అదిగో ద్వారక – నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Sept, 2020

* * *

                                  అదిగో ద్వారక

                                               డా. చింతకింది శ్రీనివాసరావు

                                 తమ పాలనలో ఉన్న ప్రజలని ఎక్కువ తక్కువ వర్గాలుగా విభజించి, ఆ విభజన బలంతో అదే ప్రజలమీద పెత్తనం చేసే స్వార్థపరులైన అధికారవర్గం, ఆ విభజన వెనుక ఉన్న అసలు తత్త్వం తెలియక తమ అనైక్యతల మధ్య నలుగుతూనే, ఆ అధికారం కింద సతమతమయే ప్రజలు…

                                   ఇదేకదా వర్తమాన ప్రపంచంలో ఎక్కడ చూసినా జరుగుతున్నది. అయితే ఈ వర్తమానానికి పునాదిగా బలమైన చరిత్రే ఉంది. అది మహాభారత కాలంనాటి నుంచి ఉంది. ఇతిహాసమని మనం గౌరవించే మహాభారత కథని క్షుణ్ణంగా పరిశీలనాత్మకంగా అధ్యయనం చేసిన శ్రీ చింతకింది శ్రీనివాసరావుగారు అధ్యయన సమయంలో తనను వేధించిన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ ఈ నవలకు పూనుకున్నారు. దీనికోసం ఆయన ఎంతో పరిశోధన చేసారు. మహాభారత కథ జరిగిందన్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి, అక్కడి ప్రజలతో ప్రత్యక్షంగా గడిపి తను సేకరించిన వివరాలతో బలమైన కథను రాసారు. ఆ ప్రయత్నంలో మూలకథలోని వాస్తవాలను మాత్రమే తీసుకున్నారు. దానికి ఎలాటి కల్పనలకూ పూనుకోలేదు.

                                         మహాభారత కథలో మనమంతా గొప్ప నాయకులుగా ప్రశంసించే శ్రీకృష్ణుడు, అర్జునుడు జీవిత చరమాంకంలో గిరిజనుల చేతుల్లో పొందిన అనుభవం రచయితలో ఎన్నో ప్రశ్నలు రగిలించింది. గిరిజనుడి బాణం దెబ్బకు కృష్ణుడు కన్నుమూయటం, గిరిజనులపైకి పాశుపతాస్త్రం ఎక్కుపెట్టబోయి అర్జునుడు భంగపడటం ఎందువల్ల జరిగింది? గిరిజనులకు వారిపై ఇంతటి ద్వేషం కలగటానికి కారణమేమిటి?

గిరిజనుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పేందుకు నిరాకరించిన ద్రోణాచార్యుడు అతని బొటనవేలును గురుదక్షిణగా అడిగి తీసుకోవటం వెనుక ఆంతర్యమేమిటి? గిరిజన స్త్రీ జాంబవతి కృష్ణుని అష్టభార్యలలో ఒకరిగా రాజమందిరంలో ఉంటూ కూడా, తన సవతులనుండి వివక్షను ఎందుకు ఎదుర్కొంది? ద్వారక ప్రభువు సాక్షాత్తు బలరాముడు తన తమ్ముడి బిడ్డలనందరినీ ఒక్కలా చూడక జాంబవతి పుత్రుల్ని ఎందుకు అనాదరణకు, అవమానాలకు గురిచేసాడు?

                                     ద్వారక రాజ్యాధిపతుల పాలనలో తక్కువజాతిగా చూడబడుతూ అవమానాలను, అసమానతనూ భరిస్తూ వచ్చిన గిరిజనులు ఒక్కటై నిలబడి, తమదే అయిన ప్రత్యేక అస్తిత్వాన్ని పాలకులకు ఎరుకపరిచేందుకు చేసిన పోరాటం ఈ నవల సారాంశం.

మహాభారత కథను ఒక ఇతిహాసంలా భావించి చదివే మనం ఎన్నడూ చూడని కోణాన్ని ఈ నవలలో రచయిత చూబించారు. జాంబవతి కొడుకు సాంబుడు తల్లితో పాటు తమ జాతికంతకూ జరుగుతున్న అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించే చేవగల నాయకుడిగా ఎదిగి, తన జాతికోసం పోరాడిన కథ ‘అదిగో ద్వారక’.

కథలో కొస్తే…

జాంబవతి శ్రీకృష్ణుడి భార్యగా ద్వారకకి వచ్చిన నాటినుంచి తన స్థానం అర్థం చేసుకుని, అవమానాలను తనలోనే దాచుకుంటుంది. కానీ ఆమె కొడుకు సాంబుడు తనకు, తన తమ్ముళ్లకు రాజ్యంలో జరుగుతున్న వివక్షను గమనిస్తాడు. చిన్నవాడుగా ఉన్నప్పటినుంచీ తల్లి పట్ల తనతండ్రి, ఇతరులు చూపే నిర్లక్ష్యం చూస్తూ పెరుగుతాడు. తల్లికి రాచ కుటుంబంలో ఎదురైన అవమానాలను కొన్ని సంఘటనల నేపథ్యంలో సాంబుడు ప్రత్యక్షంగా చూస్తాడు.

                                 సత్యభామ తన ఇంటికి పారిజాత వృక్షం వచ్చిందన్న సంబరంలో ఘనంగా పేరంటం ఏర్పాటుచేస్తుంది. జాంబవతిని మాత్రం పిలవదు. అయినా జాంబవతి పిల్లలతో సహా వెళ్లటాన్ని సత్యభామతో సహా ఆమె సవతులంతా నిరసించి, తక్షణం ఆమెను వెళ్లిపొమ్మంటారు. తమ గిరిజన వేషధారణను అవహేళన చేయటం, తల్లి కన్నీరు పెట్టుకోవటం సాంబుడు గమనిస్తాడు.

                                   అలాగే వసంతోత్సవం సమయంలో రాజ్యమంతా సంబరాల్లో మునిగిన వేళ శ్రీకృష్ణుడు తన భార్యలందరితో ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో తన తల్లిని ఎందుకు ఉత్సవానికి పిలవలేదన్న ప్రశ్నతో సాంబుడక్కడికి వస్తాడు. ‘మీ అమ్మ గిరిజనుల పిల్ల. ఆమెకు పూజలు, వ్రతాలు మినహా ఇలాటి వేడుకలు, ఉత్సవాలు తెలియవు’ అని కృష్ణుడు సమాధానమిస్తాడు.

                              ఒక సందర్భంలో సాంబుడు తన మనసులో మాటను తల్లితో సూటిగా చెబుతాడు, ‘నా తండ్రి తన భార్యలందరినీ కోరి వివాహం చేసుకున్నాడంటారు. నిన్ను కోరకుండానే కృష్ణుడి పట్ల తన భక్తిని చాటుకుందుకు తాత నిన్ను ఇచ్చి వివాహం ఎందుకు చేసినట్టు? తాత తన పూర్వపు జన్మలో కృష్ణుడి భక్తుడిగా ఉండటం, ఆయన తనకు వరమివ్వటం… ఏమిటమ్మా, ఈ జన్మలు, వరాలు?’ అంటూ ఆ మూఢ విశ్వాసాలను నిరసిస్తాడు. అన్నిటికీ జాంబవతి సమాధానం మౌనమే అవుతుంది. భర్త తన పట్ల చూపుతున్న నిరాదరణ తెలిసీ రాజ్యం పట్ల, భర్త పట్ల గౌరవంతో ఆమె నోరిప్పదు. సాంబుడు నిలదీసినపుడు ఆమె కన్నీరే సమాధానమవుతుంది.

                           సాంబుడి పట్ల రాజ్యంలోని పెద్దలందరికీ ద్వేషమే. రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు అందగాడు. కానీ తనకంటే అందంగా, బలంగా, యుద్ధవిద్యల్లో ఆరితేరిన సాంబుడి పట్ల అసూయతో, తన రాచరికపు పెద్దలతో కలిసి ఆలోచన చేసి అతనిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో మద్యంలో విషం కలిపి కొద్దికొద్దిగా అందించే ఏర్పాటుచేసి, అతని శరీరం రోగం బారిన పడేలా చేస్తాడు. కొడుకు దురవస్థకు జాంబవతి భయపడుతుంది. అందరూ కలిసి తన బిడ్డను మరణానికి దగ్గరగా తీసుకొచ్చారని దుఃఖించి, అరణ్యంలో తను పుట్టిపెరిగిన ప్రాంతానికి కొడుకుని తీసుకెళ్లి అక్కడ వనమూలికలతో అతని జబ్బుని తగ్గించమని తనవారిని కోరుతుంది. ఆ గిరిప్రాంతంలో అనంతవాకం గ్రామంలో సాంబుడు కొన్ని నెలలపాటు కఠినమైన పసరుపూతలతో వైద్యం చేయించుకుని, ఆరోగ్యంతో ద్వారకకి వస్తాడు.

                             అనంతవాకంలో ఉన్నప్పుడు తనవారి మాటల్లో ద్వారక ప్రభువులు, ఇతర రాజ్యాలవారూ గిరిజనులను ఏవిధంగా అవమానాలకు గురిచేస్తున్నారో, ఆ స్థావరాలను ఆక్రమించి అరణ్యాలను నరికి అందమైన, విలాసవంతమైన భవంతులను ఎలా తమకోసం నిర్మించుకుంటున్నారో, వాటిని చేరేందుకు అవసరమైన చక్కని దారిమార్గాలను ఎలా ఏర్పాటు చేసుకుంటున్నారో వినటమే కాక ప్రత్యక్షంగా చూస్తాడు సాంబుడు. ఈ క్రమంలో అక్కడి జనవాసాల్ని ధ్వంసం చేస్తూ, అరణ్యంలోని సమస్త  ప్రాణులనీ ఏవిధంగా నిరాశ్రయుల్ని చేస్తున్నారో అర్థమవుతుంది. గిరిపుత్రులందరినీ అధమ జాతిగా చూస్తున్న విషయం తేటతెల్లమవుతుంది. తమ వనాల్లో దొరికే బంగారం వంటి విలువైన లోహాల కోసం ఇష్టం వచ్చినట్టుగా తవ్వకాలు జరిపి దోచుకోవటం గమనిస్తాడు. గిరిజనులు అలంకారంగా వాడే పక్షుల ఈకలు, జంతువుల కొమ్ములు, నార బట్టలు రాజరికపు పెద్దలకి ఎంత అవహేళన కలిగించేవిగా కనిపిస్తున్నాయో ముందే తెలిసినవాడు. అప్పుడే అధికారవర్గపు జాత్యహంకారాన్ని ప్రశ్నించాలనుకుంటాడు.

                          తనకు వైద్యం చేసిన హిరణ్యధన్వుడు, గిరిపెద్ద నిషాదుడు ద్వారా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను స్పష్టంగా తెలుసుకుంటాడు. నిషాదుడు కుడిచేతి బొటనవేలుని లోపలికి మడిచి కట్టి, కేవలం నాలుగువేళ్లతో పని చెయ్యటం చూసి, అది ఏకలవ్యుడికి జరిగిన అన్యాయాన్ని నిరసించేందుకు, ఆ గాయాన్నిమరచిపోకుండా జ్ఞాపకం పెట్టుకుందుకేనన్న నిషాదుని ఆలోచన అర్థమవుతుంది.

పూర్తి ఆరోగ్యవంతుడై వస్తూనే, ‘తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవలసిన సమయం వచ్చిందని, తాము చేయబోయేది జాతులపీడన పైన జరిపే సంగ్రామమనీ, అందుకే తన తండ్రిమీద యుధ్ధం తలబెడుతున్నా తనకు బాధలేదని’ తల్లితో చెబుతాడు. కొడుకుగా ఏనాడూ తనను ఆదరించని తండ్రిపట్ల కూడా శతృత్వాన్ని పెంచుకుంటాడు.

ఈ భేదభావాల గురించి సాంబుడు రాజ్యంలోని పెద్దల్ని, తండ్రిని ప్రశ్నించటం మొదలెదతాడు. అది అధికారంలో ఉన్న వారికి మరింత ఆగ్రహం కలిగిస్తుంది.

                         సాంబుడు స్వస్థతతో రాజ్యానికి రావటం రాజ్యంలోని అధికార గణానికి నచ్చదు. అతడు రాజ్యంలో ఎలాటి గొడవలు తెస్తాడో అని అసహనంతో కృష్ణుడితో చెబుతారు. రాజ్యాధికారాన్ని, పెదతండ్రి బలరాముడి ఆజ్ఞలను తన బిడ్డగా సాంబుడు పాటించాలని తండ్రి చెప్పినప్పుడు, అదేవిధంగా హస్తినలో కూడా ధృతరాష్ట్రుడికి పాండవులు సేవలు చెయ్యాలి కానీ కురుక్షేత్ర యుధ్ధానికి ఎందుకు సమాయత్తమవుతున్నారని సాంబుడు ప్రశ్నిస్తాడు. దానికి కృష్ణుడు సమధానం చెప్పలేకపోతాడు.

జాంబవతి కొడుకు ఆశయం అర్థం చేసుకుని, తమ జాతి గౌరవం కోసం పోరాడాలన్న ఆలోచనను బలపరుస్తూ, గిరిప్రాంతాల్లోని తనవారినందరినీ కలిసేందుకు కొడుకుతో పాటుగా ప్రయాణమవుతుంది. తామందరూ ఈ పీడన, దోపిడీ నుంచి విముక్తులవాలంటే కలిసికట్టుగా పోరాడక తప్పదని గిరిపుత్రులందరికీ సందేశాన్నిస్తుంది. ఆ ప్రయాణంలో అరణ్యాల్లో జరుగుతున్న దోపిడీని తనకళ్లతో చూసి, తెలుసుకుంటుంది. గిరిజన స్త్రీలపైన మానభంగాలు, హత్యలు నిత్యకృత్యమవటాన్ని తెలుసుకుని దుఃఖిస్త్తుంది.

ఆ సమయంలోనే అరణ్యంలో ఒకచోట పళ్లతో నిండిన చెట్లను పట్టించుకోకుండా, తమ ఆహారానికి జంతువులను వేటాడుతున్న గిరిజనుల ప్రవర్తనకు ఆశ్చర్యపోతాడు సాంబుడు. వారి అమాయకత్వం గురించి తల్లితో చెప్పినప్పుడు, ఆమె తమ గిరిజన జాతిది అమాయకత్వం కాదని, సునాయాసంగా, అందుబాటులో ఉన్న ఆహారం పట్ల వారికి ఆశ లేదని, కష్టించి సంపాదించుకోవటమే వారి జీవనశైలి అని చెబుతుంది. వారి స్వతంత్రాభిలాష, స్వేచ్ఛాపిపాస అలాటివని చెబుతుంది.

                        పాండవుల పక్షపాతి ఐన తండ్రి, అతని యదువంశస్థులకు వ్యతిరేకంగా తనకంటూ బలం చేకూర్చుకుందుకు వ్యూహాత్మకంగా దుర్యోధనుడి కూతురు లక్ష్మణను పెళ్లిచేసుకుంటానని తల్లికి చెబుతాడు. అతని ఆలోచనకు జాంబవతి ఆశ్చర్యపోతుంది. తన నిర్ణయానికి వెనుక ఉన్న అసలు కారణం వివరిస్తాడు… శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్రను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయటంలో యాదవ రాజ్యం క్షేమానికి, మనుగడకు పాండవుల బలం తమకు అక్కరకొస్తుందన్న ఆలోచన ఉందన్నప్పుడు కొడుకు ఆలోచనల్లోని లోతు జాంబవతికి ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తుంది. యాదవులకు, పాండవులకు వ్యతిరేకంగా తను కౌరవ పక్షం వారితో బాంధవ్యం నెరిపి, తనకు అండగా చేసుకోవాలనుకుంటున్నట్టు స్పష్టపరుస్తాడు.

                        అన్నట్టుగానే ఆ స్వయంవరానికి వెళ్లి లక్ష్మణకుమారిని గెలుచుకుంటాడు. తనను తక్కువ జాతివాడంటూ అవహేళన చేసినవారికి ఒక రాచకన్య తనను కోరి వివాహమాడేలా చేసుకుని తన స్థాయిని ప్రపంచానికి చూపుతాడు. లక్ష్మణ భర్త పడుతున్న అవమానాలను, ప్రతీకారవాంఛను అర్థం చేసుకుని భర్తకి, అత్తగారికి మద్దతుగా నిలబడుతుంది.

అరణ్యంలో మసిలినప్పుడు సాంబుడుకి తుంగపరకలు చేతికి తగిలి గాయమవుతుంది. ఆ క్షణంలోనే తుంగగడ్డిని ప్రభాస తీరంలో మొలిపించి రాబోయే తమ యుద్ధంలో దానిని పదునైన ఆయుధంగా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ద్వారక ప్రజలంతా కలిసికట్టుగా ప్రభాసతీరంలో అనేక సందర్భాల్లో వేడుకలకి కలుస్తుంటారు కనుక తమ పోరాటానికి సరైన వేదిక ప్రభాసతీరమని నమ్మి, తుంగ గడ్డిని రహస్యంగా ప్రభాస తీరంలో నాటి తను అనుకున్న కార్యాన్ని సాధిస్తాడు.

                               తమ పోరాటం ‘ఆది గిరిపోరాటం’ గా అభివర్ణించి, దానికి ఒక పతాకను తయారుచేస్తాడు. నిషాదుని నాలుగువేళ్ల చేతిని తమ పతాక ప్రతీకగా నిర్ణయిస్తాడు. ఐదోవేలు అనే స్వేచ్ఛను త్వరలోనే తాము అందుకోబోతున్నామని గిరిజనులందరినీ సమరానికి సమాయత్తం చేస్తాడు.

                            యుధ్ధంలో బలరాముడు, మిగిలిన ప్రముఖ రాజవంశీయులతో పాటు సాంబుడూ వీరమరణం పొందుతాడు. ఆ పోరాటంలో గెలిచి తాము రాజ్యధికారం చేపట్టలేకపోయినప్పటికీ తమ ప్రయత్నం రాబోయే తరాలవారికి ఒక ప్రోత్సాహకంగా, ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందని గిరి పెద్దలు హిరణ్యధన్వుడు, నిషాదుడూ అనుకుంటారు. వనాల్లో, సహజమైన ప్రకృతిలో ఒదిగి జీవించే గిరిపుత్రుల ఆత్మాభిమానం, వారివైన బలాలు ఈ నవలలో చూస్తాము.

                              కురు,పాండవ యుధ్ధానికి కావలసిన ఏర్పాట్లలో మునిగి రాజ్యంలోనూ, తన కుటుంబంలోనూ జరుగుతున్న విషయాలను కృష్ణుడు పట్టించుకోడు. యుద్ధంలో తనవారంతా మరణించినపుడు కృష్ణుడు నిరాశతో అరణ్యం వైపుగా వెళ్లిపోతాడు. అక్కడే పొదలమాటున విశ్రాంతి తీసుకుంటూ ఒక గిరిజనుని చేతి బాణానికి ప్రాణాలు కోల్పోతాడు.

ఆ విషయం తెలుసుకుని అర్జునుడు ద్వారక చేరి గిరిజనులతో ముఖాముఖి తలబడినపుడు, తన చేతిలో పాశుపతాస్త్రాన్ని వారిపైకి సంధించబోయి ఆ సమయంలో పఠించవలసిన మంత్రం మరిచిపోతాడు. శివుడు ప్రసాదించిన పాశుపతాస్త్రం గిరిపుత్రుల మీద పనిచెయ్యదని వారు అర్జునుణ్ణి పరిహాసం చేస్తారు.

                            అతని అసహాయ స్థితికి గిరిపుత్రులంతా నవ్వి, ఆనాడు ఏకలవ్యుడి బొటనవేలును బహుమానంగా తీసుకుని మా గిరిపుత్రులకి చేసిన అన్యాయం గుర్తుందా అని అడుగుతారు. “నువ్వు తీసుకున్న ఒక్క బొటనవేలు నుంచి ఇందరం పుట్టుకొచ్చాం. మేమంతా గిరి కులస్థులం” అంటూ అర్జునుడికి గుణపాఠం చెబుతారు. కృష్ణుడు లేని పాండవులు ఏ బలమూ లేనివారని మాకు తెలుసు అని చెప్పి అర్జునుడు ద్వారక విడిచిపెట్టి తిరుగుప్రయాణమయ్యేలా చేస్తారు.

                           నవల మొదలు పెట్టినప్పటినుంచి చివరివరకూ ఆగకుండా చదివేలా చేసింది కథనం. అరణ్యాలలో ప్రకృతితో మమేకమై, తమబ్రతుకులు తాము బ్రతుకుతున్నవారు తమను నీచజాతివారిని చేసి, అవమానించిన ప్రభువులకు కనువిప్పు కలిగేలా పోరాటానికి దిగటం చూస్తాము. తామంతవరకూ పడిన కష్టాలు, ఆత్మన్యూనత కలిగించే అనుభవాలు సహించరాని స్థితికి చేరినప్పుడు ఎదురుతిరిగేందుకు సిధ్ధపడతారు. ఇది ఎప్పుడైనా, ఏవ్యవస్థలోనైనా అనివార్యమైనదే అని చరిత్ర చెబుతోంది. భారత కథలో అత్యంత ప్రముఖ వ్యక్తులుగా, ఉదారులుగా కనిపించిన వారిని ఈ నవలలో మరో కోణంలో చూస్తాము. వారిలో ఉన్న భేదభావనలు, మరుగుజ్జుతనాలు కళ్లకి కట్టినట్టు కనిపించి మనల్ని ఆలోచనకి పురిగొల్పుతాయి. ఈ నవల చదవటం పూర్తి అయేసరికి వర్తమాన ప్రపంచం మనకు మరింత స్పష్టంగా అర్థమవటం మొదలవుతుంది. సమాజంలోని విభిన్న జాతులు, వర్గాలు తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకుందుకు చేస్తున్న ప్రయత్నాలు కళ్లముందుకొస్తాయి. ఇంత చక్కని ఆలోచనను నిజాయితీగా మనకందించిన రచయితకు అభినందనలు.

ఈ పుస్తకం విశాలాంధ్ర ప్రచురణ.

* * *

One thought on “అదిగో ద్వారక – నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Sept, 2020

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.