“టోకెన్ నంబర్ ఎనిమిది” – పుస్తక సమీక్ష,నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Feb. 2022

* * *

ఈ నెల మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం విలక్షణమైనది. మన ఇంట్లోని అమ్మాయిలా పలకరిస్తూ, అల్లరల్లరిగా తను చెప్పదలచుకున్న కబుర్లను, చెప్పకుండా ఉండలేని కబుర్లను ఆత్మకథాత్మక రూపంలో చెప్పుకొచ్చిన పుస్తకం. పుస్తకం పేరు కూడా విలక్షణంగా ఉంది.

ఇందులో ఒక చిన్న అమ్మాయి తన బాల్యానుభవాల్ని చెబుతుంది. ఆ అనుభవాలు తనను ఎలా సంపూర్ణమైన వ్యక్తిగా మలిచాయో కూడా చెబుతుంది. ఆపైన తన వ్యక్తిత్వంపై గాఢమైన ముద్రను వేసిన వారి గురించి ప్రేమతో, ఆర్ద్రతతో తలుచుకుంటుంది. ఇంతాచేసి ఈ అమ్మాయి మనకు చాలా సన్నిహితమైన వ్యక్తే సుమా అనిపించేస్తుంది పుస్తకం పూర్తయేసరికి.

అవును. ‘’టోకెన్ నంబర్ ఎనిమిది’’ పుస్తక రచయిత్రి వసుధారాణి ఈ పుస్తకాన్ని ఒక కొత్త ప్రయోగంలా తీసుకొచ్చారనిపిస్తుంది. చాలా కబుర్లతో చదువరులం కనెక్ట్ అయిపోతాం. హాయిగా మనం చిన్నతనంలో చేసిన అల్లరిపనులన్నీ కళ్లముందుకు వచ్చేస్తాయి.

ముందుమాటలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రచయిత్రిని టోటోచాన్ తో పోల్చారు. తన చొరవతో ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే నైజం ఈ టోటోచాన్ ది కూడా. భయం అనే మాట ఎరుగని సాహసి. భయం అనేది ఒకటుంటుందని ఆమెకు ఎవరూ చెప్పలేదు. అలాటి సహజ వాతావరణాన్నిచ్చిన కుటుంబం ఆమె బలం, ఆమె ధైర్యం. బాల్యంలో తనకు ఎదురైన ప్రతి అనుభవం నుంచీ ఏదో ఒక విషయాన్ని గ్రహించి, నేర్చుకున్న గడుసరి ఈ చిన్నారి రాణెమ్మ.

టోటోచాన్ లాగానే వచ్చిన ప్రతి సందేహాన్ని తనంత తానుగా నివృత్తి చేసుకోవటం, దేనికీ భయం అనేది తెలియకపోవటం, బడిలోనూ, స్నేహితులతోనూ, టీచర్లతోనూ తనకున్న అనుబంధాన్ని నిర్మొహమాటంగా చెప్పుకురావటం చాలా బావుంది. కుటుంబంలో ఆఖరి పిల్లగా పూర్తి స్వేచ్ఛాస్వాతంత్రాలతో పెరిగిన వసుధారాణి చిన్నప్పటినుంచీ తను చూసిన జీవితాన్ని వయసుకు మించిన అవగాహనతో ఎలా స్వంతం చేసుకున్నారో, ఎలా తన ఎదుగుదలకు పునాది చేసుకున్నారో ఈ పుస్తకంలో ప్రతి అక్షరం చెబుతుంది.  

ముందుమాటలోనే పాఠకులను పలకరించిన వసంతలక్ష్మి గారు ‘’ఈ వసుధారాణి కథలు కల్పించినవి కావనీ, మనల్నందరినీ బాల్యస్మృతుల్లోకి ఆపళంగా మోసుకు వెళ్లిపోయే బంగారు జ్ఞాపకాలు’’ అంటారు. ఇది అక్షర సత్యం.

రచయిత్రి బాల్యానుభవాలు కొన్నిసార్లు కాస్త అసూయను కూడా కలిగించకమానవు. ఇంటినుంచి బడికి వెళ్లే దారిలో పంటకాలవల్లో కనిపించే జీవశాస్త్రం ఆసక్తికరంగా ఉందనుకుంటే, బడికి చేరేక బాజీసైదా, చిన్నసైదా, పెద్దసైదా, మాదిరెడ్డి పద్మ, నాగయ్య వీళ్లందరూ రాణిగారు క్లాసులోకి అడుగుపెట్టగానే వాళ్ల సంచులు అడ్డం తీసి కూర్చునే చోటుని చేత్తో తుడిచి, మెరిసే కళ్లతో ఆహ్వానించటం…ఓహ్! ఒక్క జేజమ్మా, మాయమ్మా పాట ఒక్కటే తక్కువట! ఎంత గడుగ్గాయి పిల్ల ఈ రాణెమ్మ!

టీచర్ల ముఖం వైపు ధైర్యంగా తలెత్తి సూటిగా కళ్లలోకి చూస్తే అల్లరి చెయ్యనట్టేనట. అసలు ఈ పాఠాలు రాణెమ్మకు ఎవరు నేర్పేరో అంత చిన్నప్పుడే.

ఎదురింటి వెంకటరత్నం బడి దగ్గరకొచ్చి అంజనం వేసే లింగయ్య దగ్గరకి తీసుకెళ్లినప్పుడు రాణెమ్మ ఎలాటి బెదురూ లేక లింగయ్య ప్రశ్నలకు తోచిన సమాధానాలు చెప్పటం గురించి చదువుతుంటే నాకు భలే భయమేసింది. అక్కడ కూర్చున్న సమయంలో ఆకలేస్తోందని, ఇంటికెళ్లి అమ్మ పెట్టే చిరుతిండి తినాలన్న విషయమొక్కటే ఆలోచించింది రాణెమ్మ. నిజంగా చాలా ధైర్యవంతురాలే సుమా.

హైదరాబాద్ ఒంటరిగా బస్సెక్కి వెళ్లి వచ్చిన హిప్పీరాణి బడిలో మరింత పాప్యులారిటీని తెచ్చుకోవటం సరదాగా ఉంది. అలాటి సాహసాలు చేసేందుకు అనుమతిచ్చిన రాణి నాన్నగారు నిజంగా పిల్లల్ని పెంచే కళను స్వంతం చేసుకున్నారు. లెవెల్ చెయ్యాలంటూ అక్కలిద్దరూ తగ్గించిన జుట్టు బడిలో స్నేహితుల మధ్య రాణి లెవెల్ పెంచటం చదువుతుంటే అదృష్టవంతుల్ని ఎవరాపగలరులే అనుకోకమానం.

రాణి చిన్నప్పటి ఆటలు లిస్ట్ చూస్తే చెంబులాట, గోళీలు, చీపురుపుల్లల విల్లు, గోగుపుల్లల బాణాలు, బిళ్లంగోడు, కోతికొమ్మచ్చి, చార్ పప్పు చార్, సిగరెట్ పేకలతో బెచ్చాలు, పిచ్చి బంతి…ఓహ్ కొన్ని ఆటలైతే నాకు తెలియదని ఒప్పుకోవలసిందే. ఇనుముకు సరిపడా పప్పుచెక్క ఇవ్వని పాతసామాన్ల వాడి మీద రివెంజ్ తీసుకోవటం…ఎన్నని చెప్పాలి అల్లరి పిల్ల కబుర్లు?!

ఆటలు, బజారు పనులు అయ్యాక రాత్రి పూట కాళ్లు నొప్పులంటూ అమ్మమ్మ మంచం మీదకి చేరే రాణెమ్మ హాయిగా ఆవిడ చేత కాళ్లు నొక్కించుకుంటూ సుమతీ శతక పద్యాలో, దాశరథీ శతక పద్యాలో వింటూ నిద్రపోవటం నిజ్జంగా … ఎంత అందమైన బాల్యం!

కరాటే రాణిగా తోటివారి మధ్య మరిన్ని మార్కులు కొట్టేసిన రాణి హై స్కూల్ గేట్ దగ్గర అమ్మాయిలను వేధించే అబ్బాయిలను ఎంత తెలివిగా అదుపు చెయ్యగలిగిందో చదువుతుంటే మనకి కూడా మరి రాణెమ్మ పట్ల ఆకర్షణ కలగక మానదు.

రచయిత్రే చెప్పినట్టు ‘’రైతు రాణి’’ ఎపిసోడ్ నిజంగా పుస్తకంలోని అతి ముఖ్యమైన అంశం. పన్నెండు, పదమూడు సంవత్సరాల వయసులో అమ్మమ్మకి తోడుగా పొలానికి వెళ్లి అక్కడి విషయాలను కూలంకషంగా తెలుసుకోవటం, ఆ మరు సంవత్సరం నుంచీ తానే పూర్తి బాధ్యతను తీసుకోగలిగిన విషయ పరిజ్ఞానాన్ని గ్రహించటం చాలా అబ్బురమనిపిస్తుంది. ఎరువులు సప్లై చేసే షావుకారు చేసే దోపిడీని అర్థం చేసుకుని దానికి తగిన పరిష్కారం వెతుక్కోవటం చాలా ప్రశంసనీయంగా అనిపించింది. రచయిత్రే చెప్పారు ఈ ఎపిసోడ్ లో, ‘’పొలం నాకు ధైర్యం, ఔదార్యం, ఓపిక, సహనం, నిజాయితీ, తిరుగుబాటు, రాజనీతి, ఆకలి విలువ, శ్రమ విలువ, క్రమశిక్షణ నేర్పేయి.’’

ఈ పుస్తకం ఆఖరిభాగం చాలా విలువైనది. ఇక్కడ చెప్పుకున్న ముగ్గురు వ్యక్తులు అరుదైన వ్యక్తులు.

అసలు ఈ పుస్తకం అంతా చదివేక మన టోటోచాన్ కంటే కూడా వాళ్ల అమ్మగారు నాకు బాగా నచ్చేసారు. పెద్ద కుటుంబ బాధ్యతలను, ఎదురైన సమస్యలను కూడా నిబ్బరంగా, శాంతంగా ఎదుర్కొన్న తీరు ఆమె పట్ల ఒక పూజ్యభావాన్ని, ప్రేమని కలిగించక మానవు చదువరిలో. పిల్లలందరి బలాలు, బలహీనతలూ పూర్తిగా తెలిసిన అమ్మ! ఆమె కాంగ్రెస్ సభలు జరిగినపుడు వాలంటీర్ గా చేసారంటే ఎంత గొప్పగా అనిపించిందో! ఆమె చివరి క్షణాలను చదువుతుంటే కన్నీరాగదు. ఎంత గొప్ప వ్యక్తి! ఎంత అపురూపమైన అమ్మ!

‘’ఆనందాంబరం మా నాన్న’’ అంటూ సర్వావస్థల్లోనూ, సర్వకాలాల్లోనూ సంతోషంగా ఉండే ఆయన పోలికే తనకు వచ్చిందన్న రచయిత్రి తండ్రిని ఇలా పరిచయం చేసారు…

‘’ఒక మనిషి కష్టాల్లో కూడా నిబ్బరంగా ఉండటం మీరు చూసి ఉంటారు. ధైర్యంగా ఎదుర్కోవటం కూడా చూసి ఉంటారు. కానీ అసలు ఇది కష్టం అన్న విషయం ఆయన మర్చిపోయి పక్కవాళ్లని కూడా మరిపించేలా చేయగలిగిన వ్యక్తిత్వం మా నాన్నది.’’

తండ్రి మరణం గురించి చెబుతూ ఓ యుద్ధ వీరుడు వీరమరణం పొందితే దేశానికి కలిగే గర్వం లాంటి భావన మాత్రమే కలిగింది అన్నారు వసుధారాణి. తండ్రితో గడిపిన బాల్యం ఆమెకు జీవించటంలో ఉన్న ఆనందాన్నే పరిచయం చేసింది. తననొక ధీరను చేసింది.

మూడవ వ్యక్తి రచయిత్రి పెద్దక్క. సరస్వతక్క భావుకత, పక్కవారి కోసం ఆలోచించే మంచిమనసు గురించి చెపుతూ, ఆమె నుంచి తాను ఎన్ని మంచి విషయాలను నేర్చుకున్నారో రచయిత్రి చెపుతారు. చిన్న వయసులో అకస్మాత్తుగా తమను వదిలి వెళ్లిపోయిన అక్క స్మృతి చదువుతుంటే కళ్లు చెమర్చక మానవు. మా అక్క కూడా ఇలా అనారోగ్యంతో మమ్మల్ని చిన్న వయసులోనే వదిలి వెళ్లిన జ్ఞాపకం ఊపిరాడనీయలేదు.

ఈ పుస్తకం నిండా పరుచుకున్న ఒక పెద్ద కుటుంబం, కుటుంబంలోని వ్యక్తులు మనవారేనన్న భావం కలుగకమానదు. వారి మంచి చెడ్డలు, కష్టసుఖాలు అన్నీ మనవేనన్నంత సహజమైన అనుభూతికి లోనవుతాం.

ఎవరమైనా మనకి చెందినవాళ్లను, మనకు చెందిన విషయాలను పూర్తిగా ‘’పొసెసివ్’’ అనుకుంటాం, మనవి మాత్రమే అని ఫీలవుతాం. కానీ రచయిత్రి వసుధారాణి తన కుటుంబంతోనూ, అందులోని సభ్యులతోనూ తనకున్న అనుబంధాన్ని చదువరులకి సైతం స్వంతం అనిపించే నిజాయితీతో మన కళ్లముందుంచారు. ఇలాటి పుస్తకం ఒకటి సమాజానికి ఎంతో అవసరమన్నది నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఎందుకంటే మంచి, చెడు, కష్టం, సుఖం అన్ని అనుభవాల్లోనూ వ్యక్తులు ఎలా స్పందిస్తారు, ఎలా స్పందించాలి అన్నది ఒక వాస్తవ జీవిత పాఠం ఎవరికైనా జీవితాలను వెలిగించుకుందుకు ఎంతో, ఎంతో అవసరం. అది మరిన్ని జీవితాల్ని ప్రభావితం చేసి దీపధారిగా పనిచేస్తుంది.

మంచి అనుభవాల్ని అందరితో పంచుకున్నందుకు వసుధారాణి గారికి అభినందనలు. రచయిత్రి బాల్యం వైవిధ్యమైనదన్న విషయాన్ని గుర్తు చేసి కథలుగా రాయమన్న కల్యాణీ నీలారంభం గారికి కృతజ్ఞతలు. ఆమె ప్రోత్సాహమే కదా ఈ పుస్తకానికి రూపునిచ్చింది.

సమంతా గ్రాఫిక్స్ వారు ఈ పుస్తకాన్ని ఆగస్టు, 2021 ముద్రించారు. పుస్తక ముఖచిత్రం రచయిత్రి వసుధారాణి గారి కోడలు స్నిగ్ధ తీర్చిదిద్దారు.

* * *

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.