* * *
అవి మాఘ మాసారంభపు రోజులు!
మంచు తెరలు ఒకింత త్వరగా కరిగి
మాయమవుతున్నవేళ!
తూర్పు వాకిట్లో
వెలుగుపువ్వుల ముగ్గులేసేందుకు
ప్రకృతి యవత్తూ సమాయత్తమవుతున్న వేళ!
అలవాటైన దారుల వెంట
చిరువెచ్చని కాంతులు
నిశ్శబ్ద ప్రవాహాలవుతున్న వేళ!
… … … ఎక్కడో దూరంగా వినిపిస్తున్న
పాపాయి ఏడుపు!
బధ్ధకపు దుప్పట్లో
మరింతగా ఒత్తిగిల్లుతున్న నిద్ర
మెలకువవుతున్న వేళ!
మడతపెట్టేసిన శరీరాన్ని ఒక్కసారి దులిపి
పక్క దిగుతున్న వేళ!
కిటికీ బయట ప్రహరీ మీదుగా నైట్ క్వీన్ ని నిద్ర
కమ్ముతున్న వేళ!
గడియారపు ముల్లుకు కట్తిన కొంగుని,
ప్రపంచమంతా చుట్టి తనలోకి లాక్కున్న అమ్మ
పరుగు ఆరంభించే వేళ!
అవును, అది ఏ మాసమైతే ఏమిటి?