* * *
నా డైరీతో నా ఆలోచనలు అన్నీ చెప్పుకుంటాను. అందుకేనేమో స్నేహితులంటూ పెద్దగా లేకుండానే గడిచిపోయింది ఇన్నేళ్లూ! అవును, డైరీ మాత్రమే ఓర్పుగా నా సొద వింటుంది. ఎలాటి వ్యాఖ్యానాలూ చెయ్యదు. ఎలాటి తీర్పులూ ఇవ్వదు. తనతో ఏమి చెప్పుకున్నా ఎలాటి అవరోధం కలిగించదు మధ్యమధ్య. నన్ను నన్నుగా చూస్తుంది. నా లోలోపలికి చూస్తుంది. నిజాయితీని నేర్పింది. అలా అక్షరాలతో నాస్నేహం మొదలైంది డైరీతోనే.
ఈ డైరీ రాసే అలవాటు ఎన్నేళ్లదని! ఓహ్… నాన్న నా పదకొండో ఏడు నడుస్తుండగా మొదటిసారిగా డైరీ తెచ్చి రాసుకోమన్నారు.
ఆరోక్లాసు చదువుతున్నాను. పుస్తకాలను ఇష్టంగా చూసుకుంటూ, అమ్మ తెప్పించుకునే పత్రికలను ఆవిడతో పోటీగా చదివేస్తుండే నా ఇష్టాలు నాన్నకి బాగా తెలుసు. స్కూల్ నోట్ బుక్స్ లో వెనక పేజీల్లో ఏదో కవితలంటూ, కథలంటూ రాయటం నాన్న కళ్ల పడింది. అయితే అప్పుడు కోప్పడ్డారు కానీ రాసుకుందుకు నాకో ప్రత్యేకమైన పుస్తకం అవసరం అని అర్థం చేసుకున్నారు. రోజూ అదేపనిగా డైరీలో పేజీలు నింపేస్తుంటే అడిగారు, ఇన్నిపేజీలు నింపేసేవు కదా, రేపటి తేదీన ఎక్కడ రాసుకుంటావు అని. ఇంకోటి కొనివ్వు నాన్నా అని గారంగా అడిగేసేను. ఆరోజు భోజనాల దగ్గర నాన్న అమ్మతో చెప్పారు, ఇది రచయిత్రి అవుతుందిట అంటూ. నిజంగా నేను నాన్నకి ఆరోజు పొద్దున్న అదే చెప్పాను కూడా.
అదే సంవత్సరం నాకోసం ఒక ట్రాన్సిస్టర్ కొని ఇచ్చారు. విన్న ప్రతి పాట, పద్యం అదేపనిగా రాగాలు తీసే నేను ఆ బహుమతికి మురిసిపోయాను. అది నాది. కేవలం నాదే. ఇంట్లో పెద్ద ఫిలిప్స్ రేడియో ఉంది. అది నాకు వద్దు. నేను డాబా మీద కూర్చున్నా, హోం వర్క్ చేసుకుంటున్నా వివిధభారతి వింటూ ఉండేదాన్ని. హిందీ భాష పట్ల అప్పుడు మొదలైన మోహం ఇంకా గాఢంగా మారింది రానురాను. డైరీ గురించి చెబుతూ మధ్యలో ఇదేమిటంటారా? అంటే నాన్న నాకు ప్రత్యేకంగా ఇచ్చిన కానుకలు ఇవి అని చెబుతున్నా.
దశాబ్దాలుగా రాసుకుంటూనే ఉన్నాను. ఎప్పుడో ఒకసారి పాత డైరీల్లోకి తొంగిచూస్తే ఆశ్చర్యం, ఆనందం కూడా వేస్తుంటుంది. అవునూ, కోవిడ్ హడావుడీ, లాక్ డౌన్ హడావుడి నడుస్తోంది, ఎవరికి వాళ్లం అయిపోయాం. మనకి కావలసిందీ అదే, కానీ నిర్బంధంగా అమలు చెయ్యమంటేనే కదా కష్టం అనిపిస్తుంది.
సరే, ఇంతకీ మన ప్రధాని ఓ కొత్త ప్రతిపాదన చేసారు.
ఆర్థికపరమైన అంశాలను చూబిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలూ, బ్యాంకులూ ఇకపై కొత్త సంవత్సరంలోకి వస్తూ కొత్త డైరీలని, కొత్త క్యాలండర్లనీ అచ్చు వెయ్యరాదంటూ నిబంధన పెట్టేసారు. అరె, ఎవరెవరో తెలిసున్న వాళ్లు తమ సంస్థ వేసిన క్యాలెండరో, డైరీనో బహుమతిగా ఇవ్వటం జరుగుతూనే ఉంటుంది. అవన్నీ మళ్లీ మనం మరొకరికి ఇవ్వటం…ఎంత ఆనందం! ఇచ్చి, పుచ్చుకోవటంలో ఉన్న ఆనందం అనుభవించి చూడవలసిందే. అయితే మన అభిరుచికి తగిన డైరీ మనకోసం ఉంచుకుని రాసుకోటం, లేదా నచ్చినది కొనుక్కుని వాడుకోవటం ఎలానూ ఉంటుంది.
మరి ఇలా డైరీల్ని నిలిపివేసే ఆలోచన ఎలా వచ్చిందో ఈ పెద్దాయనకి? ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఇదేనా మార్గం? ఆయనకి ఒక ఉత్తరం రాస్తే ?! నిజమే. రాయాలి.
అప్పుడెప్పుడో అబ్రహాం లింకన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక చిన్న పాప అతని గడ్డం గురించి సలహా ఇస్తూ ఉత్తరం రాయలేదూ? ఆ విషయం ఒక గొప్ప విషయంగా మన దేశంలో స్కూళ్లల్లో పాఠాల్లో చదువుకోలేదూ? నేనూ అలాటి గొప్ప ఉత్తరాన్ని ఒకటి రాయబోతున్నానేమో! ఎప్పుడో ఏ ఆఫ్రికా దేశంలోనో ఏ స్కూలు అమ్మాయో నా ఉత్తరం గురించిన పాఠాన్ని చదువుకుంటుందేమో! అవును. భలే ఐడియా వచ్చింది. దీనికి కారణం పెద్దాయన డైరీల్ని అచ్చొత్తించొద్దని అనటమే. అంటే ప్రతి దానికి ఒక కారణం, ఒక ఫలితం ఉంటుందన్నమాట.
* * *