* * *
Continued from Part 2
పదకొండవ అధ్యాయంలో…
నాలుగు సుఖాంతాలైన నాటకాలను, నాలుగు విషాదాంతాలైన నాటకాలను పరిచయం చేసి వాటి ప్రత్యేకతలను వివరిస్తూ చక్కని విశ్లేషణలను అందించారు శేషమ్మ గారు. వీటిని గురించి ఈ సమీక్షలో చెప్పటం న్యాయం కాదు. పాఠకులు స్వయంగా చదివి ఆనందించాల్సిందే. నాటకాలలోని అద్భుత సంభాషణలను కూడా ఈ అధ్యాయంలో చూడవచ్చు.
పన్నెండో అధ్యాయంలో …
ఆసక్తికరమైన అంశం ఉంది. షేక్స్పియర్ నాటకాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలకు ప్రేరణ ఇచ్చాయని చెపుతూ ఆయా సినిమాలు, అవి వచ్చిన సంవత్సరాలను ఒక పట్టిక గా ఇచ్చారు. ఆ మహా రచయిత గురించి మనకు పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నంలో పూర్తిగా సఫలీకృతులయ్యారు శేషమ్మ గారు. షేక్స్పియర్ కి ఆమె వ్యక్తిగతంగా ఇచ్చిన అద్భుతమైన కానుక ఈ పుస్తకం. ఆమె కోరుకున్నట్టుగానే ఈ పుస్తకం చదవటం వలన పాఠకులకు షేక్స్పియర్ సాహిత్యం పట్ల మరింత కుతూహలం కలుగుతుంది.
“షేక్స్పియర్ ను తెలుసుకుందాం” పుస్తకం ఏప్రిల్ 2022 ప్రచురించబడింది. అది కూడా షేక్స్పియర్ పుట్టిన తేదీ ఏప్రిల్ నెల 23 నాటికి సిద్ధమవటం కాకతాళీయం కాదు. ఆ మహా రచయిత పట్ల శేషమ్మగారికున్న నిజయితీతో కూడిన అభిమానానికి నిలువెత్తు నిదర్శనం. రచయిత్రికి అభినందనలు. షేక్స్పియర్ సాహిత్యంలోని కొన్ని ఘట్టాలకు సంబంధించిన రంగురంగుల చిత్రాలను, శేషమ్మ గారు గ్లోబ్ థియేటర్ ను సందర్శించిన ఫోటోలను కూడా పుస్తకంలో జత చేసారు.
హరివివేక్ దామరాజు గారి కవర్ పేజీ ఆకర్షణీయంగా ఉంది. అయితే, ఇంత చక్కని పుస్తకంలో అచ్చుతప్పులు నివారించి ఉండవలసింది. పునరుక్తి దోషాలను కూడా ఎడిటింగ్ లో సవరించి ఉండచ్చు. విలువైన పుస్తకం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవి పెద్ద సమస్యలు కావు, కానీ రెండవ ముద్రణలో సవరించుకోవచ్చన్న ఆశ. ఏదేమైనా ఒక మంచి పఠనానుభవాన్నిచ్చింది శేషమ్మగారి “షేక్స్పియర్ ను తెలుసుకుందాం.”
Concluded.
* * *
Pingback: షేక్స్పియర్ ను తెలుసుకుందాం – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Aug. 2022 Part – 2 –