అరకు లోయ – ఆదివాసీల స్వర్గం! – యాత్రా సాహిత్యం – సంచిక వెబ్ మ్యాగజైన్, 14Aug.2022

                   * * *   

                                   విశాఖ నుంచి డ్రైవ్ చేసుకుంటూ అరకు బయలుదేరేం. ప్రయాణమంతా ఆహ్లాదకరమైన దారివెంట నడిచింది. ఎన్నాళ్లుగానో కలలుగన్న అరకులోయ చూడటం ఇప్పటికి కుదిరింది. ప్రకృతి చూపును తిప్పుకోనివ్వదు. ఒక హాయి ఏదో మనల్ని చుట్టేస్తుంది. రంగులు, కొండలు, లోయలు, పచ్చని చెట్లలోంచి వినవచ్చే కమ్మని రాగాలు, ఆకాశం నుంచి స్వేచ్ఛగా దూసుకొచ్చే సూర్యకాంతులు… ఎన్నింటినని కాచుకోగలం?! ప్రకృతిమధ్య మనం ఎంత చిన్నవాళ్లమో మరీమరీ అర్థమవుతుంది. ఏదో తెలియని ఒక తాత్త్వికత మనలోకి ఇంకుతుంటుంది. నేనెవరినన్న ప్రశ్న అకస్మాత్తుగా ఎదురవుతుంది.

                                  నిద్రపోతున్నట్టున్న ఆ చిన్నప్రాంతం ఈ నాగరిక ప్రపంచానికి దూరంగా ఎక్కడో తనదైన అస్తిత్వంతో ఉంది. సమ్మోహన పరచే ఆ అందాలని చూడాలని వచ్చే            నాగరీకుల రాకపోకలకు చక్కని దారులు పరిచి ఉన్నాయి. చిన్నచిన్న దుకాణాలు, తమదైన సంస్కృతితో కనిపించే స్థానిక ప్రజలు! వారి కళ్లల్లో ఒక కుతూహలం, ఒక అభద్రత కూడా కనిపించాయి. ప్రతి రెండో దుకాణం చాయ్ దుకాణమే. పెద్దపెద్ద ఊడలు దిగిన చెట్లు దారులనిండా పహరా కాస్తున్నాయి. కానీ విశాలమైన చెట్లను నరికి రోడ్ల పక్క పడేసి షాపింగ్ కాంప్లెక్సుల్ని కట్టే ప్రయత్నం కంటి ముందు కనిపిస్తూ ఆ ప్రాంతపు సహజత్వాన్ని, అమాయకత్వాన్ని దోచుకుంటున్న మనిషి వ్యాపారాత్మక దాహం వెగటు పుట్టిస్తుంది.

                                                 ఆ చిన్నచిన్న చాయ్ దుకాణాల వాళ్లు యాత్రికులే తమ జీవికకు మార్గం అనిచెప్తున్నారు. పది రూపాయలకు రుచికరమైన చాయ్ ని అందిస్తున్న వారిని “ఇంకొక్క ఐదు రూపాయలైనా పెంచితే ఏమవుతుంది?” అని అడిగాను. “పెంచితే ఎవరూ రార”న్న ఆమె సమాధానం మాట రాని మౌనాన్ని మిగిల్చింది. ఆమె కు సాయంగా దుకాణంలో తిరుగుతున్న అమ్మాయిల్ని పలకరిస్తే ఇద్దరూ చదువుకుంటున్నామన్నారు. ఒకరు నర్స్ ట్రైనింగ్ పూర్తి చేస్తే, మరొకరు ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కల నిజం చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఈ తరం ప్రతినిధులు వీళ్లు. నాగరిక ప్రపంచంలోకి నిశ్శబ్దంగానే అయినా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుందుకే వస్తున్నారన్న ఆలోచన ధైర్యాన్నిచ్చింది.

                                   ట్రైబల్ మ్యూజియంలో ఫోటో గ్యాలరీలోని ఫోటోలను చూస్తున్నప్పుడు వారి సంప్రదాయాలను అర్థం చేసుకుందుకు వీలైంది. ఒక ఫోటోలో అమ్మాయి నోట్లో నీళ్లు పోసుకుని అబ్బాయి మీద చిమ్ముతున్నట్టున్నట్టుంది. ఆ ప్రాంతం వారైన సందర్శకులను అడిగితే ఆ దృశ్యం పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయిల మధ్య సాన్నిహిత్యం కోసం జరిపించేది అని చెప్పారు. తమాషాగా అనిపించింది. ముచ్చటగానూ ఉంది.

కొందరు స్థానిక మహిళలు మ్యూజియంలో పనిచేస్తూ కనిపించారు. తమదైన సంప్రదాయం, భాష, ఆహార అలవాట్లు ఉన్నాయని చెప్పారు. తమలో కూడా కులాల ప్రస్తావన ఉందని, ఒక కులంలోని వారు మరొక కులంలో పెళ్లిళ్లు చేసుకోరని చెప్పారు. తమ పిల్లల్ని చదివిస్తున్నామని, తాము చదువుకోకపోయినా చదువు విలువ తెలుసని నవ్వుముఖాలతో చెప్పారు. అన్నట్టు వారి మాట్లాడినది మన నాగరీక భాషే. ఆశ్చర్యం వేసి అడిగితే ఇక్కడ అందరితో మసలటం వలన ఇలా మాట్లాడగలుగుతున్నామని చెప్పారు.

                                     మ్యూజియంలో ఆదివాసీలు చేసిన హస్తకళలకు సంబంధించి అనేక వస్తువులతో దుకాణాలున్నాయి. అందమైన సంచీలు, టోపీలు, చిన్నపిల్లలను ఆకర్షించే అనేక ఆటవస్తువులు, గృహోపకరణాలు మొదలైనవి. ఒక దుకాణంలో ఒక పదిహేడేళ్ల చిన్నారి నిశ్శబ్దంగా తనదైన లోకంలో కూర్చుని ఎమ్సెట్ కి తయారవుతోందిట. అమ్మానాన్నలు పనులకోసం వెళ్లిన సమయంలో తానే దుకాణం చూసుకుంటానని చెప్పింది. వీరికున్న పరిస్థితులు, వాతావరణం ఎంత పరిమతంగా ఉన్నా ఆ పిల్లల్లో చదువు పట్ల ఉన్న ఆసక్తి, అభిరుచులు గొప్పగా అనిపిస్తాయి. ఆ పిల్లలు ఎంతో నిరాడంబరంగా, అమాయకంగా తమదైన సహజ స్వభావాలతో కనిపించారు.

                                      ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖవారు నడుపుతున్న హరిత రిసార్ట్ లో బస చేసాం. చాలా పెద్ద ఆవరణలో పెద్ద భవనాల్లో అనేక గదులు ఉన్నాయి. భోజనం, వసతి అన్నీ సంతృప్తికరంగా ఉండి, ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉన్నాయి. నిరభ్యంతరంగా ఇక్కడ బస చెయ్యవచ్చు. ట్రైబల్ మ్యూజియంలో శని, ఆదివారాలు థింసా నృత్య ప్రదర్శన ఉంటుంది. మన ఆసక్తిని బట్టి రిసార్ట్ ఆవరణలో రాత్రి ఆకాశం కింద చుట్టూ పరుచుకున్న ప్రకృతి మధ్య ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు. చాలా అందమైన ఈ నృత్యం చూసి తీరవలసిందే. ఆ రిథం, ఆ కదలికలు ప్రేక్షకులను ఒక కొత్తలోకంలోకి తీసుకెళ్తాయి.

హరిత రిసార్ట్ పక్కనే కాఫీ మ్యూజియం ఉంది. పొద్దున్నే వాకింగ్ కి వెళ్లి వస్తూ అక్కడ కుప్ప పోసినట్టున్న పాలప్యాకెట్లను లోపలికి తీసుకెళ్తున్న యువకుడిని అడిగాను, “ఇన్ని పాలు ఏం చేస్తారు” అంటూ. అతను నవ్వాడు. “ఈ రోజు ఇంకా తక్కువే మేడం, వీకెండ్స్ లో విజిటర్స్ చాలామంది వస్తారు. రకరకాల రుచుల్లో కాఫీల్ని తయారు చేస్తాం ఇక్కడ.” అన్నాడు. ఆ సాయంత్రం మ్యూజియంలోకెళ్లినప్పుడు అతనన్న మాటల్లో అతిశయం ఏమీ కనిపించలేదు. కాఫీ చాలా రుచిగా ఉంది. మన అభిరుచి మేరకు తయారు చేసి ఇస్తున్నారు. కొన్ని పదుల రకాల కాఫీలు, చాకొలెట్లు దొరుకుతాయి. మీరు వెళ్లినప్పుడు తప్పక ఈ మ్యూజియం చూసి కాఫీ కథేంటో తెలుసుకోండి. కాఫీ పుట్టు, పూర్వోత్తరాలు అన్నీ వివరంగా ఫోటోలతో సహా అందుబాటులో ఉన్నాయిక్కడ.

విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలోనే బొర్రా గుహలున్నాయి. ప్రకృతి మధ్య ఒదిగిఉన్న ఆ గుహలు అక్కడ ఏర్పాటుచేసిన రంగురంగు కాంతుల్లో చూడటం ఒక అనుభవం. బోలెడంత నడక, బోలెడంత థ్రిల్! ఈ గుహలను బ్రిటీష్ శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. కాల్షియం బై కార్బొనేట్, ఇతర ఖనిజాల మధ్య రసాయన చర్యల కారణంగా గుహ లోపల రకరకాల ఆకృతులు ఏర్పడిఉన్నాయి. ఈ గుహలు అనంతగిరి కొండల్లో ఉన్నాయి. గోస్థనీ నది ఇక్కడ ప్రవహిస్తుంది. సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తున ఇవి ఉన్నాయి.

ఈ చుట్టుపక్కల అనేక చిన్నచిన్న దుకాణాల్లో పనస తొనలు, తాజా పళ్లు, రకరకాల సుగంధ ద్రవ్యాలు అమ్ముతున్నారు. హరిత వారు నడుపుతున్న రెస్టొరెంట్ ఉంది. భోజనంలో రోటీ తో పాటు చాలారకాల పదార్థాలు దొరుకుతాయి. ఇక్కడి ప్రజల్ని చూస్తే వారి సాధుస్వభావాలు, వారి జీవితాల్లో కనిపించే తృప్తి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. మనకి ఎన్నో బతుకు పాఠాల్నినేర్పుతున్నట్టుంటాయి.

                                             ఈ అడవి బిడ్డల జీవితాల గురించి తెలుసుకోవాలనిపించటం సహజం. ఒక ఏడాది క్రితం సి. కె. జాను ఆత్మకథ “అడవి తల్లి ” చదివాను. ఆమె కేరళ నుంచి తమ ఆదివాసీల కోసంపోరాటాలను చేస్తున్న మహిళ. తామున్న భూమి, నీరు, ప్రకృతి తమవే ననీ, తమ జీవితాలకు ఆధారాలైన ఈ అడవి భూములను ప్రభుత్వం వాణిజ్య ప్రయోజనాల కోసం ఆక్రమించటం సహించబోమని స్పష్టం చేస్తోంది.

ఇప్పుడు మన రాష్ట్రపతి గా ఒక అడవి బిడ్డను ఎన్నుకున్నాం. ఆమె నిరాడంబర జీవిత కథ ఎవరినైనా ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు. ఒక వ్యక్తి తాను పుట్టి పెరిగిన పరిసరాలను, తనకున్న పరిమితమైన వనరులను దాటి ఒక దేశాన్ని, ఆ దేశ ప్రజలని విజయపథంలోకి నడిపించగలదన్న ఆశను ఆచరణలోకి తీసుకువస్తున్న దౌపది ముర్ము ను చూసి గర్వపడదాం. ఆమె నడిచి వచ్చిన దారులనుంచి స్ఫూర్తిని పొందుదాం.

* * *   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.