* * *
ఆరోజు ఇంటికొచ్చే దారిలో హలో అంటూ పలకరించారు నలుగురు పిల్లలు. బహుశా తొమ్మిదో, పదో తరగతుల్లో ఉండొచ్చు.
‘’మేము ఎస్సెస్సార్ వారియర్స్. మీకు తెలుసుకదా, ఎస్సెస్సార్ చనిపోవటం కొన్ని అనుమానాలను కలిగిస్తోందని. దీనిగురించి ప్రపంచమంతా న్యాయం కావాలంటూ పోరాడుతోంది. మేము కూడా పోరాటాన్ని చేస్తున్నాం. ఇదంతా ప్రస్తుతం వర్చ్యువల్ గానే జరుగుతోంది. అతని గురించి ఏదైనా రాసిస్తారా మాకోసం, ప్లీజ్!?’’ అంటూ అడిగేరు.
ముంబాయి సంఘటన దూరానున్న ఈ చిన్న పట్టణంలో వీళ్లల్లో ఇంత పోరాట స్ఫూర్తిని కలిగించిందంటే ఆశ్చర్యం వేసింది. ‘’నేనెలా తెలుసు’’ అని అడగబోయేంతలో ‘’మీరు మాకెప్పటినుంచో తెలుసు’’ అనేసారు.
‘’ఎస్సెస్సార్ సినిమా నటుడు అవటం వల్లనేనా ఈ పోరాటం?’’ అంటే,
‘’అందుక్కాదు, అతను జీవితంలో ఎన్నో కలలు కన్నాడు. ఎంతో కష్టపడ్డాడు. ఒక్కక్క మెట్టూ ఎక్కుతూ జీవితాన్ని గెలుస్తున్నాడు. ఇలాటప్పుడు ఆత్మహత్య చేసుకునేందుకు కారణం ఏముంటుంది? ఏదో జరిగింది. అదేమిటో తెలియాలి. అందుకే మేమంతా ఏదైనా చెయ్యాలనుకుంటున్నాం’’ అంటూన్న వాళ్ల ముఖాలు ఆవేశంతో ఎరుపెక్కాయి. గొంతు స్థిరంగా, గట్టిగా ధ్వనించింది. ఈ వయసు పిల్లలు తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడటం బావుంది.
మీరే రాయచ్చుగా అంటే, ప్లీజ్ అనేసేరు.
ఒక మరణం ఇంతమందిని ఒక్క దగ్గర చేర్చిందంటే గొప్పగా అనిపిస్తోంది. ఇలాగే చుట్టూ జరుగుతున్న అనేకానేక సంఘటనల్లోని మంచిచెడులను ప్రశ్నించేందుకు యువత సిధ్ధంగా ఉంటుందని ఆలోచిస్తే భవిష్యత్తు మీద ధైర్యం కలుగుతోంది.
ముంబైలో మరణించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతోంది. ఆ వార్త విషాదంతో పాటు దిగ్బ్రాంతిని కలిగించింది. గత కొన్ని నెలలుగా మనసున్న ఎందరో తమ రోజువారీ జీవితాలను, స్వంత పోరాటాలను పక్కన పెట్టి ఈ అంశాన్ని గురించే మాట్లాడుతున్నారు.
సుశాంత్ ఎవరు? భారతదేశంలో బీహార్ లోని పట్నాలో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అబ్బాయి. స్కూల్ చదువులో పెద్దగా ప్రతిభను కనబరచకపోయినా తెలివైన పిల్లవాడిగా, సైన్స్ పట్ల అపారమైన ఆసక్తి కలిగిన వాడిగా పెరిగాడు. పుస్తకాలను విపరీతంగా చదివేవాడు. నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ లో మంచి ర్యాంక్ ను గెలుచుకుని, దిల్లీలో ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ తెచ్చుకున్నాడు. చదువుకుంటూనే ఇష్టంతో డాన్స్ క్లాసుల్లో చేరాడు. క్రమంగా థియేటర్ వైపు నడిచి, అక్కడినుంచి టి.వి. సీరియల్స్, ఆ తర్వాత సినిమాల వరకు అతని ప్రయాణం సాగింది.
ఎక్కడా షార్ట్ కట్స్ లేవు. ఎలాటి గాడ్ ఫాదర్ లేడు. అయినా విజయం తరువాత విజయం వైపుగా ఎదుగుతూనే ఉన్నాడు. అతని వ్యక్తిత్వం, దాతృత్వం ఆ విజయాలకంటే గొప్పవని చుట్టూ ఉన్న ప్రపంచం గుర్తించింది.
తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తూ యువతకు ఒక మోడల్ గా నిలిచాడు. నలుగురు అక్కల మధ్య పెరిగినందువల్లనేమో ఆడపిల్లలు స్వీయ రక్షణను నేర్చుకోవాలని, స్త్రీలు ఎంట్రప్రెన్యూర్లుగా ఎదగాలని కోరుకుంటూ, తనవంతు కృషి చేసాడు.
ఇతను అందరిలాగే కలలు కన్నాడు. నెరవేర్చుకోవలసిన ప్రతి కల గురించీ డైరీలో రాసిపెట్టుకునేవాడు. యాభై కలలలో పన్నెండు మాత్రమే నెరవేర్చుకోగలిగాడని అతని మరణం తరువాత తెలిసింది.
కలలు కనే అర్హత, అవకాశం అసలు మధ్యతరగతి వారికే ఉందేమో అనిపిస్తుంది. అన్నీ అందుబాటులోనే ఉండే పై స్థాయివారికి కలలు కనేందుకు ఏమీ మిగలదు. కింది స్థితిలో ఉన్నవారికి రోజూవారీ జీవితాలే పెద్ద సవాళ్లు. కలలు కనే తీరిక, ఆసక్తి తక్కువ.
స్వయం కృషితో సాధించిన గెలుపుదారుల్లోంచి, అర్థాంతరంగా ఈ యువకుడు ఎలా మాయమైపోయాడు? సమాధానం కోసం ఎందరెందరో ఒక్కచోటకి చేరారు.
భవిష్యత్తు మీద ఎలాటి కలలూ, ఆశలూ లేని యువతను ఊహించలేము. అలాటి ప్రపంచం నిరాశలో మునిగి, నడక మరిచిపోతుంది. స్తంభించిపోతుంది. భవిష్యత్ తరాలు కనే బంగారు కలలు నిజమవుతాయన్న ధైర్యాన్నిచ్చేందుకే మనం ఈ పోరాటాన్ని చేస్తున్నాం.
మరొక సుశాంత్ సింగ్ మనకొద్దు.
ఆ పిల్లల కోసం రాసినది సిధ్ధం చేసి, లేచాను.
* * *