అనుభవైకవేద్యం – ప్రతిలిపి లాక్ డౌన్ కథల పోటీలో సాధారణ ప్రచురణ పొందినది, May, 2021

* * *

                             

                            “సౌమ్యా” అన్న కేక వినిపించి, “అదిగో అమ్మ పిలుస్తోంది. ఇంక వెళ్తాను” అంటూ అయిష్టంగానే లిఫ్ట్ దగ్గరకి పరుగెత్తింది సౌమ్య.

స్కూల్ బస్ దిగి స్నేహితులతో కాస్సేపు కబుర్లు చెప్పటం సౌమ్యకి అలవాటే. పిలవకపోతే అలా గంటలు గడిచిపోతాయి. రెండు కిలోమీటర్ల దూరమైనాలేని స్కూల్ కి సైకిల్ మీద వెళ్లమంటే స్నేహితులతో బస్ లోనే వెళ్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మెట్లెక్కి రాదు. భార్గవికి కూతురు గురించిన ఈ చిన్న విషయాలే పెద్ద తలనొప్పి తెప్పిస్తాయి.                            

లోపలికి వస్తునే, “రోజూ నువ్వే పిలుస్తావమ్మా. ఎవరి అమ్మలూ పిలవరు నీలాగా” అంది.

“ఎవరో ఒకరం పిలిస్తేకానీ మీరు కదలరు. కాస్సేపు సైక్లింగ్ కి వెళ్దువుగాని.” అంటూ ఫలహారం అందించింది.

“అబ్బా, సైక్లింగ్… నాకు వెళ్లాలని లేదమ్మా.”

“మెదడుతో పాటు శరీరానికీ వ్యాయామం అవసరం అని చదువుకోవట్లేదూ?” అంది లాలనగా.

“అమ్మా, ఒక్కసారి నీ మొబైల్ ఇవ్వు. నాకూ ఫోన్ ఉంటే ఎంత బావుంటుందో! కొనమంటే కొనవు. నువ్వెందుకు ఫేస్ బుక్ లో లేవు? మన విషయాలన్నీ అందరితో పంచుకోవచ్చు. కొత్తవాళ్లను పరిచయం చేసుకోవచ్చు. ఫోటోలు పెట్టుకోవచ్చు. నా ఫ్రెండ్స్ అందరూ కొత్తకొత్త విషయాలు చెబుతారు.” అంటూనే మొబైల్ ఫోన్ లో మునిగిపోయింది సౌమ్య. 

“పద, సైకిల్ తియ్యి.” తల్లి మాటలకి,

“చదువుకోవాలి, రేపు వెళ్తాను.” అయిష్టంగానే మొబైల్ వదిలి లేచింది.

భార్గవి తను పనిచేస్తున్న కాలేజీలోనూ చూస్తోంది. రిక్రియేషన్ అంటే కబుర్లే పిల్లలకి. గ్రౌండ్ లో ఏ కొద్దిమందో ఆటలాడుతూ కనిపిస్తారు. భోజనం ఇంటినుంచి తెచ్చుకోరు. క్యాంటీన్ లో ఏదో ఒకటి తినెయ్యటమే. అన్నిచోట్లా విరివిగా దొరుకుతున్న కొత్త రుచులకి అలవాటు పడుతున్నారు. అది అధికబరువుకి, అనారోగ్యాలకి దారి తీస్తోంది. కాలంతో పరుగెడుతూ, ఒత్తిడి జయించేందుకు  సౌకర్యవంతమైన జీవనశైలిని కోరుకుంటున్నారు. శరీరాన్ని అలవనివ్వరు. అలాటి శ్రమ అంటే చిన్నచూపే. వాళ్లకోసమే ఈరోజు కాలేజీలో “యువతరంలో ఆరోగ్యం పట్ల అవగాహన” అన్న విషయం గురించి సెమినార్ జరిగింది.

క్రితంసారి కలిసినప్పుడు సౌమ్య క్లాస్ టీచర్ కూడా ఇదే ఫిర్యాదు చేసింది. గేమ్స్ పీరియడ్ లోనూ పిల్లలంతా ఎక్కడో ఓచోట కూర్చుని కాలక్షేపం చేస్తున్నారని, కొన్ని స్కూళ్లల్లో ఆడుకుందుకు స్థలాలే ఉండట్లేదని, ఉన్నా ఇక్కడ వినియోగించుకోవట్లేదని.

భార్గవికి చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. సాయంత్రం క్లాసులయ్యాక ఎన్ని ఆటలు ఆడుకునేవారు! సైకిల్ కొనమని నాన్నని అడిగి అడిగి విసుగొచ్చి నడిచి వెళ్లొచ్చేవాళ్లు అక్కా, తనూ. “ఈకాస్త దూరానికి సైకిలెందుకమ్మా” అనేవారాయన. నడక మంచి వ్యాయామం అనిచెప్పేవారు. తనకి తీరని కోరికగా మిగిలిపోయిందని సౌమ్యకి చిన్నప్పుడే సైకిల్ కొని నేర్పింది. కూతురు మాత్రం సైకిల్ చూస్తే ముఖం చిట్లిస్తుంది.

వంట చేస్తూ ఆలోచనలో పడింది. పిల్లలకు చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా అవసరమని నమ్ముతుంది తను. తమ చిన్నప్పటికంటే ఇప్పుడు అవకాశాలు ఎక్కువున్నాయి. కొన్నాళ్లు షటిల్ నేర్చుకుంటానంది. ఇల్లు మారేసరికి దూరమైపోయిందని మానేసింది. తరువాత స్నేహితురాలితో సంగీతం క్లాసులకి వెళ్లటం మొదలెట్టింది. ఆ టీచర్ బదిలీ మీద వెళ్లిపోవటంతో మరో వ్యాపకం ఏదీ అందుబాటులో లేక ఇంటికొచ్చి పుస్తకాలు ముందేసుక్కూర్చోటం, అదయ్యాక తన మొబైల్ తీసుకుని స్నేహితులతో ముచ్చట్లు.

ఆదివారం పొద్దున్నే మళ్లీ సైక్లింగ్ ప్రస్తావన వచ్చేసరికి “నాన్నా, నాకు సైకిల్ ఇష్టంలేదు. అమ్మ నాకోసం కొనేసింది. స్కూల్ నుంచి రాగానే రోజూ వెళ్లమంటుంది.” తీరిగ్గా తండ్రితో పాటు టి.వి. ముందు కూర్చున్న సౌమ్య చెబుతూంటే భార్గవి అసహనంగా అంది,

“మా చిన్నప్పుడు అడిగినా కొనివ్వలేదు. తనంత తనుగా స్కూల్ కి వెళ్ళొస్తుందని అడక్కుండానే కొన్నాను. సైకిల్ మీద ఎవరూ రారంటుంది. మనని చూసి ఇంకొకరు నేర్చుకుంటారంటే వినదు. పొద్దున్నే ఇలా టి.వి. ముందు కూర్చోకపోతే కాసేపు వెళ్ళొచ్చుగా.’’ 

తండ్రి సైగ అందుకుని సైకిల్ తాళం తీసుకుని కిందకెళ్లింది సౌమ్య.

“అన్నింటికీ దాని వెంట పడకు, భార్గవీ. సౌమ్య పెద్దవుతోంది. తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలుంటాయి.’’ శ్రీనివాస్ మాటలకి,

“అన్నింటికీ బధ్ధకమే. చిన్నప్పుడు ఇలా ఇంత సుకుమారాలు లేవు మాకు. అమ్మ, దొడ్డమ్మల వెనకాల తిరుగుతూ వాళ్లు అడక్కుండానే సాయం చేసేవాళ్లం. పని అన్న స్పృహతో కాక ఇష్టంతో సరదాగా చేస్తూ ఎన్నో నేర్చుకునేవాళ్లం. నేర్చుకోవటం సంగతి సరేకానీ, శ్రమ పడటం ఎందుకు, వంట చేసేందుకు ఎవరినైనా పెట్టుకో అంటుంది. శ్రమ చెయ్యటంలో ఆనందం ఉంటుందన్నది ఎలా అర్థమవుతుందో!” ఆమె గొంతులో పాత జ్ఞాపకాల తాలూకు పారవశ్యం, కూతురు ధోరణి పట్ల అసంతృప్తి రెండూ ధ్వనించాయి. అతను నవ్వుతున్నాడు.

“ఇప్పుడు ఆ రోజులతో పోల్చకు. ఇప్పటి పిల్లలకి అడక్కుండానే అన్నీ అమర్చిపెడుతున్నాం. కానీ వాళ్ల ఇష్టాలేమిటో పట్టించుకోవట్లేదేమో. నా స్నేహితుడి కొడుకు పధ్ధెనిమిదేళ్ల వాడు. చదువులో చురుకైనవాడే. తనకి కొత్తకొత్త వంటలు చెయ్యటం హాబీట. అవన్నీ ఎందుకురా అని అమ్మా, నాన్నలు గొడవ పెట్టినా వినడట. ఒక్కక్కరికి ఒక్కో ఇష్టం అంతే. మంచి, చెడుల విచక్షణ తెలుసుకుంటే చాలు. ఐనా భార్గవీ, పిల్లలకి మంచి అనుభవాల్నివ్వాలి. అవే వాళ్లు చక్కగా ఎదిగేందుకు సహాయపడతాయి. అంతకుమించి మనం నేర్పేదేమీ ఉండదని అనుకుంటాను.” అన్నాడు టి.వి. ముందు నుంచి లేస్తూ.

సౌమ్య హాబీలకనుగుణంగానే ప్రతిఏడూ సమ్మర్ క్లాసుల్లో చేర్పిస్తోంది. ఊరు వెళ్లినా రెండురోజులుండి రావటమే అవుతోంది. ఈసారి మాత్రం కొన్నాళ్లపాటు స్వంత ఊళ్లో ఉండాలని నిర్ణయించుకుంది భార్గవి.  ఈ వేసవికి అమ్మానాన్నలు అమెరికా ప్రయాణం పెట్టుకున్నారు. అయినా దొడ్డమ్మ, పెదనాన్న ఊళ్లోనే ఉంటారు. అక్క కుటుంబాన్నీ, పెదనాన్న పిల్లలు మోహన్, రవి కుటుంబాల్నీ వేసవికి ఊళ్లో తీరిగ్గా గడిపేందుకు రమ్మని చెప్పాలి.  

సౌమ్య పరీక్షల హడావుడిలో ఉంటే, భార్గవి మాత్రం ఊరెళ్తున్నామన్న ఆనందంలో తలమునకలుగా ఉంది.

పరీక్షలయ్యాయి. తామంతా స్వంత ఊళ్లో పిల్లలతో కలుద్దామని నిర్ణయించుకున్నా, అక్కడికి చేరేవరకూ రహస్యంగానే ఉంచాలనుకున్నారు. ముందుగా వెళ్లి, మిగిలిన వాళ్లొచ్చేసరికి కావలసిన ఏర్పాట్లు తను చేద్దామనుకుంది భార్గవి.

“పది, పదిహేను రోజులు ఎలా తోస్తుందమ్మా అక్కడ? నా స్నేహితులంతా హాయిగా మాల్స్ కి, సినిమాలకి వెళ్లేందుకు బోలెడు ప్లాన్లు వేసుకుంటున్నారు.” అంటూ నసిగింది ప్రయాణమవుతూన్న సౌమ్య.

దారి పొడవునా భార్గవి ఆలోచనలు గతంలోకి పరుగులు పెట్టాయి.

స్కూల్ నుంచి వస్తూనే పోటీలు పడి అక్కా, తనూ కబుర్లన్నీ అమ్మతోనూ, దొడ్దమ్మతోనూ చెప్పి, పెట్టింది తిని, పెరట్లో బావిలో నీళ్ళు తోడి మొక్కలకి పోస్తున్న పెదనాన్నకి సాయం చేసి, అప్పుడు స్నానాలు చేసి పుస్తకాలు తీసేవారు. ఆటలన్నీ స్నేహితులతో స్కూల్లోనే అయిపోయేవి. పెదనాన్న పిల్లలు మోహన్, రవి కాస్త దూరంగా ఉన్న హైస్కూల్ నుంచి ఆటలు ముగించి ఆలస్యంగానైనా తమతో కలిసేవారు.  భోజనాలయ్యాక అందరికీ వరసగా మంచాలు వాల్చి, పక్కలు పరవటం, నానమ్మ దగ్గర కాస్సేపు కూర్చుని ఆవిణ్ణి వినటం… ఎంత కమ్మని రోజులు!

రాత్రుళ్లు పక్కల మీద పడుకుని నిద్ర వచ్చేవరకూ కబుర్లే. రోజూ ఏదో కొత్తదనం ఉండేది. సెలవురోజుల్లోనూ, పండుగ రోజుల్లోనూ చుట్టాలు వచ్చేవారు. పెదనాన్న మాటసాయం కోసమో, సలహా కోసమో అయితే నిత్యం ఎవరో ఒకరు వచ్చిపోతుండేవాళ్లు. నాన్నకి బదిలీ అయిందని, ఊరు విడిచి వెళ్లాలన్నప్పుడు ఎంత గొడవ చేసేరనీ అక్కా, తనూ. అక్కడే ఉండిపోతామని చెబితే అమ్మ నవ్వింది. “నాన్నకి ప్రొమోషన్ వచ్చింది, సెలవులకి వస్తూ ఉందురుగాని, అమ్మానాన్నలతో కొత్తఊరు చూసిరండి” అంటూ దొడ్దమ్మ బుజ్జగించి పంపింది.

దిగవలసిన స్టేషన్ రానేవచ్చింది.

                              ఇంటిముందు ఆటో ఆగేసరికి పొట్టిపరికిణీ, జాకెట్టుతో మట్టి పులుముకున్న చేతులతో ఏడెనిమిదేళ్ల పాప పరుగున వచ్చింది గుమ్మంలోకి. “ఇప్పుడు మనింటికెవరూ వచ్చేవాళ్లు లేరు కానీ, ఇలావచ్చి నీళ్లు వదిలిపెట్టు” అంటున్న పెదనాన్న గొంతును వింటూ గేటు తీసుకుని లోపలికొచ్చింది భార్గవి. పెదనాన్న మొక్కలమధ్య ఉన్నారు, కాళ్లకి, చేతులకి, కట్టుకున్న పంచెకి కూడా మట్టిపూసుకుని. నవ్వుతున్న భార్గవిని,  వెనకే ఉన్న సౌమ్యని చూసి సంబరపడిపోయారు.

“ఎవరూ, బాగీ, నువ్వే…” అంటూ చేతిలో నీటి గొట్టాన్ని వదిలి దగ్గరకొచ్చారు. పెదనాన్న ముఖం సాయంకాలపు సూర్యుడి వెలుతురులో ప్రకాశవంతంగా ఉంది.

“పెదనాన్నా, ఉండు, చేతులు కడుక్కో” అంటూ చెంబుడు నీళ్ళు పట్టుకొచ్చింది ఆ చిన్నారి.

చురుగ్గా కాటుక కళ్లతో, రెండు జడలతో ఉన్న ఆ పాపని మెచ్చుకోలుగా చూస్తూ, “నేనే పెదనాన్నా, ఈ చిట్టితల్లి ఎవరు నాకు పోటీగా నిన్ను పెదనాన్నా అంటోంది?” అంటూ లోపలికి నడిచింది.

నీళ్లగొట్టం పట్టుకుని మొక్కల్లోకి లాక్కెళుతున్న చిన్నారిని, “కోయిలమ్మా, నువ్వు పట్టలేవు కానీ, ఈరోజుకి వదిలెయ్. రేపు పొద్దున్నే నేను పడతాను” అంటూ ఆయన చేతులు కడుక్కున్నారు. ఆమాటలకి అంత పెద్ద గొట్టాన్ని తను సమర్థించలేనన్న విషయాన్ని ఒప్పుకుంటూన్నట్టు ఆ పక్కనే పెట్టేసింది.

భార్గవి కాఫీగ్లాసుతో వరండాలోకి వచ్చేసరికి, మగ్గుతో మొక్కలకి నీళ్ళు పోస్తున్న కోయిలమ్మ కనిపించింది. నవ్వుతూ దగ్గరకి పిలిచింది,

”నువ్వు కోయిలమ్మవా? పాటలు పాడతావా?” 

“అవును, పాటలు పాడుతున్నానని పెదనాన్న కోయిలమ్మ అని పేరు పెట్టారు. బళ్లోనేమో నాపేరు కావ్య” అంది వివరంగా.

“బళ్లో పాటలు పాడవా మరి? ఆ పేరు ఒప్పుకోలేదా?” భార్గవి గొంతులో అల్లరిని గమనించి, “బళ్లో పాఠాలు చదవాలి కానీ పాటలు పాడతారేంటి?” అంది. సౌమ్య నవ్వుతూ చూస్తోంది.

దొడ్డమ్మ రానే వచ్చింది వెనకాలే. “ఆంటీకి ఏమీ తెలియదురా. బళ్లో పాటలు పాడమంటోంది. సరే, నువ్వెళ్లి అమ్మని  పిలుచుకురా” అంది.

కావ్య తల్లి చేతులు పట్టుకుని లాక్కొచ్చింది. పరిచయాలు చేస్తూ దొడ్దమ్మ చెప్పింది, “శ్రావణీ, మా మరిది గారమ్మాయి భార్గవి. చిన్నప్పుడు కొన్నేళ్లు ఇక్కడే పెరిగింది.”

చీకటి పడుతుంటే, “కావ్య లెక్కలు చేసుకోవాలంది, వెళ్తాను దొడ్డమ్మా” అంటూ శ్రావణి లేవటంతో అలవాటుగా వరండాలోనూ, గేట్లోనూ లైట్లువేసి కావ్య తల్లివెనుకే వెళ్లిపోయింది.

“చూసావా ఆ చంటిది పెద్దపేరక్కలాగా అన్నింటికీ ముందుంటుంది. లేవండి, ప్రయాణం చేసొచ్చారు. భోజనం చేసి ఈపూట తొందరగా పడుకుందురుగాని. సౌమ్యా, పెద్దదానివైపోయావు. పదోక్లాసు పరీక్షలు రాసేవుకదూ” దొడ్డమ్మ మాట్లాడుతూనే లోపలికి నడిచింది.

పొద్దున్నే భార్గవికి మెలకువ వచ్చేసరికి అప్పటికే కావ్య తయారై, పెదనాన్న వెనకే పువ్వులు కోస్తోంది.

“శ్రావణి మనకి చాలారోజులుగా తెల్సున్నపిల్లే. భర్త ఆమెను హింసలు పెట్టి, ఊరొదిలి వెళ్లిపోయాడు. పెదనాన్న అతనికి చెప్పి చూసారు. వినలేదు. మన ఇంట్లో వెనకవైపున్న సామాను పెట్టే గదులు ఖాళీ చేయించి, వాడుకొమ్మని చెప్పేం. అతని తల్లి ఇక్కడే ఉండేది. ఈమధ్యే పోయింది. ఈ పిల్ల కుట్టు మిషన్ తో నడుపుకుంటోంది. సౌమ్యురాలు. నలుగురు ఆడపిల్లలు నేర్చుకుందుకు వస్తామంటే మమ్మల్ని అడిగింది, రమ్మంటారా వాళ్లని అని. వాళ్లూ ఆర్థికంగా అవసరాలున్న పిల్లలే. పొద్దున్నే వస్తారు, ఆ గదుల ముందున్న షెడ్ లో కూర్చుని పనులు చేసుకుంటారు. నీకు తెలుసుగా, నాకూ, పెదనాన్నకీ ఇంట్లోకి జనం వచ్చి పోతుంటే బావుంటుంది. అదే మాకు బలం.”

మాట్లాడుతూనే ఆవిడ పూజగదిలోనూ, వంటింట్లోనూ పనులు చక్కబెట్టుకుంటోంది. వంట తను చేస్తానంది భార్గవి. “వంటకి రాజేశ్వరొస్తుంది. పాపం, ఆవిడ పరిస్థితీ బావులేదు. ఏదో కాస్త ఆధారం ఈ పనీ, ఆపనీ చేసుకుంటుంది. ఇన్నాళ్లకి తీరిక చేసుకుని వచ్చావే బాగీ, బావుంది.”

“సౌమ్యకి మన ఊరిని, ఇక్కడ జీవితాన్ని వివరంగా చూబించాలని వచ్చాను. నీకు ఇంకో మంచి కబురుందిలే.” అంటూ ఆవిడని ఊరించింది. “చెబుదూ” అంటున్న దొడ్దమ్మకి చిన్న ఆధారం కూడా ఇవ్వలేదు భార్గవి.

పొద్దున్నే పనిలోకొచ్చిన ఆదెమ్మ “అమ్మో, మన బాగమ్మగారే, ఎన్నాళ్లైపోయిందమ్మా” అంటూ సంబరపడింది. పని చేస్తున్నంతసేపూ కూతురు, కొడుకు సంసారాల గురించి చెబుతూ అందరూ పెద్దపెద్ద పట్నపు జీవితాలకి అలవాటు పడ్డారని, ఈ మాత్రం ఊరు వాళ్ల కళ్లకి పల్లెటూరల్లే ఉందని విమర్శించింది. మనవరాలు కాలేజీ చదువుకొచ్చిందని, ఇంటిపట్టున ఉండదనీ, తల్లే అన్నీ చేతికి అందించాలని, కాలేజీ, స్నేహాలు, సినిమాలు అంతవరకే ఆ పిల్ల లోకం అని విసుక్కుంది ఆదెమ్మ.

ఆరోజు సరదాగా కలిసి భోజనం చేద్దామని దొడ్డమ్మ శ్రావణిని, కావ్యని, వాళ్లతో పాటు శ్రావణి శిష్యురాళ్లని భోజనానికి పిలిచింది. అందరికీ వరసగా అరిటాకులేసి, వడ్డిస్తుంటే కావ్య చిట్టిచిట్టి చేతులతో మంచినీళ్లు తెచ్చి అందరికీ పెడుతోంది, “నేనూ వడ్డిస్తా” అంటూ. పని చేస్తానంటూ సరదా పడే కావ్యని చూస్తే చిత్రంగా ఉంది సౌమ్యకి. తనకి అలాటి పనులు బోర్ అనుకుంది.

రాజేశ్వరి భోజనాలు వడ్డిస్తూ, “దొడ్దమ్మగారూ, మీరూ కూర్చోండి, నేను వడ్డన చూసుకుంటాను” అంటున్నా దొడ్డమ్మ పట్టించుకోనట్టే తనూ నాలుగువైపులా తిరిగి వడ్డన చూస్తోంది. అందరూ తిని లేచాక, రాజేశ్వరిని తన పక్కన భోజనానికి కూర్చోబెట్టుకుని మంచీ, చెడూ మాటాడుతూన్న దొడ్డమ్మని తదేకంగా చూస్తూ ఉండిపోయింది సౌమ్య. స్నేహితుల ఇళ్లల్లో ఎప్పుడైనా భోజనానికెళ్తే ఆంటీలు తమతో పాటే కూర్చోవటం, వంటచేసి, వడ్డించే ఆమెను అన్నింటికీ పురమాయించటం చూసింది. దొడ్డమ్మలాగా స్నేహంగా ఉండటం చూడనేలేదు.

“సౌమ్యా, కరోనా ఎలా ఉంది మీ ఊళ్లో? రైలు ప్రయాణంలో జనం మామూలుగానే ఉన్నారా?”

“ప్రస్తుతానికైతే అందరూ మామూలుగానే పనులు చేసుకుంటున్నారు పెదనాన్నా. రైలంతా జనం ఉన్నారు. అన్ని స్టేషన్ లూ హడావుడిగానే ఉన్నాయి.” సౌమ్య కూడా భార్గవి లాగానే ఆయన్ని పెదనాన్నా అంటుంది.

“నీ పేరు పెదనాన్న పెట్టారు. సౌమ్యంగా ఉంటారట ఇలాటి పేరు పెడితే.” అమ్మ చెప్పిన కొత్త విషయాన్ని వింటే తన పేరు తనకే ప్రత్యేకంగా అనిపించింది సౌమ్యకి.  

సౌమ్య నాలుగు రోజులు ఎవరితో కలవకుండా తల్లిఫోన్ తో కాలక్షేపం చేసింది. కానీ చుట్టూ ఉన్న సందడి ఆమెని తనలోకి లాక్కుంది. సౌమ్యలో కొత్త చైతన్యమేదో వచ్చిందని భార్గవి గమనించింది. ఆ వాతావరణంలోని అద్భుతాన్నేదో స్వయంగా అనుభవిస్తున్నట్టుంది. ఉన్నట్టుండి దేశమంతా స్తంభించిపోయింది. దేశమేమిటి, ప్రపంచమంతా. ఎక్కడివాళ్లక్కడే.  బయలుదేరుతున్నామన్న భార్గవి అక్క, మోహన్, రవి ప్రయాణాలు ఆగిపోయాయి. ముఖాన మాస్కులతో అందరూ దూరదూరంగా మసులుతున్నారు.

ఇంట్లో సందడికి పొద్దున్నే లేవటం, అందరి మధ్యా తిరగటం మొదలెట్టింది సౌమ్య. మధ్యాహ్నాలు శ్రావణి పోర్షన్ వైపు వెళ్లి, వాళ్లతో మాటలు కలిపింది. వాళ్లు ఎంబ్రాయిడరీ డిజైన్లు గీస్తుంటే తనకి తోచిన కొత్త డిజైన్లు గీసిచ్చింది.

కావ్య పూర్తిగా పెదనాన్నని అనుకరిస్తుంది. ఆయన ఘంటసాల పాటలేవో రాగాలు తీస్తుంటే తనూ ఆయన వెనకే అందుకుంటుంది. బడి నుంచి వచ్చిందంటే ఆరోజు జరిగిన విషయాలన్నీ ఆయనకి పూర్తిగా చెప్పేయ్యాల్సిందే. ఆయన వెనక తోటపని, దొడ్డమ్మతో పాటు ఇంటిముందు ముగ్గులు… ఇవన్నీ కావ్యకి ఆటలే. బడి మూసేసారని స్నేహితులని తీసుకొచ్చి సౌమ్యతో లెక్కలు, ఇంగ్లీషు చెప్పించుకుని, హోం వర్క్ ఇప్పించుకునేది. గులాబిమొక్కకి అంటు కట్టటం చూబించి, “పెదనాన్న నేర్పేరు” అంది గొప్పగా. సౌమ్యతో స్నేహం కట్టేసి, “స్కిప్పింగ్ చేద్దాం. నీకు, నాకు పోటీ” అంటూ వచ్చేది. సౌమ్యకి, భార్గవికి కావ్య పట్ల మమత అల్లుకుంది.

పెదనాన్న ఆ వయసులోనూ స్వయంగా తన పనులతోపాటు, అవసరమని వచ్చిన వాళ్ల పనులూ చూడటం భార్గవికి బావుంది. పాతరోజులు కళ్లముందుకొచ్చాయి…

తోటలోంచి మొక్కజొన్న పొత్తులు తెస్తే, తనే స్వయంగా కుంపటి ముందు కూర్చుని కాల్చి పిల్లలందరికీ పెట్టేవారు. దొడ్డమ్మ చేస్తానని అడ్డం వస్తే విసుక్కునేవారు. ఆ పని తనే చెయ్యాలని, ఇంకెవరికీ రాదనీ ఆవిణ్ణి ఒప్పించేవారు. పైగా ఎలా కాల్చాలో చెబుతుంటే, “బడిలో పాఠాలు అయ్యాయి, ఇహ ఇంట్లో నాకు పాఠాలు” అంటూ దొడ్డ వెక్కిరించేది. “పొద్దున్న వెళ్లి ఇప్పుడొచ్చారు, కాస్సేపు హాయిగా కూర్చోకూడదూ, నేను చేసిపెడతానని చెబుతున్నాగా” అంటూ ఆవిడా ఆపేక్షగా విసుక్కునేది.

“హాయిగా కూర్చోటమేమిటి పూర్ణా. అలా నాకు బావుండదు. ఏదో ఒకపని చెయ్యటమే హాయి నాకు. తెల్లారిన దగ్గరనుంచీ క్షణం కూర్చుంటావా నువ్వు? అన్ని పనులూ నీవేనంటావుగా.”

“బావుంది, కూర్చుంటే ఎలా తోస్తుంది?” వాళ్ల సంభాషణ తీరది.

                                లాక్డౌన్ మొదలై రెండు వారాలు దాటిపోయింది. ఆ మధ్యాహ్నం ఎండలో ఆదెమ్మ పరుగెత్తుకొచ్చింది,

“అయ్యా, మనూరి పిల్లోళ్లు ఎట్టొగట్టా పడుతాలేస్తా ఊర్నుంచొచ్చారు. కానీ ఎవర్నీ ఊళ్లోకి రానివ్వమంటన్నారు. మీరు రావాలి బాబూ” అంటూ ఏడ్చేసింది.

విషయం కనుక్కుందుకు పెదనాన్న మరో నలుగుర్ని కలుపుకుని బయలుదేరారు. ఊరి మొదట్లో అన్నివైపులా కంచెలు కట్టేసి కాపలా ఉన్న యువకులంతా ఎదురొచ్చారు,

“పెదనాన్నగారూ, వీళ్లంతా ఎక్కడెక్కణ్ణుంచో వచ్చారు, వీళ్లని రానిస్తే కరోనా మన ఊళ్లోకి వస్తుంది” అన్నారు.

వాళ్లని ఆగమని చెప్పి, కంచె ఆవతల ఉన్నవారిని పలకరించి, వెంటనే ఏమిచెయ్యాలో నిర్ణయానికొచ్చారు. వలస వెళ్లిన ఊళ్లో చోటులేదని పంపేస్తే పుట్టిపెరిగిన ఊరికి కాక ఇంకెక్కడికి వస్తారని వాళ్లని ఊరడించి, ముందు అలిసి వచ్చిన వాళ్లకి మంచినీళ్లు, భోజనాల ఏర్పాట్లు మొదలెట్టారు. 

వాళ్లందర్నీ ఉంచేందుకు ఊళ్లో ఉన్న హైస్కూల్ ని, జూనియర్ కాలేజీని వాళ్లకి వసతిగా ఏర్పాటు చేసారు.  అక్కడ ఉన్న ఖాళీస్థలాల్లో వెంటనే తాటాకులతో పందిళ్లు, టెంట్లు వెయ్యటం మొదలెట్టేరు. ఊరంతా పెదనాన్న మాటతో కదిలి వచ్చారు. భోజనాలు, మంచినీళ్ళు, పిల్లలకి పాలు అన్నీ తరలి వస్తున్నాయి. ఊరంతా ఉమ్మడి కుటుంబమైపోయింది.

సౌమ్య తన వయసు పిల్లలతో కలిసి అందరి అవసరాలు కనుక్కుంటోంది. కావ్య, స్నేహితులు చిన్న పిల్లలకి ఆటవస్తువులు సేకరించారు. రెండు వారాలు గడిచిపోయాయి. ఎవరిళ్లకు వాళ్లు వచ్చేందుకు అనుమతి దొరికింది. ఎవరికీ అనారోగ్యం రాకుండా కాపాడుకున్నందుకు ఊరంతటినీ పెదనాన్న, ఆయన మిత్రులు మెచ్చుకున్నారు.

ఊళ్లో ఎవరిళ్లల్లో ఎలాటి పనులున్నా వాటిని పనులు పోగొట్టుకొచ్చిన వాళ్లతో చేయించుకోవాలని, ఆవిధంగా వాళ్లకి కొంచెమైనా ఆదాయమార్గం దొరుకుతుందని పెదనాన్న చెప్పారు. అందరూ జాగ్రత్తలు మాత్రం పాటించాలని గట్టిగా చెప్పాక, తామంతా క్షేమంగా ఉంటామన్న నమ్మకంతో ఒక్కక్కరు పనులకు పిలవటం మొదలెట్టారు.

“ఈమాత్రం పనులు దొరికితే ఉన్నఊరు వదిలి ఎందుకెళ్తారు వీళ్లంతా. కావలసిన పనులు ఇవ్వలేక వాళ్లని బయటకి తరుముతున్నాం” అంటూ పెదనాన్న నిట్టుర్చారు.  

సాయంత్రం ఆదెమ్మ గోరింటాకు తెచ్చింది “ఇంటికి ఆడపిల్లలొచ్చారు, పెట్టుకుంటారు” అంటూ. ఆకంతా కుమ్మరించి బాగుచేస్తూ, భార్గవితో మాట కలుపుతూ ఉన్నట్టుండి ఆదెమ్మ కళ్లనీళ్ల పర్యంతం అయింది, “అమ్మా, బారమ్మా, ఈ అమ్మ, అయ్య లేకపోతే మేము ఏమైపోయేవాళ్లం తల్లీ. నలభై యేళ్లైంది ఈ గుమ్మంలోకొచ్చి. బట్టకి, తిండికి లోటులేదు. పిల్లల పెళ్లిళ్లు సమస్తం ఈ చల్లనితల్లి చేతిమీదే జరిగాయి. నేనన్నమాటేంటి, ఈ గడపలోకొచ్చిన అందరికీ ఇది పుట్టిల్లే. పనులకోసం ఊళ్లోని పిల్లలంతా దేశాలట్టుకు పోయేరు. ఆరోజులు పోయి, ఇప్పటికి ఈ కరోనా జబ్బు మళ్లీ సొంతూళ్లకి తరిమింది. మంచికొచ్చిందో, చెడ్డకొచ్చిందో కానీ పిల్లలు చాన్నాళ్లకి ఇంటిపట్టునున్నారు.”

“ఆదెమ్మా, కబుర్లెట్టుక్కూర్చున్నావా? లే, నేను రుబ్బుకుంటాను, మీ ఆయనకి ఆరోగ్యం సరిలేదు. పెందరాళే అన్నం, కూర పట్టుకెళ్లు.” అంటూ దొడ్డమ్మ గోరింటాకు రుబ్బేందుకు కూర్చుంది.

సౌమ్య కొత్త ప్రపంచాన్ని చూస్తోంది. ఇలా వచ్చి ఉండకపోతే తనకెప్పుడూ ఇలాటి జీవితం ఒకటుంటుందని తెలిసేదే కాదు. ఎంత బావుంది! ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఆడుతూ పాడుతూ పనులు చేసుకోవటం వంటి సహజమైన, అందమైన వాతావరణాన్ని చూబించాలని కూతుర్ని తీసుకువచ్చింది భార్గవి. ఆ పరిధిని దాటి ఊరంతటినీ కుటుంబంగా చేసుకునే అవకాశాన్ని దక్కించుకుంది సౌమ్య. శ్రీనివాస్ అన్నట్టుగా సరికొత్త అనుభవాలతో ఎంత నేర్చుకుందో!  

నీళ్లు చల్లిన వాకిట్లో కావ్య, సౌమ్య ముగ్గులు ముగించి వస్తుంటే భార్గవికి ఆశ్చర్యం! పరిసరాలు, పరిస్థితులు ప్రత్యక్షంగా ఇచ్చే జ్ఞానాన్ని మించి జీవితాల్లో నేర్పేందుకేదీ లేదని భార్గవికి స్పష్టమైంది. కావ్య వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతున్నది ఇదే కాదూ!

“దొడ్డా, నాకు రుబ్బటం నేర్పుతావా?” అంటోంది సౌమ్య రోటి దగ్గర చేరి.

“నాకొచ్చు కూడా” అంటోంది ఆ పరిసరాల్లోని సహజత్వాన్ని ఆవాహన చేసుకున్న చిట్టి కోయిలమ్మ కూనిరాగం తీస్తూ.

* * *

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.