* * *
ఊరికి దూరంగా ఒక ఇల్లుంది. ఇంటి వెనకున్న తోటలో గులాబీ, మల్లె, చేమంతి, నందివర్ధనంలాంటి పూలమొక్కలు, వేప, మామిడిలాటి పెద్దచెట్లు ఉన్నాయి.
“ఇల్లంతా దుమ్ము పట్టి, నాకళ్లు మసకబారాయి. ఇంట్లోకి ఎవరైనా వస్తే సేవ చేస్తాను. అలికిడిలేదని పక్షీ, పిట్టా కూడా రావట్లేదు.’’ ఇల్లు దిగులుగా తోటకి చెప్పింది.
“మాకు దాహం వేస్తే నీళ్లిచ్చేవాళ్లు లేరు. వాననీళ్లని దాచుకుని తాగుతున్నాం. మొక్కలు చిగుళ్లేయటం మరిచిపోతున్నాయి. పువ్వు, పిట్టపాట లేని తోట ఏం బావుంటుంది? ఎవరికి ఉపయోగపడుతుంది? మా తాత ఇతరులకి సేవ చెయ్యటానికే పుట్టామంటాడు.’’ తోట బాధపడింది.
“ఇంట్లో కుటుంబం ఉన్నప్పుడు పిల్లలు ఆడుతూ, పాడుతూ తిరుగుతూండేవారు. ఇంటిముందు ముగ్గులు, ఇంటినిండా దీపాలు ఉండేవి. తోటలో పువ్వుల్ని పిల్లలంతా కోసుకునేవారు. పళ్లు ముగ్గకుండానే ఇష్టంగా కోసి తినేవాళ్లు. అలాటి రోజులు ఎప్పుడొస్తాయో!” అంది ఇల్లు.
తోటలో చిన్నమొక్కలకి ఆ మంచిరోజులు జ్ఞాపకం లేవు. “మనం మనసారా కోరుకుంటే ఇంట్లోకి అందరూ వస్తారు.” అన్నాడు మామిడితాత. ఆకాశంలో బుజ్జిబుజ్జి నక్షత్రాల్ని చూస్తూన్న గులాబిమొక్క వెంటనే అడిగింది,
“అయితే తాతా, రాలిపడుతున్న నక్షత్రాన్ని చూసి ఏది కోరుకుంటే అది నిజమవుతుందని మల్లెక్క చెప్పింది, నిజమేనా?” “అందరికీ మంచి జరగాలని కోరుకుంటే తప్పక అవుతుంది గులాబీ.’’ అన్నాడు మామిడితాత. ‘’నక్షత్రం రాలుతుంటే మన తోటలోకి పాపాయిలు రావాలని కోరేసుకుందాం.” గులాబి అందరితో చెప్పింది.
తెలవారుఝామున ఒక నక్షత్రం నేలమీదకి దూకుతూ, గులాబిని చూసి నవ్వింది. నిద్ర ఆపుకుని చూస్తున్న గులాబీ పాపాయిల్ని కోరుకుంటూ సంతోషంగా నిద్రపోయింది.
పొద్దున్నే సందడికి మొక్కలన్నీ నిద్రలేచాయి. ఎవరో ఇంట్లోకొచ్చినట్టుంది. చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసారు. బావిలో నీళ్ళు తోడి, కడిగి, ముగ్గులెట్టారు. నిద్రకళ్లతో “ఎవరొచ్చారు?” అంది గులాబి.
“ఇంట్లోకి ఎవరో వచ్చారు. మేమంతా చూసాం.” అంది చేమంతి గర్వంగా. గులాబికి కోపం వచ్చింది. ఇంట్లోకి పాపాయి రావాలని రాత్రంతా మేలుకుని తను కదా నక్షత్రాన్ని కోరుకుంది! మామిడితాతని అడిగింది, ఎవరొచ్చారని. “ఏమోనమ్మా, నాలుగు రోజులు ఆగితే తెలుస్తుంది.” అన్నాడు తాత.
ఇంట్లోవాళ్లు తోటని శుభ్రం చేసి, మొక్కలకి నీళ్లు పొయ్యటం మొదలుపెట్టారు. వాళ్లని అమ్మ, నాన్న అనుకుంది తోట. తోటంతా చిగుళ్లు వేసి, ఇంద్రధనుస్సులా మారింది. పిట్టలన్నీ వచ్చేసాయి. తోటంతా కమ్మగా పాటలు పాడుకుంది. ఇల్లు, తోట సంతోషించాయి.
గులాబి ఒకరోజు “అమ్మా, నాన్న కాకుండా ఇంకెవరో ఉన్నట్టున్నారే. సన్నని గొంతేదో వినిపిస్తోంది.” అంది. ‘’నువ్వు ఎక్కువగా ఏవేవో ఊహిస్తావులే.” అన్నారు అందరూ.
“కేర్ కేర్” అంటూ కాస్త గట్టిగా పాపాయి ఏడుపు వినిపించి, ఏమిటబ్బా అని తోటలో మొక్కలు, చెట్లు, పిట్టలు ఆలోచించాయి. నందివర్థనం మొక్కతో, “అక్కా, నేను చెప్పలేదూ, ఏదో చిన్న సవ్వడి వస్తోందని.’’ అంది గులాబి. నందివర్థనం ఎప్పుడూ ఆ శబ్దం విననేలేదంది. “పాపాయి ఉంది ఇంట్లో.” తనకు తెలుసన్నాడు మామిడి తాత సంతోషంగా.
అమ్మా నాన్న ఏదో వాదులాడుకుంటున్నారు. పేరేం పెడదామని నాన్నఅంటే, ఆలోచించాలంటోంది అమ్మ. “ఎవరికో పేరు పెట్టాలట.’’ తోటంతా గుసగుసలాడింది. గులాబికి అంటు కడుతూంటే, నాన్న ఏదో చెప్పాడు.
“కాదు. మంఛి పేరు పెట్టాలి పాపాయికి.” అంది అమ్మ.
“నాపేరు పెట్టండి.” అంది గులాబి. ‘’తెల్లగా ఉంటాను, నాపేరు ఇంకా బావుంటుంది’’ అంది మల్లె గొప్పగా.
“నేను పచ్చగా ఎంత ముద్దొస్తున్నానో” అంది చేమంతి. అమ్మానాన్నలకి ఆ మాటలు వినిపించనేలేదు.
“పాపాయికి బడికెళ్లే వయసు వచ్చేస్తుంది.’’ అన్నాడు నాన్న.
“పాపాయి పెద్దయ్యాక తనే పేరు పెట్టుకుంటుంది.” అమ్మ చెప్పింది.
“పేరులేని పాపాయి” అంటారు బడిలో.’’ నాన్న మాటలకి అమ్మకి నవ్వొచ్చింది.
నాన్న మామిడిచెట్టుకి ఉయ్యాల కట్టాడు. ఇంత చిన్న ఉయ్యాల పాపాయికి సరిపోతుందా? మొక్కలకి సందేహం. చెట్లేమో నవ్వుతున్నాయి. సాయంత్రం పాపాయిని ఉయ్యాల్లో పడుకోబెట్టి చుట్టూ మెత్తనిబట్ట కప్పింది అమ్మ. కాళ్లు, చేతులు ఆడిస్తూ ‘’ఊ ఊ’’ అంటుంటే ఇంట్లో సందడి పాపాయిదే అని తోటంతా సంబరపడింది.
అమ్మ ఉయ్యాలపైన రంగురంగుల పాలవెల్లి కట్టింది. ‘’కీ’’ ఇస్తే గిరగిరా తిరుగుతుందది. దాన్ని చూస్తూ పాపాయి ఆడుకుంటుంది. పూవులన్నీ పాపాయికోసం సువాసనలు పంపుతాయి. చెట్లు చల్లని గాలినిస్తాయి. పిట్టలన్నీ తియ్యగా పాడతాయి. పాపాయి హాయిగా నవ్వుతుంది.
అమ్మ, నాన్న కబుర్లు చెబుతుంటే పాపాయి ఆడుకుంటుంది. వాళ్లు కనిపించకపోతే ఏడుస్తుంది. అమ్మ పనులన్నీ వదిలి పరుగెత్తుకొస్తుంది. పాపాయి ఏడుపు మానేవరకు పక్కనే కూర్చుంటుంది.
ఇంటి వరండాలో పిచ్చుకలగూట్లో బుల్లిబుల్లి పిచ్చుకలున్నాయి. కిచకిచమంటూ పాపాయికి మాటలు నేర్పుతున్నాయవి. బుల్లిరెక్కలతో ఎగిరేందుకు ప్రయత్నిస్తూ “ఊ ఊ” లు చెబుతున్న పాపాయిని గుమ్మంలోంచి తొంగిచూసాయి. కిచకిచ శబ్దాలు దగ్గరగా వినిపించి పాపాయి పకపకా నవ్వింది. అమ్మా నవ్వేసింది. నాన్న ఇంటికొచ్చాక పిచ్చుకల కిచకిచలకి పాపాయి నవ్వుతోందని అమ్మ చెప్పింది.
“అయితే పాపాయి పేరు కిచ్చు” అన్నాడు నాన్న. ఉయ్యాల్లో కిచ్చు గట్టిగా నవ్వింది. “భలే! పాపాయికి పేరు నచ్చింది.’’ అనుకున్నారు అమ్మ, నాన్న.
“కిచ్చు అంటే ఏమిటి?” అంది అమ్మ. “కిచ్చు అంటే ప్రియమైనది.” అన్నాడు నాన్న.
నాన్నకన్నీ తెలుసని ఇల్లు, తోట, పిట్టలు చెప్పుకున్నాయి. ‘’కిచ్చు’’ పేరు భలే ఉందనుకున్నాయి, మరి పాపాయికి నచ్చిందికదా.
***
(Baby Name : Kichu. Origin : Indian. Kichu Meaning: Beloved; Sweet.)
* * *