వివక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక Aug. 2022

* * *

                                          

వివక్షా? అలాటిదేం లేదే.

భారత రాజ్యాంగం ఎప్పుడో చెప్పింది-

కులం, మతం, వర్గం, లింగం, భాష ఇలాటి భేదాలేవీ ఉండవని,

అన్నిటా అందరూ సమానమేననీ!                                     

అంటే వివక్షలంటూ ఉండవన్నమాట!

మరి, ఈ పదం ఎలా పుట్టిందంటారా?

భలే సులువు!

ఇంట్లోంచి, మనుషుల్లోంచి, ఆలోచనల్లోంచి, అహంకారాల్లోంచి

అలా వైనవైనాలై,

రాజ్యాంగ నిర్మాతలకు తోచని ఎన్నో మార్గాల్లోంచి పుడుతూనే ఉంది!

వారి మేధకు అందని దారుల్లో పెత్తనం చేస్తూనే ఉంది.

ముందుగా ఏదైనా ఒక ఇంటి లోపలకి చూద్దాం,

అక్షరాలు నేర్వని వయసులోనే…

అన్నయ్య కంచంలో రెండు అప్పడాలు, తన కంచంలో ఒక్క అప్పడం ఏమిటంది అమ్మాయి.

వాడు అబ్బాయి కదా అంటూ నానమ్మ,

అమ్మాయిని మహా గడుగ్గాయంది.

ఇంటి మహాలక్ష్మి కచ్చితంగా అమ్మాయే!

ఇంటి బరువు, పరువు మోసే అబ్బాయి మాత్రం మహలక్ష్మి కంటే కాస్త ఎక్కువే!

ఇల్లు పట్టక ఆటలాడే అబ్బాయికి సైకిల్ బహుమతి అడక్కుండానే!

అమ్మకి సాయంచేసి, బడికి ఆలస్యమయ్యే అమ్మాయికి రిస్టువాచీ దండగే.

అమ్మాయి అపర సరస్వతి!

ఏం చదివినా నెగ్గుకొస్తుంది, ఎలాగైనా బతికేస్తుంది.

అబ్బాయి చదువు, కెరీర్ వెనకబడితే ఏం బావుంటుంది?

ట్యూషను పెట్టో, డొనేషను కట్టో ఒడ్డున పడెయ్యాల్సిందే!

‘’ఫలానా మనిషితోడు నాకు బావుంటుంది’’ అంది అమ్మాయి.

“కులం, మతం, సంప్రదాయం” సంగతేంటి అన్నాడు నాన్న.

అమ్మాయికి లోకజ్ఞానం తక్కువంది అమ్మ.

పెళ్లికి కులం ముఖ్యమా? ప్రేమ ముఖ్యమా?

ప్రేమనేది కవిత్వపు ముడిపదార్థం. అంతే.

అప్పుడెప్పుడో అమ్మాయి ఎలాగైనా బతికేస్తుందన్నాడు నాన్న!

నిజమే!

కానీ…

ఆమె కోరుకున్నట్టు మాత్రం బతకలేదు.

ఇదేం వివక్ష కాదు సుమా!

అమ్మా, నాన్నా ఏం చెప్పినా అమ్మాయి మంచికే!

ఆడకూలి, మగకూలి విడివిడిగా విలువకట్టే ప్రపంచం అర్థమవాలంటే

ఆర్థికశాస్త్రం చదవనూ అక్కర్లేదు, బోధించనూ అక్కర్లేదు!

ఇల్లూ, పిల్లలూ అమ్మాయికే సొంతమన్న ఉదారత చూసారా?

చిత్రంగా ఇక్కడ కూలీ ప్రస్తావన ఏమీ లేదు.

ఎందుకంటే,

చరిత్ర వాటిని అచ్చంగా అమ్మాయికి ఉచితమంది.

ఇక్కడ ఎలాటి వివక్షా లేదు.

ఇవన్నీ చెపుతున్న నాది వివక్షంటారా?

క్షమించండి,

ఇంతకు మించి వివరం చెప్పలేను!

* * *

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.