జీవితాలు సరళాలు! – ప్రతిలిపి, May. 2021

* * *                                                                  

                                    సాయంత్రం మార్కెట్ లో కనిపించింది సరళ. వాళ్లు, మేము ఇదివరకు ఒకే వీధిలో ఉండేవాళ్లం. ఇల్లు కట్టుకున్నాక మేము ఇటు వచ్చేసాం. ఎప్పుడైనా ఇలా కలిసినపుడు కొత్తగా వెలిసిన కాఫీ డే లో కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకోవటం చేస్తుంటాం. అలవాటుకు భిన్నంగా కాస్సేపు ఇంటికొచ్చి వెళ్లకూడదూ అంటూ నన్ను తనతో లాక్కెళ్లింది. ఆమె ఏదో దిగులుగా ఉన్నట్టు తోచింది నాకు. తనున్న పరిస్థితి(?)లో ఎవరితోనైనా కాస్సేపు మాట్లాడాలనుకుంటోందేమో!

గుమ్మంలో ఎదురొచ్చింది సరళ కూతురు దివ్య. ఎప్పుడొచ్చావన్న నా ప్రశ్నకి జవాబిచ్చి, చేతిలో ఫోన్ తో లోపలికెళ్లిపోయింది. సరళ కాఫీ కలుపుకొచ్చింది. అల్లుడితో గొడవ పడిందేమో, నాలుగు నెలలై దివ్య ఇక్కడే ఉందని చిన్న గొంతుతో చెప్పింది. అల్లుడు రెండుసార్లు వచ్చి వెళ్లాడని, దివ్య మాత్రం నోరు మెదపట్లేదని అంది. పక్క గదిలో దివ్య ఉంది, మేము ఇలా  చర్చలు చెయ్యటం బావుండదని నేను కాఫీ తాగి లేచాను.

                                     గేటు దాటేలోపు దివ్య వచ్చి కలిసింది. తనే చెప్పటం మొదలెట్టింది, పెళ్లైన కొత్తలో సతీష్ మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాడని, సాయంత్రాలు పెందరాళే వచ్చేవాడని, రానురాను ఒక సమయం లేకుండా రావటం మొదలెట్టాడంది.

‘’ఒకరోజు మధ్యాహ్నం అమ్మతో మాట్లాడుతుంటే భోజనాలు ఆలస్యం అవుతున్నట్టున్నాయంది. ఇది రోజూ ఉండేదే అంటే, ‘’రోజూ లేట్ అయితే ఆరోగ్యాలు పాడవుతాయి. తొందరగా రమ్మని చెప్పుకోలేవూ’’ అంటూ గొడవ చేసింది అమ్మ.

నేను చెబుతూనే ఉన్నానాంటీ. పని ఎక్కువగా ఉంటోందంటాడు. కనీసం ప్రయత్నం చేస్తానని అనడు. పధ్ధతి మార్చుకుంటే వస్తానని చెప్పి వచ్చేసాను. నేను ఇలా వచ్చానని తెగ బాధ పడిపోతున్నారు అమ్మా, నాన్న. జాబ్ కి కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగం ఎక్కడొచ్చినా వెళ్లిపోతాను, ఇక్కడమాత్రం ఉండనాంటీ. అమ్మానాన్నల్ని నా గురించి వర్రీ అవద్దని చెప్పండి.’’ అంటూ, బ్యూటీపార్లర్ లో పనుందని, బై చెప్పి వెళ్లిపోయింది.

అల్లుడి ఆఫీసు వేళల గురించి సరళ అనాలోచితంగా మాట్లాడటం, దివ్య  వచ్చెయ్యటం, అతనివైపు ఆలోచించక, అతని రాకపోకల్ని పట్టించుకోక విషయాన్ని సాగదియ్యటం నాకు కాస్త అసహనాన్ని కలిగించింది.

                                  రాత్రి భోజనాలవుతుంటే మా ఇంటి దగ్గర్లోని సుబ్బయ్య ఇంటిముందు పెద్ద గొడవ వినిపించింది. వరండాలోంచి చూస్తే సుబ్బయ్య కూతురు జ్యోతి పెద్దగొంతుతో అత్తింటి మీద ఏదో ఫిర్యాదు చెబుతోంది. ఆమె భర్త ‘’ఇప్పుడేమైందని’’ అంటున్నాడు. కాలనీ నిశ్శబ్దంగా ఉండటంతో వాళ్ల మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

ఆ సంభాషణ అంతా విన్నాక జ్యోతి భర్త ప్రస్తుతం చేతిలో పనిలేకుండా ఉన్నాడని, అతని తమ్ముడి భార్య ఆ విషయం గురించి తేలిగ్గా మాట్లాడుతోందని, ఆమె మాటల్ని అత్తమామలు, భర్త  ఖండించక పోవటంతో ఆమె తనని, పిల్లాణ్ని కూడా తేలిగ్గా చూస్తోందని, అక్కడ ఉండలేనని, భర్త మరో పని వెతుక్కుని వేరింటి సంసారం పెట్టాలని గట్టిగా చెబుతోంది జ్యోతి. అతను మాత్రం వేరువెళ్లటం కుదరదని చెబుతున్నాడు.

జ్యోతి చేతిలో పిల్లాణ్ని కింద కూర్చోబెట్టి ‘’అయితే వీణ్ణి తీసుకెళ్లిపో, నాకు నువ్వూ వద్దు, పిల్లాడూ వద్దు’’ అంటోంది. వీధి దీపం వెలుగులో అందరూ స్పష్టంగానే కనిపిస్తున్నారు. కిందకి దింపగానే పిల్లవాడు మట్టిలో చేతులు పెట్టి తల్లినోమాటు చూసి, ఆడుకోటం మొదలెట్టాడు.

జ్యోతి అన్నదమ్ములు సర్ది చెబుతున్నట్టు మాట్లాడారు. సుబ్బయ్య బీడీ కాలుస్తూ కూర్చున్నాడే కానీ నోరు మెదపలేదు. జ్యోతి తల్లి అల్లుణ్ణి చేతకానివాడల్లే మాటలు పడతావా? అంటూ గట్టిగానే అడుగుతోంది.

అల్లుడు కాస్సేపు అందర్నీ విన్నాడు, జ్యోతి దగ్గరకెళ్లి,

‘’నీకేం తక్కువైందనీ ఇంత రచ్చ చేస్తున్నావ్? ఇంటికి పద’’ అన్నాడు. జ్యోతి రానంటే రానని చెబుతోంది. అతను చెయ్యెత్తి

‘’రెండు వేస్తేనే కాని మాట వినవా’’ అని బెదిరిస్తున్నాడు సన్నని గొంతుతో. అంత పని చెయ్యడని తెలుస్తూనే ఉంది.

‘’కొట్టు మరి. నీ దెబ్బలకి కాచుకున్నాలే’’ జ్యోతి మళ్లీ అరుపులు మొదలెట్టింది. కాస్సేపు అందరూ గోలగోలగా మాట్లాడుకున్నారు, జ్యోతి ఏడుపు వినిపించింది. కాస్సేపటికి తల్లి అందర్నీ లోపలికొచ్చి భోజనం చెయ్యమంటోంది. అందరూ వెళ్లినా జ్యోతి మాత్రం తనకి తిండి అక్కర్లేదనీ, సంగతి ఇప్పుడు తేల్చాల్సిందే అంటోంది.

                                       వాచ్మన్ పనికెళ్లే సుబ్బయ్య పధ్ధతిగానే ఉంటాడు. భార్యతో గొడవలు పడటం, పిల్లల్ని కేకలు పెట్టటం, అప్పుడప్పుడు కాస్త ఆల్కహాలుచ్చుకుని ఊరంతా వినబడేలా చిందులు తొక్కటం, ఎవరినో అర్థం కాకుండా తిట్లు లంకించుకోవటం! మా ఇంటి ఎదురుగా వినిపించే, కనిపించే దూరంలో ఉంటాడు. ఇల్లంటే ఒక గది, ముందు కాస్త వరండా. ఇంటి ముందు వీధిలో ఉన్న నీళ్లపంపు దగ్గరే పనులు చేసుకుంటూ సుబ్బయ్య భార్య కనిపిస్తుంటుంది. పనులకి వెళ్తుంటుంది. ఒక్కోరోజు ఆమె పెద్ద పేచీలు పెట్టుకునేది భర్తతో. బైక్ వేసుకుని కొడుకులిద్దరూ తిరుగుతుంటారు. పిల్లల గురించిన ప్రస్తావన ఎక్కువగా వారి గొడవల్లో వినిపిస్తుంటుంది.

                                  ఈ కాలనీకొచ్చిన ఐదారేళ్లుగా ఆ కుటుంబాన్ని చూస్తున్నాను. సుబ్బయ్య కూతురు జ్యోతి చురుగ్గా ఉంటుంది. పది పాసవలేదని ఎప్పుడో ఒకసారి పలకరించినపుడు చెప్పింది. తల్లి వెనకాలే ఇంటిపని చేస్తూ కనిపించేది. ఓరోజు ఇంటిప్రక్కన ఉన్న నీళ్ల ట్యాంకు మీదకి ఎక్కి చున్నీ మెడకి బిగించుకుంది. ఆమె అన్నయ్య చూసి ఆపళాన లాక్కొచ్చి గట్టిగా కేకలేసాడు. ఏదైనా ప్రేమ వ్యవహారమేమో! రెండురోజులు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సుబ్భయ్య అరుపులు లేవు. భార్యా పిల్లలు కూడా ఇంటి బయట కనిపించలేదు.

సాయంకాలాలు జ్యోతి తన ఈడు పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూనో, ఇంటిముందున్న గోరింటాకు కోస్తూనో కనిపించేది.

‘’గోరింటాకు ఇష్టమేనా మేడం?’’ అంటూ అడిగింది నన్నోసారి. అప్పుడప్పుడు ఆకునో, రుబ్బిన గోరింటాకునో ఇచ్చేది.

మా ఇంట్లో గులాబీపూలు భలే బావుంటాయి అని సరదా పడుతుందని వచ్చి కోసుకొమ్మనేదాన్ని.

ఒకసారి పువ్వులు కోసుకుని మా వరండాలో కూర్చుంది. నా పక్కనున్న పత్రికలు తీసుకుని తిరగేసింది. పత్రిక తీసుకెళ్ళమంటే, కూడబలుక్కుని చదవాలని, విసుగ్గా ఉంటుందంది.

ఏదైనా పని నేర్చుకుంటున్నావా అంటే, బాగా కుట్టగలననీ, మిషన్ కొనమంటే ఇంట్లో పట్టించుకోరంది. నెమ్మదిగా చెప్పుకొచ్చింది, తనకి ఇష్టమైన అత్తకొడుక్కి పెళ్లి అయిపోయిందని, ఇంకెవర్నీ చేసుకోవాలని లేదని. ఇంట్లో పెళ్లి చేస్తామంటున్నారని విచారంగా చెప్పింది. 

                          జ్యోతికి వేసవిలో పెళ్లి జరిగింది. అబ్బాయి రాడ్ బెండింగ్ పని చేస్తాడట. పిల్లవాడు నెమ్మదస్తుడిలాగే కనిపించాడు.

పెళ్లైన ఏడాదిలోపే జ్యోతి కాన్పుకి పుట్టింటికొచ్చింది. అత్తమామలు, మరిది, తోటికోడలు అంతా కలిసి ఉంటారని చెప్పింది. బాబు పుట్టాక లాక్డౌన్ పుణ్యమాని పుట్టింట్లో ఆరునెలల పైనే ఉంది. అత్తవారింటికి వెళ్లేముందు కొడుకుని ఎత్తుకుని నవ్వుముఖంతో మా ఇంటికొచ్చింది.

జ్యోతి అత్తవారింట్లో సుఖంగా ఉందిన్నాళ్లూ. ఈ సమస్య ఏమిటో, ఇది ఎక్కడికి దారితీస్తుందో! వీళ్లతో తెలియకుండానే అనుబంధం ఏర్పడిపోయింది నాకు.

                                       తెలవారి సుబ్బయ్య ఇంటి ముందు జ్యోతి, భర్త, ఆమె అన్నదమ్ములు అందరూ కూర్చుని టీలు తాగటం గమనించాను. సుబ్బయ్య భార్య చంటిపిల్లాడికి స్నానం చేయిస్తోంది. సుబ్బయ్య బజారు నుంచి సరుకులు తెచ్చి కూతురి చేతికందించాడు. అందరి ముఖాలూ తేటగా కనిపిస్తున్నాయి. ఆ ఇంటి వాతావరణంలో రాత్రి కనిపించిన ఉద్రిక్తత మాయమై, నవ్వులు వినిపిస్తున్నాయి.  

మధ్యాహ్నం ఇంటి ముందున్న కట్టెల పొయ్యి మీద అల్లుడికి విందు భోజనం తయారుచేస్తూ కుటుంబమంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. జ్యోతి చెబుతోంది పెద్దగా,

‘’మా తోటికోడలు రొయ్యల పులుసు చేసిందంటే వదిలిపెట్టవు నానా. అమ్మకీ, మా అత్తమ్మకీ కూడా చేతకాదు అంత రుచిగా చెయ్యటం.’’ నిన్న తోటికోడలు మాటలు నొప్పించాయని గొడవ పెట్టుకున్న పిల్లేనా ఈరోజు ఆమె గురించి అంత గర్వంగా పుట్టింట్లో చెబుతున్నది?! భలే పిల్ల. నవ్వొచ్చింది. సుబ్బయ్య నవ్వుతున్నాడు కూతురి మాటలకి. నిన్న రాత్రిలాగే ఏమీ మాట్లాడలేదు అతను.

                                        ఎంత సింపుల్ మనుషులు! పంతాలతో జీవితాల్నిసమస్యాత్మకం చేసుకోకుండా ఒక సయోధ్యకి రావటం హాయిగా అనిపించింది. చదువులు లేవన్నమాటే కానీ జీవితాన్ని నడుపుకోగల సమర్థత ఉంది. 

దివ్య గుర్తొచ్చింది అప్రయత్నంగా. సతీష్ ఆలస్యంగా ఇంటికొస్తున్నాడని తగువు పెట్టుకుని పుట్టింటికొచ్చింది. అతను భార్యని పిలుచుకెళ్లేందుకు వస్తూనే ఉన్నాడు. సాయంకాలం తొందరగా ఇంటికి వస్తానని మాటివ్వు, వస్తానంటోంది ఈమె.

                                       సాయంకాలం నాలుగవుతుంటే నవ్వుముఖంతో భర్త చేతికి కొడుకుని అందించి, తల్లిచ్చిన ఫలహారాల సంచీతో అత్తారింటికి బయలుదేరుతున్న జ్యోతిని చూస్తే సంతోషం వేసింది.

జీవితాన్ని సరళంగా నడుపుకునే అవకాశం మనచేతుల్లోనే ఉందని తోస్తోంది నాకు.

* * *

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.