* * *
ఎప్పటిలాగే దేశంలో మరో క్రొత్త ప్రదేశాన్ని చూసేందుకు బయలుదేరాలనుకుంటుంటే ఒక పంజాబీ మిత్రుడు తాను స్థిరపడిన బరేలీ రమ్మని ఆహ్వానించారు. ఎన్నాళ్లుగానో వాయిదా వేస్తున్న ప్రయాణానికి వేసవి విడిది నైనితాల్ ని కూడా కలుపుకుని నాలుగు రోజులు యాత్రని సిధ్ధం చేసుకున్నాం.
ముందుగా విజయవాడ నుంచి ఆకాశదారిలో దిల్లీ చేరి, అక్కడొక రోజు మజిలీ చేసేం. ఏప్రిల్ నెల మూడో వారం దిల్లీ నగరమింకా వేసవి వేడిని ఆహ్వానించినట్టులేదు. వాతావరణం బావుంది. ఆ శుక్రవారం సాయంత్రం దిల్లీలో గడిపిన పాత రోజుల్ని దిగులు, దిగులుగా తలుచుకుంటూ తీరిగ్గా జమా మసీదును చూసేందుకు బయల్దేరేం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించిన ఈ మసీదు భారతదేశంలోని ప్రసిధ్ధి చెందిన మసీదుల్లో ఒకటి. విశాలంగా కొన్ని వేలమంది సరిపోయేంత ఆవరణలో ఉన్న ఈ మసీదు అందమైన ఎర్రరాయి, తెల్లని పాలరాయి మేళవించి కట్టిన నిర్మాణము. ఆవరణలో పెద్దలు, పిల్లలు ఆనందంగా తిరుగాడుతూ కనిపించారు. ఆనందంతో వెలిగే ముఖాలు చూస్తుంటే ఎంత బావుంటుంది!
మసీదు ముందు అనేక చిన్న చిన్న దుకాణాలు బట్టలు, గాజులు, క్లిప్పులు, బొమ్మలు, బ్యాగ్ లు, పాదరక్షలు, ఇంకా అనేకరకాల వస్తువుల్ని అమ్మేందుకు సిధ్ధంగా ఉన్నాయి. చిన్నచిన్న పిల్లలు కూడా దుకాణాల్లో వ్యాపారం చేస్తూ కనిపించారు. ఎదగడానికి తొందరలేకపోయినా, జీవితం బలవంతంగా నేర్పుతున్న జీవిత పాఠాల్ని అనాయాసంగానే అందుకుంటున్నారు.
మరోప్రక్క రకరకాల తినుబండారాలను తయారు చేసే దుకాణాలు హడావుడిగా కనిపించాయి.తీరిగ్గా ఆ పరిసరాల్లో తిరిగి, నగరపు వీధుల్ని దాటుకుంటూ ఇండియా గేట్ ను చుట్టి మా బసకు చేరుకున్నాం.
తెలవారి శతాబ్దిలో బయలుదేరి కాఠ్ గోదామ్ చేరాం. అక్కణ్ణుంచి రోడ్డు మార్గంలో ఒకగంట ప్రయాణం చేసి నైనితాల్ చేరుకున్నాం. మధ్యాహ్నం ఒంటిగంట కావొస్తూంది. చలి ఆహ్లాదకరంగానే ఉంది. ఘాట్ రోడ్డు విశాలమైన కొండల్ని, లోయల్ని, చిక్కని అరణ్యాల్ని చూబిస్తూ మనసులని సేదదీర్చింది. పొడవాటి పైన్ చెట్లు విస్తరించి ఉన్నాయి.ఆ కొండ దారులు, ఇరుకైన వీధులు, ఆకుపచ్చగా చుట్టూ అల్లుకున్న ప్రకృతి అందాలు, ఏ ధూళీ అంటని స్వచ్ఛమైన నీలాకాశం, అడుగడుక్కీ ఎదురయ్యే నీటిప్రవాహాలు, వేడివేడి చాయ్ తో పాటు రకరకాల తినుబండారాలను రుచిగా అందిస్తూన్న అనేకానేక ఫుడ్ జాయింట్లు యాత్రీకులతో, వచ్చేపోయే వాహనాలతో ఒక పండుగ సంరంభాన్ని, ఒక జీవన ఉత్సాహాన్ని మాలోకి, లోలోపలికి ఒంపుతూ ఎన్నో వేసవి విడుదులను తలపుకు తెచ్చింది. ఇక్కడి కట్టడాలన్నీ బ్రిటిష్ వారి కాలంలోని నిర్మాణాలే.
ఉత్తరాఖండ్ ప్రాంతం కుమావు, గఢ్ వాల్ ప్రాంతాలుగా విభజించి చెబుతారు. ఈ రెండు భాషలు స్థానికుల భాషలు. కోల్, ముండా, మండిస్ వంటి భిన్న తెగలవారున్నారు. నైనితాల్ నుండి అల్మోరా దాదాపు 65కిలోమీటర్ల దూరం. అల్మోరాలో నిత్యావసర సరుకులు నైనితాల్ లో కంటే తక్కువ ధరకి దొరుకుతాయని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు.
రాష్ట్రం విడివడ్డాక ఇప్పుడిప్పుడే పిల్లల చదువులు గురించి ఇప్పటి తరం శ్రధ్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కేవలం స్థానిక భాషలో బోధన చేస్తుందని, ఆరవ తరగతి వరకూ ఇంగ్లీషు భాషను నేర్పించరనీ, ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పే ప్రైవేటు పాఠశాలలకి ఖర్చు ఎక్కువైనా పంపుతున్నామని చెప్పారు. కానీ తమ పిల్లల హోం వర్క్ ని తాము చేయించలేమని, ఇంగ్లీషు చదువుతున్న మొదటి తరం తమ కుమావూలలో తమ పిల్లలే అని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. తమ ప్రాంత ప్రజలు శాంత స్వభావులని, ఉన్నదానితో తృప్తిగా జీవిస్తామని చెప్పాడు. అది అక్కడి ప్రజలందరి ముఖాల్లోనూ స్పష్టంగా కనిపించింది.
అక్కడి అరణ్యాలను చూసి మురిసిపోతున్న మాతో చెప్పాడు, తమ ప్రాంతంలో ప్రతి చెట్టుని అపురూపమైన సంపదగా చూస్తామని, ఇక్కడ చెట్టు కొట్టేయటమనేది నేరమని, తమ ఇంటి కాంపౌండ్ లో కానీ ముందుగాని ఉన్న చెట్టుని పడగొట్టే అధికారం ఆ ఇంటి స్వంతదారుకి కూడా లేదని, తప్పని పరిస్థితుల్లో స్థానిక అధికారుల అనుమతి పొందినపుడు మాత్రమే వీలవుతుందని చెప్పినప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. అంత చిక్కని అడవుల్లోనూ ఒక్క చెట్టూ కొట్టివేయరాదన్న విషయం నిజంగా అభినందనీయం. చెట్లను తమతో పాటు ప్రాణమున్నజీవులుగా చూస్తున్న ఆ ప్రజలు ధన్యులు.
మనవైపు చెట్లను నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేసే ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు పర్యావరణం పట్ల, మనతో పాటుగా చుట్టుప్రక్కల పెరుగుతూ మనకి ఉపకారం చేస్తున్న చెట్లను ప్రేమించి, సంరక్షించాలన్న ఆలోచన ఎప్పటికి కలుగుతుందో!
ఇక్కడి స్థానికులు నిరాడంబరంగా, సంతోషంగా కనిపించారు. ఈ కొండలు, అడవులు, సరస్సులు, ఈ గాలి, నీరు…ఇవన్నీ వీళ్లకి ఇలా జీవించమని నేర్పుతున్నాయి కాబోలు. ఇక్కడి వారికి అనారోగ్యం అనేది ఆమడదూరమని చెబుతారు. నైనితాల్ సమీపంలో దాదాపు వందేళ్ల క్రితం బ్రిటిష్ వారి కాలంలో కట్టిన టి.బి. హాస్పిటల్ లో కేవలం బయటివారిని మాత్రమే చేర్చుకుంటారని, స్థానికుల్ని మాత్రం ఆ పరిసరాల్లోనే ఆరోగ్యాన్ని పొందమని చెబుతారని విన్నాము. ఒకవేళ ఎవరైనా ఆరోగ్యం బావులేదని డాక్టర్ దగ్గరకి వెళ్లినా మందులు ఇవ్వటం కాక వారిని ప్రతిరోజూ అడవిలో చెట్లమధ్య కూర్చుని ఆ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ కొంతసేపు గడిపి ఆరోగ్యవంతులు కమ్మని చెబుతారట. ప్రకృతిని మించిన వైద్యులు ఎవరున్నారు?
యాత్రీకుల రద్దీతో సతమతమవుతూ భోజనాలని అందించటం, అంతలోనే ఒక ప్రవాహం వెనక్కి తీసినట్టుగా ఖాళీ అయిపోయి మరొక యాత్రాబృందం కోసం ఎదురుచూసే రెస్టోరెంట్లు…ఓహ్, ఎక్కడున్నామన్న స్పృహ ఒక్కసారీ కలగకపోవటమే ఆ అందమైన ప్రదేశాలలో కనిపించే మ్యాజిక్. నైనితాల్ ని సరస్సుల నగరంగా పిలుస్తారట. ఎటుచూసినా సరస్సులే. నైని సరస్సులో పడవ ప్రయాణం అందమైన అనుభవం. ఇక్కడ నయనా దేవి దేవాలయం ఉంది. నిలువెత్తు ఆంజనేయుడు ఎదురుగా దర్శనమిస్తాడు. దేవాలయాన్ని ఆనుకుని ఉన్న సరస్సు ఆ ప్రాంతానికి ఒక గంభీరమైన రూపునిచ్చింది.
ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ తో విడివడ్డాక అక్కడ అభివృధ్ధి కనిపిస్తోందన్నది అక్కడి ప్రజల మాట. ఉత్తరాఖండ్ అంటే చార్ధామ్ గా పిలిచే గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బదరీనాథ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ వంటి అత్యంత ఆకర్షణీయమైన అనేక విహారయాత్రా స్థలాలున్నాయి. మేము ఈ ట్రిప్ లో కేవలం నైనితాల్ ఒక్క ప్రదేశానికి పరిమితమయ్యాం.
రెండు రోజులు చలిని కాస్త ఇష్టంగానూ, ఇబ్బందిగానూ కూడా భరించాం. స్థానికప్రజల జీవిక యాత్రీకులపైనే ఆధారపడిఉన్నదన్నది నిజం. రోడ్లన్నీ క్యాబ్ లతో నిండిపోయాయి. రిక్షాలు కూడా ఉన్నాయి. వాటికి ఆ బజారు రోడ్లలో తక్కువ దూరాలు తిరిగేవారినుంచి చాలా డిమాండ్ ఉంది. వాటికోసం క్యూలలో వేచిఉండటం కనిపించింది. మార్చి నుంచి జూన్ వరకు యాత్రీకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. జూలై నుంచి సెప్టెంబరు వరకు ఆగకుండా కురిసే విపరీతమైన వర్షాల కారణంగా యాత్రీకుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో హోటల్ రూమ్స్ చవుకగా దొరుకుతాయి. అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు యాత్రీకుల రద్దీ సుమారుగా ఉంటుందని చెప్పారు. స్థానికులు చదువుల నిమిత్తం పిల్లలను దూర ప్రాంతాలకి, మైదాన ప్రాంతాలకి పంపటమనేది తక్కువే. దానికి తగిన ఆర్థిక వనరులు తమకు లేవన్నది వారి మాట.
మాల్ రోడ్, టిబెటన్ బజార్, బారా బజార్, భోటియా బజార్లు అనేక రకాల సామగ్రిని అమ్ముతున్నాయి. ఇక్కడ చేతితో చేసిన క్యాండిల్స్, రకరకాల జామ్ లు, జ్యూస్ లు ప్రముఖంగా దొరుకుతాయి. ఇక్కడ మాల్ రోడ్ లో తిరగటం ఒక చక్కని అనుభవం.
నైనితాల్ సముద్ర మట్టానికి రెండువేల మీటర్ల పైగాఎత్తున ఉండటం, సంవత్సరం పొడవునా అనువైన ఉష్ణోగ్రతలు ఉండటంతో యాత్రీకుల రద్దీ సంవత్సరం పొడవునా కనిపిస్తుంది. రెండురోజుల్లోనే నైనితాల్ చాలా అత్మీయమైనదిగా అయిపోయింది. నైనితాల్ లో హోటళ్ల వసతి, భోజన సదుపాయాలు బావున్నాయి. పెట్టిన ప్రతి రూపాయికి విలువ ఉందన్నది కాదనలేని నిజం.
ఇక బయల్దేరవలసిన సమయం వచ్చింది. నైనితాల్ నుంచి బరేలి కి బయలుదేరేం. అన్నట్టు, నైనితాల్ నుంచి కాఠ్ గోదామ్ వచ్చి రైలెక్కాలి. కాఠ్ గోదామ్ లో చక్కని ఉడిపి రెస్టొరెంట్ ఉంది. ఇడ్లీలను, దోసెలను మాత్రం మిస్ అవలేదక్కడ.బరేలీ అంటే మన నెహ్రూ కుటుంబానికి రాజకీయంగా సంబంధమున్న రాయబరేలీ కాదు. ఈ బరేలీ అంటే దశాబ్దాల వెనుక వచ్చిన హిందీ సినిమా, ‘మేరా సాయా’ లోని ‘ఝుంకా గిరారే, బరేలీకి బజార్ మే…’ అంటూ సాధన పాడిన పాట జ్ఞాపకానికొస్తుంది. ఆ బరేలీ అన్నమాట!
మేము బరేలి లో ఉన్న రెండు రోజుల్లో ఒక రోజు పోలింగ్ జరిగింది. పోలింగ్ రోజు పట్టణమంతా ప్రశాంతమైన వాతావరణంతో కనిపించింది. మనవైపు ఇలాటి దృశ్యం కనిపించదు.
పట్టణం సుమారు పది, పన్నెండు లక్షల జనాభాతో ఉంది. దాదాపు యాభై శాతం ప్రజలు ముస్లిములు. ప్రజల మధ్య ఎలాటి భేదాభిప్రాయాలు లేకుండా చక్కని సమన్వయంతో జీవిస్తున్నారన్నది స్పష్టంగా కనిపించింది. జరీ వర్క్ ఉన్న బట్టలు ఇక్కడ ప్రత్యేకం.
స్నేహితులు కులభూషణ్, అంజులు ఆత్మీయంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు.
బరేలీలో స్నేహితులమధ్య కబుర్ల కలపోత ముగించుకుని దిల్లీ వచ్చే దారిలో మరొకసారి తాజ్ ని చూసేందుకు ఆగ్రాలో ఆగాం. విదేశీ యాత్రీకులు ఎక్కువ సంఖ్యలో కనిపించారు. ఇదివరకటిలా కాక యమున నిండా నీళ్లతో కనిపించింది. తాజ్ గంభీరంగా నిలబడి శతాబ్దాల వెనుకటి చరిత్రను మరొకసారి వీక్షకుల మనసుల్లోకి లాక్కోచ్చింది. పదిపన్నెండేళ్ల పిల్లలు కూడా గైడ్ కావాలా అంటూ సందర్శకులను ఇంగ్లీషులో పలకరించటం కనిపించింది. ఈ చరిత్ర మిగిల్చిన జ్ఞాపకం పట్ల ప్రభుత్వ దృష్టిలో ఎంత ప్రాధాన్యత ఉన్నదో కానీ స్థానికులకు మాత్రం ఒక జీవికని తరతరాలుగా అందిస్తూనే ఉంది. తాజ్ అద్భుతమైన సౌందర్యాన్ని అంటిపెట్టుకుని అక్కడ ఉన్న దారిద్ర్యమూ మన కళ్లపడక మానదు. ఒక్కసారిగా శ్రీనగర్ చూసేందుకెళ్లినపుడు అక్కడ అడుగడుగునా కనిపించిన లేమి జ్ఞాపకానికొచ్చింది.
ఈ సౌందర్యాలకావల ఒక దిష్టిచుక్కలాటి పరిస్థితులు కాబోలు!తాజ్ ని ఎన్నిసార్లు చూసినా ఒక దిగులు మాత్రమే కలుగుతుంది ఎందుకో! ఆ స్మృతి తాలూకు వేదనో, మరేమిటో ఇతమిత్ధంగా తోచదు.
ఈ దిగుళ్లు నుంచి దూరం చేస్తూ దిల్లీ నగరపు హడావుడి మమ్మల్ని ఎయిర్పోర్ట్ కు చేర్చింది. అంతే. రెండే రెండు గంటల్లో స్వంత ఊరు, స్వంత మనుషుల మధ్యకి…
Very good! As usual I felt like I was with you through out this! Loved the whole journey! Thanks for sharing your wonderful experience and photos !
LikeLiked by 1 person
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike