* * *
అమృతసర్ నుండి రోడ్డు దారిలో ఒక వెహికల్ తీసుకుని హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ధర్మశాలకు బయలుదేరాం. ఇది 200 కిలోమీటర్ల దూరం. నాలుగైదు గంటల ప్రయాణం బావుంటుంది. నేషనల్ హైవే 54, 154 మీదుగా ప్రయాణం చేశాం. 1971 సంవత్సరంలో భారతదేశపు 18 వరాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది.
భారత దేశ పటంలో పశ్చిమ హిమాలయ శ్రేణుల్లో దౌలధర్ పర్వత పాదాల చెంత ఉన్నచిన్నరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. దీనికి ఉత్తరంగా జమ్ము, కాశ్మీర్, వాయవ్యంగా హర్యానా, పశ్చిమంగా పంజాబ్, తూర్పున టిబెట్ స్వతంత్ర ప్రాంతం ఉన్నాయి. హిమం అంటే మంచు, అచలమంటే పర్వతం. రాష్ట్రం అంతా ఆవరించి ఉన్న కొండలు, వాటిపైన మెరిసే మంచుతో ఈ రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది. ఈ రాష్ట్రం ప్రకృతి అందాలకు, వేసవి విడుదులకు, హిందూ దేవాలయాలకు ప్రసిధ్ధి. 2005 సంవత్సరం సర్వే ప్రకారం దేశంలో అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ తరువాత ఈ రాష్ట్రం రెండవది. ఈ రాష్ట్రానికి రెండు ముఖ్య పట్టణాలున్నాయి. వేసవి ముఖ్య పట్టణం సిమ్లా. శీతాకాలం ముఖ్య పట్టణం ధర్మశాల. హిమాచల్ ప్రదేశ్ అంటే వేసవి విడుదులైన సిమ్లా, మనాలి, కులు, చంబ, డల్హౌసీ, ధర్మశాల వంటి ప్రాంతాలు మన మనస్సుల్లో కదులుతాయి.
*
హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం రియో పుర్గ్యిల్ 6816 మీటర్ల ఎత్తున ఉంది. చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, యమున వంటి జీవనదులు ఈ రాష్ట్రంలో ప్రవహిస్తూ, అనేక హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులకు నెలవుగా ఉన్నాయి. ఈ జీవనదులన్నీ సహజమైన వృక్షసంపద మధ్య సంరక్షించబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో పర్వతాలు, లోయలు వివిధ ఎత్తులలో ఉండటం వలన ఈ ప్రాంతం వాతావరణ పరిస్థితులలో అనేక వైరుధ్యాలున్నాయి. ధర్మశాలలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అలాగే లాహౌల్, స్పిటి ప్రాంతాలు అత్యంత చల్లని ప్రాంతాలు, కానీ ఇక్కడ వర్షపాతం అత్యల్పం. ఈ రాష్ట్ర ఆర్థికంగా పర్యాటకం, విద్యుచ్ఛక్తి, వ్యవసాయం, వివిధ పరిశ్రమలపైన ఆధారపడి ఉంది. జనాభాలో 90% మంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు.
వ్యవసాయం ఇక్కడి ముఖ్య వృత్తిగానూ, ముఖ్య ఆర్థిక వనరుగానూ ఉంది. 93% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. గోధుమ, బార్లీ, జొన్న, వరి ఇక్కడ పండిస్తున్నారు. యాపిల్ పండ్లను వాణిజ్య పంటగా సిమ్లా, కిన్నూర్, కులు, మండి, చంబ ప్రాంతాల్లో పండిస్తున్నారు. గ్రామాల మధ్య చక్కని రోడ్డు సదుపాయం ఉంది. ఇక్కడ ప్రజా ఆరోగ్య కేంద్రాలు చక్కగా పనిచేస్తున్నాయి. ఈ కొండ ప్రాంతాల్లో హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం బాగా పనిచేస్తోంది. ఇటీవల దాకా బయటి ప్రపంచం తాలూకు ప్రభావం కొంత తక్కువగా ఉన్న ఈ ప్రాంతం ఇంటర్ నెట్ సౌకర్యం ద్వారా ప్రపంచ పోకడలను ఒంటబట్టించుకుంటోంది.
ఈ రాష్ట్రంలో దాదాపు 66.5% ప్రాంతం అడవులతో ఉంది. ఇక్కడి మొక్కలు, వృక్షాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. దేశానికి ఈ రాష్ట్రం ‘ Fruit Bowl’ గా చెబుతారు. అలాగే లిల్లీ, గులాబులు, మేరీగోల్డ్, తులిప్స్ వంటి అనేక పుష్పజాతులతో రాష్ట్రాన్ని ‘Flower basket of World’ గా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 400 కు పైగా పక్షి జాతులు, 30 వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఉన్నాయి. ఇక్కడి ‘గ్రేట్ర్ హిమాలయన్ నేషనల్ పార్క్’ యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ప్రకటించబడింది.
పర్వతాలు, లోయలతో నిండిన ఈ రాష్ట్రంలో 8 నేషనల్ హైవేలు, 19 రాష్ట్ర హైవేలు ఉన్నాయి. కులు, కాంగ్రా, సిమ్లా లలో విమానాశ్రయాలున్నాయి. హిందీ ఇక్కడ అధికార భాష. ఇంగ్లీషును కూడా అధికార భాషగా గుర్తించారు. ఇవి కాక పహాడి భాష కూడా వ్యవహారంలో ఉంది. ప్రజల్లో హిందువులు 95% శాతం. అందువలనే ఇక్కడ నయనాదేవి, వజ్రేశ్వరి దేవి, చింతపూర్ణి, చాముండ దేవి, జ్వాలాజీ వంటి హిందూ దేవాలయాలున్నాయి.
*
ఇంత అందమైన రాష్ట్రంలో ధర్మశాలను చూడాలని కదా బయలుదేరింది. ధర్మశాలను ధరమశాల అని కూడా పిలుస్తారు. ధర్మశాల కాంగ్రా లోయకు ముఖద్వారంగా చెబుతారు. ధర్మశాల ఓక్, కోనిఫరస్ చెట్ల మధ్య దౌలధర్ పర్వత శ్రేణులు సరిహద్దుగా ఉంది. ఈ ప్రాంతంలో టీ తోటలు, పైన్, దేవదారు అడవులు ముఖ్య ఆకర్షణ. కాంగ్రాలోని గగ్గల్ విమానాశ్రయం ధర్మశాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పఠాన్ కోట ఇక్కడికి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రైలు స్టేషన్.
ధర్మశాల కాంగ్రా జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. ఇది బ్రిటిష్ అధికారులకు వేసవి విడిదిగా ఉండేది. 1905 సంవత్సరంలో వచ్చిన పెద్ద భూకంపం కారణంగా కాంగ్రా, మెక్ లియోడ్ గంజ్, ధర్మశాల ప్రాంతాలు చాలావరకు ధ్వంసం అయ్యాయి. ధర్మశాలను రెండు భాగాలుగా విభజిస్తే, పైభాగాన అంటే ఎగువ ధర్మశాలలో ‘మెక్ లియోడ్ గంజ్’, ‘నడ్డి’ ప్రాంతాలలో పర్యాటకులు ఎక్కువగా బస చేసే ప్రాంతాలు. దిగువ ధర్మశాల ప్రాంతం ఇక్కడి పౌరుల పరిపాలనా వ్యవస్థకూ, వాణిజ్యవ్యవహారాలకు కేంద్రంగా ఉంది. ‘కొత్వాలి బజారు’ ప్రాంతం ముఖ్య వ్యాపార కేంద్రం. ‘కచేరి అడ్డా’గా పిలువబడే ప్రాంతం ప్రభుత్వ కార్యాలయాలున్న ప్రాంతం. సిధ్ధబారి ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ విధాన సభ ఉంది. ఈ ప్రాంతం తంత్ర విద్యలకి ప్రసిద్ధి అని చెబుతారు. సిధ్ధబారి ప్రాంతంలో స్వామి చిన్మయా తపోవన ఆశ్రమం 1457 మీటర్ల ఎత్తున ఉంది. ఇది మెక్ లియోడ్ గంజ్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పర్యాటకులకు ‘హోమ్ స్టే’ అవకాశం కూడా ఉంది.
*
మెక్ లియోడ్ గంజ్ ప్రాంతం దలైలామా, ప్రపంచ బౌధ్ధ గురువు నివాసముండే ప్రాంతం. మెక్ లియోడ్ అనే పేరున్న ఒక పంజాబ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ పేరుమీదుగా ఈ ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. గంజ్ అంటే పొరుగుప్రాంతం. ఈ ప్రాంతంలోనే దలైలామాతో పాటు ఆయన శిష్యులు, వలస వచ్చిన మిగిలిన టిబెటన్లు నివాసముంటున్నారు. 1959 సంవత్సరంలో చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన దలైలామా, తిరుగుబాటు విఫలం కావటంతో పొరుగున ఉన్న ఈ రాష్ట్రానికి శరణార్థిగా వచ్చారు. అప్పటి భారత ప్రధానమంత్రి నెహ్రూ దలైలామాకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వటంతో అనేక వేలమంది టిబెటన్లకు ఇది ఆవాసంగా మారింది. వలస వచ్చిన టిబెటన్లు 1960 సంవత్సరంలో ఇక్కడ తమకంటూ ఒక పాలనావ్యవస్థను, తాత్కాలిక ముఖ్య పట్టణం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అది ధర్మశాల లో కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో అనేక బౌధ్ధ ఆరామాలు, దేవాలయాలు కనిపిస్తాయి. వారివైన విలువైన గ్రంథాలు భద్రపరచిన లైబ్రరీ ఉంది. వారి వారసత్వం, కళలు, చేతివృత్తులు కాపాడుకుందుకు కొన్ని సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని ‘Little Lhasa’ గానూ, ‘Dhasa’ ( Dharmasala, Lhasa) కూడా పిలుస్తారు. Lhasa అనేది టిబెట్ ముఖ్య పట్టణం.
*
మెక్ లియోడ్ గంజ్ ప్రాంతం అతి సన్నని దారులతో ఎత్తుపల్లాల మధ్య ఉంది. ఇక్కడి నుండి హిమాలయాలను, సూర్యోదయ, సూర్యాస్తమయ వేళలను చూడటం గొప్ప అనుభవం. ఇక్కడి ప్రజలు సాత్వికంగా, నాజూకైన శరీరాలతో కనిపించారు. నిత్యం కొండ ఎక్కి దిగే వీరి జీవనశైలి దీనికి కారణం కావచ్చు. ఇక్కడి భోజనం చాలా రుచికరంగా ఉంది. మెక్ లియోడ్ గంజ్ ప్రాంతం అనేక రంగురంగుల దుకాణాల మధ్య అత్యంత జన రద్దీతో కనిపిస్తుంది. ఇక్కడి ముఖ్య రహదారిమీద ప్రముఖమైన బౌధ్ధ దేవాలయం, కాలచక్ర దేవాలయం ఉన్నాయి.
మెక్ లియోడ్ గంజ్ నుండి మరింత ఎత్తైన ప్రదేశం ‘నడ్డి’ కి వెళ్లే దారిలో ‘దాల్ లేక్’ ఉంది. దీని చుట్టూ దేవదారు వృక్షాలతో అందంగా ఉంది. ‘నడ్డి’ ప్రాంతం నుండి ట్రెక్కింగ్ కి వెళ్లే వారికి ఈ లేక్ ప్రాంతం బేస్ క్యాంప్. ప్రతి సంవత్సరం సెప్టెంబరులో ఈ సరస్సు ఒడ్డున ఒక ఉత్సవం జరుపుతారు.
ఇక్కడి దేవాలయాలలో స్తూపం, ప్రేయర్ వీల్స్ అందమైన, ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. ఈ ప్రాంతం టిబెటన్ బౌధ్ధులకు విద్యాపరమైన, మతపరమైన కేంద్రంగా తయారైంది.
*
మేము బస చేసిన ప్రాంతం మెక్ లియోడ్ గంజ్. ఒక సాయంత్రం చిన్న జల్లుల మధ్య సుగ్లఖాంగ్ కాంప్లెక్స్ లో ఉన్న బౌధ్ధ దేవాలయం చూసేందుకు వెళ్ళాం. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. అక్కడ బౌధ్ధ బిక్షువులు వారి భాషలో ప్రార్థనలు జరుపుతున్నారు. ఎవరికైనా ప్రవేశం ఉంది. అక్కడ కూర్చుని వారి ప్రార్థనావిధానం గమనించవచ్చు. ఫోటోగ్రఫీ మీద ఆంక్షలు లేవు. బియ్యం పిండి, రకరకాల డ్రై ఫ్రూట్ స్ తో చేసిన ఒక తీపి పదార్థం అందరికీ ప్రసాదంగా ఇచ్చారు. ఒక తెలియని మార్మికత తోచింది మనసుకి. వీరి దేవాలయాలన్నీ పసుపు, ఎరుపు రంగుల్లో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అది ముఖ్యమైన బౌధ్ధ దేవాలయం కనుక ఆ పరిసరాల్లో అకస్మాత్తుగా దలైలామా కనిపిస్తే బావుణ్ణు అని ఆశ కలిగింది కూడా. అక్కడి టిబెట్ మ్యూజియం శుక్రవారం కావటంతో మూసివేసి ఉంది. బయట ఎండలోంచి హోటల్ రూమ్ లోకి చేరేసరికి చటుక్కున పెద్దవాన, చిన్నపాటి వడగళ్లు మా రూమ్ బాల్కనీలో చేరాయి. అంతే త్వరగా వాన ఆగిపోయింది. కొండల ప్రాంతం కావటంతో ఒక్కక్షణంలో వాతావరణంలో మార్పు వచ్చేస్తుంటుంది. అంతలోనే వర్షం, అంతలోనే సూర్యకాంతి అనుభవంలో కొస్తాయి.
కాంగ్రా పట్టణం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో కాంగ్రా కోట చూడదగ్గది. మహాభారత కథలోనూ, అలెగ్జాండర్ యుధ్ధ చరిత్రలోనూ ఈ కోట ప్రస్తావన ఉంది.ఇక్కడి దౌలధర్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 2830 మీటర్ల ఎత్తున ‘త్రైయండ్ గంజ్’ ఒక ముఖ్య ఆకర్షణ. మెక్ లియోడ్ గంజ్ నుండి 9 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి చేరుకోవచ్చు.
*
ఇక్కడ దారుల వెంట కురిసిన మంచు కనిపిస్తుంది. ఈ ప్రాంతాలన్నీ చాలా ఇరుకైన దారుల్లో ఉన్నాయి. స్థలాభావం వలన వాహనాలు పార్కింగ్ చెయ్యటం కష్టమైన పని. కానీ సిమ్లా వెళ్లే దారి కంటే సురక్షితంగానే అనిపించాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేసేందుకు అనేక పర్యాటకులు రావటం కనిపించింది.
సెప్టెంబరు నుండి అక్టోబరు వరకు, మార్చ్ నుండి జూన్ వరకు పర్యాటకులకు అనువైన సమయంగా చెబుతారు. అంతే కాకుండా ఆగస్ట్- సెప్టెంబరులో వచ్చే ‘ద్రుక్పా తెషి’ పండుగ సమయం కూడా అనువైనది. మేమున్న సమయంలో ఉష్ణోగ్రతలు -2 వరకు వెళ్లాయి. అయితే బౌధ్ధ బిక్షువులు మాత్రం పలుచని బట్టల్లో అతి సహజంగా ఆ చలిలో రోడ్ల వెంట చకచకా నడుస్తూ కనిపించారు. వారిలో చిన్నవయసు బాలురు కూడా ఉన్నారు.
*
ధర్మశాల లో క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే ఎత్తైనది. స్టేడియం చుట్టూ హిమాలయపర్వత శ్రేణులుతో అతి సుందరంగా ఉంది.
*
మెక్ లియోడ్ గంజ్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘నోర్బులింగ్కా’ ప్రాంగణం చేరుకోవచ్చు. ఇక్కడ టిబెటన్ సంస్కృతి,కళ, సంగీతం, నృత్యం, చేతిపనులు, శిల్పకళ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు.
*
ఈ కేంద్రంలో ఉన్న ‘లోసిల్ డాల్’ మ్యూజియం చూడదగ్గది. టిబెట్ ప్రజల జీవన విధానం, వస్త్రధారణ, వాళ్ల అలవాట్లు వంటివాటిని బొమ్మల రూపంలో ఇక్కడ పొందుపరిచారు. ఇది 1988 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ కేంద్రంలో కళాకారులు చెక్కతోనూ, మెటల్ తోనూ వివిధ కళారూపాలను తయారు చెయ్యటం, తంగ్కా పెయింటింగ్, ఎంబ్రాయిడరీ వంటి పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు వారిని చూసే అవకాశం ఉంది. ఈ కేంద్రం ఆహ్లాద కరమైన ప్రకృతి ఒడిలో అందమైన రంగులతో నిర్మించిన కట్టడాల మధ్య ఉంది. 40 రూపాయల ప్రవేశ రుసుము ఉంది.
*
ధర్మశాల, పఠాన్ కోట దారిలో మచ్చిరాల్ జలపాతం అందమైన పర్యాటక ప్రదేశం.
సమీపంలోని పాలంపూర్ టీ తోటలకు ప్రసిధ్ధి. పాలంపూర్ ‘ Tea capital of North West India’ గా ప్రసిధ్ధి. ఇక్కడి టీ కి పత్యేకమైన పేర్లు పెట్టబడ్డాయి. అవి భారత సంగీతానికి చెందిన రాగాల పేర్లు. ఉదాహరణకి, బాగేశ్వరి, బహార్, మల్హార్, దర్బారీ.
‘జ్వాలాముఖి’ ఆలయమును ‘జ్వాలాజి’ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం అతి సన్నని రోడ్డులో కేవలం నడక లేదా ఆటో ద్వారా మాత్రమే చేరుకోగలం. ఒక మండుతున్న నోరుగల దేవత ఇక్కడ కొలువై ఉందని నమ్మకం. సతీదేవి నాలుక ఇక్కడ పడిపోవటంతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టరు. ఇక్కడ అంతరాలయంలో 9 జ్వాలలున్నాయి. దేవతను ఆ జ్వాల రూపంలోనే కొలుస్తారు. విగ్రహాలుండవు. ఆ జ్వాలలకు మహంకాళి, అన్నపూర్ణ, లక్ష్మి, సరస్వతి, అంబిక, చండి మొదలగు తొమ్మిది దేవతల పేర్లున్నాయి. ఆలయ పురాతన పగుళ్లలోంచి జ్వాలలు దర్శనమిస్తాయి.
*
ధర్మశాల నుండి చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ రోడ్డు మార్గంలో తిరగటం చక్కని అనుభవం. అన్నిచోట్ల మంచి ఆహారం దొరికింది. పేదరికం ఉంది. పనులు కోసం ఉదయం నుండి దారుల వెంట ఎదురుచూసే కార్మికులు కనిపించారు. దారినిండా జలపాతాలు, లోయలు, మన వెంట ప్రయాణం చేస్తూ వచ్చే హిమాలయాలు ఇక్కడ మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతి మనల్ని వివశుల్ని చేస్తుంది. ఇక్కడి పరిసరాలు, గాలి, నీరు మనుష్యులకి ఆరోగ్యాన్ని, ప్రశాంతతను ప్రసాదించేదిగా ఉంది. ప్రతి వారు తప్పని సరిగా చూడదగిన ప్రదేశం హిమాచల్ ప్రదేశ్. అది మన దేశానికి ఒక ఆభరణం అనిపించింది.
ధర్మశాల నుండి చండీఘర్ కు 250 కిలోమీటర్ల దూరం ఉంది. నేషనల్ హైవే 503 మీద ప్రయాణం చేసి చండీఘర్ కు ఆఖరి మజిలీగా చేరుకున్నాం. దారిలో ‘ఆనంద్ సాహిబ్’ ప్రాంతం దగ్గర విపరీతమైన రద్దీతో ట్రాఫిక్ జామ్ అయింది. అన్నిదారుల నుండి అనేక రకాల వాహనాల మీద పండుగ సంబరంతో ప్రయాణిస్తున్న స్థానికులను చూశాం. ఆరోజు హోలి పండుగ కావటంతో దారిపొడవునా అనేక చోట్ల ప్రజలు సంబరాలు, విందులు చేసుకోవటం కనిపించింది. దారిలో వెళ్తున్న ప్రతివారిని ఆపి విందు చేసి వెళ్లమని వారంతా కోరుతున్నారు.
Pingback: అమృత సరస్సు, దలైలామా తో పాటు టిబెటన్లు నడయాడే ధర్మశాల యాత్ర – March, 2017 – Part I – ద్వైతాద్వైతం
Wonderful Dharamshala, Beautiful description!! Long Live Anuradha!!
LikeLiked by 1 person
అద్భుతం
LikeLike
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike