* * *
రాబోయే రహదారుల వెంట నాకోసం ఏదో అద్భుతం
దారికాచి మరీ వేచి ఉందనే ఆశ
నన్ను ప్రతి మలుపులోనూ ఉత్సాహంగా నడిపిస్తుంటే
సహ పధికురాలివై కలిసిన నిన్ను కాస్సేపు విన్నాను!
ఇవన్నీ ఎప్పుడో విన్నవేనన్న భావం!
మాట్లాడుతూ మాట్లాడుతూ,
చీకటి గుహల్లోకి మాయమైపోతావ్!
అంతలోనే అగాధాల్లాంటి సముద్రలోతుల్లోకి మునకలూ వేస్తావ్!
కబుర్లకి విశ్లేషణల రెక్కలు తొడిగి,
సిధ్ధాంతాల రూపులు దిద్దుతావ్!
నీభాష నాకింగా అలవడలేదు సుమా!
అందుకే కాస్త దూరందూరంగానే తచ్చాడుతున్నానేమో!
అయినా నీ పలకరింపులో చిక్కదనం
నన్నో పరిమళమై అల్లుకుపోయిందన్నది వాస్తవం!!