* * *
తెల్లవారి లేస్తూనే గుమ్మం ముందు పాల ప్యాకెట్ తీసుకుంటూ, ఇంటి కాంపౌండ్ లోనూ, బయటా అరడజను పైగా స్కూటర్లు ఉండటం గమనించింది శారద. విషయం అర్థం కాలేదు.
తలుపు మూసి పనుల్లో పడిన శారద ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి.క్రిందపోర్షన్ లో వాళ్లు వచ్చి మూడు నాలుగు నెలలవుతోంది. ఇంటావిడ రాజమ్మమ్మ పధ్ధతిగా ఉండే మనిషి. ఆవిడ పెట్టే రూల్సన్నీ అద్దెకొచ్చేవాళ్లు ఒప్పుకుని తీరవలసిందే. సిటీలో కొడుకు దగ్గర ఉంటూ, అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్ళు స్వంత ఇంట్లో ఉండి వెళ్తూంటుందావిడ.
శారదకి ఈ ఊళ్లో ఉద్యోగం వచ్చిందని తెలియగానే మేడమీద గదులు శుభ్రం చేయించి ఆమెకోసం సిధ్ధం చేయించింది రాజమ్మగారు. ఆవిడ శారద అమ్మమ్మకి స్నేహితురాలు అవటంతో శారదకి రాజమ్మమ్మ అయింది.
క్రిందింట్లోవాళ్లు వచ్చిన క్రొత్తలోనే రాజమ్మగారు ఊరు వెళ్లవలసి రావటంతో మేడమీదకొచ్చి శారదకి అప్పగింతలు పెట్టింది ఆవిడ.
‘శారదా, మనింట్లో అద్దెకు దిగిన వాళ్లు ఏలూరు నుండి వచ్చారు. ఆయన అక్కడేదో మిల్లులో పని చేసేవాడుట. ఇక్కడేదో మెరుగైన పని దొరికిందని మకాం మార్చేరుట, ఆవిడ, అదేలే ఆ అమ్మాయి సావిత్రి చెప్పింది వివరాలు.
వాకిట్లో ముగ్గు, పెరట్లో మొక్కల బాధ్యత వాళ్లదే అని చెప్పేను. వాళ్లు కాస్త అలవాటు పడేవరకూ….
* * *








