* * *
నీరాకనంటే ఎన్నాళ్ళు ఉంటావులే అన్న నిర్లిప్తత!
నువ్వొస్తున్నావన్న కబురుతో పాటు వెళ్లిపోతావన్న దిగులు! నిజం చెప్పనా………..
ఎప్పుడో, బహుశా ఏ జన్మలోదో అనిపించే జ్ఞాపకం!
ధనుర్మాసపు చిరుచలిలో…………..
వరండా అంచునో, డాబా పిట్టగోడ మీద నీలాకాశం క్రిందో కూర్చుని
వాకిలి ముందు క్రితం రాత్రి వేసిన ముగ్గుల్ని, గొబ్బెమ్మల సిగలో తురిమిన బంతి పువ్వుల్ని
చూస్తూ కబురులాడే తీరిక లేదంటావ్!
ఎందుకో అలలు అలలుగా నవ్వులు పూచే ఆ పసితనాలు ఏమయ్యాయో!?
ఒక ఇంటి కప్పుక్రింద కలిసి గడిపిన నిన్నమొన్నలన్నీ ఏమయ్యాయో!?
జ్ఞాపకాల మూటలై, చెలిమి ఊటలై,
మదినిండా నిక్షేపాలై మాత్రం ఉన్నాయిలే!
అవి నేను మొయ్యలేని బరువులై వేధిస్తుంటే,
నీ మరో ఆగమనానికై ఇప్పటి నుంచీ
ఎదుర్కోలు సన్నాహాలు చేసుకోనా??