తొమ్మిది దశాబ్దాల సామాజిక చైతన్యం నంబూరి పరిపూర్ణ! – వ్యాసం, Jun.2022

 * * *         

అవును, తొమ్మిది దశాబ్దాల సామాజిక చైతన్యం ఆమె!

                               ‘’వెలుగు దారులలో…’’ అంటూ తన ఆత్మకథను మనకందించిన పరిపూర్ణ గారి జీవితం పుట్టినప్పటినుంచీ సమాజంతో ముడిపడి ఉంది.

తన పెద్ద కుటుంబ బాధ్యతలే కాక చుట్టుపక్కలున్న వారి మంచిచెడ్డలను తనవిగా భావించి అందరికీ సాయపడే తల్లి లక్ష్మమ్మ గారు, దేశభక్తి, సోషలిష్టు భావాలతో దేశ స్వాతంత్రోద్యమంలో జైళ్లకెళ్లిన అన్నయ్యలు చిన్నతనంలోనే పరిపూర్ణ గారి మీద గాఢమైన ముద్రను వేసారు. జీవితం తనకోసం మాత్రమే జీవించేది కాదన్న విశాలమైన ఆలోచన, ఆచరణ ఇంటినుంచే ప్రారంభం కావటంతో తాను సమాజంలోని ఒక భాగమే కానీ వ్యక్తిగతమైనదేదీ లేదన్న అవగాహన ఆమెకు కలిగింది.  

చెల్లెలు పరిపూర్ణ తెలివితేటలు గుర్తించిన అన్నయ్య శ్రీనివాసరావు గారు ఆమె చదువును ప్రోత్సహించారు. స్వతహాగా చురుకైన చిన్నారి పరిపూర్ణ చదువుతో పాటు లలితకళలలోనూ రాణిస్తూ వచ్చారు. చదువుకునే వయసు నుంచే కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేస్తూ సమాజ తీరుతెన్నులను, సామాజిక, ఆర్థిక అంశాలను అవగాహన చేసుకున్నారు. అన్నయ్యలిద్దరూ రచయితలు కావటంతో సాహిత్యం పట్ల ఆసక్తి మొదలై ఆమెను రచన వైపు ప్రోత్సహించింది.

                                స్త్రీ సంక్షేమ శాఖలో ఉద్యోగం చేస్తూ సమాజపు అట్టడుగునున్న ప్రజల పట్ల, స్త్రీల పట్ల అమలవుతున్న అసమానతలను, వివక్షలను గమనించారు. వాటిని ప్రపంచం ముందుకు తీసుకొచ్చేందుకు సాహిత్యాన్ని అనువైనదిగా భావించారు. సమస్యల గురించి చెప్పటమే కాకుండా పరిష్కారాలను సూచిస్తూ వ్యాసాలను రాయటం మొదలుపెట్టారు. క్రమంగా ఆ రచనాభిలాష ఆమెతో కథలను రాయించింది. కథలన్నీ చుట్టూ ఉన్న దుఃఖార్తులవే. బాధలకు కృంగిపోయే విధంగా కాక భవిష్యత్తు పట్ల ఆశతో, ధైర్యంతో పోరాడే స్ఫూర్తినిచ్చే రచనలు చేస్తూ వచ్చారు.

కుటుంబం నుండి తాను నేర్చుకున్న సంస్కారం తన పిల్లలకు నేర్పారు. క్రమశిక్షణ, నిజాయితీ, ఆదర్శవంతమైన ఆలోచనలు ఆమె పిల్లల జీవితాల్లోనూ సహజంగా అమరిపోయాయి. ఉద్యోగ జీవితంలో తలమునకలుగా ఉంటూనే, పిల్లలను బాధ్యతాయుతమైన వ్యక్తులుగా విజయపథం వైపు నడిపించిన ఆమె కృషి ముందుగా చెప్పుకోదగ్గ విజయం.

                                   సాహిత్యంలోనూ తన వారసత్వాన్ని పిల్లలకి అందించారు. శిరీష గారు, అమరేంద్ర గారు, శైలేంద్ర గారు కూడా సాహిత్యం పట్ల అంతులేని ప్రేమ, నిబద్ధత కలిగిన వ్యక్తులు. శైలేంద్ర గారు రచయిత కాకపోయినా చిన్నప్పటినుంచే సాహిత్యంతో అనుబంధం ఉన్న వ్యక్తి. పరిపూర్ణ గారు డెబ్భై ఐదో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ‘’కథా పరిపూర్ణమ్’’ పేరుతో పిల్లలు ఒక పుస్తకాన్ని తెచ్చారు. ఒక కుటుంబంలోని తల్లి, పిల్లలూ కూడా రచయితలు కావటం, వారందరి కథలనూ కలిపి కదంబంలా ఒకే పుస్తకాన్ని తీసుకురావటం అరుదైన సందర్భం. అందుకే అది విలక్షణమైన పుస్తకం.                                     

‘’కథా పరిపూర్ణమ్’’ సంపుటి లోని ఆమె కథలను పరిశీలిస్తే పరిపూర్ణ గారిని మరింతగా తెలుసుకోగలుగుతాం.

మొదటి కథ ‘’శ్రీనుగాడి తత్వ మీమాంస’’ ఒక చిన్న పిల్లవాడి కథ. వాడిని చూస్తుంటే మన ఇంట్లో తిరిగే పసివాళ్లు గుర్తు రాక మానరు.

                                       ఆకలేస్తోందంటూ అమ్మ దగ్గర గొడవ చేస్తూ కూడా తండ్రి వాయించే మృదంగాన్ని వాయించనిస్తేనే భోజనం చేస్తానని తల్లికి షరతు పెడతాడు. ఇంట్లో పెద్దల ప్రభావం పిల్లల మీద ఎంత గాఢంగా ఉంటుందో అర్థమవుతుంది.

తనతో చదువుకునే దొరగారి మనవడు పండుబాబు ఇంట్లో రకరకాల ఫలహారాలు, గదినిండా ఉన్న బొమ్మలు, చిన్నదొరగారంటూ అతనికి సపర్యలు చేసే సేవకులు శ్రీనుకి ఆశ్చర్యం కలిగిస్తాయి. వారి దివాణం ముందునుంచి తల్లితో వెళ్తూ, తన తండ్రి, ఊళ్లోని మిగిలిన వారు చేసినట్టు బంగళాలోని వారెవరూ బయటకొచ్చి పనులు చెయ్యరు, మరి వీళ్లకింత డబ్బెకడిదమ్మా అంటాడు. కష్టపడితేనే డబ్బులొస్తాయన్న వాడి ఊహకి ఇది అందదు.

వాళ్లంతా వెనకటి జన్మలో పుణ్యం చేసుకున్నారన్న తల్లి మాటలకి తృప్తి పడడు శ్రీనుగాడు. తాత, ఆయన పూర్వీకులు ఎన్నో పుణ్య కార్యాలు చేసారని చెపుతావు, మరి మనకెందుకు డబ్బు లేదంటాడు. పెద్దయ్యాక తెలుస్తాయిలే అంటూ తల్లి మాట దాటవేసినా, దొరగారు వడ్డీలకి డబ్బు ఇచ్చి బాకీలు తీర్చలేని వారి ఇళ్లను, పొలాలను లాక్కుంటాడంటారు కదా, పాపం చేసినవాళ్లు వచ్చే జన్మలో కుక్కగానో, నక్కగానో పుడతారు కదా అంటూ అమాయకంగా అడిగేస్తాడు. తల్లి జవాబు చెప్పలేకపోతుంది.

తల్లి అరిసెలు చెయ్యటం చూసిన శ్రీను నోరూరుతుంది. తనకి పెట్టమంటూ అడుగుతాడు. ముందుగా దేవుడికి నైవేద్యం పెడితే కానీ మనం తినకూడదని ఆమె చెప్పినప్పుడు అలా ఎందుకంటాడు. దేవుడిని నిత్యం భక్తిగా పూజించి, సత్కార్యాలు చేస్తే స్వర్గానికెళ్తామని, పరమాత్మునిలో లీనమవుతామని తల్లి చెపితే శ్రీను ఆలోచనలో పడతాడు.

                                      అలా స్వర్గానికెళ్లటం, దేవుడిలో లీనమవటం ఇష్టం లేదని చెప్తూ తనకి ఎప్పుడూ బతికుండి మాయాబజార్, మల్లీశ్వరి లాటి సినిమాలు మళ్లీ మళ్లీ చూస్తూ, గేదె ఈనినప్పుడు అమ్మ వండిపెట్టే జున్ను, కొత్త అటుకులూ, తంపటేసిన వేరుశనక్కాయలు మళ్లీ మళ్లీ తింటూ ఉండాలని ఉందంటాడు. అసలు మామిడిపళ్లు తింటూ ఉండకపోతేనూ, చెరువులో తామరల్ని రోజూ చూడకపోతేనూ ఎలాగమ్మా అని ప్రశ్నిస్తాడు. ఆఖరికి తల్లి వాడి వాదన పడలేక రెండు అరిశెల్ని అరిటాకులో పెట్టి ఇస్తుంది. అయితే, వాడు తల్లి దగ్గర వాదించి సంపాదించిన అరిశెల్ని అమాంతం తినెయ్యలేదు.

శ్రీనుగాడి తత్వ మీమాంస గొప్పది!

వాటిని పట్టుకుని పరుగెత్తుకెళ్లి నోట్లో పెట్టుకోబోతూ ఆకాశం వైపు చూసి, ‘’భగవంతుడా, మా ఇంట్లో అందరికన్నా నేను ముందుగా ఏమి తింటున్నా మా నాన్న మురిపెంగా చూస్తాడు. మరి నువ్వు అందరికీ తండ్రివి కదా, నీకు నైవేద్యం పెట్టకుండా నేను తింటున్నందుకు కోపగించుకోవు కదూ’’ అంటాడు. ఆ మాటలు కథకి కొత్త కాంతిని, చదువరి మనసుకి కొత్త శాంతిని తీసుకొస్తాయి.

సంపుటి లోని రెండో కథ ‘’ఎర్రలచ్చుప్ప’’.

లక్షుమ్మ దళిత కుటుంబంలో పుట్టిన అందమైన ఆడపిల్ల. బంగారు బొమ్మలాటి ఆ పిల్లను ఆరేళ్ల వయసులోనే తన కొడుక్కి చేసుకుని ఇంటికి కోడలిగా తెచ్చుకుంటుంది ఆమె మేనత్త. ఎనిమిదేళ్ల వయసులో ఉండగా భర్తను పోగొట్టుకున్న లక్షుమ్మ జీవితంలో ఆ అంకం ముగిసిపోతుంది. పెరిగి పెద్దదవుతూన్న లక్షుమ్మకి తన స్నేహితురాళ్లు పెళ్లిళ్లై, భర్త వెనుక అత్తవారిళ్లకు వెళ్లటం చూసి తను ఏం పోగొట్టుకుందో అర్థం అవుతూంటుంది.

ఆమె సభ్యతాసంస్కారాలున్న మాలదాసుల కుటుంబంలో పుట్టిపెరిగిన పిల్ల. పుట్టింటి కట్టుబాట్లు, వంశపారంపర్యపు సంప్రదాయాలు ఆమెను పక్కదారులు పట్టకుండా గట్టిగా నిలబెడుతూ వస్తాయి. మాలపల్లెలో ఉండే మాలదాసులు తాము మేలైన సంస్కృతిని అలవరచుకున్నందున తోటివారికంటే అధికులమన్న భావంతో ఉంటారు. తమ కులాల్లో ఉండే మారు మనువును బహిష్కరించారు.

ఒక ఏడు కరువు రోజుల్లో తన వారితో కలిసి పరాయి ఊరికి వరికోతలకి వెళ్లిన లక్షుమ్మకి మంచినీటి బావి దగ్గర భూషణం పరిచయమవుతాడు.

ఊళ్లో ఉన్న రెండు మంచినీటి బావులు అగ్రకులాల ఆధిపత్యంలో ఉండేవని చెబుతూ రచయిత్రి అంటారు కదా, ‘’హరిజనులు తక్కువ వాళ్లూ, అంటరాని వాళ్లూ అని దయతో ఆకలిదప్పులేమైనా తక్కువగా పెట్టవచ్చు కదా దేవుడు’’ అని!  

                                     లక్షుమ్మ, భూషణం ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. పరిచయం పెరుగుతూ వస్తుంది. లక్షుమ్మ వరుసగా మూడేళ్లు అదే ఊరికి పనులకు వస్తుంది. భూషణం, ఆమె తాము ఇక వేర్వేరుగా ఉండలేమన్న నిర్ణయానికొస్తారు. భూషణం లక్షుమ్మ తో ఆమె ఊరు వచ్చేస్తాడు. ఊరివారు వాళ్లిద్దర్నీ వెలి వేస్తారు. అయినా భయపడక, ఒక పోరంబోకు స్థలంలో చిన్న కుటీరం వేసుకుని, బ్రతుకుతెరువు కోసం చిన్న దుకాణం పెట్టుకుంటారు. క్రమంగా వారిద్దరూ బంధుగణంలోనూ, ఊరివారిలోనూ అభిమానాన్ని సంపాదించుకుంటారు. లక్షుమ్మ మేనకోడళ్లు, మేనల్లుళ్లు ఆమెను ఎర్రలచ్చుప్ప అంటూ పిలుస్తూ భూషణాన్ని మామయ్య అని పిలవటం మొదలెడతారు.

భూషణం తండ్రి వీరయ్య చౌదరి కొడుకును వెతుక్కుంటూ వచ్చి ఆస్తి పంపకాల నిమిత్తం ఇంటికి రావలసిందిగా చెప్పి తీసుకెళ్తాడు. ఆస్తి, పరువు ఉన్న కుటుంబంలో పుట్టి బికారి జీవితం ఎందుకు బతకాలని చెప్పిన తండ్రి, బంధువుల మాటలకు ఎటూ తేల్చుకోలేకపోతాడు భూషణం.

లచ్చుప్ప భూషణం ఊరికి వచ్చి అతన్ని నిలదీస్తుంది. అతను లేని జీవితం తనకి వద్దు అని చెప్పి వెళ్లిపోతుంది. భూషణం ఎవరికీ చెప్పకుండా ఒక రాత్రి లచ్చుప్ప ఊరు చేరతాడు. జీవిక కోసం లచ్చుప్ప కూలీ పనులకు వెళ్తుంటే, భూషణం అగ్రకుల నేపథ్యం వల్ల కూలీ పనికి వెళ్లక, కొట్టు దగ్గర కాలక్షేపం చేస్తూ గడుపుతుంటాడు. ఇంటిబాధ్యత పూర్తిగా తనపై పడేసరికి లచ్చుప్ప భూషణం సోమరి జీవితాన్ని తప్పు పట్టేది. ఆమెపై చెయ్యి చేసుకోవటం మొదలుపెడతాడు భూషణం. అయినా ఇద్దరిమధ్యా కలహాలు ఇట్టే సమసిపోతుండేవి.

కొట్లో సరుకులు తెచ్చే పని మీద భూషణం పొరుగూళ్లకి వెళ్తుండేవాడు. అలా ఒకసారి పాలకొల్లు ప్రాంతంలో తిరుగుతూ ఒక నడివయస్కురాలికి దగ్గరవుతాడు.

                              ‘’మనుషులు ఎల్లకాలమూ రాముడి భజనలు, శివుడి పూజలు చేసి చేసి విసుగొచ్చి సత్యసాయి, షిరిడి సాయి వంటి కొత్తకొత్త దేవుళ్ల అవతారాలను పూజించటం మొదలెట్టినట్టే భూషణం కూడా కొత్త ప్రేమను వెతుక్కున్నా’’డంటారు రచయిత్రి.

లచ్చుప్ప అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతని జీవితంలో కొత్త స్త్రీని చూస్తుంది. అతను లచ్చుప్ప పట్ల తన అభిమానం చెక్కుచెదరనట్టే ప్రవర్తిస్తాడు. అయినా ఆ స్త్రీ పట్ల కూడా బాధ్యత ఉన్నట్టే కనిపిస్తాడు. విషయం ఏమిటని లచ్చుప్ప నిలదీసినపుడు, తామిద్దరి మధ్యా శారీరక సంబంధం ఏర్పడటంతో ఊరిపెద్దలు ఆమెను పెళ్లి చేసుకోవలసిందేనని పంచాయితీ పెట్టారనీ, చేసుకోక తప్పలేదనీ ఒప్పుకుంటాడు.                 లచ్చుప్ప తనకి, భూషణానికి మధ్య నమ్మకం మినహా పెళ్లి అనే బంధం ఎప్పుడూ కోరుకోలేదు. తన వాడనుకున్న వాడు పరాయి వాడైపోయాడని దుఃఖంతో మనసును రాయి చేసుకుని లచ్చుప్ప వెనక్కి వెళ్లిపోతుంది. భూషణం నిస్సహాయంగా ఏడుస్తాడు.

                                  జీవితమనే అద్భుత వరాన్ని నలుగురికీ ఉపయోగపడేట్టు మలచు కుని, బ్రతుకు సార్థకం చేసుకోవాలనుకుంటుంది లచ్చుప్ప. ఆమె సంస్కారం సమాజ శ్రేయస్సునే జీవన మార్గం చేసుకునేలా చేస్తుంది. ఊళ్లో ఉన్న పేద పిల్లల్ని బడుల్లో చేర్పించేలా పెద్దలకి నచ్చజెప్తుంది. ప్రభుత్వం గ్రామాల అభివృధ్ధి కోసం చేసే కార్యక్రమాల్లో లచ్చుప్ప భాగస్వామి అవుతుంది. ఊరి మహిళా మండలి అధ్యక్షురాలిగా లచ్చుప్పను ఎన్నుకుంటారు. క్రమంగా గ్రామంలో అభివృధ్ధి పనులకు, వయోజన విద్యకు లచ్చుప్ప సారధ్యం వహిస్తుంది. గ్రామం పురోగమన దారిలో నడవటం మొదలెడుతుంది. లచ్చుప్ప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికవుతుంది. ఆ పంచాయితీ రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయితీగా బహుమతి అందుకోవటంతో కథ ఆరంభమవుతుంది.

                                    ఒకనాడు అకస్మాత్తుగా భూషణం మరణవార్త అందుతుంది. లోకమంతా తనదిగా చేసుకున్నప్పుడు భూషణం మాత్రం తనకు కానివాడెలా ఔతాడని ఆలోచించి అతని ఆఖరి ఘట్టం చూసేందుకు వెళ్తుంది. ఏ ఉద్వేగం, దుఃఖం లేకుండా రాగద్వేషాలకు అతీతమైన మానసిక స్థితికి ఆమె చేరుతుంది.

నిరుపేద గ్రామీణ కుటుంబంలో, సామాజికంగా వెనుకబడిన వర్గంలో పుట్టి జీవితంలో ఎదురైన ఆశాభంగాలకు, అవమానాలకు కృంగిపోకుండా నలుగురి మంచిని కాంక్షించే సహృదయగా మారిన లచ్చుప్ప పాత్ర ఆదర్శవంతమైనది.

మూడో కథ ‘’మాకు రావు సూర్యోదయాలు’’

                                   ఆ రోజు బాలసదనం సూపర్నెంటు హేమలత సదనంలోని ఆడపిల్లల్ని దైవ దర్శనానికి తీసుకొస్తుంది. స్త్రీ సంక్షేమ విస్తరణాధికారిగా పనిచేస్తూన్న తారాదేవి హేమలత చిన్ననాటి స్నేహితురాలు. ఆమె కూడా అక్కడికి వస్తుంది. ఆ పిల్లలలో అందమైన పిల్లను చూసి తాను ఎనిమిదేళ్ల క్రితం సదనంలో చేర్పించిన శ్యామలగా గుర్తించి, ఆమె పట్ల ప్రేమను వ్యక్తపరుస్తుంది తార. 

క్రిస్మస్ సెలవుల్లో శ్యామలను తన ఇంటికి తీసుకెళ్లి అపురూపంగా చూసుకుంటుంది తార. వేసవి శెలవులయ్యాక శ్యామలను తన ఇంటి దగ్గర్లోని హై స్కూల్లో చేరుస్తానంటుంది. భవిష్యత్తు గురించిన కలలతో శ్యామల సదనానికి వెళ్లిపోతుంది.

                                   తారాదేవి పై మనసుపడిన ఒక పెద్ద వ్యాపారి పాపిరెడ్డి ఆమెను చేరదీస్తాడు. నలుగురు పిల్లల తండ్రి అయిన పాపిరెడ్డి తారాదేవితో వారాంతాలు గడుపుతూ ఆమెకు ఒక హై క్లాసు జీవితాన్ని అమరుస్తాడు. రెడ్డితో కలిసి జీవించటం మొదలైన కొద్దికాలానికే తారలో ఒక అశాంతి మొదలవుతుంది. అది భర్తీ చేసుకుందుకు భారీగా ఖర్చుకు అలవాటుపడుతుంది. ప్రభుత్వం పేదలకోసం ఇస్తున్న రుణాలను రెడ్డి, తార కలిసి వసూలు చేసుకుని, ఆ డబ్బుని వడ్డీలకు ఇస్తూంటారు.

డబ్బు గురించిన వెంపర్లాటలో తారకి తనపై అధికారి శేషగిరి స్నేహం కలుస్తుంది. స్వంత ఊళ్లో కుటుంబాన్ని పెట్టి అతను ఉద్యోగరీత్యా ఒంటరి జీవితం గడుపుతున్నాడు.  ప్రభుత్వ నిధుల్ని దోచుకోవటంలో ఘనుడు. తారకి తన ఉద్యోగ బాధ్యతగా పేద వర్గాల స్త్రీల కోసం మహిళా సంఘాలు ఏర్పాటు చెయ్యటం, లేబరు కాలనీలకు వెళ్లి పని చెయ్యటం చిరాకు. తార, శేషగిరి దగ్గరవుతారు. అతని సాహచర్యంలో తారకి అనాకారి, వయసు పైబడిన వాడు అయిన రెడ్డి పట్ల అసహనం మొదలవుతుంది. తార, రెడ్డిల కొడుకు నిరంజన్. తల్లి కోసం ఇంటికి వచ్చిపోతున్న శేషగిరి వ్యవహారం తండ్రికి చెపుతాడు.

తార ప్రోద్బలంతో శ్యామల సదనం వదిలి శాశ్వతంగా తార ఇంటికి వచ్చేస్తుంది. ఇంటి పనులు, వంట పనులు చేస్తూ తారను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్న శ్యామలకు అలంకరణ సామగ్రి బహుమతిగా ఇస్తుంటుంది తార. శేషగిరితో తార వ్యవహారం శృతి మించుతోందని తారను గట్టిగా హెచ్చరించి ఆమెను వేధించటం మొదలెడతాడు రెడ్డి. అతన్నుండి తప్పించుకుందుకు క్యాంపుల పేరుతో శేషగిరితో తిరుగుతుంటుంది తార. రెడ్డి పనులు చూసేందుకు అమాయకురాలైన శ్యామలను నియోగిస్తుంది. రెడ్డి శ్యామలను లోబరచుకుంటాడు. నిరంజన్ శ్యామల ఉనికిని ఇంట్లో భరించలేక తిరిగి సదనానికి పంపెయ్యమని తల్లికి చెపుతాడు.

ఇంట్లో ఘర్షణల వల్ల శ్యామలను తార ఇంటి నుంచి తప్పించి రెడ్డి తన మిల్లుకు చెందిన గెస్ట్ హౌస్ కి వెళ్లిపోతాడు. రెడ్డి దూరమైతే ఆయన ద్వారా వచ్చే ఆస్తులు పోతాయన్న దిగులుతో కొడుకు అనారోగ్యం కారణంగా చెప్పి ఇంటికి రప్పిస్తుంది తార. శ్యామల మకాం గెస్ట్ హౌస్ నుంచి కొబ్బరి తోటలో ఉన్న చిన్న కుటీరంలోకి మారుస్తాడు రెడ్డి. నెమ్మదిగా రెడ్డి తనను తప్పించుకుని తిరగటం గమనించిన శ్యామల తనకు రాసిస్తానన్న ఆస్తిని ఇమ్మంటుంది. రెడ్డి కోపంతో శ్యామల నోరు మూయిస్తాడు. తారతో కలిసి ఆలోచించి శ్యామలను తార ఇంటికి తీసుకొస్తాడు. జీతం, బత్తెం లేని పనిమనిషిలా ఆ ఇంట దీనమైన స్థితిలో కొన్నాళ్లు గడుపుతుంది. ఇంట్లోనూ, ఇరుగుపొరుగు వారు కూడా హీనంగా చూస్తున్నారన్న నిజం ఆమె భరించలేకపోతుంది.                            

                            శ్యామల చిన్నపిల్లగా సదనంలో ఉన్నప్పుడు చదువుకున్న వారి పట్ల అంతులేని ఆరాధనతో ఉండేది. వాళ్లకి గొప్ప మనసులుంటాయని పేదలపట్ల అభిమానం, ఆదరణ ఉంటాయని నమ్మేది. తారాదేవి వలన తన జీవితానికి ఒక ఆలంబన దొరికిందని సంబరపడిన శ్యామల ఆమె స్వార్థానికి బలి అయిపోయింది. పదహారేళ్ల వయసులోనే మనుషుల్లో వంచన, దోపిడీని చూస్తుంది. ఎవ్వరి మీదా ఆధార పడకుండా తనంత తానుగా కష్టపడి బ్రతికేందుకు నిర్ణయించుకుంటుంది.

తార ఇంటినుంచి తప్పించుకుని, ఎరుకల గూడెంలో తన తండ్రి బంధువుల దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడే ఒక హోటల్ లో పని దొరుకుతుంది శ్యామలకి. ఆమెతో పనిచేసే షణ్ముగం ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అంతలోనే అతని తండ్రి వచ్చి తమ ప్రాంతంలోనే హోటల్ పెట్టుకుందామని చెప్పి కొడుకుని తీసుకెళ్తాడు. భర్త తిరిగి రాకపోవటంతో శ్యామల జీవితం మరింత దుర్భరమవుతుంది.

తోటివారి అవహేళనలు భరించలేక శ్యామల తిరిగి ఎరుకల గూడెం చేరి కూలి పనులకెళ్తూ, పనులూ లేనినాడు పస్తులతో గడుపుతుంది. జీవిక కోసం క్రమంగా గూడెంవారి సలహాతో తన శరీరాన్నే వ్యాపార దినుసుగా చేసుకుంటుంది.

                                       ‘’గొప్పోళ్ల లాగా శ్యామల చుట్టూ ఉన్నవారికి నీతులు, కట్టుబాట్లు ఉండవు. వాటిని గురించి ఆలోచిస్తుంటే కడుపులు నిండవు.’’ అంటారు రచయిత్రి. పరపతీ, డబ్బు, హోదా కావాలనుకునే గొప్పవాళ్లు కూడా నీతి, న్యాయం వదిలిపెట్టక తప్పదన్నది కథలో స్పష్టంగా చూసాము.

                         సమాజ వికృత రూపం ఈ కథలో కనిపిస్తుంది. మనుషుల్లో ఉండే నీచత్వం, బలహీనుల్ని పావుల్ని చేసుకుని తమ పబ్బం గడుపుకునే స్వార్థం, అమానవీయత కనిపిస్తుంది. బలహీనుల జీవితాల్లో సూర్యోదయాలు ఎలా వస్తాయి?                 ఈ కథ 1985 లో ఆంధ్రప్రభలో వచ్చింది. సమాజపు వాస్తవ జీవన దృశ్యాన్ని ఇది ప్రతిఫలిస్తోంది. సమాజం మారిపోతోందంటాం. సమాజం మనుషుల సమూహమైనప్పుడు, అది ఏ కాలమైనా, ఏ ప్రాంతమైనా ఒకేలా ప్రవర్తిస్తుందన్నది నిజం. మనిషి ప్రవర్తన సార్వజనీనమన్నది మళ్లీ మళ్లీ నిరూపించబడుతూనే ఉంటుంది.

తొమ్మిది దశాబ్దాల జీవితాన్ని పరిశీలనగా చూస్తూ సమస్యలెదురైనపుడు ధైర్యంగా, పరిష్కార దిశగా పరిపూర్ణ గారు నడిచి చూపిన దారులన్నీ మనం ఆమె ఆత్మకథలో చూసాము. ఆమె ఒక వ్యక్తి కాక విశ్వంలోని శక్తినంతా ఆవాహన చేసుకున్న ధీర అనిపిస్తుంది. ఇప్పటి జీవితాల్లోని వేగం ఒక్కక్షణం నిలబడి ఆలోచించలేని వ్యక్తులని తయారు చేస్తోంది. ఓటమి, సమస్య ఎదురైనప్పుడు బాధ్యతను తీసుకోలేని అసహనం, అవివేకం, ఆగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పటి యువతరంలో. అలాటివారికి ఆమె జీవితం మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇలాటి వ్యక్తుల జీవితాలు సమాజానికి విలువని, బలాన్ని చేకూర్చిపెడతాయని చెప్పచ్చు.

తొంభై రెండో పుట్టిన రోజు జరుపుకోబోతున్న సమయంలో ఆమె గురించి ఏదైనా రాయాలన్న ప్రయత్నం! కానీ, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి అన్నది తెలియనే లేదు.

                           పరిపూర్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆమెను అభినందిస్తూ…

* * *     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.