* * *
చదువు, కెరీరంటూ నాన్న గీసిన గిరులు ధిక్కరించనందుకు
లోకం ప్రయోజకుడన్న ముద్ర వేసి, పొంగిపొరలే జీవన భాండాన్ని అందించింది!
ఎప్పుడో ఈ అన్ని హోదాల వెనుక , అన్ని పరుగుపందేల వెనుక
నిశ్చింతగా పెనవేసుకు నిద్రపోయే భార్యో, కూతురో,
ఏ నిద్రపట్టని నిశిరాత్రి నిశ్శబ్దమో, ఏ ఒంటరి సుదూర ప్రయాణమో,
నాలోని నన్ను బయటపడేసే యత్నం మొదలెడుతుంది!
అప్పుడు,
అకస్మాత్తుగా మొదలవుతుంది గుండెపట్టని దిగులు…
ఏనాటిదో డైరీ పేజీల మద్య దాచుకున్న తొలి కవితా పంక్తులు!
‘ఈ పిచ్చి రాతలు కడుపునింపవని’ వీపున చరిచి,
తను నమ్మిన జీవిత సత్యాల్ని నాలోకి ఒంపే యత్నంలో తనే గెలిచి,
భాష యెరుగని ప్రవాస దేశంలో చదువుకొమ్మంటూ తరిమికొట్టిన నాన్న!
బిక్కుమనే తనానికి స్నేహపు పూతరేకులద్ది,
లోకపు గెలుపులకోసం నడక ఆరంభించిన రోజులు!
జీవితం-
నేను నేనుగా మాత్రమే ఎప్పటికీ మిగలాలన్న ప్రాకృతిక భావాన్ని,
నా జీవనాభిలాషల్ని దోచుకుని,
నేనేమైపోయానో అర్థం కాని జడత్వాన్ని
ప్రపంచానికి పనికొచ్చే చైతన్యాన్ని మాతం నాలో మిగిల్చింది!