* * *
తెలతెల వారుతూంటే నిద్ర లేని రాత్రిని విసుక్కుంటూ మంచం దిగి బాల్కనీలోకి వచ్చాను. ఆకాశం దిగులుగా ఉందని తోచింది. నా మనసులో దిగులు ఆకాశానికి పులిమేసి చూస్తున్నానా లేక ఆ మబ్బులు నిజంగా ఆకాశానివేనా? ఇంతలో చటుక్కున వాన చినుకులు ఆరంభమయ్యాయి. నా అశాంతికి మృదువైన లేపనంలా చల్లని జల్లు ముఖాన్ని తాకుతోంది. ఒక్కసారిగా తెలియని ఆనందమేదో నన్ను పలకరించింది. చేతిలో టీ కప్ తో వచ్చి బాల్కనీ అంచున కూర్చున్నాను.
ఇష్టంగా నేను ఏర్పరుచుకున్న వ్యాపకాన్ని వదిలి పారిపోయి వచ్చేసేను. ఈ నచ్చకపోవటాలు నాకు ఎక్కువే . నాలుగైదేళ్లుగా ఏకాగ్రతతో ఒక రూపుకు తీసుకొచ్చిన బొటీక్ ‘శింగార్’ని, రేణు స్నేహాన్ని వదిలి ఇంటి కొచ్చాను. కొన్నేళ్లుగా వచ్చేందుకు ఇష్టపడని నాన్న ఇంటికి నా ఒంటరితనాన్నితోడుగా తీసుకుని వచ్చాను. ఈ ఇల్లు నాకు పరాయిగా మారిపోయి చాలా ఏళ్లైంది. చదువు నిమిత్తం పదిహేనేళ్లకే ఇంటికి దూరమైన నేను మళ్లీ వచ్చి ఉన్నదే లేదు. ఎప్పుడొచ్చినా ఒకటి రెండు రోజులు, ఒక అతిథిలాగా. అంతే. ఇప్పుడైనా నాన్న ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటం వల్ల నా ఒంటరితనానికి ఎలాటి ఆంక్షలూ ఉండవని ధైర్యంగా వచ్చాను.
ప్రక్కింటి ‘సంధ్య ఆంటీ తాళం ఇస్తూ చెప్పింది, ‘పల్లవీ, నువ్వు వచ్చే ముందు కాస్త చెప్పివుంటే ఇల్లు శుభ్రం చేయించి ఉండేదాన్ని. మధ్య మధ్య శుభ్రం చేయిస్తున్నా కాని ఇల్లంతా ఎలా ఉందో మరి. ప్రొద్దున్నే భాగ్యం వస్తుందిలే. ఈ రాత్రికి భోజనానికి మా ఇంటికొచ్చెయ్’
‘వద్దాంటీ. రాత్రి భోజనం ఏర్పాటు అయిపోయింది. రేపు కలుస్తాను’ అంటూ ఆవిడ ఇచ్చిన మంచినీళ్ల సీసాలు అందుకుని ఇల్లు తాళం తీసేను.
ఇంటికి వెళ్తున్నానని నాన్నకి చెప్పటంతో ఆయన చాలా సంబరపడిపోయారు. నా పలకరింపుకోసం ఆయన ఏళ్ల తరబడి ఎదురుచూస్తూనే ఉంటారని తెలుసు. కానీ పలకరించాలనే ఉండదు, ఏంచెయ్యను? రాత్రి పడుకోబో యేంతలో నాన్న కాల్ చేసేరు,
’అమ్ములూ, ఏమైనా తిన్నావా? అలమరలో ఇస్త్రీ దుప్పటి తీసుకుని పక్క వేసుకో.’ ఒక్కక్షణం ఆగి,
‘ఇక్కడికి వచ్చెయ్యరా తల్లీ’ అన్నారు.
‘కుదరదు నాన్నా.’
నాన్నకి గుడ్ నైట్ చెప్పేను, కాని నిద్ర వస్తేగా. అలమర తెరిచి చిన్నప్పటి కథల పుస్తకాలు, అపురూపంగా వేసి దాచుకున్న పెయింటింగ్స్ అన్నీ చూస్తూ కూర్చున్నాను .
సిధ్ధు కూడా బొమ్మలు గీసేవాడు. వాడి ఆరోగ్యం వాడిని నెలకి మూడొంతులు ఆసుపత్రుల చుట్టూ తిప్పేది. అమ్మ తిండి, నిద్ర లేకుండా వాడితో గడపటం నిన్న మొన్న విషయంలా అనిపిస్తుంది తలుచుకుంటే. వాడు పుట్టినప్పుడు నాకు ఆడుకుందుకు ఒక చిన్న నేస్తం దొరికేడని మురిసిపోయేను. అమ్మ ముద్దు చేసినట్లే నేనూ వాడిని ముద్దు చేసేదాన్ని. వాడు పెరుగుతూంటే వాడి అనారోగ్యం పెరుగుతూ వచ్చింది. రానురాను అమ్మ నాకు సంబంధించిన పనులన్నీ నన్నే చేసుకోమనేది. అమ్మ నా కళ్లెదుటే ఉన్నా నా కోసం సమయాన్ని కేటాయించలేని స్థితి. అదంతా సిధ్ధూ మూలంగానే అని కోపం వస్తూండేది. నాన్న రమ్మని పిలిచినా వెళ్లేదాన్ని కాదు.
సిధ్ధు పుట్టేవరకూ అమ్మ కొంగు పట్టుకుని తిరిగేదాన్ని. అమ్మ చెప్పే కథలు, అమ్మతో ఆటలు, అమ్మ పెట్టే గోరు ముద్దలు అన్నీ నా ఒక్క దానికే స్వంతంగా ఉండేవి. అమ్మ నాకున్న ఒకేఒక స్నేహితురాలు. నాతో చదివే ప్రక్కింటి పిల్లలు ఆటలకి పిలిచినా అమ్మని వదిలి వెళ్లేదాన్ని కాదు. ఇంటిపనుల్లో సాయంగా ఉండే లక్ష్మి నన్ను బుజ్జగించి స్కూలుకి తయారుచేసేది. క్రమేపీ ఆమె దగ్గర ఒక ఓదార్పు వెతుక్కునే దాన్ని కానీ అమ్మని చూసినప్పుడల్లా ఒక శత్రువుని చూసినట్లే అనిపించేది.
స్కూలు చదువు పూర్తి చేసుకుని రెసిడెన్షియల్ చదువుకి వెళ్లిపోయాను. ఇంటికి, అమ్మకి, నాన్నకి, సిద్ధూకి దూరంగా నాదైన ఒక ప్రపంచంలోకి
* * *