* * *
ఫిబ్రవరి నెల నడుస్తోంది.
దక్షిణభారతంలో చలి అనేది అంతో ఇంతో, అంటే ఒక దుప్పటి పలుచనిదైనా కప్పుకునే అనుభవం తెచ్చే ఒకటి, రెండు నెలలు వెనక్కివెళ్లిపోయాయి. వాతావరణంలో వేడి కొద్దికొద్దిగా అనుభవంలోకి వస్తోంది. సాయంకాలపు నడక ఎంతో ఇష్టమైన వ్యాపకంగా మారింది.
నడుస్తుంటే చుట్టూ పరుచుకున్న ప్రకృతి నన్ను చూస్తోందా? నాతోపాటే తనూ నడుస్తుంది కదా. నేను నా ఆలోచనల్లో మునిగి చుట్టూ ఉన్న పరిసరాల్ని చూస్తున్నానా? అంటే కళ్లతో కాదు. హృదయంతో. ఎందుకో ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యుడు, దారిపక్కన నిటారుగా నిలబడిన తాటిచెట్లు నన్ను గమనిస్తున్నట్టే అనిపిస్తుంది. అప్పుడప్పుడు తలెత్తి వాటిని వివరంగా చూసి చిన్నగా నవ్వుతాను. అవీ నవ్వినట్టు తోస్తుంది. ఏం చెబుతున్నాయివి ఈరోజు అని ఆలోచిస్తాను. నా మనసులో వచ్చిన ప్రతి ఆలోచనా వాటికి తెలుసన్నట్టు చూస్తుంటాయి.
వెనక్కి తిరిగి ఇంటి దారి పట్టినపుడు ఏదో దిగులు పుడుతుంది. రాత్రంతా అలా చీకటిలో ఆకాశం కింద ఒంటరిగా నిలబడిపోయే ఆ చెట్లు, వాటి కొమ్మల్లోని గూళ్లల్లోకి ఒదిగిన పిట్టలు ఆ నిశ్శబ్దంలో ఎలా ఉంటాయో!
రాత్రిని చూస్తే భలే భయం వేస్తుంది ఒక్కోసారి. పగలంతా పనులు చేసుకుని నిద్రకి మళ్లే రాత్రులంటే ఇష్టం ఉంది. రాత్రయ్యేసరికి నిద్రనిచ్ఛి కన్నులకే కాక మొత్తం జీవన వ్యాపారానికి విశ్రాంతినిచ్చి, మరో కొత్త ఉదయంలోకి తాజాగా నిద్రలేపే రాత్రులు ఇష్టమే. అయినా ప్రయాణాల్లో ముఖ్యంగా రైళ్లల్లో, రోడ్డు ప్రయాణాల్లో రాత్రులంటే భలే భయం. సినిమాల్లోనూ, వాస్తవ సమాజంలోనూ జరుగుతున్న దౌర్జన్యాలు, హింస గుర్తొస్తాయి. చీకటంటే కంటికి కనిపించనిదేదో మనల్ని మాయ చేస్తోందని భయమేస్తుంది.
చీకటి చల్లగా ఉండటం కూడా చాలాసార్లు అనుభవంలోకి వస్తుంది. చీకటి రాత్రుల్లో ఆకాశంలో చుక్కలు ఎంత వెలుగుల్నిస్తాయనీ! పౌర్ణమి రోజుల్లో అవన్నీ ఎక్కడ దాక్కుంటాయో, వాటి వెలుతురంతా పౌర్ణమి చంద్రుడు మింగేస్తాడు కాబోలు! లేకపోతే చంద్రుడికి ఆకాశాన్ని, ప్రపంచాన్ని అప్పగించి విశ్రాంతి కోసం వెళ్తాయేమో చుక్కలన్నీ!
గత సంవత్సరకాలంగా ప్రపంచాన్నివణికిస్తున్న వైరస్ మనిషి జీవితానికి ఇంతకు ముందెప్పుడూ లేని కొన్ని నిబంధనల్నితెచ్చింది. ఎంతటి సాహసీ కూడా అతిక్రమించే వీలు లేదు. అది ఆత్మహత్యా సదృశం అని అందరికీ అర్థమైంది. పరిస్థితి కాస్త మెరుగవుతోందని ఇంటి కాంపౌండ్ దాటి ఇప్పుడిప్పుడే వీధుల్లోకెళ్లే ఆలోచన చేస్తున్నారు నెమ్మదిగా. కాలనీ రోడ్డులో నడుస్తున్నాను.
రోడ్డుపక్క మట్టిలో దిగాలుగా పడుకున్న కుక్క తలెత్తి ఎందుకో నావైపు చూసింది. అది చాలాసార్లు అలాగే అక్కడే పడుకుని దొర్లుతూ ఉంటుంది. నన్నుచూస్తుంది. అంటే రోడ్డు మీద వెళ్లే చాలామందిని చూస్తుంటుందేమోలే! కానీ ఆరోజు నడక పూర్తై వెనక్కి మళ్లినప్పుడు బధ్ధకంగా నిద్రలోంచి లేచినట్టు లేచి, ఒళ్లు దులుపుకుని ఉన్నట్టుండి గొంతెత్తి ఓ అరుపు అరిచింది. ఉలిక్కిపడ్డాను. ఇందాక చూసినప్పుడు ముఖంలో ఉన్న దిగులు ఏమైందో! ఆ, అవును అప్పుడు కొన్నికుక్కలు దాని పక్కగా వెళ్తూ ఏదో అన్నాయి. నాకు అర్థం కాలేదు కానీ ఈ పడుకున్న కుక్కకి అర్థమైంది కాబోలు. బద్ధకం వదలక ఇందాక అలా చూస్తూ, కళ్లు మూస్తూ ఊరుకుంది. ఇప్పుడింక విశ్రాంతి ఇచ్చిన బలంతో సమర శంఖం పూరించినట్టు లేచి బయలుదేరింది. నిజమో కాదో ఎవరు చెబుతారు అనుకున్నాను. నవ్వొచ్చింది నా ఆలోచనలకి.
మా ఇంటి పరిసరాల్లో మిగిలిన కాస్త పొలం దగ్గర కాస్సేపు నిలబడటం అలవాటు నాకు. ఆ మాత్రంగా కంటికి మిగిల్చిన పచ్చదనాన్ని చూస్తూ ఆ రైతు మంచి మనసుని తలుచుకోవటం దినచర్యగా తయారైంది. అస్తమిస్తున్న సూర్యుడి నారింజ కిరణాల మధ్య ఆకుపచ్చని పైరు హాయిగా నవ్వుతోంది. ఫోన్ లో ఆ దృశ్యాన్ని పదిలపరుచుకుంటున్నా, చాలా రోజులకి తోటకూర అమ్మే అవ్వ ఖాళీ గంపతో ఎదురొచ్చింది. ఎప్పటిలాగే నవ్వింది. ఆ ముఖంలో ఎప్పుడూ ఒక వెలుగు కనిపిస్తుంది.
‘’ఒక్కసారి నిలబడు, పైరు రంగులో కలిసిపోయేలా ఉన్నావు. నువ్వు కట్టుకున్న ఆకుపచ్చ చీరెతో ఫోటో తీస్తా’’ అంటే చక్కగా గంపతో సహా పోజిచ్చింది. ఆనక వీడ్కోలు చెబుతూ, టీ తాగాలనుకుంటున్నానంది. అవ్వ గడుసుదనం నాకు తెలుసున్నదే. ఆమెకు కావలసినదిచ్చి, ఆ వెలుగుతున్న ముఖాన్ని మరోసారి మనసులో ముద్రించుకున్నాను. నేను తీసిన ఫోటోలో ఆ వెలుగు వచ్చిందో లేదో ఇంటికెళ్లాక గమనించాలి.
* * *