బిట్టు-మట్టివాసన – ఐదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Feb, 2018

బిట్టుమట్టివాసన

నేపథ్యం : ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు కదా, చాలా అనుమానాలు వస్తుంటాయి వాడికి. ఇక ఊళ్లో సైకిల్ రిపెయిర్ షాపు నడిపించే వీరబాబు కూతురి పిల్లలు దావీదు, చిట్టి. ‘వాళ్ళు చదువుకోవాలి’ అని వీరబాబు కోరిక. ఇక చదవండి..
రచన: శ్రీమతి అనురాధ నాదెళ్ళ, పోరంకి, విజయవాడ.

* * *

మొదటి రోజు దావీదు అయిష్టంగానే వచ్చాడు. వాడు వీరబాబుతో చెప్పాడుట, ‘నేను సైకిల్ పని బాగా నేర్చుకుని, పెద్ద కొట్టు పెట్టుకుంటాను, చదువొద్దు’ అని.
‘కానీ చదువు ఎందుకు అవసరం’ అని బిట్టు వాళ్ల తాతయ్య వివరంగా చెప్పారు అందరికీ: “ఏ పని చేసినా కొంచెం చదువు, కొంచెం ఆలోచన ముఖ్యం. ఆ కొంచెం చదువు కూడా లేకపోతే ఆలోచించే శక్తి సరిగ్గా రాదు. అంతేకాదు, ఈ రోజుల్లో చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది; జీవితం బావుంటుంది. మరొకరికి సాయం చేసే అవకాశం ఉంటుంది కూడా” అని. పిల్లలు ముగ్గురూ బుద్ధిగా విన్నారు.

తాతయ్య చెబుతుంటే మెల్ల మెల్లగా తెలుగు అక్షరాలు నేర్చుకోవటం మొదలెట్టారు బిట్టు, దావీదు. అప్పటికే చిట్టికి తెలుగు చదవటం, రాయటం వచ్చు బాగానే. అందుకని ఇప్పుడు తను వీళ్ళతోబాటు కూర్చొని ఇంగ్లీషు అక్షరాలు, హిందీ అక్షరాలు మొదలెట్టింది.

కొన్ని రోజులు గడిచే సరికే చాలా మార్పు వచ్చింది. పిల్లలిద్దరికీ కూడా చిన్న చిన్న పదాలు చదవటం వస్తోంది ఇప్పుడు. తాతయ్య రోజూ వాళ్లకి వార్తా పత్రిక హెడ్డింగులు చూపించటం మొదలు పెట్టాడు. వాటిలో కొన్ని పదాలు, కొన్ని అక్షరాలు గుర్తు పట్టటం, చదవటం, ఫలానా పదం ఎక్కడ ఉన్నది? అని ఒకరు అడిగితే మిగిలిన ఇద్దరూ పేజీలో అంతా వెతికి కనుక్కోవటం- అదొక ఆటలాగా తయారైంది పిల్లలకి.

‘చదువు అనేది అసలు ఇంత సులభం అని గానీ, ఇంత ఆనందం కలిగిస్తుంది’ అని గానీ అనుకోలేదు దావీదు. స్వతహాగా వాడు చాలా తెలివైన వాడు. ఒకసారి చదువు రుచి తెలిసాక, ఇక వాడు దూసుకు పోయాడు. అక్షరాలు చదవటం, పదాలు చదవటంలోంచి, వాక్యాలు చదవటంలోకీ, వాక్యాలు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించటంలోకీ వచ్చేసాడు. ప్రతిరోజూ మధ్యాహ్నం పూటంతా వీరబాబు దగ్గర సైకిల్ షాపులో కూర్చుంటున్నాడు. వాడిలో మంచి మార్పు కనిపించటం మొదలెట్టింది వీరబాబుక్కూడా… ఆరోజు వార్తాపత్రిక మొదటిపేజీలో ‘డ్రగ్స్ వినియోగంతో చెడు దారి పడుతున్న యువత’ అంటూ ఒక వార్త కనిపించింది వీళ్లకి.

‘డ్రగ్స్ అంటే ఏమిటి తాతయ్యా? అవి ఎందుకు చెడ్డవి?’ అంటూ ప్రశ్నలు అడిగేసేరు దావీదు, బిట్టు.

“కొన్ని రకాల కెమికల్స్‌కు మత్తు ఎక్కించే లక్షణం ఉంటుంది. వాటిని ఎవరైనా వాడారనుకో, ఆ తర్వాత వాళ్ళకి ఇంక ఎప్పుడూ ‘అవే కావాలి, మళ్ళీ కావాలి’ అని అనిపిస్తుంటుంది. అవి చాలా ఖరీదువి కూడా. అందుకని చూస్తూండగానే వాళ్ల దగ్గరున్న డబ్బులు అన్నీ ఖర్చయిపోతాయి. అంతే కాక అవి వాళ్ల నెర్వస్ సిస్టంని నాశనం చేసేస్తాయి. దాంతో ఇంక వాళ్ళకు ఏ పని చేసేందుకూ శక్తి లేకుండా పోతుంది. అందుకనే ప్రభుత్వం వాటిని ఎవ్వరూ వాడకూడదు అని రూల్స్ పెట్టింది” చెప్పాడు తాతయ్య.

“సారాయి కూడా అంతే కదండి” అన్నాడు దావీదు, అకస్మాత్తుగా కళ్లనీళ్ళు పెట్టుకొని. వాడికిప్పుడిప్పుడే తమ కుటుంబ పరిస్థితి అర్థం అవుతోంది. వాళ్ల నాన్న రోజూ తాగి వచ్చి, వాళ్ల అమ్మని కొడతాడు; వాళ్ల అమ్మ సంపాదించిన డబ్బుల్ని కూడా ఎత్తుకుపోతాడు; ఇంకా కావాలంటాడు- ఇవన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చి వాడు దిగులుగా అయిపోయాడు.

తాతయ్య తల ఊపాడు. “సారాయిని ఊరి బయట దుకాణాల్లో అమ్ముతారు, కానీ డ్రగ్స్‌ ఇంకా ప్రమాదం. వాటిని ఎవ్వరూ అట్లా కూడా అమ్మేందుకు లేదు, కొనేందుకు లేదు.

‘మా నాన్న రోజూ తాగి ఇంటికి వచ్చి మా అమ్మని కొడతాడు తాతగారూ’ అన్నాడు దావీదు.

‘నువ్వు బాగా చదువుకోవాలి దావీదూ! అప్పుడు నువ్వు చెప్పిన మాటకి విలువ ఉంటుంది. మీ నాన్న చెడు అలవాటుని మాన్పించచ్చు. సరేనా, దిగులు పెట్టుకోకు!’ అంటూ బుజ్జగించారు తాతయ్య. ‘బీడీ కూడా మంచిది కాదా తాతగారూ?’ అని అడిగాడు దావీదు, బీడీలు కాల్చే తాత వీరబాబుని గురించి ఆలోచిస్తూ.

‘మంచిది కాదురా దావీదు, అలాంటి అలవాట్లు ఊపిరి తిత్తుల వ్యాధులకీ, కాన్సర్‌కీ దారితీస్తాయి’ చెప్పాడు తాతయ్య.

“బీడీలు కూడా మంచివి కావట. తాతచేత బీడీలు మాన్పించాలి” మనసులోనే నిశ్చయం చేసుకున్నాడు దావీదు.


రోజూ సాయంత్రం చదువులయ్యాక, పిల్లలకి ఏదో ఒక ఫలహారం పెడుతుంది అమ్మమ్మ. పెరట్లో జామచెట్టు నీడన కూర్చుని, అందరూ కబుర్లు చెప్పుకుంటూ తినాలంటే బిట్టుకి, చిట్టికి, దావీదుకి బలే సరదాగా ఉంటుంది. వీళ్లందరి మధ్యా రెయిన్బో కుక్క గాడు బుద్ధిగా కూర్చుని తను కూడా ఫలహారాన్ని రుచి చూస్తూ ఉంటాడు. అలాటి సన్నివేశం తమ కుటుంబంలో ఎప్పటికైనా చూస్తానా అని ఆలోచన వచ్చినప్పుడలా దావీదుకు మనసులో చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడే వాడు నిశ్చయించుకున్నాడు: “మా చెల్లెల్ని, తమ్ముళ్లని నేనే పైకి తీసుకు రావాలి’ అని.

బిట్టుకి తనకుగా తాతమ్మతో సమస్య లేదు- పైగా తనను బోలెడు ముద్దు కూడా చేస్తుంది. కానీ రెయిన్బో గాడిని చూస్తే గొడవ చేస్తుంది. వాడిని తన గదిలోకి అస్సలు రానివ్వదు. ‘రెయిన్బోకి స్నానం చేయించాను తాతమ్మా’ అని చెప్పినా ఊరుకోదు. ‘ఒరేయ్, నువ్వు ఆ కుక్కపిల్లని వేసుకు తిరిగేవంటే మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పేస్తా, నిన్ను తీసుకెళ్లి పొమ్మని’ అంటూ బెదిరిస్తుంది కూడా. “‘ప్రాణులందరినీ ప్రేమించాలి’ అని తాతయ్య, అమ్మమ్మ చెబుతుంటే, ఈ తాతమ్మ ఏంటి, అందరికంటే అంత పెద్దదై ఉండి కూడా రెయిన్బోని విసుక్కుంటోంది?” అని బిట్టుకి కోపం.

ఆఖరికి తాతయ్యని అడిగేసేడు: “తాతయ్యా, తాతమ్మ ఎప్పుడూ రెయిన్బోని విసుక్కుంటుంది. వాడిని అసలు ప్రేమించదు- ఎందుకు?’” అని. వాడి ముఖంలో సీరియస్‌నెస్ చూసి తాతయ్య నవ్వేసాడు. “తాతమ్మకి ఇష్టమేరా! కానీ తన బట్టలు, పక్క తొక్కుతాడని భయం. రెయిన్బో ఇంట్లోనూ, పెరట్లోనూ తిరుగుతూ ఒళ్లంతా మట్టి చేసుకుంటాడు కదా, మనమైతే మట్టి అంటుకుంటే వెంటనే కడిగేసుకుంటాం. కానీ తాతమ్మ గబుక్కున లేవలేదు. ఆవిడకి ఎవరైనా సాయం చేస్తే కానీ ఏ పనీ చేసుకునే ఓపిక ఉండదు. అందుకే తన గురించి ఎవరిననీ ఇబ్బంది పెట్టకూడదని, జాగ్రత్తగా ఉంటుందిరా బిట్టూ! ఎప్పుడైనా మనం ఎదుటివారిని అర్థం చేసుకోవాలి కానీ తప్పుగా అనుకోకూడదు, తెల్సిందా?” అది విన్న తర్వాత బిట్టూకి తాతమ్మ అంటే మరింత ఇష్టం కలిగింది.

అప్పటినుంచీ వాడు తాతమ్మని మరింత జాగ్రత్తగా చూసుకోవటం కూడా మొదలెట్టాడు. రోజూ ప్రొద్దున్నే తాతమ్మకి రాగి జావ తీసుకెళ్లటం, ఆవిడ జావ త్రాగేసాక ఖాళీ కప్పుని తీసుకెళ్ళి వంటింట్లో పెట్టటం, రాత్రి పడుకోబోయే ముందు తాతమ్మకి దుప్పటి కప్పి, చిన్న లైటు వేయటం, ‘నిద్ర వస్తోందా’ అని అడిగి తెలుసుకుని, ‘రావట్లేదు’ అంటే కాస్సేపు దగ్గర కూర్చొని కబుర్లు చెప్పటం.. “నేను ఇక్కడే ఉంటే బావుండు కదా, తాతమ్మకి సాయంగా?!” అని కూడా కొద్ది కొద్దిగా ఆలోచించటం మొదలెట్టాడు.


ఆరోజు ప్రొద్దున అకస్మాత్తుగా వాన పడింది. తర్వాత ఇక రోజంతా మబ్బు మబ్బుగానే ఉంది. మధ్యాహ్నం అవుతుండగా మళ్ళీ ఓ చిన్న వాన మొదలైంది. వాననీటిలో తడుస్తున్న మొక్కల్ని చూస్తూ వరండాలో కూర్చున్న బిట్టూ,

మెల్లగా లేచి వరండా అంచుకు వెళ్ళాడు. వాన నీటి తుంపరలు మీద పడుతుంటే కిలకిలా నవ్వుతూనే “హాచ్..చ్చ్” మని రెండు తుమ్మలు తుమ్మేసాడు. అమ్మమ్మ గబుక్కున లోపల్నించి వచ్చి, వాడి రెక్క పుచ్చుకుని లోపలికి తీసుకొచ్చింది:

“వానలో తడిస్తే జలుబు చేస్తుందిరా, బిట్టూ! తడవకు. కావాలంటే కాగితం పడవలు చేసుకుందాం- నువ్వూ నేర్చుకున్నట్లు ఉంటుంది. పారే నీళ్లలో పడవలు వదలచ్చు- సరదాగా ఉంటుంది. ఉండు, కాగితాలు తెస్తాను!’ అంటూ అమ్మమ్మ లోపలికి వెళ్ళింది. ‘ఈ పడవలు ఏమిటి?’ అని చూస్తున్నాడు బిట్టు. అంతలో అమ్మమ్మ కాగితాలు తెచ్చి పడవలు ఎట్లా చెయ్యాలో నేర్పింది. వాన సన్నగా కురుస్తున్నప్పుడు నీళ్లు కాలువ కట్టిన చోట పడవలు వదిలి పెట్టి చూపించింది బిట్టూకి. పడవలన్నీ ఒకదానినొకటి ఒరుసుకుంటూ వంగిపోతూ, ఊగుతూ పోతుంటే బిట్టు సంతోషంతో గెంతులు వేసాడు. అకస్మాత్తుగా బిట్టు గట్టిగా శ్వాసను ఎగబీల్చి అన్నాడు: ‘అమ్మమ్మా, ఏదో వాసన వస్తోంది. ఏం వండుతున్నావ్, నాకోసం?!’

‘స్టవ్ మీద ఏమీ లేదురా, నీకు ఏం వాసన వస్తోంది?!‘ అని వాడిని అడిగిన క్షణంలో ఆ వాసనని పసిగట్టింది అమ్మమ్మ. ‘ఇది మట్టి వాసనరా!’ అంది. బిట్టు అర్థం కానట్టు చూసాడు. ‘మట్టి వాసన?!” అమ్మమ్మ వివరంగా చెప్పింది- “చాలా రోజుల తర్వాత కొత్తగా వాన పడినప్పుడు, మట్టి తడుస్తుంది కదా, అప్పుడు ఇట్లా ఒకలాంటి కమ్మని వాసన వస్తుందిరా! దీన్ని మట్టి వాసన అంటారు. సిటీల్లో‌ చాలా ప్రాంతాల్లో మట్టికి ఈ వాసన ఉండదు మరి ఎందుకో” అని.

బిట్టు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. ‘అబ్బ, ఎంత బావుందో!’ అనుకున్నాడు. వెంటనే వాన మీద ఒక కవిత రాసేసాడు కూడా :

టప్ టప్ మంటూ వాన
అల్లరి చేస్తూ వాన
మట్టిని తడిపే వాన
కమ్మని వాసన వాన
ఎండని తరిమిన వాన
ఎంచక్కా వాన!
ఏడురంగుల ఇంద్రధనస్సుని తెచ్చేవాన!

రెయిన్బో ప్రసక్తి వచ్చి బిట్టు ముఖం మీద నవ్వులు పూసాయి.

మధ్యాహ్నం వానతో వాతావరణం చల్లబడింది. వేసవి వాన అందరికీ గొప్ప సంతోషాన్నిచ్చింది. సాయంకాలం చదువులు పూర్తి అయ్యే సరికి మళ్ళీ సన్నగా వాన మొదలైంది. “దావీదూ, చిట్టీ, మీరిద్దరూ ఇవాళ్ల ఇంటికి వెళ్లకండి- ఇక్కడే పడుకోండి సరదాగా ” అన్నది అమ్మమ్మ. వాళ్లని తీసుకెళ్ళేందుకు గొడుగు వేసుకొచ్చిన వీరబాబుతోటీ ఆ మాటే అన్నది. ‘ఎందుకులేమ్మా, తమకు శ్రమ’ అన్న వీరబాబు మాటల్ని తాతయ్య కొట్టి పారేసాడు: ‘మంచి పిల్లలు…శ్రమ ఏముంది వీరా!’ అంటూ.

దాంతో అందరూ భోజనాలు చేసేసి పెందరాడే పక్కల మీదకి చేరారు. వరండాలో గ్రిల్ తలుపు ఉంటుంది. దానికి తాళం వేసేసి, పోయి రెయిన్బోని చూసొచ్చారు అందరూ. వాడు పాలన్నం తినేసి, చక్కగా దుప్పట్లో ముడుచుకొని పడుకున్నాడు అప్పటికే .

మట్టి వాసన కమ్మదనం నిద్రలోనూ తెలుస్తోంది బిట్టూకి- “దిల్లీలో ఎప్పుడూ ఇలాటి వాసన రాదు: అసలు వానే రాదుగా?!” అనుకున్నాడు నిరాశగా. “అమ్మకి చెప్పాలి.. వాన, మట్టి కలిసిన వాసన గురించి” అనుకున్నాడు

నిద్రపోతూనే.

* * *


 

 

2 thoughts on “బిట్టు-మట్టివాసన – ఐదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Feb, 2018

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.