంగా వ్యక్తీకరించే భాష, విషయ పరిజ్ఞానం, మిగిలిన వారితో మసులుకునే తీరు లాటి ఎన్నో విషయాల్ని పుస్తకాల్ని చదవటంతో పరోక్షంగానే నేర్చుకుంటారు. అమ్మలు సీరియస్ గా ఉన్నా, చిరాగ్గా ఉన్నా, అమ్మ దగ్గరకి చేరి, ‘ఆయి వచ్చిందా’ అంటూ నుదుటిమీద చెయ్యి వేసి చూస్తారు ఆరిందాల్లా. ఇవన్నీ ఎవరూ నేర్పక్కరలేదు వాళ్లకి.
ప్రపంచం అనుక్షణం మారుతూనే ఉంటుందన్నది పిల్లలకి అర్థమయేలా చెయ్యాలి. ఋతువులు మారుతూ, తమచుట్టూ ఎలాటి మార్పులు తెస్తున్నాయో గ్రహించే పిల్లలు ఎదుగుతున్న క్రమంలో తమలో వస్తున్న మార్పుల్నిసహజంగా తీసుకుంటారు. అనవసరంగా భయాందోళనలకి లోనుకారు.
పిల్లల్లో పోటీ తత్వం ఉండటం అవసరమే. కానీ తోటివారిమీద పోటీ పడి, వాళ్లతో గొడవలు పడటం కాక కొత్త విషయాల్ని నేర్చుకునేందుకు పోటీ పడాలి. వేరెవరిలానో తాము లేమని నిరాశపడకుండా తనవైన ప్రత్యేకతని గమనించి, నిలబెట్టుకోవటం అలవాటుచేసుకోవాలి. తన లాటి వాళ్లు మరెవరూ ఉండరని, తనదైన వ్యక్తిత్వం తనకే స్వంతమనీ తెలుసుకోవాలి.
ఉదాః ఒక నదిలో స్నానం చేస్తున్న ఒక సాధువు ఒక తేలు కొట్టుకుపోతుంటే రక్షించబోతాడు. నాలుగు ప్రయత్నాల్లో కానీ అది సాధ్య పడదు, ప్రతిసారి తేలు అతన్ని కుడుతూనే ఉంటుంది, అది సహిస్తూనే తన పట్టు వదలకుండా ఆఖరి ప్రయత్నంలో తేలుని ఒడ్డుమీదకి చేరుస్తాడు సాధువు.
‘కుట్టే నీ లక్షణం నువ్వు మార్చుకోవు, అలాగే నిన్ను రక్షించాలన్న నా మానవ లక్షణం నేను మార్చుకోను’ అని నవ్వుతాడు ఆఖరుకి.
పిల్లలు తమ అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పే ధైర్యాన్ని, తమకు కలిగే మంచికి చుట్టూ ఉన్న వారి తోడ్పాటు ఉందని గమనించే శక్తి పుస్తకాలు నేర్పుతాయి. బాధ్యతల్ని తీసుకోటం ద్వారా (ఉదాః స్కూల్ ఫంక్షన్ లో తమకి అప్పగించిన పనిని చక్కగా చేసి టీచర్ల మెప్పు పొందటం) తమమీద తమకి ఒక గౌరవం, విశ్వాసం కలుగుతాయి. చేసే పని మీద వంద శాతం దృష్టి పెడితే, అది విజయానికి సరైన మార్గాన్ని చూబిస్తుంది. వంద శాతం అనేది ప్రతిపనిలోనూ అలవాటు చేసుకోవాలి.
జీవితంలో కొత్తకొత్త కలలు కని, వాటిని సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో పనిచెయ్యాలి.
ఉదాః దశరథ్ మాంఝీ ఒక పేద వ్యవసాయ కార్మికుడు. ప్రతిరోజూ ఒక కొండ దాటి వెళ్లి ఒక రైతు పొలంలో పని చేస్తుండేవాడు. అతని భార్య అతనికి మధ్యాహ్నం భోజనం తెస్తూ కొండ మార్గంలో జారి గాయపడుతుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు కొండ దాటాలి. అతను ఉన్న ప్రాంతం గెహ్లార్. అక్కడినుంచి గయ వెళ్లాలి. భార్యకి వైద్యసదుపాయం కోసం కొండ దాటి వెళ్లవలసి ఉంది. వైద్యం సమయానికి అందదు. ఇలాటి పరిస్థితి మరొకరికి రాకూడదని మాంఝీ అప్పుడే నిర్ణయించుకుంటాడు. తానున్న ప్రదేశం నుంచి గయ వరకు కొండను తవ్వి రోడ్డుమార్గం వెయ్యాలని పొలం పని మానేసి, తన మేకల్ని అమ్మి కావలసిన సుత్తి, గునపంలాటి వస్తువులను కొనుక్కుంటాడు. కొండను పగలకొట్టడం మొదలు పెట్టాడు. అతన్ని చూసి అందరూ పిచ్చివాడని నవ్వేవారు. అతని పట్టుదల పెరిగింది. 1967లో మొదలు పెట్టిన అతని పని 1988లో 360 అడుగుల పొడవు, 30అడుగుల వెడల్పు తో రోడ్డు పూర్తిచేసాడు. అతని పట్టుదల చూసి అతని గ్రామస్థులు అతనికి ఆహారం ఇవ్వటం, సాయం చెయ్యటం చేసేరు. అతన్ని మౌంటెన్ మ్యాన్ గా పిలుస్తారు. 2007 లో మరణించినపుడు బీహార్ ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అతనికి అంత్యక్రియలు జరిపింది. ఒక మనిషి తను చెయ్యవలసినదేమిటో నిర్ణయించుకున్నాక ఎవరేమన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగిపోకూడదని చేసిచూపించాడు. చెయ్యదలచుకున్న పనిమీద, తన శక్తి మీద నమ్మకంతో పనిచేసినపుడు అది విజయాన్నిస్తుందని నిరూపించాడు.
జీవితంలో ఎదురయ్యే అనేకానేక సందర్భాలను ఎదుర్కొందుకు మనల్ని మనం సన్నద్ధులను చేసుకుందుకు పుస్తకాల్ని మించిన నేస్తాలు లేరన్నది నిరూపించబడిన సత్యం. పుస్తకాలతో పాటు మొక్కల్ని పెంచటమో, ఒక పెట్ ని పెంచటమో, ఒక సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవటమో, ఒక కొత్త భాషని నేర్చుకోవటమో చేసినపుడు ఒక ప్రత్యేకత మనస్వంతం అవుతుంది.