“#మీ టూ” కథలు – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Apr. 2022

* * *

                                                      

                                                                                         సంపాదకత్వంః కుప్పిలి పద్మ

                                సమాజంలో అర్థభాగం స్త్రీలదే అయినా ఆమె పట్ల ప్రపంచం చూసే చూపులో ఏదో తేడా ఉంటూనే ఉంది. ఇదొక సంప్రదాయంగా వస్తోంది. చదువుకుని, అన్ని రంగాల్లోకి విజయవంతంగా అడుగులేస్తున్న స్త్రీ ఎదుర్కోవలసిన సవాళ్లు మరిన్ని తయారవుతున్నాయి. అయినా నడక మానలేదు. తానేమిటో నిరూపించుకుంటూనే ఉంది. ఆమె సమస్యలకు, అవమానాలకు, అవహేళనలకు ఒక రంగం, ఒక వర్గం, ఒక ప్రాంతం అంటూ పరిధులు లేవు. ఇలాటి సమతుల్యతను కాపాడుతున్న సమాజాన్ని అభినందిద్దామా?!

ఉన్నతోద్యాగాల్లో ఉన్నవారి దగ్గర నుంచి నిరుపేద స్త్రీ వరకూ అందరూ బాధితులే. ఏ భేదాలు లేనిది ఒక్క వివక్షకే. స్త్రీకి పర్యాయ పదం వివక్షేనా?! పితృస్వామ్య సమాజం చెప్పిన తీర్పులు కాలాలను, ఖండాలనూ అధిగమించాయి. స్త్రీని బలహీన పరిచే ప్రయత్నంలో తన బలాన్ని నిరూపించుకుంటోంది వ్యవస్థ. “మీ టూ” ఉద్యమం భారతదేశంలో 2018లో మొదలైంది.

                              ఈ నెల పుస్తకం ‘మీ టూ” కథా సంకలనంలో స్త్రీ ఎదుర్కొంటున్న హింసను రకరకాల పార్శ్వాలనుండి పదమూడు మంది రచయిత్రులు చెప్పిన కథలున్నాయి. దశాబ్దాలుగా రాస్తున్న రచయిత్రుల నుంచి మొదటి కథతో సంకలనంలో చేరిన రచయిత్రుల వరకూ ఉన్నారు. సంపాదకురాలు సుప్రసిద్ధ రచయిత్రి కుప్పిలి పద్మ.

ఆమె తన ముందుమాటలో నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టటం “మీ టూ” వుద్దేశ్యం అని చెప్పారు. హింసని మౌనంగా భరిస్తున్నంత కాలం దానికి కారకులైనవారికి బలాన్నిచ్చి, పోషిస్తూనే ఉంటాం. బయటపడాలంటే నోరు విప్పక తప్పదంటారు.               

                                  ఇప్పుడిప్పుడు పురుష హృదయాల్లో కొంత మార్పు వచ్చి స్త్రీల సమస్యలను అర్థం చేసుకుంటూ, వారి పట్ల స్నేహ దృష్టితో చూస్తున్నారంటారు సంపాదకురాలు. ఇది చాలా తక్కువ శాతమే. పైగా హింస కొత్తకొత్త రూపాలను సంతరించుకుంటోంది. ప్రశ్నించి, నిలదీసిన ప్రతిసారీ చట్టాలు తయారవుతున్నాయి కానీ పురుషుల ఆలోచనల్లో ఆధిపత్య భావాలు అనేక కొత్త రూపాల్లో వేధిస్తూనే ఉన్నాయి.  

సంకలనంలో అన్ని కథలకూ కథా వస్తువు ఒక్కటే. సాధారణంగా కథలన్నీ ఒకే వస్తువుతో ఉన్నప్పుడు పాఠకుడుకి అసహనం కలిగే ప్రమాదం ఉంది. కానీ, సమాజపు అన్ని దశల్లోనూ, వర్గాలలోనూ, నేపథ్యాలలోనూ, ప్రాంతాలలోనూ స్త్రీకి ఎదురయ్యే సమస్య ఎన్ని రూపాలతో విస్తరిస్తోందో తెలియాలంటే ఇవన్నీ ఒకేసారి చదవటం అవసరమంటారు పద్మ. హింసని గురించి మాట్లాడుతున్నాం. మరి పరిష్కారం మాటేమిటి? 

                                 ముందుగా సెల్ఫ్ సెంటర్డ్ నెస్ వదిలించుకుని ఒక సామూహిక స్వరాన్ని వినిపించే ప్రయత్నంగా మన ప్రపంచాల్ని విశాలం చేసుకుని, స్త్రీ పురుషుల మధ్య సమ సంబంధాలను ఏర్పరుచుకోగలిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆమె అంటారు. “మనం ప్రపంచం కోసం మాట్లాడితే ప్రపంచం మనకోసం మాట్లాడుతుంది” అన్నది సంపాదకురాలి విశ్వాసం. సృష్టిలోని జీవరాసులన్నింటి మధ్యా సహజంగా అమరిన సమన్వయం మనుషుల మధ్య కరువవటం విశ్లేషణకు అందదు.

కథలకు పేర్లను ప్రత్యేకంగా ఇవ్వలేదు. రచయిత్రుల పేర్లను మాత్రమే విషయసూచికకూ, కథకు ముందూ సూచించారు. ఇదొక కొత్తదనం. అస్తిత్వ పోరాటానికి అనువుగా ఉంది.

మొదటి కథ ఊడుగుల జరీనా రాసిన కథ. రచయిత్రి మొదటి కథ.

డోలాముఖి డాక్టర్. ఆమెది ప్రేమ వివాహం. భర్త కోరిక మీద వృత్తిని వదిలి ఇంటికి పరిమితమౌతుంది. మొదటిసారి భర్త హింసాత్మక ప్రవర్తన డోలాముఖిని పుట్టింటికి వెళ్లిపోయేలా చేస్తుంది. ఆమె తల్లి భర్త హింసను మౌనంగా భరిస్తున్న నిస్సహాయ. తండ్రి మాత్రం అల్లుడికి క్షమాపణ చెప్పి డోలాను భర్తతో పంపించేస్తాడు. పెళ్లైన ఆడపిల్లకి భర్త ఇల్లే సరైనదంటూ, అలా రావద్దని చెప్తాడు. ఆమె హింసను భరిస్తూనే ఉంది. భరించలేనపుడు చెల్లెలి దగ్గర ఆశ్రయం తీసుకుంటూంటుంది. భర్త వచ్చి మారానంటూ వెనక్కి తీసుకెళ్తూనే ఉన్నాడు. మళ్ళీ మళ్లీ అదే హింస. ఆ హింస తట్టుకునే ఓర్పు లేదని నిశ్చయించుకున్న డోలా ఎదురింటి స్నేహితురాలిని సాయంతో తన ఊరు వెళ్లిపోతుంది.

సాయం అందించిన ఎదురింటామె డోలా తీసుకున్న నిర్ణయం సరైనదనుకుంటూ, తన తల్లి జీవితాన్ని తలుచుకుంటుంది. తండ్రి కంటే ఎక్కువ కష్టపడుతూ ఇంటిని నడిపే తల్లి అతని చేతిలో హింస మౌనంగా భరిస్తూనే ఉండేది. తన తల్లి ధైర్యం చేసి భర్తని వదిలి వెళ్లిపోయి ఉంటే ఎలా ఉండేదని ఆలోచించుకుంటుంది. పురుషుడు అతి సునాయాసంగా స్త్రీ పై చేసే హింస. తరాలు మారుతున్నా మారని కథ.

కథనం సునాయాసంగా నడిచినా, కథలో మరింత బిగువు అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మరింత చిక్కని కథలు రాస్తారని ఆశ.

రెండవ కథ ఝాన్సీ పాపుదేశి రాసినది.

దేవుడి పేరుతో ఆడపిల్లల్ని మాతమ్మలను చేసి ఊరికి అర్పించే మూఢనమ్మకం ఎన్ని ప్రభుత్వాలొచ్చినా ప్రజల్లోంచి మాయమవటంలేదు. వాడలో ఉండే గంగను మాతమ్మగా మార్చింది ఆమె కుటుంబం. ఆరోగ్యం పాడైన తన కూతురు దీప బతికి బట్టకడితే ఆమెను మాతమ్మను చేస్తానని గంగ మొక్కుకుంది. సమర్త కాగానే తనను మాతమ్మను చేస్తారని, తను దేవతగా మారిపోతుందని తల్లి చెప్పగా వింటున్న దీప మాతమ్మ అయిపోయింది. మాతమ్మగా మారిన రోజే ఆమెను వేలంపాటలో కొనుక్కుని సుబ్బయ్య స్వంతం చేసుకుంటాడు. అందరూ కొలిచే దేవతగా మారిపోతాననుకున్న దీపకి జరిగిందేమిటో తెలవారి అర్థమై ఏడుస్తుంది. దేవుడి పనికి ఏడవకూడదంటుంది తల్లి. మాతమ్మగా నరకం చూస్తుంది దీప.

స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న శ్రావణి దేవుని పేరుతో జరుగుతున్న మోసం గురించి వీధి నాటకం ద్వారా చెప్పటంతో దీపకు తనకు జరిగిన అన్యాయం అర్థమవుతుంది. ఊరి ప్రజల ప్రతిఘటన నుంచి తప్పించి దీపను రీహాబిలిటేషన్ సెంటర్ లో చేరుస్తుంది శ్రావణి. మాతమ్మల, జోగినిల పేరుతో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి పూణేలో జరుగుతున్న మీటింగ్ లో ధైర్యంగా మాట్లాడమని దీపను ప్రోత్సహిస్తుంది. దానివలన తనకు మంచి ప్రాజెక్టు వస్తుందని చెప్తుంది.

“మీటూ” ఉద్యమం గురించి పేపర్లో చదివి, అనుమతి లేకుండా ఆడదాన్ని తాకిన వాళ్లపై కేసులు పెట్టచ్చని తెలుసుకున్న దీప తనకి అక్కడ స్థానం లేదా అని అడిగినపుడు శ్రావణి నిట్టూరుస్తుంది. సినిమా యాక్టర్లు, గొప్పోళ్లు మాత్రమే మాట్లాడ్తారా అక్కడ? మాలాంటోళ్ల కథలు ఎవరికి వద్దా? మా మానాలు, ప్రాణాలు పనికిరానివేనా అంటూ దీప విశ్లేషిస్తుంది. దీపను స్టేజ్ మీద తన కథను చెప్పమన్నప్పుడు పెద్దింటోళ్ళ కష్టాలే అందరి కష్టాలు కావని, తనలాటి వారి కష్టం అందరిదీ అయినప్పుడే తన కథను చెప్తానని గట్టిగా ఆవేశంగా చెప్తుంది.

రచయిత్రి నగర నివాసం, ఉన్నత విద్య, వృత్తి పరమైన జీవితం గమనించి ఆమె మాండలికంలో ఇంత అందమైన కథలు రాయటం ఒక అద్భుతం అనుకుంటాను. ఆమె కథ “నీరుగట్టోడు” చదివినప్పుడు ఇదే అభిప్రాయాన్ని ఆమెతో పంచుకున్నాను. తక్కువగా రాస్తున్నా నాణ్యమైన కథలను ఇస్తున్న ఝాన్సీ గారికి అభినందనలు.

మూడవ కథ సుజాతా వేల్పూరి రాసిన కథ.

మహి కి తన పక్కింటి కుటుంబంతో మంచి స్నేహం కుదురుతుంది. ఆ ఇంట్లో వీల్ ఛైర్ లో ఉన్న భార్యకు తలదువ్వి, ప్రేమగా చూసుకునే వయసుమళ్లిన పెద్దాయన ఉన్నాడు. కొడుకు, కోడలుతో కలిసి ఉంటారు. ఆ కుటుంబంలోని కోడలు రితిక మహికి దగ్గరవుతుంది. ఆ పెద్దాయన, పెద్దావిడ మహి ని చూసి తమ కుమార్తె గుర్తొస్తోందంటూ పిన్నీ, బాబాయ్ వరస పెట్టి పిలిపించుకుంటారు. బాబాయ్ భార్య పోయినపుడు ఆయనను ఆత్మీయంగా ఓదారుస్తుంది మహి. ఒకరోజు ఆఫీసు నుంచి వచ్చి, ఇంట్లో పాలు లేవని పక్కింటి కెళ్తుంది మహి. ఆ సమయంలో బాబాయ్ ఒక్కడే ఉంటాడు ఇంట్లో. కలిసి కాఫీ తాగుదామంటాడాయన. కాఫీ కలిపి తెచ్చిన మహి ని సెక్సీగా ఉన్నావంటూ తన కోర్కెను సూటిగానే చెప్పేస్తాడు. మహి తను విన్నదేమిటో కాస్సేపు అర్థం చేసుకోలేకపోతుంది. ఆయన తన ఒంటరితనం గురించి చెప్తూ, భర్త నైట్ షిఫ్ట్ లతో బహుశా మహి కోరికలు తీరక బాధ పడుతూ ఉండుంటుందని ఆమెను ఒప్పుకొమ్మంటాడు. విస్మయం, అసహ్యం కలగలిసిన భావాలతో మహి స్తబ్దురాలై పోతుంది. ముందడుగు వెయ్యబోతున్న అతడిని అడ్డుకుందుకు చేతికందిన వస్తువుతో గాయపరచి ఇంటికి పరుగెడుతుంది. ఆక్షణంలో ఇంట్లోకి వచ్చిన రితిక ప్రశ్నకు మహి జవాబివ్వదు. భర్తకీ చెప్పుకోలేకపోతుంది ఈ అవమానాన్ని.

రితిక వచ్చి ఆ పెద్దాయనకు కంటి దగ్గర దెబ్బ తగిలిందని చెప్తుంది. ఆయన ఎంత దారుణంగా ప్రవర్తించాడో మహి చెప్తుంది. రితిక మాత్రం” నేను కొట్టలేకపోయాను” అంటూ మహి ని హగ్ చేసుకుంటుంది. మర్యాదస్తులనుకునే కుటుంబాలలో ఇలాటి వికృత సంఘటనలు, అత్యాచారాలు నిశ్శబ్దపు కార్పెట్ కింద ఎన్నెన్నున్నాయో!? ఎందర్ని హింసిస్తున్నాయో!? నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాల్సిందే. సహజమైన వాతావరణంలో చిక్కగా చెప్పిన కథ.

నాల్గవది దేవికా రెడ్డి కథ.

రచయిత్రి మొదటి కథ. మీడియారంగంలో ఉండటం, తెలుగు సాహిత్యం, జర్నలిజం చదువుకోవటం, రాయటం వృత్తిగా కూడా ఉండటం వల్ల కాబోలు కథ ఒక ప్రవాహంలా నడిచిపోయింది. ఏ రంగమైనా వివక్షకు మినహాయింపు కాదన్నది స్పష్టంగా చెప్పారు. కూతురు మీడియా రంగంలో ఎదుర్కొంటున్న వివక్ష, దాని తాలూకు నిరాశ చూసిన తల్లికి తన వృత్తి జీవితంలో పాతిక ముఫ్ఫై ఏళ్లనాడు ఎదుర్కొన్న సంఘటనలను జ్ఞాపకం వస్తాయి. ఇప్పటి తరం ఆడపిల్లలకు చాలా విషయాల్లో ఆంక్షలు లేవు. ఇళ్లల్లో పెద్దవాళ్ల మితిమీరిన అదుపాజ్ఞలు లేవు అనుకున్నా ఎక్కడికక్కడ ఏదో కారణంగా వివక్ష అమలవుతూనే ఉంది. అన్ని రంగాల్లో ముందుకొస్తున్న ఆడపిల్లల్ని ప్రోత్సహించాల్సింది పోయి ఏదో ఒక రకమైన సాధింపు కనిపిస్తూనే ఉంది. మరిన్ని వాస్తవ జీవిత గాథల్ని మనకి చెప్తారని ఆశిద్దాం.

ఐదవది కుప్పిలి పద్మ రాసిన కథ. వీరికి ఎలాటి పరిచయం అవసరం లేదు. ఎన్నో కథా సంపుటాలు, కవిత్వ సంపుటాలు, నవలలు వెలువరించారు.

మీర కెరీర్ ని పర్సనల్ గ్రోత్ గా భావించే అమ్మాయి. తన తల్లి మృణాలిని అలా భావించదని తప్పు పడుతుంటుంది. కూతురు కెరీర్ విషయంలో క్యాట్ రేస్ లో భాగమైందని మీర తల్లి గమనిస్తూంటుంది. అయితే కూతురిని స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పెంచటం వల్ల ఏమీ సలహాలు ఇచ్చే ప్రయత్నం చెయ్యదు. ఆఫీసులో కొత్తగా చేరిన మానస ప్రస్తుతం తన బాస్ కి దగ్గరవుతోందని, తనకు రావలసిన ప్రాజెక్ట్ ఆమెకు ఇస్తున్నారని, అది తన కెరీర్ గ్రోత్ కి అడ్డుపడుతోందని తల్లితో చెప్తుంది మీరా.

మృణాలిని క్లాస్ మేట్ నిఖిత రెండు మూడు దశాబ్దాల క్రితం యూనివర్సిటీలో ప్రొఫెసర్ తనను వేధించాడంటూ ‘మీ టూ” పోస్ట్ పెట్టటం చూపిస్తుంది మీరా. ఆ విషయం తెలుసా అంటూ తల్లిని ప్రశ్నిస్తుంది. అప్పట్లో నిఖిత ఆ ప్రొఫెసర్ కు క్లోజ్ గా ఉండేదని, కానీ మరొక అమ్మాయి అతనికి సన్నిహితమయ్యేసరికి నిఖితను దూరం పెట్టాడని, దానిని మరిచిపోకుండా నిఖిత ఇప్పుడు ‘మీ టూ’ పోస్ట్ పెట్టీందని తల్లి వివరిస్తుంది.

బాస్ ని ‘మీ టూ” తో బెదిరిస్తే ప్రాజక్ట్ తనకి దొరుకుతుందేమో అంటుంది మీరా.  

మార్కులు, కెరీర్ కోసం శరీరాన్ని యెర వెయ్యటమేమిటని, ఆత్మగౌరవంతో పాటు శరీరాన్ని ప్రేమించి గౌరవించటం ముఖ్యం కాదా అని కూతురిని అడుగుతుంది మృణాలిని. నిఖితలాగా ఏళ్లతరబడి మనసులో అవమానాన్ని మోసే స్థితి వద్దని, స్వశక్తిని నమ్ముకొమ్మని కూతురికి చెప్తుంది.

కాలేజీలో మృణాలిని తన స్టూడెంట్ల చేత చదివించే పుస్తకాల గురించి కాలేజీ యాజమాన్యం ఆమెను ఎక్స్ప్లనేషన్ అడుగుతారు. లేనట్టైతే ఆమెను సస్పెండ్ చేస్తామంటున్న కాలేజీ యాజమాన్యాన్ని నిరసిస్తూ స్టూడెంట్లంతా మృణాలిని కోసం ప్రొటెస్ట్ చేస్తారు. ఇంతమంది తల్లికో సం ముందుకు రావటం మీరా నమ్మలేకపోతుంది.

మనం ప్రపంచం కోసం నిలబడితే ప్రపంచం మనకోసం తప్పక నిలబడుతుందనే తల్లిదండ్రుల మాటలకు మీరా ఆలోచనలో పడుతుంది. మృణాలిని తను నమ్మినదాన్ని మరింత నొక్కి చెప్తూ, అలాటి ఒక స్ట్రీమ్ ఒకటి మన పక్కనే ఉంటుందని, ఆవైపు చూడవలసిన బాధ్యత మనదే అంటుంది. ఈ కథ చదువుతుంటే ఈ రచయిత్రి రాసిన ప్రసిద్ధ కథ ‘లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్’ గుర్తు రాక మానదు.

ఆరవ కథ ఎండపల్లి భారతి రాసినది.

ఎండాకాలంలో ఆ ప్రాంతంలో గొడ్లకి గడ్డికి కరువు. ఊరంతా ఎక్కడా గడ్డి దొరకదు. నీటి సదుపాయమున్న పెద్ద రెడ్డి భూముల్లో గడ్డి దొరుకుతుంది. కానీ చిన్రెడ్డి తమ భూముల్లో కొచ్చిన ఏ స్త్రీని కూడా విడవడు. వారి ఇష్టాయిష్టాలతో, అనుమతితో సంబంధం లేకుండా తన కోరిక తీర్చుకుంటుంటాడు. ఆ విషయం అందరికీ తెలిసినదే అయినా ఎవ్వరూ నోరు విప్పరు. తనకైతే తినేందుకు ఏదో ఒకటి ఉంది కానీ తన గొడ్లకి తినేందుకు ఏమీ లేదని దిగులు పడుతుంది కథలోని యువతి. స్నేహితురాలు నర్సి తో కల్సి ఆమె పెద్ద రెడ్డి చెరుకుతోటకి వెళ్తుంది. చిన్రెడ్డి కళ్ల పడిన నర్సి ఇబ్బందిరోజులని చెప్పి తప్పించుకుంటుంది.

దారిలో ఎదురైన అరవై ఏళ్ల నాగవ్వను పలకరించి, ఆరోజు చెరుకుతోటలో ఎదురైన విషయం చెప్తుంది నర్సి. నాగవ్వ నెలరోజుల క్రితం తనని ఆ చెరుకుతోటలో చిన్రెడ్డి బలవంతం చేసి అనుభవించాడని అప్పట్నుంచి జ్వరంతో బాధ పడుతున్నానని చెప్తుంది. అవమానంతో ఎవరికీ చెప్పుకోలేక తనలో తనే యాతన పడుతున్నానంటూ వారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. ఆ చెరుకుతోటకి నోరు ఉంటే చిన్రెడ్డి పాలబడ్డ వారి గురించి ఊరంతా చాటి ఆడవాళ్ల మానాన్ని మరొకసారి తీసేవని అనుకుంటారు ఆ యువతులు. వారి గుండెలు దుఃఖంతో బరువెక్కుతాయి.

నిత్యం మీడియా లో వస్తున్న ఇటువంటి వార్తలు గాలిలోంచి పుట్టటం లేదన్నది వాస్తవం.  హింసకి ఎన్నెన్ని రూపాలో! ఈ రచయిత్రి రాసిన “ఎదారి బతుకులు”కథా సంపుటి తెలుగు పాఠకులు మర్చిపోలేరు. సమాజంలోని అట్టడుగు వర్గ జీవితాల్ని నిజాయితీగా చెప్పగల గొప్పకళ ఆమె స్వంతం.

ఏడవ కథ సాంత్వన చీమలమర్రి రాసినది. ఇది ఆమె మొదటి కథ.

“పెన్ తో రాయటం ఓ గొప్ప ఉత్సవంగా ఉండే రోజుల్లో” ఆమె చదువుకున్న స్కూల్ కి వచ్చాడు ఆ ఇంగ్లీష్ టీచర్. అతని భాషకి, కోట్స్ కి, అసైన్ మెంట్లకి నల్లసిరాతో అతను రాసే అందమైన కామెంట్లకీ అమ్మాయిలంతా ఫిదా అయిపోయారు ఆ పాతికేళ్ల కుర్ర టీచర్ కి. కొత్త స్నేహాన్ని, అనుబంధాన్ని పెంచుకుంది “ఆమె” అతనితో. అంతలోనే ఒక రోజు బస్ దిగి స్కూల్లోకి వెళ్లకుండానే అతను రిజైన్ చేసి వెళ్లిపోయాడన్న వార్త. కారణమెవరో, ఏమిటో తెలియక దిగులు పడిపోయింది. నల్లసిరా అంటే ఆరాధన అలా ఉండిపోయింది.

పెద్దై, వృత్తిరీత్యా అటెండైన ఒక కాన్ఫరెన్స్ లో స్టేజ్ పైన హుందాగా, ఆత్మవిశ్వాసం తో కనిపించింది ఆనాటి క్లాస్ మేట్ తులసి. అప్పట్లో అందరి దృష్టిలో ఇంగ్లీషు రాని, నాగరికత తెలియని పల్లెటూరి పిల్ల!

కాన్ఫరెన్స్ నాటి సాయంత్రం ఆ క్లాస్ మేట్స్ కలబోసుకున్న కబుర్లలో తులసి ఒక వాస్తవం చెప్తుంది. ఆ పర్వర్టెడ్ ఇంగ్లీష్ టీచర్ తులసిపైన, ఇంకా ఆమెలాటి హాస్టల్ లో ఉన్న అమ్మాయిల పట్ల చేసిన హింస! అది ఎవరితోనైనా చెప్పుకుందామన్నా తమను ఎవరూ నమ్మరంటూ అతను బెదిరించి, చూపించిన నరకం చెప్పుకొస్తుంది. ఆ చేదు అనుభవం తనను రాటుతేల్చి తర్వాత రోజుల్లో చదువులో, కెరీర్ లో ఎలా తీర్చిదిద్దిందో చెప్పిన తులసి మాటలు విని నల్లసిరాను ఆరాధించిన “ఆమె” అసహ్యంతో తన బ్యాగ్ లోని నల్లసిరా నిండిన పెన్నుల్ని విరిచేస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో అభం శుభం తెలియని చిన్నారుల పట్ల ఇలాటి రాక్షసుల వికృతచేష్టల్ని మౌనంగా, భయంగా భరిస్తున్న చిన్నారులకో హెచ్చరిక ఈ కథ. క్లుప్తంగానే అయినా బలంగా చెప్పిన కథ.

ఎనిమిదవ కథా రచయిత్రి స్వర్ణ కిలారి.

భర్తను కోల్పోయి, ఒంటరిగా కష్టపడి పెంచిన తల్లి పెంపకంలో సున్నితంగా పెరిగింది ఆమె. ఇంటర్మీడియట్లో రూప ఆమె క్లాస్ మేట్. ఇద్దరూ కలిసి చదువుకునే సమయంలో రూప తండ్రి ఎదురుగా కూర్చుని వారి చదువు పర్యవేక్షించేవాడు. రూప మంచి ర్యాంక్ తో డాక్టరవుతుంది. అలాటి తండ్రి తనకి లేడే అనుకుంటుందామె.  

ఒకరోజు తాను ప్రయాణించవలసిన రైలు ఆలస్యం అవటంతో రూపని కలిసేందుకు వెళ్తుందామె. స్టేషన్ కి బయలుదేరేప్పుడు రూప తండ్రి ఆమెను స్కూటర్ మీద దింపుతానంటాడు. ఆ గతుకు రోడ్డు మీద ప్రయాణంలో ఆయన ప్రవర్తన ఆమెను షాక్ కు గురిచేస్తుంది. అసహ్యంతో స్కూటర్ దిగిపోతుంది. చాలా ఏళ్ల తర్వాత రూప తండ్రి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగి ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసి, ఆయన పట్ల కేవలం మానవతా భావంతో చూసేందుకు వెళ్తుందామె. ఐసియు లో ఉన్న ఆయన ఆమె ఇప్పుడింకా అందంగా ఉందంటూ, ఇదివరకటి సంఘటన తన కూతురికి చెప్పలేదు కదా అంటాడు. చావుబతుకుల స్థితిలోనూ అతనిలోని వెకిలితనం ఆమెకు వెగటును, ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అతనిలోని నీచత్వం తాలూకు పర్యవసానాన్ని అతను మాత్రమే అనుభవించాలని, ఆతని కూతురుకి అందులో భాగం లేదని చెప్తూ, నిజానికి అతని శరీరానికి కాక, మెదడుకు, హృదయానికి ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరం అంటూ పౌరుషంగా జవాబు చెప్తుంది.

వెనక్కి తిరిగి వస్తూ భర్తతో మొత్తం విషయాన్ని పంచుకున్నప్పుడు ఇప్పుడు ఆమె చేసిన పని ఎప్పుడో చెయ్యవలసిందన చెప్తూ, కనీసం ఇప్పటికైనా నోరు విప్పిన దానికి ఆమెను అభినందిస్తాడు. ఆత్మీయులనుకున్న పెద్దలనుంచి ఇలాటి అనుభవాలు ఎదురైనపుడు మనసు ముడుచుకుపోతుంది, కానీ దాన్ని దాటి ప్రతిఘటన చూపాల్సిందే. కొంత ఎడిటింగ్ తో మరింత చిక్కదనం కథకు చేకూరి ఉండేది.

తొమ్మిదవ కథా రచయిత్రి డా. మమత వేగుంట సింగ్. ఇది ఆమె మొదటి కథ.

కార్పొరేట్ ఆఫీసులో అనీష పనిచేస్తోంది. ఆమె బాస్ తో లండన్ కాన్ఫరెన్స్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు మధ్యలో దుబాయ్ లో రెండురోజులు ట్రాన్సిట్ హాల్ట్ చేద్దామంటాడు. కార్పొరేట్ లో పైకి రావాలంటే సోషలైజింగ్ అవసరమంటాడు. ఆమె రాలేనని మర్యాదగా చెప్పేస్తుంది.

లండన్ నుంచి వచ్చాక అనీష ఫోన్ నుంచి వల్గర్ జోక్, వల్గర్ ఫోటో బాస్ కి రావటంతో అతను నిలదీస్తాడు ఇదేమిటంటూ. పైగా మోడరన్ డ్రెస్సింగ్ చూసి అనీష ని మోడరన్ గర్ల్ అనుకునే దుబాయ్ ప్రపోజల్ పెట్టానంటాడు. అనీష ఆశ్చర్యపోతుంది. ఆ మెసేజెస్ తను పంపలేదంటుంది. ఇంటి ఓనర్ కూడా తనకు వచ్చిన వల్గర్ మెసేజెస్ చూపించి ఇల్లు ఖాళీ చెయ్యమంటాడు. అనీష పోలీసులకి ఫిర్యాదు చేస్తుంది. పోలీసుల పరిశోధనలో అనీష ఆఫీసులో డాక్యుమెంట్లను ఫైలింగ్ చేసే సునీల్ ఆమె పేరుతో తీసుకున్న ఫోన్ నంబరు నుంచి ఆ మెసేజెస్ వస్తున్నట్టు తేలుతుంది. చివరికి తప్పు ఒప్పుకుని క్షమించమంటాడు సునీల్. ఆధార్ కార్డ్ లాటి డాక్యుమెంట్లను దుర్వినియోగం చేసి వేరేవారి పేరుతో ఫోన్ నంబర్లను తీసుకుని, నేరాలకు (వాళ్లకి సరదాలు) ఒడిగట్టే నేరస్థులున్నారు మనచుట్టూ. వర్తమాన సమాజంలో కొత్త రూపాలను సంతరించుకుంటున్న హింసని చూపించారు మమత.

పదవ కథ ఉషా తురగా రేవెల్లి రాసిన కథ.

ఒక పత్రికలో పనిచేస్తున్న తారకు బాస్ సురేంద్ర ప్రవర్తన ఇబ్బందిగా ఉంది. ఈ విషయం తనతో పనిచేసే మిత్రుడు సందీప్ కు చెప్తుంది. బాస్ చేసే పనికి కి ప్రూఫ్ లేదు కనుక కొంచెం ఓపిక పట్టమంటాడు అతను. సురేంద్ర మరింత చొరవ తీసుకుని సింగిల్ విమెన్ సమస్యల మీద కవర్ స్టోరీ చెయ్యాలంటూ వాళ్లకి ఉండే శారీరక అవసరాలు కూడా సమస్యే అంటాడు. అతని పద్ధతి తార కి సహించరానిదిగా ఉంటుంది. లిఫ్ట్ లో ఆమెతో సూటిగా తన కోరికను చెప్తాడు సురేంద్ర. తార తన మితృబృందంతో చర్చిస్తుంది. ఎడిటర్ కి కంప్లెయింట్ ఇవ్వాలంటారు అందరూ. ఎడిటర్ తో ప్రస్తావించినప్పుడు అది చాలా పెద్ద విషయం అవుతుందని, ఆలోచించుకోమంటాడు. కంప్లెయింట్ ఇచ్చేందుకు ఆ విషయాలను పేపర్ మీద పెట్టటం ఎంత ఇబ్బందో అర్థమవుతుంది తారకి. అదీకాక ఇలాటి సమస్యలను పరిష్కరించేందుకు తమ వార్తాపత్రిక లో ఇంటర్నల్ కమిటీ అంటూ ప్రత్యేకంగా పనిచెయ్యటం లేదని తెలుసుకుంటుంది.

కమిటీ ఎంక్వయిరీలో ఇలాటి సంఘటన మన ఆఫీసులో ఎప్పుడూ లేదు అంటూ మొదలుపెడతారు సభ్యులు. ఆమె సురేంద్ర మాటలను తప్పుగా అర్థం చేసుకుని ఉండచ్చంటారు. పైగా రుజువులు కావాలంటారు ఆమె కంప్లెయింట్ నిజమనటానికి. చివరికి ఆమె మాటల్లో పస లేదని కేసు క్లోజ్ చేస్తారు. సురేంద్ర చేత సారీ మాత్రం చెప్పిస్తారు. ఆమెకు న్యాయం జరగదని అర్థమవుతుంది.

సురేంద్ర ఇంటికి వెళ్లి అతని భార్య, కూతుర్లకు విషయం చెప్పేసేక తనకు జరిగిన అవమానానికి అతనికి సరైన శిక్ష వేసానని, తనకు తానే న్యాయం చేసుకున్నానని అనుకుంటుంది. ప్రపంచ అన్యాయాలను ఎలుగెత్తి చెప్పాల్సిన వార్తా పత్రికా రంగంలో స్త్రీ పట్ల చూపించే వైఖరి సూటిగా చెప్పారు పరిణతి చెందిన రచయిత్రి.

పదకొండో కథ రచయిత్రి మైథిలీ అబ్బరాజు రాసారు. విలక్షణమైన కథలు రాసే ఈ రచయిత్రికి పరిచయం అక్కరలేదు. అరుదైన కథా వస్తువులతో సున్నితమైన శైలిలో చెప్పే ధోరణి ఈమె స్వంతం.

నలకూబరుని ఎడబాటును ఇక ఓర్చుకోలేక రంభ అతన్ని కలిసేందుకు బయలుదేరింది. దారిలో ఎదురైన రావణుడు ఆమెపై మనసుపడ్డాడు. కుబేరుని కుమారుని సన్నిధికి వెళ్తున్నానని చెప్పి, రావణుడు తనకి మామగారి వరస అంటుందామె. కుబేరునితో తనకు సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయంటూనే ఆమె నలకూబరునికి భార్య కాదన్నది జ్ఞాపకం చేస్తాడు రావణుడు. అది ధర్మం కాదన్న రంభతో స్వర్గానికి చేరిన వారందరినీ సంతోషపెట్టే వాళ్లు ధర్మాధర్మాలు చెప్పకూడదనీ, తన ప్రేమను స్వీకరించమనీ వెంటపడతాడు రావణుడు. తాను అతన్ని ప్రేమించటం లేదంటుంది రంభ. తాను శ్రీ మహాలక్ష్మికి తోబుట్టువునని చెప్పినప్పుడు ఆవిడ సంగతీ చూస్తాలే అంటాడు రావణుడు కౄరంగా. రంభను తన బలంతో ఛిద్రం చేస్తాడు. దుఃఖంతో ఆమె నలకూబరుని చేరుతుంది. ఆమెను ఓదార్చి, ఆక్రోశంతో, ఆగ్రహంతో నలకూబరుడు ఇష్టంలేని స్త్రీని ముట్టుకుంటే రావణుని తల ఏడు వక్కలైపోతుందని మంత్ర జలంతో శపిస్తాడు.

కైలాసంలో పార్వతిని మోహించి అక్కడ ఏమీ చెయ్యలేక పర్ణశాలలోంచి శ్రీ మహాలక్ష్మిని లంకకు ఎత్తుకొస్తాడు రావణుడు. సర్వనాశనమైపోతాడు. రావణకాష్ఠం ఆరనేలేదు.

ఆనాడూ ఈనాడూ ఏనాడూ కూడా స్త్రీ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తమ కోర్కెను ప్రకటించి తీర్చుకుంటూనే ఉన్నారు అహంకారంతో కళ్లు తలకెక్కిన కామాంధులు.

“మీటూ“ అంటూ గొంతెత్తుతున్న స్త్రీ పై జరుగుతున్న హింస, దుర్మార్గం ఇప్పుడు కొత్తగా పుట్టిన వైకల్యం కాదు. ఆదిశక్తి అనాదిగా భరిస్తున్న వ్రణం.

పన్నెండవ కథా రచయిత్రి ఉమా నూతక్కి.

అర్జున్, మిథున బావా మరదళ్లు. చిన్నప్పడు వారి మధ్య మొలకెత్తిన అనురాగం పెద్దయ్యాక భార్యాభర్తల్ని చేసింది. కానీ తనను దూరంగా ఉంచుతూ లోలోపల ఆవేదన పడుతున్న మిథున ధోరణి అర్జున్ కి అర్థం కాదు.

చిన్ననాడు తల్లిదండ్రులు లేని మిథున అత్తా, మామయ్యల ఇంట పెరిగింది. మామయ్య రూపంలోని రాక్షసుడు పసివయసులోనే ఆమెలో ఆడతనాన్ని చూసాడు. అర్థం చేసుకున్న అమ్మమ్మ సాయంతో ఆ ఇంటినుంచి బయటపడినా అప్పటి నరకయాతన ఆమెను ఇప్పటికీ పీడకలై వేధిస్తోంది. చిన్ననాటి నేస్తం, తనకు అత్యంత ఇష్టుడైన బావ భర్త రూపంలో దగ్గరగా ఉన్నా అతని సామీప్యాన్ని సహించలేక పిచ్చిదైపోతోంది. అతనికి గతం చెప్పలేక విడాకులు తీసుకుంటే బావకు న్యాయం చేసినట్టవుతుందేమో అని ఆలోచిస్తుంటుంది.

చిన్నప్పటి నుంచీ తమను చూసిన నాయనమ్మ ద్వారా మిథున సంగతి అర్థం చేసుకోదలచి ఆమెను రప్పిస్తాడు అర్జున్. నాయనమ్మ ద్వారా గతం తెలుసుకుని భార్యను మామూలు మిథునను చేసుకుంటానంటూ అమ్మమ్మతో నమ్మకంగా చెప్తాడు. కుటుంబాలలో నిశ్శబ్దంగా జరుగుతున్న ఈ లైంగిక హింస ఎన్ని పసి జీవితాలను అల్లకల్లోలం చేస్తోందో!

పదమూడవ కథ, ఆఖరి కథ రాసినవారు స్వేచ్ఛ వొటార్కర్. మనిషి మీద పెత్తనం చేసే అధికారం, హక్కు మరో మనిషికి లేవని గట్టిగా నమ్ముతారు. ఇది ఆమె తొలి కథ.

విన్నీ తన పనేదో చేసుకుంటూ తనదైన ధోరణిలో ఉండే అమ్మాయి. ఆఫీసులో ఒకరోజు ఆమె ఒడిలోకి ఎవరో చాక్లెట్ విసురుతారు. ఉలికి పడుతుంది. ఇలాటి చనువు తనెవ్వరికీ ఇవ్వలేదే, ఇలా ఎలా అయిందని ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎవరైనా చూసారేమో అని విచారపడుతుంది. ఆ సాయంత్రం బస్ స్టాప్ కి వెళ్లే దారిలో ఆఫీసులో తనతో పనిచేసే రాజు పలకరించి ఆ చాక్లెట్ విసిరింది తనే నంటూ ఇంటివరకూ లిఫ్ట్ ఇస్తనంటాడు. అతని చొరవకి అసహ్యించుకుంటుంది మౌనంగా. మర్నాడు మళ్లీ ఆమెతో మాటలు కలుపుతాడు తనతో బైక్ పైన రమ్మని. అసహనంతో తన పై అధికారి సుధారాణికి రాజు మాటలు, చేతలు గురించి పేపర్ పైన రాసి అందిస్తుంది. ఆవిడ రాజుని మొదటి రోజే ఎందుకు హెచ్చరించలేదు అని అడుగుతుంది. పైగా అతనిపై యాక్షన్ తీసుకుంటే ఉద్యోగం పోతుందని, అతని భార్య పిల్లలు అన్యాయమవుతారని చెప్తుంది. సాటి స్త్రీగా మరో స్త్రీకి అన్యాయం చేసినట్టవుతుందంటుంది. విన్నీ తన సమస్యను కంప్లెయింట్ కమిటీకి మెయిల్ చేస్తుంది. రాజుని పిలిచి కమిటీ మాట్లాడుతుంది. విన్నీ మాత్రం ఇంట్లో స్త్రీలను అడ్డుపెట్టుకుని చెత్తపనులు చెయ్యద్దంటూ రాజుకి హెచ్చరిక చేస్తుంది. మరునాడు రాజు ఆఫీసులో కనిపించడు. విన్నీ తన సమస్యను తానే పరిష్కరించుకోవాలన్నది కాస్త ఆలస్యంగానైనా తెలుసుకుంది. తనను తాను ధైర్యంగా కూడగట్టుకోగలిగితే స్త్రీ ఇలాటివాటికి చెక్ పెట్టగలదు.

కథలన్నీ వేటికవే వివిధ రంగాలలో స్త్రీ ఎదుర్కొంటున్న లింగ వివక్షను స్పష్టంగా చెప్పాయి. హింసకి ఎన్నెన్ని రూపాలో చెప్పారు రచయిత్రులు. వాటిని అడ్డుకునేందుకు ఎవరో ఎక్కడినుంచో రారన్నది వంద శాతం వాస్తవం. సమస్య రూపం, లోతు తెలిసిన వ్యక్తే పరిష్కారం చూపాలన్నది ఈ కథలన్నీ చెప్తాయి. ఈ కాలానికి అవసరమైన కథలు. ఆలోచింపచేసే కథలు. అందరికీ అభినందనలు.

మంచి పుస్తకాలు ప్రచురించాలన్న సదాశయంతో ప్రారంభమైన ఆన్వీక్షికి ప్రచురణ ఈ పుస్తకం. 2019లో వచ్చింది. అందంగా కవర్ డిజైన చేసిన మహి బెజవాడకి అభినందనలు. అచ్చుతప్పులు, ఎడిటింగ్ మరికొంత సవరించి ఉంటే పుస్తకం పట్ల ఫిర్యాదులుండేవి కావు. “మీటూ” ప్రత్యేక సందర్భం పురస్కరించుకుని ఈ సంకలనం తెచ్చిన సంపాదకులకు, ప్రచురణకర్తలకు అభినందనలు.

* * *

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.