మాలతి కథలు – నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Dec. 2020

* * *

పుస్తకాల్ని ప్రేమించేవారికి కథల పుస్తకాలంటే మరింత ప్రేమ సహజం. ఒక రచయిత లేదా రచయిత్రి వివిధ కథావస్తువులతో రాసిన కొన్ని కథలను ఒకేసారి, ఒకేచోట ఒక కథల సంపుటిగా చదవటం బావుంటుంది. ఆ రచయిత శైలిని తెలుసుకోవటమేకాక, విభిన్న సందర్భాలలో, సన్నివేశాలలో రచయిత ప్రతిస్పందనను చూసే అవకాశం దొరుకుతుంది. కథా సంపుటిని చదవటం పూర్తయ్యేసరికి పాఠకులకు రచయిత దగ్గరవుతారు.

‘’మాలతి కథలు’’ కథా సంపుటి చదవటం పూర్తవుతూనే రచయిత్రి ఆత్మీయురాలిగా తోచారు. మాలతి గారి పూర్వీకులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారు. ఆమె చదువు గుంటూరు జిల్లాలోనూ, విజయనగరం, మద్రాసుల్లో జరిగింది. ఒడిషాలో ఉద్యోగం చేసి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతూ అక్కడే స్థిరపడిపోయారు.

చాగంటి తులసి గారు పుస్తకం ముందుమాటలో ఈరచయిత్రి కొత్తతరం పాత్రలను, సమాజంలో కొత్తగా రూపొందుతున్న పాత్రలను పట్టుకుని కథలు రాస్తున్నారని చెప్పారు.

ఈ కథలను చదివితే ఆ మాటల్లోని నిజం అర్థమవుతుంది. ఇందులో పదమూడు కథలున్నాయి. అన్నీ వివిధ వార, మాసపత్రికలలో ప్రచురణ పొందినవి. కొన్ని కథలు బహుమతులను గెలుచుకున్నాయి.

అద్దంలో ముఖాలు, అంతు దొరకదు, రాంగ్ కాలిక్యులేషన్ – ఈ మూడు కథల్లోనూ కథానాయికలు పెద్ద చదువులు చదివి, నగరాల్లో కెరీర్ ని మలుచుకోవటంలో మునిగిపోయి తల్లిదండ్రులు సూచించే వివాహం పట్ల నిరసన వ్యక్తం చేస్తారు. కానీ జీవితాన్ని అనుభవించి ఆస్వాదించాలన్న ఆశ మాత్రం ఉంటుంది. ఒంటరి నగరజీవితం, ఆర్థిక స్వాతంత్రం జీవితానికి స్వేచ్ఛనిస్తాయి కానీ సమగ్రమైన ఆలోచనను చాలామందిలో కల్పించలేకపోతున్నాయని తోస్తుంది.

‘’అద్దంలో ముఖాలు’’ కథలో నాయిక తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెట్టి తనదైన జీవనశైలిని అనుసరిస్తుంది. ఎంతో ధైర్యంగా పెద్దవాళ్ల ప్రమేయం లేని జీవితాన్ని ఎన్నుకుంటుంది. తన ఇష్టంతోనే ఒక స్నేహితుడికి దగ్గరై, తాను తల్లికాబోతోందన్న విషయం తెలుసుకుని, ఆ బిడ్డను తాను కనిపెంచాలనే అనుకుంటుంది. ఆ స్నేహితుడు అలాటి బాధ్యతను కాదనుకుని, సెంటిమెంట్లు వదిలిపెట్టు అని చెప్పినా ఒప్పుకోదు. ఇలాటి పరిస్థితిలో తనకు సాయం చెయ్యగల వ్యక్తి తనతల్లి మాత్రమే అని తెలుసుకుంటుంది. ప్రస్తుతం చదువులు, కెరీర్లు విషయానికి ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో తల్లిదండ్రుల ఆలోచనకు పిల్లలు అందటం లేదన్నది వాస్తవం.

‘’అంతు దొరకదు’’ కథలో నాయిక తనతో ఆఫీసులో పనిచేసే అందరితోనూ కలుపుగోలుగా, స్నేహంగా ఉంటుంది. కూతురు అందరితోనూ అంత చనువుగా ఉండటాన్ని ఆమె తల్లి జీర్ణించుకోలేకపోతుంది. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని, జీవితంలో స్థిరపడమని చెబుతుంది. తల్లి చెప్పినట్టు ఆకోణంలో తన ఆలోచనలు లేవని, అందరూ కేవలం స్నేహితులే అని స్పష్టంగా చెబుతుంది. పెళ్లి చేసుకుంటే జీవితంలో స్థిరపడినట్టన్న ఆలోచనను కొట్టిపారేస్తుంది. అయితే  ఒక బిడ్డకు తల్లి కావాలనుకుంటున్నానన్న కూతురి మాటలకి తల్లి ఆశ్చర్యపోతుంది. ఈ కాలం పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలో అనుకుంటుంది. చక్కని వయసు, మంచి సంపాదన, స్వతంత్రం ఉండి పెళ్ళి చేసుకుందుకు మాత్రం ఎన్నో పరిమితుల్ని చెప్పే కూతురు ఆమెకు అర్థం కాదు.  

‘’కలకత్తా లాటి నగరంలో తెలుగువాడు ఎవరు దొరుకుతారు? నాకు తెలుగు అబ్బాయిలే నచ్చుతారు, కానీ ఆంధ్రాలో ఇక్కడలా జీతాలు దొరకవని’’ చెప్పే కూతురి మాటలు తల్లిని అయోమయంలో పడేస్తాయి. పెళ్ళి, పిల్లలు అన్న ఆలోచనలు చేస్తూ కూడా ఒంటరి జీవితాన్నే కోరుకుంటున్న కూతుర్ని చూసి నిస్సహాయంగా బాధ పడుతుంది. ఇది ఈ కాలపు కథ.

‘’రాంగ్ కాలిక్యులేషన్’’ కథలో నగర జీవితం, మంచి కెరీర్, స్వతంత్రం, జీవితం పట్ల ఏర్పరచుకున్న అవాస్తవపు ఊహలు కథానాయికను తిన్నగా ఆలోచించనియ్యవు. తనకంటే తక్కువ జీతగాడని తనను ప్రేమించే కొలీగ్ ని కాదంటుంది. మంచి జీతం ఉన్నవాడి రూపు రేఖల్ని పట్టించుకోకుండా పెళ్లికి సిధ్ధపడినా అవతలవైపు నుంచి అమోదం దొరకక తన అహానికి దెబ్బ తగిలిందని బాధపడుతుంది. అనాలోచితంగా పెళ్లైనవాడి ఆకర్షణలో పడి, అతనితో సహజీవనం మొదలుపెడుతుంది. అతను పెళ్లైనవాడన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుని జీవితాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు అతన్నుంచి దూరంగా ప్రయాణమవుతుంది.

రెండో బాల్యం, పడక కుర్చీ, జీవితపు రుచి కథలు వయోవృధ్ధుల జీవితాలకి సంబంధించినవి.

జిహ్వ చాపల్యంతో తన ఇంట్లో తానే దొంగతనంగా తింటూ, ఆవిషయమై మరొకరు దోషిగా పరిగణించబడటాన్ని చూడలేక నిజాన్ని ఒప్పుకున్న ఒక వృధ్ధుని కథ ‘’రెండో బాల్యం’’.

మరొక కథలో మనవలు తాతగారి అవసరాన్ని గుర్తించి ఆయనకోసం తమ పాకెట్ మనీతో ‘’పడక కుర్చీ’’ని కొని తెస్తారు.

కొనుక్కుని తినగలిగే స్థితిలో ఉన్నప్పటికీ, ఆరోగ్య రీత్యా తినకూడని పరిస్థితిలో ఉన్న ఒక వృధ్ధుడు మిఠాయి షాపు ఎదుట నిలబడి తనకు నచ్చిన మిఠాయిలను చూస్తూ కన్నీళ్ల పర్యంతం అయిన కథ ‘’జీవితపు రుచి. ‘’

ఏటో ఏటయిందో, ఏలయిపోనాది కథలు కథాకథనం పూర్తిగా ఉత్తరాంధ్ర మాండలికంలో రాయబడ్డాయి. ‘

‘’ఏలయిపోనాది’’ కథ భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి సున్నితంగా చెప్పిన ప్రేమకథ. జీవితాన్ని ఎలాటి క్లిష్ట సందర్భాలలోనైనా కూడా ఎంత చక్కగా నడుపుకోవచ్చో చెప్పిన కథ. కథా నాయకుడు వివేకంతో జీవితాన్ని చక్కగా జీవించి చూపిన కథ.

‘’ఏటో ఏటయిందో’’ కథలో పేదరికంలోంచి చదువు నిచ్చెన పట్టుకుని ఉన్నతస్థానానికి చేరిన కొడుకు, వాడి చుట్టూ ప్రేమను అల్లుకున్న తల్లిదండ్రుల ఆలోచనలను చెప్పిన కథ. చదువు, మంచి ఉద్యోగం సంపాదించుకున్న కొడుకు కనపడని దూరాల్లో ఉండటాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి వారిది. కానీ అతని ఉనికి కూడా అంతుబట్టక చివరికి ఒంటరివారైపోతారు.

‘’పసి(డి) మనసు’’ కథలో కుటుంబవ్యవస్థ బలంగా నిలబడేందుకు వృధ్ధులకి ఉన్నతమైన స్థానాన్నివ్వవలసిన అవసరం గురించి, కుటుంబంలోని పసివారికి వృధ్ధులతో సహజంగా ఏర్పడే మమతను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి చెప్పారు.

‘’ఓ సతి కథ’’ లో సంఘటన కలో వాస్తవమో తెలియనీయకుండా చదువరులకు ఒళ్లు గగుర్పొడిచేలాటి ఒక అనుభవాన్నిస్తుంది.

ఈ సంపుటిలో ‘’నిష్కామ కర్మ’’ కథ పెద్ద కథ. ఇందులో భార్యాభర్తలు ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని గడుపుతుంటారు. ఇంట్లో పాలు పోసే శీను కుటుంబావసరాలకి ఆర్థిక సాయం అందిస్తారు. అతి మంచితనంతో, దయతో అతని కుటుంబాన్నంతటినీ తమ ఇంట్లో పెట్టుకుని సేవ చేస్తారు.

అలాగే రోడ్డు మీద ఏ ఆధారం లేకుండా ఆకలికి ఏడుస్తున్న ఏడేళ్ల కుర్రవాడిని జాలితో ఇంటికి తీసుకొచ్చి అన్నం పెడతారు. అదే జాలి, మమతతో తమతోనే వాడిని ఉంచుకుని చదువు చెబుతుంటారు. క్రమంగా శీను లోని స్వార్థాన్ని, ఇంట్లో పెరుగుతున్న పిల్లవాడి పెత్తనాన్ని చూసి కలత చెందుతారు. వాళ్లని వదిలించుకోవాలనుకునేలోపు వాళ్లంతట వాళ్లే దూరమవుతారు.  

                                  చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమించి దగ్గరకు తీసుకునే తమ ధోరణి దుఃఖాన్నిచ్చిందని, మనుషుల పట్ల మమత ఉన్నా, దేనిమీదా, ఎవరిమీదా మోహం పెంచుకోకూడదని అనుకుంటారు. ఈ కథలో ముఖ్యపాత్రల ఉదాత్త వైఖరికి మనసు ఆర్ద్రమవుతుంది. కానీ ఇంత నిష్కపటంగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఎవరైనా ఉండగలరా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాటివారు అరుదుగానైనా తటస్థపడటం తక్కువే.

ఈ కథల పుస్తకం చదివాక మన చుట్టూ ఉన్న మనుషులు మరికొంచెం అర్థమైనట్టు తోస్తుంది. రచయిత్రి నిజాయితీగా చెప్పిన కథలు మనసుకు హాయినిస్తాయి.

ఈ పుస్తకం 2012 సెప్టెంబరులో చినుకు ప్రచురణలు ద్వారా విడుదలైంది.

* * *

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.