* * *

వేదికపైనున్న భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ పూర్వ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారికి, సిద్ధార్థ అకాడెమీ అధ్యక్షులు శ్రీ డా. సి. నాగేశ్వరరావు గారికి, సభలోని పెద్దలందరికీ నమస్కారములు.
మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జరుపుకుంటున్న అమృతోత్సవ సమయంలో దేశ స్వతంత్రపోరాటం గురించి, ఆనాటి భారతీయుల నిస్వార్థ త్యాగాల గురించి మాట్లాడుకోబోతున్నామన్నది సంతోషం కలిగించే విషయం. ఈరోజు మన ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్న పుస్తకం ‘’భారతదేశం పక్షాన’’ ఈ విషయాలనే చెబుతుంది.
ఎవరైనా ఒకరి పక్షం మాట్లాడుతున్నారంటే వారిపట్ల ఉన్న అభిమానాన్ని, సహానుభూతిని తెలియజేస్తున్నట్టు అర్థమవుతుంది. అయితే,
ఈ పుస్తకం ఏమిటి, ఎవరిదీ సహానుభూతి? వివరాల్లోకి వెళ్తే,
ఒక విదేశీయుడు ప్రపంచ నాగరికతల గురించి ఒక గ్రంథాన్ని తీసుకు రావాలనుకున్నారు. ఆ పనిలో భాగంగా ప్రత్యక్షానుభవం కోసం 1930వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు. ప్రపంచ నాగరికతలో విశిష్టమైనదిగా, గొప్పదిగా చెప్పుకునే భారతదేశంలో అప్పటి పరిస్థితులు రచయితను ఊపిరాడనీయని అశాంతికి, ఆవేదనకు గురిచేసాయి.
తను ఏ పని నిమిత్తం వచ్చారో దానిని తాత్కాలికంగా పక్కన పెట్టారాయన. భారతదేశం గురించి అధ్యయనం మొదలుపెట్టారు. దాదాపు వంద పుస్తకాలను చదివారు. అందులో ఎక్కువ భాగం విదేశీ రచయితలు రాసినవే. కొన్ని పుస్తకాలలో ఉన్న వాస్తవాల కారణంగా అవి భారతదేశంలో నిషేధించబడ్డాయి. అధ్యయనంలో తెలుసుకున్న దానికంటే ఇక్కడి నాగరికత, సంస్కృతి మరింత గొప్పవన్న నిజం రచయిత పరిశోధనలో బయటపడింది. ఐదు వేల సంవత్సరాల నాగరికత కలిగిన ఒక సంపన్న దేశం, ప్రజలు ఎంత దయనీయమైన స్థితికి తీసుకురాబడ్డారో అర్థమైంది. తను చూసిన వాస్తవాలు చరిత్రలో సమాధి అయిపోకుండా ఒక పుస్తక రూపంలో భద్రపరచి, భారతదేశం పట్ల తన అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజెయ్యాలనుకున్నారు.
ఈ విదేశీ రచయిత విల్ దురంత్. ఆయన ఒక తత్త్వవేత్త, మానవతావాది కూడా. ఆయన అమెరికా దేశస్థుడు. ఆయన రాసిన ‘’ద కేస్ ఫర్ ఇండియా’’ మనం మాట్లాడుకుంటున్న అనువాదానికి మూలం. చదువు పూర్తి చేసి కొన్నాళ్లు ఒక పత్రికా విలేకరిగా పనిచేసారు. ఆ వృత్తి, వేగవంతమైన జీవితం తనకు సరిపడవని గ్రహించి, మరికొంతకాలం విద్యాభ్యాసంలో గడిపారు. అధ్యాపక వృత్తిని స్వీకరించారు. వయోజన విద్యలో విజయవంతమైన ప్రయోగాలను చేసారు.
ప్రపంచంలో అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ తన అధ్యయనాలను, అనుభవాలను పుస్తకాల రూపంలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. స్త్రీ పురుషులకు సమానమైన వేతనాలు సాధించేందుకు, స్త్రీలకు బానిసత్వం నుంచి విమోచన కలిగించేందుకు, కార్మికులకు మెరుగైన పని పరిస్థితులను కల్పించేందుకు ఆయన పోరాడారు.
తన అధ్యయనం, పరిశీలనల్లో గ్రహించిన విషయాలను మాత్రమే ఈ పుస్తక రచనకు ఉపయోగించుకున్నానని విల్ దురంత్ పుస్తకం ముందు మాటలో చెప్పారు. తనకు ఇంగ్లీషువారి పట్ల ఉన్న ప్రేమ, ఆరాధన గురించి చెబుతూ ప్రపంచానికి స్వేచ్ఛను ఇచ్చినది వారేనంటారు. సామ్రాజ్యవాద దేశాల్లో బ్రిటీషువారు చెడ్డవారని చెబుతూ, భారతదేశం పట్ల, భారతీయుల పట్ల వారు అవలంబించిన అమానుషమైన తీరును వ్యతిరేకిస్తారు.
విల్ దురంత్ పుస్తకం చదువుతుంటే ఆనాటి భారతీయుల దుర్భర పరిస్థితులు, అశక్తత కంటనీరు పెట్టిస్తాయి. వ్యవసాయాధారితమైన సుభిక్షమైన భారతదేశంలో పండిన పంటలో సగభాగంతో పాటు అధికమైన పన్నులు చెల్లించలేక పుట్టిపెరిగిన ఊళ్లను, భూమిని వదిలి జీవిక కోసం వలసదారి పట్టిన లక్షలాది మంది ఆకలి చావులకు గురవుతారు. కర్మాగారాల్లో పనులకోసం ప్రజల ఒత్తిడి పెరిగి వేతనం మరింత దిగజారిపోతుంది.
సామ్రాజ్యవాద ప్రభుత్వానికి పన్నులు చెల్లించే స్వతంత్ర సంస్థానాల్లో కనిపించని పేదరికం, ప్రజల మధ్య విభేదాలు వలస పాలన క్రింద ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేవి. భారత దేశానికి ప్రపంచ దేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలను ధ్వంసం చేసారు. నౌకా నిర్మాణం, కళలు, శిల్పం, దుస్తులు మొదలైన అనేక వస్తువులను ఉన్నత ప్రమాణాలతో తయారుచేసే అత్యున్నతమైన వ్యవస్థలన్నింటినీ సామ్రాజ్యవాద పాలకులు నాశనం చేసారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన, శాంతిపూరితమైన దేశాన్ని క్రమబద్ధమైన ప్రణాళికతో అంచెలంచెలుగా సామాజికంగా, ఆర్థికంగా పతనం చేస్తూ ఒక సామ్రాజ్యవాద దేశం తన సంపదను, రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవటం చూస్తాం. కుల, మత భేదాలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజలను స్వంతలాభం కోసం విడగొట్టిన తీరును చూస్తాం.
భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది నాయకులు బలి అయిపోయారు. సామాన్యుల జీవితాలు అతలాకుతలమయ్యాయి. గాంధీజీ అహింసా వాద సిద్ధాంతంతో సంతంత్రాన్ని సాధించుకున్నాం.
ఇటువంటి పుస్తకాలను ఇప్పటి యువతరం చదవాల్సిన అవసరం ఉంది. స్వతంత్ర దేశంలో మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఎందరి జీవితాలను పణంగా పెట్టటం వల్ల వచ్చిందో, దేశం కోసం త్యాగం చెయ్యటంలోని ఉన్నతాదర్శం ఏమిటో ఇప్పటివారికి అర్థమవుతుంది. దేశ అభివృద్ధి కోసం ఏదైనా చెయ్యాలన్న స్ఫూర్తి వారిలో కలుగుతుంది. తమ స్వంత ఆశయాల పరిధులను దాటి సమాజ శ్రేయస్సును కోరుకునే ఆదర్శవంతమైన యువతరం తయారై, దేశ క్షేమం వారి చేతుల్లో భద్రంగా ఉంటుంది.
విల్ దురంత్ కాల్పనికేతర సాహిత్యానికి 1968 సంవత్సరంలో పులిట్జర్ ప్రైజు ను, 1977 సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ను అందుకున్నారు.
భారతదేశం మానవ జాతికంతటికీ మాతృభూమి వంటిదనీ, సంస్కృత భాష ఐరోపా దేశ భాషలన్నింటికీ తల్లి అనీ అన్నారు విల్ దురంత్. తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసినది, గ్రామ స్వపరిపాలన, ప్రజాస్వామ్యం వంటి విషయాల్లో మార్గదర్శకత్వం చేసినది భారతదేశం అంటారాయన.
‘’ప్రపంచ స్వేచ్ఛ కోసం నిలబడిన ఎంతోమంది అమెరికా దేశపు స్త్రీ, పురుషులకు, ఎవరికైతే రంగు, జాతి, వర్గ విభేదాలు తెలియవో వారికి, ఎవరైతే ప్రేమ, మానవత్వం, న్యాయం అనే మతాన్ని నమ్ముతారో వారికి, ఇంకా ఈ భూతలం మీద స్వేచ్ఛకోసం పోరాడుతూ తమపట్ల సానుభూతి కోసం చూసే అణగారిపోయిన ప్రజలకు, ప్రపంచశాంతి పట్ల వారిలో ఇమిడిఉన్న ఆశాభావానికి ప్రేమతో, కృతజ్ఞతతో అంకితం ఇస్తున్నానంటూ’’ లాలాలజపతి రాయ్ తన ‘’అన్ హ్యాపీ ఇండియా’’ గ్రంథానికి రాసిన ముందుమాటను విల్ దురంత్ తన పుస్తకం ముగింపులో పేర్కొంటూ భారతదేశం పట్ల కొంత అవగాహన, కృతజ్ఞత చూపకుండా ఈ మాటలను ఎలా చదవగలం అంటారు.

* * *
Pingback: భారత దేశ పక్షాన | The Case For India By Will Durant | Book Launch By Hon’ble Vice President Of India – ద్వైతాద్వైతం