* * *
మాదొక ఆకుపచ్చని సమూహం!
అవును, అరణ్యమనే అనండి!
నిటారుగా నిలబడి ఆకాశపు అంచులకు పహరా కాస్తుంటాం,
అయినా, మట్టి పొత్తిళ్లలో పసిపాపలమై ఒదిగిపోతాం!
మా గుండెల్లోంచి గుండెల్లోకి శ్వాసని నింపుతుంటాం!
నిరంతరం హర్షాతిరేకంతో ఆనంద నృత్యం చేస్తుంటాం!
మా ఒడిలోకి చేరే కువకువల్ని మనసారా పొదువుకుంటాం.
ఇన్నింటి మధ్యా, ఋతువుల్ని లెక్కెట్టుకుంటూనే ఉంటాం.
ఇష్టమైన ఋతువొకటుంది!
పరిమళమై వెల్లువెత్తే ఋతువు!
కాపుకాచి, ఆషాఢపు అల్లరి మబ్బుల్ని తేలిగ్గా తరిమికొడతాం.
కాటుక సింగారంతో మరింత చిక్కనై రమ్మంటాం!
అడవంతా ఒక్కటై ఆలపించే అనుభూతిరాగం,
హోరుమంటూ వచ్చే వర్షగీతి!
ఉరుముతో తట్టి, మెరుపుతో పలకరించి,
ఎదురుచూపుల వాకిలి దాటి వచ్చే చినుకు అతిథులు!
ఏటేటా వచ్చే వేసవి విడుదులు అవుతాయి.
చెట్లన్నీ సాయంకాలం ఇల్లు చేరిన బడిపిల్లల్ని భుజాలకెత్తుకున్న మురిపెమవుతాయి!
నిలువెల్లా స్పర్శించే అమృత ధారలకి
జేజేలు పలుకుతూ ఉత్సవ సంబరమవుతాయి.
ఇంతలో…
ప్రగతి బాజా మోగింది!
సమూహం పలుచబడింది, చెదిరిపోయింది,
చెట్టుతో పాటు మట్టీ మాయమైంది!
ఎడతెగని నున్నని రహదారులైంది,
లెక్కకుమించి నివాసాలైంది.
ఎండకి బొబ్బలెక్కి తారురోడ్డు సాగిసాగి పరుగెడుతోంది,
సేదదీరే నీడ లేక ఉక్కిరిబిక్కిరవుతోంది.
కొమ్మెక్కి, రెమ్మెక్కి, పిట్ట గూడెక్కి ఊయల్లూగే ముత్యపు నీటిబొట్లేవి?
పిల్లలు కాగితప్పడవలై ఈదులాడే వాననీటి మడుగులేవి?
రాత్రంతా కప్పల పాట కచేరీలేవి?
బరువెక్కిన మబ్బు కబురట్టుకొచ్చే గాలి సైన్యమేది?
చల్లగాలికి ఎగిసి, ఎదురెళ్లి ఆలింగనం చేసుకునే దుమ్ము మేఘమేది?
ఆవలి తీరంనుంచి ఎగిరెగిరి వచ్చిన పిట్ట డస్సిపోయింది!
ఎడారిలాటి దూరాన్ని దాటనే లేదు,
గాలి స్థంభించింది, పాట ఎండిపోయింది!
రహదారి వారగా మిగిలిన మట్టిపిసరు మీద
ఉస్సురంటూ గింజని విదిల్చి,
రేపటి ఆకుపచ్చని వనాల్ని కలవరిస్తూ
జీవితేచ్ఛతో తిరుగు ప్రయాణమైంది!
* * *