స్వచ్ఛ భారత్ – గూడెం చెప్పిన కథలు

* * *

‘స్వచ్ఛ భారత్’ నినాదం దేశం అంతా మారుమ్రోగిపోతోంది. స్కూల్ కాంపౌండ్ లోపల పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డి తీసివేయించి, టాయిలెట్లు దగ్గరనుంచీ క్లాసురూముల వరకూ శుభ్రం చేసే పనిని యుద్ధ ప్ర్రాతిపదికన మొదలుపెట్టేం స్కూల్లో అందరం. పిల్లలంతా ఉత్సాహంగా పనుల్లోకి జొరబడ్డారు. అన్ని పనులకీ పోటీ పడిన వాళ్లు టాయిలెట్ల దగ్గరకొచ్చేసరికి శుభ్రం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

‘మేం ఇలాటి పని చెయ్యం టీచర్. మా అమ్మకి తెలిస్తే కొడుతుంది. ఆ పని బయట పనివాళ్ల చేత చేయించండి. ‘ అంటూ పెద్దక్లాసు పిల్లలు సలహా చెబుతున్నారు.

‘మన స్కూలు, మన టాయిలెట్లూ మనం బాగు చేసుకోవాలి.  మనం వాడుకున్న పరిసరాల్ని మనం శుభ్రంగా ఉంచుకో వాలన్నది ఇన్నాళ్లూ మీరెవరూ పట్టించుకోలేదు. మీ బాధ్యత ఏమిటో మీరు తెలుసుకోలేదు. కనీసం ఇప్పుడైనా ఆ విషయం మీరు నేర్చుకోవాల్సిన సమయమొచ్చింది. మన టాయిలెట్లు మనమే శుభ్రం చేసుకోవాలి. మనం పాడుచేసిన పరిసరాలు ఎవరొచ్చి శుభ్రం చేస్తారు?’ సీనియర్ టీచర్ల మాటలు వింటూ కూడా తమని కానట్లు నిలబడి చూస్తున్నారు పిల్లలంతా.

‘ఒక్క అయిదు నిముషాలు సమయమిస్తున్నాం. మీలో ఎవరు ముందుకు వస్తారో చూస్తాం.’ పి.టి. మాష్టారు హెచ్చరించారు.

అయిదు నిముషాలు గడిచిపోయేయి. నిశ్శబ్దంగా చూస్తున్నారంతా. అనిల్ ముందుకొచ్చి చీపురు , బకెట్ తీసుకుని కడగడానికి  ఉపక్రమించేడు.పి.టి. మాష్టారు అభినందన పూర్వకంగా చప్పట్లు కొట్టడం మొదలు పెట్టేరు. ఆయనతో పాటు అభినందనలు చెప్పేందుకు మరికొంత మంది కలిసేరు. ఇందాకటి నుండి చెయ్యం అని చెప్పిన పిల్లలు నెమ్మదిగా ఒక్కక్కళ్లూ ముందుకొచ్చి చీపుళ్లు చేతిలోకి తీసుకున్నారు.

రెండు రోజుల్లో స్కూలు పరిసరాలు తళతళ లాడేలా తయారయ్యాయి. ఆరోజు క్లాసులు అయిపోయాక హెడ్మాస్టారు పిల్లలందర్నీ కూర్చోబెట్టి వాళ్లు చేసిన పనిని ప్రశంసిస్తూ, గాంధీజీ కలలు కన్న భారతదేశం మన కళ్లముందుకు తెచ్చుకోవలసింది మనమే అని, ఆ శక్తి మన అందరికీ ఉందనీ చెప్పేరు.

పిల్లలందరూ చక్కగా పనిచేసేరని చెబుతూ, కొంతమంది పిల్లలు మాత్రం ఇతరులకి ఆదర్శప్రాయులయ్యారని చెప్పేరు. అలాటి వాళ్లకి తాను బహుమతులు ఇవ్వదలచుకున్నానని చెబుతూ, మిగిలిన పిల్లలు వాళ్లతో పోటీ పడి బహుమతులు తెచ్చుకోవాలన్నరు. అందరూ ఊపిరిబిగపట్టి చూస్తున్నారు. ఎవరూ ఊహించనిది ఇది. ఎవరికి బహుమతులు ఇవ్వబో తున్నారు?!

హెడ్మాష్టారు ముందుగా అనీల్ పేరు పిలిచేరు. మెరిసే కళ్లతో వాడు బహుమతి తీసుకుంటూంటే నాకు గర్వంగా అనిపించింది. మిగిలిన పిల్లల్లో లేని ఒక ప్రత్యేకత తనకుందని చాటుకున్నాడు. వాడు బహుమతి అందుకు వెనక్కి వస్తూ నా వైపు తలత్రిప్పి ప్రత్యేకంగా చూడటం నేను గమనించకపోలేదు.

ఆనాడు ఆడపిల్లల్ని ఏడిపించడంలో వాడు చూబించిన ఉత్సాహం ఈ నాటికి మరో మంచి రూపు దిద్దుకుందని నాకు అనిపించింది.  అప్పుడు నా మీద దాడి చేసేడని ఫిర్యాదు చేసి, వాడిని శిక్షించి ఉంటే వాడు ఇలా రూపాంతరం చెంది ఉండేవాడా? వాడికి  ఇచ్చిన అవకాశం వాడిని మంచి మార్గంలోకి మళ్లించింది. నా నమ్మకం వృధా కాలేదు.

పిల్లలూ , పెద్దలూ వాడిని ఆదర్శంగా తీసుకోవాలని చెబుతూ టీచర్లంతా అనీల్ ని అభినందించారు. ఆరోజు స్కూలు నుండి ఇంటికెళ్లే దారిలో మిగిలిన పిల్లల్తో విడివడి అనీల్ నా వెనుకే రావడం గమనించేను.

ముందుగా నేనే పలకరింపుగా నవ్వేను. వాడు మొహమాటంగా నవ్వేడు.

ఏదో చెప్పాలన్నట్లు నాకు దగ్గరగా వచ్చాడు. ఏం మాట్లాడలేదు కానీ, వాడి కళ్లు దిగులుగా ఉన్నాయి. నాకు తెలుసు వాడు మనసులో పడుతున్న మథన.

‘కంగ్రాచ్యులేషన్స్ అనీల్. నిన్ను చూస్తే మా అందరికీ గర్వంగా ఉంది.’

వాడు మరింత సిగ్గు పడిపోతూ, ‘థాంక్స్ టీచర్’ అన్నాడు.

‘మరి ఈ రోజు నుండి సాయంకాలం క్లాసుకొస్తావా?’ అన్నాను చిరునవ్వుతో.  నా మాటలకి సంతోషంగా తలవూపి ఇంటివైపు పరుగుతీసేడు.  నాకు మా గూడెం మరింత ప్రియమైనది అయిపోతోంది……..

******************

వ్రాయటం ముగించి గడియారం వంక చూసాను. అర్ధరాత్రి దాటింది. కొన్ని గంటలైనా నిద్ర పోవాలి లేకపోతే ప్రొద్దున్న స్కూల్లో బధ్ధకంగా ఉంటుంది అనుకుంటూ వ్రాస్తున్న ఉత్తరానికి ముగింపు వాక్యాలు మొదలు పెట్టేను…………

‘అమ్మా, వింటున్నావా నా గూడెం కథ?! నువ్వు నా ఎదురుగా ఉన్నావని అనుకుంటూ ఇదంతా చెప్పుకొచ్చాను. ఇప్పుడు చెప్పు, నేను ఈ పిల్లలకోసం, వాళ్లని చదివించటం కోసం రోజూ గూడెం వెళ్లాలా లేదా? నాకు తెలుసమ్మా, నువ్వు ఈ ఉత్తరం చదువుకుని వెంటనే సెలవుపెట్టి నా పిల్లలని చూసేందుకు వస్తావు కదూ…నీ దీపూ’

* * *

2 thoughts on “స్వచ్ఛ భారత్ – గూడెం చెప్పిన కథలు

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.