* * *
ఫోన్ మోగటం నా విషయంలో కాస్త తక్కువే. ఎక్కడ చూసినా కళ్లు, చెవులు, చేతులు మొబైల్ ఫోన్ కి అప్పగించే మనుషుల్ని చూస్తుంటే వీళ్లందరికీ ఇన్నిన్ని కబుర్లు ఎక్కడినుంచి వస్తాయో అని ఆశ్చర్యం గా ఉంటుంది. బొత్తిగా అలవాటు లేని వ్యవహారం. అయితే ఎప్పుడూ ఫోనెత్తి ఎవరినీ పలకరించనన్నది నా సర్కిల్ లో అందరికీ నా మీదున్న ఏకైక కంప్లైంట్. కానీ ఆ అలవాటు అలాగే ఉండిపోయింది. ఎప్పుడో మరీ బతికున్నానా లేదా అన్నట్టు స్నేహితులు పలకరించి, ‘’ఓహో ఉన్నావా?’’ అని విసుక్కుంటూంటారు.
మొండివాళ్లు బలవంతులట! మొండితనం కాదంటే నమ్మరు. ఇలాగే ఒకసారి పన్నునొప్పని డాక్టర్ దగ్గరకెళ్తే నాకు సమస్య ఉన్న పన్నే కాక మరోటి కూడా సమస్యాత్మకం కాబోతోందని, పరిష్కరించుకొమ్మని డాక్టర్ సలహా ఇచ్చారు. కానీ ఇప్పటికేమీ సమస్య లేదు కదా డాక్టర్ అంటూ వాయిదా వెయ్యటం చూసి ఆయన చురుక్కున మీరు భలే మొండివారండీ అనేసాడు. అదేమిటో అలా పేషెంట్ ని అనచ్చా? డాక్టర్ కి అధికారం ఉంటుందా? నా పన్ను, నా నిర్ణయం కదా. అది నా ప్రైవేటు విషయం కాదా?!
మాలతి చాలారోజులకి ఫోన్ చేసింది. మా సంభాషణ దేశంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి నడుస్తోంది. మాలతి మాట్లాడదలచుకున్నది వేరేదో ఉందని అనిపిస్తోంది. సాధారణంగా ఇద్దరం ఫోన్లకు, పోచికోలు కబుర్లకు దూరంగా ఉంటాం. అక్కడికి సమయం అంతా అద్భుతమైన చైతన్యంతో గొప్ప పనులేవో వెలగబెడుతున్నట్టు కాదు కానీ, చిన్నప్పుడు స్కూల్లో పి.టి. టీచర్ సరోజిని గారు సమయం వృధా చెయ్యకూడదు, జరిగిపోయే ప్రతి నిముషం మనది కాదు. డబ్బులు పోగొట్టుకున్నా సంపాదించుకోగలం కానీ సమయాన్ని అలా సంపాదించుకోలేం అని చెబుతుండటం ఇప్పటికీ ఇద్దరికీ బాగా జ్ఞాపకముంది.
నేనే కదిపాను, ‘’ఏదో చెప్పాలనుకుని మర్చిపోయావా? చాలా మాట్లాడేసుకున్నాం ఇప్పటికే’’ అంటూ మాలతికి అడ్డువెళ్లాను. అవునంది వెంటనే.
కూతురు, దాదాపు ఇరవైయేళ్ల పిల్ల, తన విషయాలేవీ తమతో, అంటే తల్లిదండ్రులతో చెప్పకుండా నిర్ణయించేసుకుంటోందని, కనిపెంచిన వాళ్లన్న గౌరవం, అభిమానం అసలే లేవని ఆవేశంగా చెప్పింది. డిగ్రీ చదువులకొచ్చిన పిల్ల ఆమాత్రం స్వతంత్రంగా ఉండటంలో తప్పేముంది? అదీకాక చిన్నప్పట్నుంచి ‘’ధరణి’’ స్వంత గొంతున్న పిల్ల. అప్పట్లో ఆ విషయాలన్నీ మాలతి గర్వంగా చెప్పేది. ఇక ఈ వయసుకి స్వతంత్రంగా ఉండటం కొత్తేముంది? సూటిగా అడిగితే మాలతి నొచ్చుకుంటుందని కొంచెం నెమ్మదిగా నసిగాను, ధరణి చురుకైన పిల్ల కదా అంటూ.
‘’నిజమే, కానీ ప్రతి విషయం ప్రైవేట్ అంటుంది. ఏదైనా చెయ్యదలచుకున్నా మా చెవిన వెయ్యదు. ఆ తర్వాత తన స్నేహితుల ద్వారానో, మరోరకంగానో విషయం మా దృష్టికి వస్తుంది. తన నిర్ణయాలు, పనులు తనని ఎలాటి ప్రమాదంలో పడెయ్యగలవో తలుచుకుంటే భయం వేస్తోంది. ఆమధ్య కాలేజీ నోటీస్ బోర్డ్ లో ఎవరికో ఫలానా ఆసుపత్రిలో, ఫలానా గ్రూపు రక్తం కావాలని చూసిందట. రోజూ కాలేజీ అయ్యాక స్నేహితులతో కలిసి ఇంటికొచ్చే పిల్ల ఆరోజు తనకి వేరేపని ఉందని చెప్పి ఒంటిగా ఆ ఆసుపత్రికి వెళ్లి, రక్తం ఇచ్చి వచ్చింది. కాలేజీలో ఏదో స్పెషల్ క్లాసుంది కాబోలనుకున్నాం. ఇంటికొస్తూనే నీరసంగా ఉందంటూ పడుకుంటానంది. భోజనం చెయ్యమంటే బలవంతంగా రెండు ముద్దలు తింది. రాత్రంతా వాంతులు అయి, చాలా నీరసం అయిపోయి, వేళ్లాడిపోతోంది. తెలవారుతూనే మాకు తెలిసిన డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లాం. పరిస్థితి చూస్తూనే డాక్టర్ ధరణిని హాస్పిటల్ లో జాయిన్ చెయ్యమని, వెంటనే సెలైన్ ఎక్కించటం మొదలు పెట్టి వరసగా నాలుగైదు బాటిళ్లు ఎక్కించేక పిల్ల స్పృహలోకి వచ్చింది.
డాక్టర్ అడిగారు, ‘’ముందురోజు ఏమి తిందని’’. అదివరకోసారి కాలేజీ దగ్గర బండి మీద పుచ్చకాయ ముక్కలు తిని జబ్బుపడిన విషయం ఆయనకు గుర్తే. ఆ క్రితం సాయంకాలం జరిగినదంతా చెప్పుకొచ్చింది. నాకు బుర్ర తిరిగిపోయింది. ఆసుపత్రిలో ఎలాటి నీడిల్స్ వాడారో, ఎంత రక్తం తీసుకున్నారో ఎలా తెలుస్తుంది? మా ఆయన ఊళ్లో ఉండి ఉంటే ఉన్న ఒక్క పిల్లని సరిగా పెంచటం చేతకావట్లేదని అందుకునేవారు. అదో బాధ తప్పిందిలే.
ఇంతకీ, అన్ని విషయాలూ ప్రైవేటు, పర్సనల్ అయితే మరి కుటుంబాలు ఎందుకు? తల్లిదండ్రులకీ పిల్లలకీ, భార్యాభర్తలకీ అందరికీ కూడా పర్సనల్ స్పేస్, ప్రైవేటు జీవితాలు అంటే ఇక మంచీ చెడూ చెప్పుకోటం మానేసి ఒకరికొకరు ఏం కానట్టు బతికెయ్యటమేనా? ఇదేమైనా బావుందా?’’ అంటూ ముగించింది.
సరే, ఈ స్వతంత్రాలు మనకి కొత్తేమిటి?
ఇదివరకు కాలేజీ చదువులకి రాకుండానే మేము అమ్మానాన్నలతో ‘’నా కిలా ఇష్టం, నాకది ఇష్టం లేదు’’ అంటూ బలంగా బల్లగుద్ది చెప్పిన సంగతి ఇంకా మరుపులోకి వెళ్లలేదు. ఇప్పుడీ గతమంతా తవ్వితే మాలతి నన్నూ విసుక్కుంటుంది. పైగా తనంటే కొంచెం కూడా స్నేహం లేదంటుంది. అందుకే,
‘’ఇవాళారేపూ అందరూ స్వంత ఆలోచనలతో పుట్టి పెరుగుతున్నారు. ఆమేరకు పెద్దవాళ్లకు కాస్త బరువు తగ్గింది. స్వంత వ్యక్తిత్వం, స్వయం నిర్ణయాధికారం అన్నప్పుడు చక్కగా ప్రోత్సహించి ఆయా ఆలోచనలకు వాళ్లే బాధ్యులన్నది వాళ్లకి తెలియజెప్తే చాలుతుంది కదా. అలాటి ఆలోచనలు లేకపోతే వాళ్లు వెనకబడిపోవటం ఖాయం’’ అని చెప్పాను. ఎవరి పనులకు వాళ్లు బాధ్యులైతే అంతకన్నా కావలసినదేం లేదన్నాను.
మాలతి కాస్త అయోమయంలో పడింది. వెంటనే, ‘’అయితే ఇప్పుడు మా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు చేస్తారని చెబుతున్నారు. ఉద్యోగులు గొడవ పెడుతున్నారు. ఈ ప్రైవేటు మంచిదా కాదా’’ అంటూ అడిగింది. ప్రసంగ విషయం మారింది.
‘’ఈ ప్రైవేటు మంచిదాకాదా అంటే మంచిదనీ చెప్పచ్చు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో సంస్థలు వృధ్ధిలోకి వస్తాయికదా. కానీ మన జనానికి ప్రతిదానికీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవటం హాయిగా ఉంటూంది. అకౌంటబిలిటీ లేకుండా నిష్పూచిగా బతికెయ్యటం అలవాటైపోయి ప్రైవేటు రంగంలోకి దారితీస్తే తమపైన బాధ్యత పెడతారన్న దిగులు, తమ ప్రైవేటు జీవితాలు రోడ్డున పడిపోతాయన్న బెంగ వాళ్లచేత హర్తాళ్లు చేయిస్తోందేమోలే’’ అన్నాను నా మిడిమిడి జ్ఞానంతో. ఇలాటి విషయాలు నేనేం చెప్పగలను? ఇంట్లో స్వతంత్రాలు గురించైతే కాస్త చెప్పగలను. ఎందుకంటే నా ఇంట్లో నడుస్తున్న విషయం ఇదే కనుక.
‘’అవునా, చుట్టుపక్కలంతా ఇదే విషయం మాట్లాడుతుంటే నాకు అర్థంకాక అడుగుతున్నాను. అయితే ప్రైవేటు చేస్తే మంచిదేనంటావా’’? అంది అమాయకంగా.
‘’హాయిగా చెయ్యొచ్చు. ప్రైవేటు యాజమాన్యమైతే సాంకేతికతకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, చక్కగా కొత్త మెలకువలు నేర్పుతారు. పైగా పనిచేసేవాడికి, చెయ్యని వాడికి ఒకేరకంగా కాకుండా బాధ్యతగా కంపెనీకోసం శ్రమపడే వాళ్లకి ప్రోత్సాహకాలు ఇస్తారు. ప్రొమోషన్లు ఇస్తారు కూడాననుకుంటా’’ అన్నాను.
కాస్సేపు ఇద్దరం ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల గురించి మాట్లాడుకున్నాం. టాటా, బిర్లాలు దగ్గర్నుంచి అంబానీల వరకు ఎలాటి విజయాల్ని స్వంతం చేసుకున్నారని గర్వంగా చెప్పుకున్నాం.
మాలతికి మనసులో ఇంకా ఏదో సలుపుతోంది. ‘’అయితే ధరణి తన జీవితం, తన ప్రైవేట్ విషయం అంటే అది రైటేనంటావా?’’ అంది మళ్లీ.
‘’అంతేకదూ, తెలివైన పిల్ల. స్వయం నిర్ణయాధికారం, స్వతంత్రం చిన్నప్పట్నుంచే అలవాటైన పిల్ల. శుభ్రంగా పైకొస్తుంది’’ అన్నాను. మాలతి సంతోషించింది.
‘’ఫోన్ పెట్టేయనా, కాస్త ఎక్కువసేపే మాట్లాడుకున్నట్టున్నాం’’ అంది.
నిజమే, ఒక్క గంటా పది నిముషాలే.
ఇంట్లో మావాడున్నాడు అన్నీ ధరణి లాగే ప్రైవేటనే అంటాడు కానీ ‘’చదువు వెనకపడుతున్నట్టున్నావేరా’’ అంటే,
’స్నేహితులతో సినిమాలు, షికార్లకీ వెళ్తుంటే ఒక్కసారీ చదువు సంగతి గుర్తు చెయ్యలేదు, పైగా ఇప్పుడు వెనక పడ్డానంటావ్’’ అంటాడు. ఫోన్లుచ్చుకుని గదిలో తలుపులేసుకుని కబుర్లు చెప్పుకోటం, సినిమాలు షికార్లు తిరిగి రావటం వరకూ వాడికి స్వతంత్రం కావాలి, అది వాడి ప్రైవేట్ స్పేస్. నో ఎంట్రీ.
ఇంతకీ మాలతికి ఏదో చెప్పేను కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ సంగతి నిజంగా నాకేం తెలుసు?!
ఈ ప్రైవేటు భావాలు మనుషుల్ని మరీ విడదీసి ఒంటరితనాల్ని అలంకరిస్తున్నాయి. ముందు బాగానే ఉంటుంది. ఎవరి గొడవ లేదు కదా అనుకుంటాం. ఆనక మనల్ని పట్టించుకునే వారెవరూ లేరని డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు.
అందరూ డిప్రెషననీ, ఒంటరితనం భయపెడుతోందనీ చెప్పటం ఎక్కువైంది ఇప్పటికే.
నా సైక్రియాటిస్ట్ ఫ్రెండ్ చెబుతోంది, మనుషులు ఎవరికి వాళ్లు గిరిగీసుకుని కూర్చోటంతో అనవసరమైన దిగుళ్లు, మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయని. ఎవరికి వాళ్లుగా కాక అందరూ అందరితో కలుస్తుంటే బావుంటుందేమో. అసలు ఈ ప్రైవేటీకరణలూ, ప్రైవేట్ జీవితాలు…చాలా గందరగోళంగా ఉంది.
కొంచెం స్వేచ్ఛనీ , స్పేస్ నీ వదులుకుందామా, మళ్లీ ఒకరికోసమొకరం అన్నట్టు పాత సినిమాల్లో లాటి ఉమ్మడి కుటుంబాల్లోకి వెళ్దామా? నిద్ర వస్తోంది, ఇది నా ప్రైవేట్ విషయం సుమా. డైరీ మూసి లేచాను.
* * *