…మాయలు నీవే కప్పి – దునియా, మన తెలంగాణా ఆదివారం పత్రిక, 27 Oct, 2019

 

* * *

వర్షం ఆగకుండా నిలబడి కురుస్తోంది.ఎందుకో మనసంతా దిగులు దిగులుగా ఉంది.తెలవారిందో లేదో తెలియనీయని చిక్కని మబ్బులు తమ సొద ఏదో చెప్పుకుంటూ ఈ వర్షపు ఉదయయానికి గుబులు పులుముతున్నాయి.

బాల్కనీలోకి చిన్నజల్లు కూడా రావటంలేదు.ఉయ్యాలలో మరింత సర్దుకుని కూర్చుంది శైలజ.ఆమెభర్త చంద్ర పనుందంటూ పెందరాళే ఆఫీసుకి బయలుదేరాడు.సంవత్సరం గ్యాప్ తర్వాత ఇంటికి వచ్చిన కొడుకు రాహుల్ రెండురోజులు మురిపించి వెళ్లిపోయాడు.ఒంటరితనం ఒక్కటే బెంగల్ బెంగల్ కి కారణమా? కాదులే,అది కూడా ఒక కారణమంతే.
బెంగల్, బెంగల్… పుష్కరం క్రితం ఈపదాన్ని కనిపెట్టింది రేణు కదూ.అమ్మానాన్నలకి, తమ్ముడికి బై బై చెప్పి యూనివర్సిటీ చదువుకి హాయిగా వెళ్లిపోయింది. భోజన సమయంలో కన్నీళ్లెట్టుకునే భార్య బెంగల్ చూడలేక డైనింగ్ టేబిల్ దగ్గర కూతురురేణు కూర్చునే నాలుగో కుర్చీ తీసి కంటికి కనిపించకుండా దాచేసేడు చంద్ర. హాస్టల్ లో ఉన్న రేణుని ఫోన్ లో పలకరించినపుడు కిలకిలా నవ్వుతూ కబుర్లు చెప్పేది, ‘ఎందుకమ్మా బెంగల్ బెంగల్ నీకు’ అని అడిగేది పైగా. ఈ పిల్లకి తల్లి బాథ అర్థం కాదా అని వాపోయేది ఆమె.

ఇంట్లో అన్నేళ్లుగా విసిగించిన పిల్లలఅల్లరి మిస్ అవటం ఆమెకి మరింత అలసటని, అసహనాన్ని కలిగించేవి. ఆ తర్వాత రాహుల్ చదువుకోసం దూరంగా వెళ్లినప్పుడు ముందులా కాకుండా కొంచెం స్థితప్రజ్ఞతతో తీసుకోగలిగింది. అదేదో సహజమైనదే అన్న తెలివిడి వచ్చి గంభీరంగా ఉండిపోయింది. ఈ పిల్లలు ఇంతే. మనసంతా ఒక మాయపొరను కమ్మేసి అంతలోనే చటుక్కున కనబడకుండా వెళ్లిపోతారు. ‘జీవితంలోకి హఠాత్తుగా వచ్చి వెళ్లిపోయే వీళ్లనసలు సీరియస్గా తీసుకోవటం తనదే తప్పు, ఉద్యోగం, వ్యాపకాలు తనకి మాత్రం లేవా?’ అనుకుంది శైలజ ఉక్రోషంగా.

గత రెండురోజులుగా ఒక కమ్మని పరిమళంలా ఆస్వాదించిన ఇంట్లో సందడిని మళ్లీ మళ్లీ కంటిముందుకు తెచ్చుకునే ప్రయత్నంలో అలా కూర్చుండిపోయింది శైలజ…
‘ఏరా, నీ బెటర్ హాఫ్ ఏదీ? ఒక్కడివీ వచ్చావ్’ తలుపుతీసి ఎదురుగా కొడుకొక్కడే ఉండటంతో అడిగింది.
‘అది వాళ్ల అమ్మ దగ్గరకి వెళ్లింది, నేను నా అమ్మ దగ్గరకి’
‘ఇంకా నీ పాత అలవాటు పోలేదా? అది, ఇది అని చెబుతున్నావ్, రేణుకి చెప్పేనంటే నీతో గొడవకి వస్తుంది.’ కొడుకు చేతిలో బ్యాగ్ అందుకుని, నవ్వుతూ హెచ్చరించింది.
చిన్నప్పుడు రేణుని అక్క అనకుండా ‘అది’, ‘ఇది’ అని ప్రస్తావించినప్పుడల్లా వాళ్లిద్దరి మధ్యా జరిగిన యుధ్ధాలు నిన్న మొన్న జరిగినట్టే అనిపించాయి శైలజకి.

స్నానం చేసివచ్చి డైనింగ్ టేబిల్ దగ్గరకొస్తూ, ‘చాలా ఆకలేస్తోందమ్మా. నువ్వు పెట్టబోయే విందులు తలుచుకుంటూ నిన్న రాత్రి కూడా సరిగా తినలేదు.’
వేడివేడి ఇడ్లీలను ఇష్టంగా తింటున్న కొడుకుని చూస్తూ అడిగింది,
‘అదితికి కూడా ఇడ్లీ రుచి నేర్పేవా?’
‘అస్సలు తినేదికాదమ్మా. టిపికల్ మదరాసీ అంటూ నన్ను ఏడిపించేది. ఈ మధ్య కొంచెం బరువు పెరుగుతోందట, అందుకని నూనె లేని ఫలహారమని ఇడ్లీ తింటోంది. తనకి బ్రేక్ ఫాస్ట్ అంటే పళ్లు, కార్న్ ఫ్లేక్స్. అందుకే మా ఆనందిబాయి కి వంట భలే సులువు. రోటీ తో పాటు ఏదైనా కూర చేసి లంచ్ ప్యాక్ చేసి ఇస్తుంది మా ఇద్దరికి. సాయంత్రం మేము వచ్చేసరికి మళ్లీ రోటీ, దానిలోకి ఏవో రెండు రకాల ఆధరువులు చేసి వెళ్లిపోతుంది.’ తింటూ చెబుతున్నాడు.
‘అదితికి వంట వచ్చా?’
‘భలే ప్రశ్నవేసేవమ్మా, అసలైన అత్తగారివనిపించావు. తనకి అసలు వంటిల్లు అనే కాన్సెప్ట్ నచ్చదు. వండుకోవటం అనేది లేకపోతే బోలెడు సమయం ఆదా అవుతుందని, ఇంకా చాలా గొప్పపనులు చెయ్యచ్చంటుంది.
ఆనందిబాయి రానప్పుడు ఒక్కోసారి నేనే వండుతాను. ఎక్కువ నూనె వేసేస్తున్నానని నేను వండినవేవీ అదితి ముట్టుకోదు. హాయిగా వంకాయ కారం పెట్టిన కూర, బంగాళాదుంప వేపుడు చేసుకుని అన్నంతో తింటాను. అదో లగ్జరీ నాకు. ఇంట్లో బియ్యం వండద్దని అదితి గొడవ.’
ఎక్కడి వస్తువులు అక్కడ విసిరేసి, చేతికి అందించే వరకు భోజనం నోట పెట్టుకోని కొడుకు పెద్దవాడైపోయాడు అనుకుంది శైలజ.
‘ఆఫీసు నుంచి వచ్చి వండుకోవటం అంటే ఆలస్యమవదూ? పోనీ సెలవు తీసుకునేముందు రెండురోజులకి వండిపెట్టి వెళ్లమను మీ ఆనందిబాయిని.’
‘కాదులేమ్మా. సెలవు తీసుకోమని ఆనందీకి నేనే ఒక్కక్కసారి చెబుతాను. నువ్వు అలవాటుచేసిన రుచులు గుర్తొచ్చి వండుకోవాలని మొదలెడతాను. ఈలోపు అదితి హాయిగా సాలడ్ ఏదో తయారుచేసుకుని తన డిన్నర్ పూర్తి చేసి, తనకిష్టమైన టి.వి. ప్రోగ్రామ్ చూస్తూనో, వాళ్ల మమ్మీతో చాటింగో చేస్తూనో రిలాక్సవుతుంటుంది. ఆంటీ మాత్రం నాకు వంటలో సాయం చెయ్యమని అదితికి చెబుతుంది, ఇది వినదుగా.’

వింటున్న శైలజ మనసు చివుక్కుమంది. భోజనం విషయంలో ఎంత కచ్చితంగా ఉండేవాడు. చిన్నప్పడు రాహుల్ కోసం ప్రత్యేకంగా వంటలు, చిరుతిళ్లు చేస్తున్నందుకు రేణు ఎప్పుడూ పోట్లాడేది. వాడు ఏడో నెలలో బలహీనంగా పుట్టడంతో వాడి తిండి విషయంలో తనెప్పుడూ ఎక్కువ శ్రధ్ధ తీసుకుంటూండేది. కాస్త పెద్దయ్యాక రేణు అర్థం చేసుకున్నా, ‘వాడికిష్టమైనవన్నీ నాకూ ఇష్టమే, అయినా ఎప్పుడూ వాడికి ఇష్టం అని చెబుతావు. నాగురించి చెప్పనే చెప్పవు’ అంటూ అలిగేది.
‘రాహుల్, నువ్వెప్పుడు నేర్చుకున్నావురా వంటలు?’ తల్లి ప్రశ్నకి,
‘అమ్మా, తినాలని ఉన్నప్పుడు అదే ఐడియా వచ్చేస్తుంది. ప్రత్యేకం నేర్చుకోనక్కర్లేదు.’ సులువుగా చెప్పేసేడు.

రాత్రి భోజనాలయ్యాక రేణు ఫోన్ చేసింది,
‘అబ్బాయిగారికి విందుభోజనాలు కాబోలు’ అంటూ.
‘రేణూ, నువ్వు కూడా రావలసింది. నువ్వూ, వాడూ ఇద్దరూ కలిసి ఇక్కడికొచ్చి ఎన్నాళ్లైంది’
‘వాడొచ్చినప్పుడు వస్తే నేనెక్కడ కనిపిస్తాను నీకు?’ అంటూ తల్లిని కాస్సేపు ఆటపట్టించింది.
‘అది నాతో వస్తే ఇక్కడ ఎవరు పట్టించుకుంటారులే. దాని కూతురుతో ఆడుకునేవాణ్ణి నేను. అది మిస్ అయిపోయాను. ఏమంటోందే నీ లిటిల్ ఏంజిల్? ’ వెనకనుంచి తమ్ముడి మాటలు విని,
‘ఏరా, అది, ఇది అంటున్నావు ఇంకా. అదితితో ఇలాగే మాట్లాడుతున్నావా?’ కోపంగా అడుగుతున్న రేణు మాటలకి నవ్వేసేడు, ‘అది ఈ జన్మలో తెలుగు నేర్చుకోలేదుగా. భయంలేదు.’
‘చూస్తూండు, ఒక ఆరునెలల్లో నేనే ఫోన్లో నేర్పేస్తాను. అప్పుడు చెబుతుంది నీపని.’
‘అక్కా, అమ్మ వింటే ఏమైనా అనుకుంటుందని కొంచెం ఆగాను. అది నన్ను వాడు, వీడు అంటుంది. అంత మాత్రం తెలుగు నేర్చుకుంది’ అన్నాడు తల్లికేసి చూస్తూ.

పొద్దున్నే నడకకి బయలుదేరబోతూ,
‘ఏమంటున్నాడు అబ్బాయిగారు?’ అంటున్న చంద్రతో మాట్లాడుతూనే, ఫ్రిజ్ లో ఉన్న కూరలు పరిశీలించి చూసి, ‘వాడికి క్యాబేజీ, దొండకాయ ఇష్టం లేదు. నిన్న నేనే వెళ్లి పట్టుకొద్దామంటే వర్షం ఒక పట్టాన వదల్లేదు. వాడికిష్టమైన కూరలు పట్టుకురండ’ ని భర్తకి పురమాయించింది శైలజ.
‘అదేమిటి, ఏ కూరైనా ఇంట్లో అందరూ తినాల్సిందే అనేదానివిగా. ఇప్పుడు రూల్ మార్చేసేవా?’
‘వాడు చుట్టం చూపుగా వచ్చాడు. మన తిండి వాడికక్కడ దొరకదు. ఏవో వాడిపాట్లు వాడు పడుతున్నాడు. ఈ రెండు రోజులైనా వాడికిష్టమైనవి తింటాడు.’
‘కొడుకు సెంటిమెంటు’ అని నవ్వుతూ బ్యాగ్ అందుకున్నాడు.

వరండా అంచున ఉన్న మొక్కల్లో తల్లిదగ్గర కూర్చుని, తమ ఇంటి ఫోటోలు చూబిస్తున్నాడు రాహుల్. నడక ముగించుకొచ్చిన చంద్ర కాఫీ కప్పుతో వాళ్ల కబుర్లు వింటున్నాడు.
‘అమ్మా, అదితి ఎంత బాగా ఇంటిని సర్దుతుందో తెలుసా, ఏ ఇంటీరియర్ డిజైనర్ కూడా పనికిరారు. తన దృష్టిలో, చేసే పనుల్లో ఒక కళ ఉంది. ఏ పనైనా భలే శ్రధ్ధగా చేస్తుంది. నువ్వు చూడాల్సిందే.’ అంటూ ఇంటిని ఎంత కళాత్మకదృష్టితో సర్దిందో చూబిస్తున్నాడు.
‘ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తావు కదరా, నీకు ఈ కళాదృష్టి ఎలా అర్థమైంది’ అని అడగాలని అనిపించినా భార్య గొడవ పెడుతుందని చంద్ర మాట్లాడకుండా వింటున్నాడు.
‘అమ్మా, నువ్వూ, నాన్న ఎప్పుడొస్తారు?ఎప్పుడూ ఏదో సెలవు లేదనో మరొకటో చెబుతారు. రండమ్మా. అదితి బాగా రిసీవ్ చేసుకుంటుంది. నువ్వే చూస్తావుగా. నీకు చాలా నచ్చుతుంది. అసలు తను ఏం చేసినా అందంగా ఉంటుంది’ భార్య గురించిన కబుర్లను ఇష్టంగా చెబుతున్న కొడుకును చూసి నవ్వింది శైలజ.

రెండు రోజులు రెండు నిముషాల్లా గడిచిపోయాయి. ఒక అందమైన కల నడిచొచ్చినట్టు వచ్చాడు. అంతలోనే వెళ్లిపోయాడు. కొడుకు వెళ్లాక శైలజకి తన సర్వ శక్తులూ మాయమైపోయినట్టు అనిపించింది.
చిందరవందరగా ఉన్న ఇంటిని నెమ్మదిగా ఒక తీరుకి తీసుకొస్తున్న భార్యని చూసి, చంద్ర వెక్కిరించాడు. ‘చిన్నప్పటి అలవాట్లేవీ మార్చుకోలేదు వీడు. ఆ అమ్మాయి ఎలా వేగుతోందో! అంత సౌందర్య దృష్టి ఉన్న పిల్ల వీడి పద్ధతులు చూసి ఏమంటుందో!’
శైలజ భర్త మాటలకి చురుగ్గా చూసింది, ‘ఎప్పుడూ వాడి మీద మీకు ఫిర్యాదులే.’
‘కాదు శైలూ, అదితి గురించి అంత గొప్పగా చెబుతున్నాడు. ఇక్కడ చూడు ఒక్క రోజులో ఇల్లంతా తిరగతోడేసేడు. ఎక్కడ వస్తువులు అక్కడే. ఆ తడి తువాలు తెచ్చి మంచం మీద పడేస్తాడు. తింటున్నంత సేపూ కిందామీదా ఒలకపోస్తాడు. అలమర తెరిస్తే వెయ్యడు. ఫ్యాన్లు, లైట్లు అలా వదిలేస్తాడు. పిల్లల చిన్నప్పుడంతా ఎంత స్ట్రిక్ట్ గా ఉండేదానివి ఈ విషయాల్లో. వాళ్లు కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా ఊర్కునే దానివికాదు. ఇప్పుడెందుకో అవేవీ పట్టించుకోనట్టున్నావ్.’

శైలజ ఏమీ మాట్లాడలేదు. భార్య మనసు గ్రహించినట్టు చంద్ర కూడా సంభాషణ మరి పొడిగించలేదు. పిల్లల పట్ల ఆమె పెంచుకుంటూ వచ్చిన మమకారం అతనికి తెలియనిది కాదు.

తల్లిమనసు తెలిసున్నదానిలా రేణు ఆ రాత్రి ఫోన్ చేసింది.
‘అమ్మా, ఏం చేస్తున్నావు’ అంటూ.
‘సందీప్ ఎలా ఉన్నారు? చిట్టితల్లి ఎలావుంది?’ అంటూ అల్లుడి గురించి, మనవరాలి గురించి యోగక్షేమాలడిగింది. తల్లి గొంతులో ధ్వనించిన బెంగల్ రేణు పట్టేసింది.
‘అమ్మా, నీ మనవరాలు నిన్ను కలవరిస్తోంది. వచ్చి నాలుగురోజులుండి వెళ్లు.’
మనవరాలి గురించిన కబుర్లతో మళ్లీ తల్లి గొంతులో ఉత్సాహం వినిపించాక అప్పుడు చెప్పింది రేణు,
‘రాహుల్ నిన్న రాత్రి ఫోన్ చేసాడు.’
కొడుకు ప్రస్తావన విని, ‘ఏమంటాడు?’ అంది శైలజ.
‘నువ్వూ, నాన్న చాలా మారిపోయారని చెప్పాడు. వాడిని పరాయివాడిలా చూసినట్టనిపించిందని బాథ పడ్డాడు.’ వింటున్న శైలజ ఉలిక్కిపడింది. అదేమిటి?
‘పెళ్లైన తర్వాత ఇన్నాళ్లకి తీరిగ్గా రెండు రోజులు అమ్మా, నాన్నలతో గడపాలని, చిన్నప్పటి రోజుల్ని తలుచుకోవాలని వచ్చేడట వాడు.’
‘రేణూ, నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదే.’ అంది అయోమయంగా.
‘వాడు వాడి పాత పధ్ధతులు అన్నీ అలాగే ఉంచుకున్నాడట మన ఇంటికి వస్తూ. ఎప్పటిలా తడి తువ్వాలు బయట తీగెమీద ఆరెయ్యకపోవటం, నువ్వు నేర్పినట్టు తీరువుగా తినకపోవటం…ఒకటేమిటి, వాణ్ణి నువ్వు ఏయే విషయాలకైతే కోప్పడేదానివో అవన్నీ ఇప్పుడు చూసికూడా చూడనట్టు ఉండిపోయావట. వాడి వెనక నువ్వే సర్దేసేవట. వాడికిష్టమైన కూరలే చేసేవట. ఏ దొండకాయో, క్యాబేజీనో చేసి తినాల్సిందే అని చెప్పలేదట. ‘నన్నుఆ ఇంటికి వచ్చిన ఒక అతిథిలాగా చూసేరు అమ్మా, నాన్న’ అంటూ చాలా సేపు చెప్పాడు.
‘నేనేమో నా పూర్వపు రోజుల్ని చూసుకోవాలని, ఆఇంట్లో నా స్వేచ్ఛని ఎంతగానైనా మిస్యూజ్ చేసి అమ్మా, నాన్నల్ని విసిగించాలని, వాళ్లు నన్ను ఇదివరకులా చనువుగా విసుక్కోవాలని, కోప్పడాలని ఆశపడ్డాను. అందుకే ఎక్కడి వస్తువులక్కడ అశ్రధ్ధగా వదిలి వాళ్ల రియాక్షన్ కోసం చూసి చూసి చాలా నిరాశ పడ్డానక్కా. గడిచిపోయిన బాల్యాన్ని మళ్లీ అనుభవించాలని వెళ్లాను, కానీ…ప్చ్’ అన్నాడు.
‘సరే, ఇంతకీ నాన్న ఎక్కువ మారలేదట. వాడికిష్టమైన కూరలు గుర్తుంచుకుని, పప్పులోకి దోసకాయలు, పచ్చడికి కొబ్బరికాయ తెచ్చారట. పైగా వాడోరోజు విడిచిన బట్టలు, చదివిన న్యూస్ పేపర్లు అడ్డదిడ్డంగా సోఫాలో పడేస్తే, నాన్న నీ దగ్గరకొచ్చి ‘నీ కొడుకు వాడి పధ్ధతులేవీ మార్చుకోలేదు చూసేవా? ఒకసారి గట్టిగా చెప్పనా, ఇలాటివి మన ఇంట్లో కుదరవని’ అంటే, నువ్వు గొంతు తగ్గించి,
‘ఊరుకోండి, వాడు వింటాడు, ఇంకా చిన్నపిల్లాడనుకుంటున్నారా వాణ్ణి?’ అంటూ విసుక్కున్నావట నాన్నని. నాన్న మాత్రం వాడిని ఎప్పటిలానే చూసుకున్నారట.’
వింటున్న శైలజ కళ్లల్లో నీళ్ళూరాయి. ‘ఒఠ్ఠి పిచ్చివాడు నా రాహుల్!’ అనుకుంది.

‘ఏమో రేణూ, నేను వాడి మనసు కనిపెట్టలేకపోయానే. వాడు చిన్నప్పట్నుంచి అలవాటైన తిండికి దూరమయ్యాడని నేను బాథ పడ్డాను. పైగా ఆఫీసునుంచొచ్చాక అప్పుడప్పుడు తనకిష్టమైన భోజనం వండుకుంటానని చెబుతుంటే ఆగలేక వాడు వెళ్ళేప్పుడు అన్నాను,
‘నాన్నా, అదితికి మన వంటలు చెయ్యటం నేర్పరా. ఎప్పుడైనా తను ముందుగా డ్యూటీ నుంచి వస్తే సరదాగా, సర్ప్రైజింగా చేసి ఉంచుతుంది’ అంటే, వాడు మాత్రం,
‘ఇష్టంలేని ఈ వంట వ్యవహారం తనకెందుకమ్మా. నేను వండుకోగలనుగా. వియార్ ఫైనమ్మా.’ అంటూ నన్ను బుజ్జగించి వెళ్లిపోయాడు.’
తల్లి మాటలకి ‘బావుంది మీ తల్లీకొడుకుల ప్రేమలు’ అంటూ మరి కాసిని కబుర్లు చెప్పి ఆవిడ మనసుకు ఊరట కలిగించింది రేణు. కూతురితో మాట్లాడటం అయ్యాక తమ సంభాషణ మళ్లీ మళ్లీ తలుచుకుంది శైలజ.

రాహుల్ చిన్నబుచ్చుకు వెళ్లేడా ఇక్కణ్ణుంచి? తమ దగ్గర బయటపడనేలేదు.
ఎంతసేపూ వాడికి నచ్చేవి చేసి పెట్టాలని తాపత్రయపడింది తన తల్లి మనసు. క్రమశిక్షణ తప్పినా వెనకపడి అదిరించి, బెదిరించకుండా వాడికి పెద్దరికాన్ని ఆపాదించి గౌరవంగా చూసింది. అమ్మ వండిపెట్టే కమ్మని భోజనమే కాక వాడు తన చిన్నతనాన్ని, అప్పటిలా అమ్మా, నాన్నలు పెట్టే ఆంక్షల్ని కూడా వెతుక్కుంటూ వచ్చాడని తనకి గ్రహింపుకే రాలేదు. ఈ ప్రేమపాశం మరింకేమీ అంతుపట్టనివ్వదు.

ఎప్పుడు వినే అన్నమాచార్య కీర్తన మనసులో మెదిలింది. జీవించే స్వతంత్రాన్ని, దాన్ని అల్లుకునే మమతల్ని ఇచ్చి, మనసుని ఇంత మాయపొరల్లో కప్పిపడేసి జన్మ సార్థకతని తెలుసుకొమ్మంటే ఎలా? ‘సర్వాంతరాత్ముడవు, శరణాగతుడ నేను…’ అంటూనే అన్నమయ్య ఆ సర్వాంతర్యామిని సూటిగానే ప్రశ్నించాడు మరి!

* * *

One thought on “…మాయలు నీవే కప్పి – దునియా, మన తెలంగాణా ఆదివారం పత్రిక, 27 Oct, 2019

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.