షేక్స్పియర్ ను తెలుసుకుందాం – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, July. 2022 Part – 1

* * *  

తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, విమర్శ, సాహిత్య వ్యాసాలు, పిల్లల కథలు, ఆత్మ కథలు, జీవిత చరిత్రలు, అనువాదాలు ఇలా ఎన్నో చదువుతుంటాం. ఇటీవల చదివిన “షేక్స్పియర్ ను తెలుసుకుందాం” పుస్తకం ఒక విలక్షణమైన పుస్తకం అని చెప్పాలి. ఈ పుస్తకం గురించి మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు చెప్పాలి.

అనగనగా ఒక అమ్మాయి.  చిన్నప్పుడే తండ్రి పుస్తకాలు చదివే అలవాటు చెయ్యటంతో సాహిత్యాభిరుచిని పెంచుకుంది. 11వ తరగతి లో షేక్ స్పియర్ పద్యభాగాన్ని పాఠ్యాంశంగా చదువుకుంది. ఆ రచయిత పట్ల ఆరాధనా భావంతో ఆయనను మరింతగా చదవాలని కుతూహలపడింది. డిగ్రీ చదువుతున్నప్పుడు షేక్స్పియర్ రాసిన మరో పాఠ్యాంశాన్ని చదువుకుంది. ఆపైన ఎ. సి. బ్రాడ్లే షేక్స్పియర్ గురించి రాసిన విమర్శనాత్మక వ్యాసాలను అధ్యయనం చేసింది. చిన్ననాట ఇష్టపడిన రచయితను గురించి మరింత లోతుగా చదువుతూ, తెలుసుకుంటూ వచ్చింది. ఆ రచయిత సాహిత్య కృషి గురించి ఆరు దశాబ్దాల పాటు తెలుసుకున్న సమస్త విషయాలను తెలుగు పాఠకులకు దగ్గర చేసే ఉద్దేశ్యంతో తన డెబ్భై ఎనిమిదో ఏట ‘షేక్స్పియర్ ను తెలుసుకుందాం” అంటూ ఒక పుస్తకాన్నే రాసేసింది.

                    మరణించిన శతాబ్దాల తర్వాత కూడా ఆ రచయితను ప్రపంచమంతా ముక్తకంఠంతో ప్రశంసిస్తున్న కారణాల్ని స్పష్టమైన విశ్లేషణతో సరళంగా వివరించింది. ఆమె శ్రీమతి కాళ్లకూరి శేషమ్మ గారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యులు డా. వై. సోమలత గారు ముందుమాటను రాస్తూ ఈ పుస్తకం మహాకవి గొప్పతనాన్ని వివరంగా చెపుతుందని, యువతకు విలువైనదని చెప్పారు. శేషమ్మ గారు షేక్స్పియర్ రచనల్లోని గొప్పతనాన్ని వివరించేందుకు మూడు పద్యభాగాలను ఎన్నుకుని విశ్లేషించారని, గాఢమైన మూడు సానెట్లను, కొన్ని విషాదాంత, సుఖాంత నాటకాలను అనువదించి పాఠకుని మనస్సుకు హత్తుకునేలా చెప్పారంటారు సోమలత గారు.

శ్రీమతి సూరపరాజు పద్మజ గారు ఆంగ్లం, ఫ్రెంచ్ భాషలను పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు బోధించే అధ్యాపకురాలు. వారు పుస్తకం ముందుమాటలో ఏడు పదులు దాటిన శేషమ్మగారు నిత్య విద్యార్థిగా విద్యోపాసన చేస్తున్నారని, ఇటువంటి పుస్తకం రాసేందుకు ఆమె పూనుకోవటం ఎంతైనా సముచితమనీ అంటారు. సిలబస్, పరీక్షల ప్రయోజనం కోసం కాక స్వతంత్రంగా, సాహిత్య అధ్యయనాన్ని ఆస్వాదించేందుకు అవకాశమిచ్చిన ఈ పుస్తకం అరుదైనదంటూ, తేట తెలుగు భాషలో కఠినమైన ఆంగ్ల కావ్య చర్చను అందించారని చెప్పారు.

రచయిత్రి కుమార్తె శ్రీమతి శైలజ గారు షేక్స్పియర్ ను ఎందుకు తెలుసుకోవాలో రాసారు. మనిషిలోని నాలుగు ప్రధాన భావోద్వేగాలైన ప్రేమ, ద్వేషం, వాత్సల్యం, అసూయ ల గురించి, వాటి ఫలితాలు, పర్యవసానాల గురించి తన రచనల్లో చూపించిన షేక్స్పియర్ కాలానికి దీటుగా నిలబడే సాహిత్యాన్ని సృష్టించారని, అది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ మనిషిని ఆలోచింపజేసేదిగా ఉందని చెప్పారు. ఇతర రచయితల ధోరణిలో పురాణాలనో, ఇతిహాసాలనో ఆధారం చేసుకుని కాక షేక్స్పియర్ తానున్న సమాజపు తీరుతెన్నులను, మనిషికి ఎదురయ్యే రకరకాల సవాళ్లను, కష్టసుఖాలను సాహిత్యంగా అందించారు.

ఆయన నాటకాల్లో ‘స్వగతాలు’ అనే కొత్త ప్రక్రియను చేర్చారు. మనిషి మనసులో జరిగే సంఘర్షణను స్వగతాల రూపంలో వ్యక్తపరచటం, వాటిని చదువుతున్న పాఠకునిలో అంతర్గంగా ఉన్న భావాలను మేల్కొల్పేలా చెయ్యటం ఒక అద్భుతమైన ఆవిష్కరణ. శతాబ్దాలకు పూర్వమే మనిషి చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచం, మనిషి లోలోపలి ప్రపంచం గురించి ఇంత స్పష్టంగా తన రచనల్లో చూపించిన షేక్స్పియర్ ను, ఆయన ఆలోచనల్లోని గొప్పదనాన్ని మనం తెలుసుకుని తీరవలసిందే అంటారు శైలజ గారు.

                                      శేషమ్మగారు పుస్తకానికి నాంది, ప్రస్తావన ద్వారా తన మనసులో మాటలను చెప్పారు.

                                 ఆనాడు నాటక ప్రదర్శనకు తగిన సాంకేతిక వ్యవస్థ లేనందున పాత్రల మనసులోని భావాలను, జరగబోయే విషయాలను స్వగతాల రూపంలో వ్యక్తపరిచారు షేక్స్పియర్. ఇలాటి స్వగతాలు మన తెలుగు సినిమాల్లో, నాటకాల్లో కనిపిస్తాయి. ‘శ్రీకృష్ణ పాండవీయం’ లో సుయోధనుడు మయసభలో పలికిన స్వగతాలు, నర్తనశాల లో కీచకుడు ‘మాలిని’ రాకకై ఎదురుచూస్తూ పలికిన స్వగతాలు మొదలైనవి రచయిత్రి ఉదాహరణలుగా చెప్పారు. షేక్స్పియర్ తన సాహిత్యం ద్వారా పరిచయం చేసిన అనేక పద ప్రయోగాలు ఈ నాటికీ ప్రపంచమంతా ఉపయోగిస్తోందంటే రచయితగా ఆయన గొప్పదనం తెలుస్తుంది. కర్మ సిద్ధాంతము, కలల ప్రభావము, శకునాలు, గొప్పవారి నోటి మాటలు నిజమవటం, వానప్రస్థాశ్రమాలు, రాజుల భిన్న ప్రవృత్తులు, యోధుల వీర గాధలు వంటివి షేక్స్పియర్ రచనల్లో చూసినపుడు అవే అంశాలు భారతీయ సంస్కృతి, జీవన విధానానికి సమాంతరంగా నడిచినట్టు గమనిస్తామంటారు రచయిత్రి.

ఈ సాంకేతిక యుగంలో భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి, అధ్యయనం తగ్గుతున్నందున మనసుకు ఊరటను, శాంతిని ఇచ్చే సాహిత్యం అవసరమని రచయిత్రి భావించారు. షేక్స్పియర్ రచనల్లో ఉత్తమ విలువలకు ప్రాధాన్యత ఉన్నందున ఈ మహాకవి గురించి, ఆయన సాహిత్యం గురించి పుస్తకం తీసుకు వచ్చి, ఈ ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరించమంటూ పాఠకులను వినమ్రంగా కోరారు.  

ఆంగ్ల భాషకు, సాహిత్యానికి ఒక నిండుదనాన్ని, గౌరవాన్ని ఇచ్చిన షేక్స్పియర్ కు పరిచయం అవసరం లేదు. వీరి సాహిత్యం ద్వారా తాను పొందిన ఆనందాన్ని తెలుగు పాఠకులకు అందించాలన్న తపనే తనచేత ఇలా రాయించిందంటారు. కుమార్తె శైలజ, హిందూ పత్రికా విలేఖరి శ్రీ మురళీశంకర్ గారు, స్నేహితురాలు శారద గారు, కుమారుడు కాళీ ప్రసాద్ లను ఈ పుస్తకం తీసుకురావటంలో సూత్రధారులంటూ పరిచయం చేసారు రచయిత్రి.

ఈ పుస్తకాన్ని పన్నెండు అధ్యాయాలుగా విభజించారు.

మొదటగా,

ప్రపంచ దేశాలన్నింటిలోనూ కీర్తిని సంపాదించుకున్న షేక్స్పియర్ కవిగా, నాటక కర్తగా అనేక ప్రత్యేకతలను కలిగిన వాడని, సమాజంలోని లోటుపాట్లను చూస్తూ కూడా మానవుని గురించి ఆయన నమ్మకాన్ని కోల్పోలేదని, రచనల్లో సానుకూలతే కానీ ఎక్కడా నైరాశ్యం కనిపించదని రచయిత్రి చెపుతారు. షేక్స్పియర్ రచనల్లో అలజడి ఉంటుంది. నాటకీయమైన మార్పులనేకం జరిగిపోతుంటాయి. కానీ కథ మానవతా విలువలను పెంపొందించేదిగా, మంచికి పట్టం కట్టేదిగా ఉంటుంది. వ్యవస్థలో వచ్చిన మార్పులు గురించి కాక మనుషుల్లో వచ్చే మార్పులు, తరిగిపోతున్న మానవతా విలువల గురించే ఆయన బాధ పడతాడు. మనుషుల మధ్య ఆర్ర్దత, ప్రేమ, సోదర భావం ఉండాలని, అందరూ కలిసి కష్టించి పనిచేసి, సంపదను తయారుచేసి ఆనందంగా పంచుకోవాలన్నది ఆయన కోర్కె.  

షేక్స్పియర్ ఎక్కడా నీతి సూక్తులు వల్లె వెయ్యడు. ఆయన నాటకాల లోని పాత్రలు సహజంగా ఉండటంతో నాటకాన్ని చూస్తున్న వారికి తామే ఆ పాత్రలో ఉన్న అనుభూతి కలుగుతుంది. “ఇది నీతి” అని ఒక చోట ఒక వ్యక్తితో చెప్పించినా, మరొక చోట మరో పాత్రతో ఆ అభిప్రాయం సరైనది కాదు అనిపిస్తాడు. మనిషి జీవితంలో ఒక మాటకు, బంధుత్వానికి, వస్తువుకూ ఒక సమయంలో ఉన్న విలువ మరికొంత కాలానికి ఉండకపోవటమే దీనికి కారణం. మనిషిని ఎంత కఠినంగా, క్రూరంగా చూపిస్తాడో అలాగే మహా మనీషిగానూ చూపిస్తాడు షేక్స్పియర్. రెండూ వాస్తవాలే మరి.

రెండవ అధ్యాయంలో షేక్స్పియర్ జీవిత విశేషాలు చూస్తాం.

షేక్స్పియర్ తల్లి సంపన్న రైతు కుమార్తె మేరీ, మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు, షరీఫ్ అయిన జాన్ ఆయన తండ్రి. గ్రామ ప్రాంతపు ఆత్మీయత, పట్టణ ప్రాంతపు ఆధునికత కలిసిన లక్షణాలు షేక్స్పియర్ లో కనిపిస్తాయి. తల్లిదండ్రుల నుండి సెక్యులర్ భావాలను స్వంతం చేసుకున్నాడు. పేదరికంలో మగ్గే ప్రజల పట్ల చిన్ననాడే సహానుభూతిని ఏర్పరచుకున్నాడు. ఎన్నడూ తాను పేదరికం లో చిక్కుకోరాదని నిశ్చయించుకున్నాడు. పద్ధెనిమిదేళ్ల వయసులో తనకంటే ఎనిమిదేళ్లు పెద్దదైన స్త్రీతో ప్రేమాయణం సాగించి, ఆమె గర్భవతి కాగా తప్పని సరి పరిస్థితుల్లో తండ్రి అనుమతితో వివాహం చేసుకున్నాడు. అతనికి 26 సంవత్సరాల వయసు వచ్చేవరకు అతనొక రచయిత అని లోకానికి తెలియదు. కానీ మరొక దశాబ్ద కాలంలో ఇంగ్లండులోని ప్రముఖ రచయితల్లో ఒకడయాడు. రచయితగా అతనికి ఓర్పు, సాహసం, మాటల గారడీ, నాటకీయత వంటి లక్షణాలుండటంతో ప్రజాదరణ పొందాడు. పల్లె నుండి నగరానికి గ్లోబ్ థియేటర్ కు చేరుకుని తన ఆదాయాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ పొదుపు, మదుపు చేసి సంపదను పెంచుకున్నాడు. నీతి నియమాలకు, విలువలకు తల వంచాలని అతను నమ్మాడు.  

మూడవ అధ్యాయం “షేక్స్పియర్ – రంగస్థలం”

షేక్స్పియర్ రచనా కాలంలో ఇంగ్లండులో కళలకు మంచి ఆదరణ ఉంది. అతను యుక్తవయస్కుడయేసరికి నాటక కళ ఒక పరిణిత దశకు చేరింది. నగరవాసులకు నాటకాలు చూడటమనేది గొప్ప వినోదం. లండన్ నగరంలో ఉన్నత వర్గానికి చెందిన వారు నటన పట్ల ఆసక్తి చూపేవారు. అన్ని రంగాల్లోని వ్యక్తులకూ సంభాషణా నేర్పు అవసరమని, కొంత నాటకీయత ఉంటే ఏ రంగంలోనైనా రాణిస్తారని నమ్మేవారు. నాటక ప్రదర్శనలో పేదలు, కింది వర్గం వారు నేల మీద కూర్చుంటే, ధనిక వర్గాలు బాల్కనీల్లో కూర్చునేవారు. నాటకాన్ని చూస్తున్నప్పుడు ప్రేక్షకులంతా ఒకే రకమైన హావభావాలకు, అనుభూతులకు లోనైనా కింది తరగతుల ప్రేక్షకులంత స్వేచ్ఛగా పై తరగతివారు వాటిని ప్రదర్శించ లేకపోయేవారు. బింకంగా ఉన్నట్టు నటించేవారు.

నాటకాల్లో పాత్రధారులంతా పురుషులే ఉండేవారు. స్త్రీ పాత్రలు బాలురు వేసేవారు. షేక్స్పియర్ రాణి ఎలిజబెత్ ఆస్థానంలోని ఉద్యోగి. ఆమె సమక్షంలో తాను రాసిన నాటకాలను ప్రదర్శించేవాడు. పైగా తానే నటుడు కూడా. ఇలాటి అదృష్టం నాటక కర్తలందరికీ దొరకదు. రాణి కోర్కె పైన హేమ్లెట్ నాటకంలో తండ్రి పాత్రను షేక్స్పియర్ పోషించినట్టు చెపుతారు.

నాలుగవ అధ్యాయంలో,

షేక్స్పియర్ పై ఇంగ్లండు చరిత్ర ప్రభావం గురించి చెపుతారు. ప్రపంచ దేశాలెన్నో చాలాకాలం రాచరికం కింద పరిపాలన సాగించాయి. వారి ధైర్యసాహసాలు, యుద్ధాలు, విజయాలు, ప్రజల హితం కోరే పాలన, రాజుల కోటలు ఇలా ఎన్నో విషయాలను చరిత్ర నుంచి తెలుసుకుంటాం. కొందరు రాజులు శాంతియుత జీవితాలకు మొగ్గుచూపితే, కొందరు యుద్ధ కాంక్షతో ప్రజల జీవితాలను సమస్యల బారిన పడెయ్యటం చూశాం. షేక్స్పియర్ తొమ్మిది చారిత్రాత్మక నాటకాలు రచించాడు. ఎనిమిదో హెన్రీ నాటకంలో “విద్య, విజ్ఞానం మనిషిని స్వర్గానికి చేర్చగల రెండు రెక్కలు.” అంటాడు నాటకకర్త. ఆరో హెన్రీ నాటకంలో రాజనీతి గురించి, యుద్ధం గురించి మంచి విశ్లేషణ చూస్తాం. అందులో నాలుగవ ఎడ్వర్డ్ పదవి కోసం ఎటువంటి దుర్మార్గానికైనా తెగించబూనటం చూస్తే పాఠకుడు భయంతో వణికిపోతాడు. రాజు అన్నవాడు ఏదైనా చెయ్యవచ్చన్న ధోరణి, రాజు ఏ తప్పూ చెయ్యడన్న అభిప్రాయాలను ఎడ్వర్డ్ ప్రదర్శిస్తాడు. షేక్స్పియర్ రాణి ఆస్థానంలో ఉంటూ రాచ కుటుంబాలలోని సాధకబాధకాలు, వారి బలహీనతలు, స్వార్థపుటాలోచనలు, విశృంఖలతలు అన్నింటినీ దగ్గరగా చూసినవాడు. వాటినే తన నాటకాలలో చూపించాడు.  

యుద్ధాన్ని ఒక క్రీడగా చెప్పటం (sport), కథలో ఎత్తుగడను, కుట్రలను plot అన్న పదానికి పర్యాయపదంగా చెప్పటం మొదటిసారిగా ఈయన సాహిత్యంలో చూస్తాం.

ఐదవ అధ్యాయంలో,

షేక్స్పియర్ రచనలపై రాచరికం చూపిన ప్రభావాన్ని చెప్పారు. ఇంగ్లండులో రాచరికపు వ్యవస్థ ఏనాటినుంచో ఉంది. ఇంగ్లండు దేశ ప్రజలకు రాచరికం పట్ల ఇష్టం. పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నప్పటికీ రాజు లేదా రాణి ని దేశపెద్దగా కొనసాగిస్తున్న దేశం ఇంగ్లండు. రాజు దైవాంశ సంభూతుడన్నది నమ్మేవారు. రాజు ఎన్నడూ తప్పుచెయ్యడని, ఒకరి తరువాత ఒకరు వంశ పారపర్యంగా రాచరికాన్ని పొందుతారు కనుక రాజుకు మరణం లేదని నమ్మేవారు. కొందరు రాజులు ప్రజల కోసం తాము ఏమి చెయ్యగలం అని తపించి ప్రజలకు శాంతియుతమైన జీవితాల్ని అందిస్తే, మరికొందరు తమ అధికారానికి తిరుగులేదని భావిస్తూ నియంతల్లా పాలించేవారు. రాచరికపు కుటుంబాల్లోని సంఘర్షణ, సంక్లిష్టతలను షేక్స్పియర్ తన నాటకాల్లో ఆసక్తికరమైన కథ, కథనాలతో చూపించాడు.  (సశేషం)

Continued in Part – 2

* * *  

One thought on “షేక్స్పియర్ ను తెలుసుకుందాం – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, July. 2022 Part – 1

  1. Pingback: షేక్స్పియర్ ను తెలుసుకుందాం – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Aug. 2022 Part – 2 –

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.