ఆదర్శం – బిట్టు కథ, పదవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Apr, 2019

* * *

జరిగిన కథ : బిట్టు ఢిల్లీ కుర్రాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ల ఊరు పోరంకికి వచ్చాడు, వేసవి సెలవలు గడిపి వెళ్ళేందుకు. ఇక్కడ వాడు రకరకాల సంగతులు నేర్చుకుంటున్నాడు. మొన్న పిచ్చుకలు దొరికాయి వాడికి. అంతకుముందు ఓ కుక్క దొరికింది. దానికి రెయిన్ బో అని పేరు పెట్టుకున్నాడు. పక్కింటి అమ్మమ్మ పేరు జయమ్మమ్మ. ఆవిడే, పిచ్చుకల్ని బయట పడేసింది.. ఇక చదవండి.

 

మర్నాడు జయమ్మమ్మ వచ్చింది- రమ్యనీ, రాహుల్ ని తీసుకుని. ఆవిడ వచ్చేసరికి బిట్టు పిచుకల దగ్గర ఉన్నాడు. ‘నేను బయట పడేసిన పిచుకల్ని నువ్వు ఇంట్లోకి తెచ్చుకున్నావా?’ అని జయమ్మమ్మ తిడుతుందేమో అనుకొని కొంచెం చిన్నబోయాడు బిట్టు.

‘ఏమిటి, ఆ పిచుకల్ని ఇక్కడ తెచ్చిపెట్టావా?’ అంది ఆమె కొంచెం ఆశ్చర్య పోతున్నట్లు. బిట్టు అమ్మమ్మ వైపు చూసాడు. ‘అవును జయా, వీడు ఎప్పుడూ పిచుకల్ని చూడలేదుట. వీడు ఉన్నన్నాళ్లూ వీటిని పెంచుకుంటాడట’ అంటూ నవ్వింది అమ్మమ్మ, వాతావరణాన్ని తేలిక చేస్తూ.

బిట్టూ రమ్యని, రాహుల్ని దగ్గరికి పిలిచి పిచుక పిల్లల్ని చూపించాడు. వాళ్ల వెనకే ఇల్లంతా తిరుగుతున్నాడు రెయిన్బోగాడు. జయమ్మమ్మ కొంచెం విసుక్కుంది: ‘ఈ పిచ్చి కుక్క ఎక్కడిది? పెంచుకోవాలంటే మంచి జాతి కుక్కని తెచ్చి పెట్టుకోవాల్సింది’ అని.

బిట్టుకి జయమ్మమ్మ మాటలు నచ్చలేదు. కానీ తాతయ్య చెప్పారు కదా, పెద్దవాళ్ల మాటలకి కోపం తెచ్చుకోకూడదని?! అందుకని ‘ఎలాగైనా సరే, రెయిన్బోగాడు జయమ్మమ్మకి కూడా నచ్చేలా చెయ్యాలి’ అనుకొని ‘ఇది చాలా మంచిది అమ్మమ్మా, దావీదు దగ్గర నుంచి తెచ్చాను’ అని మాత్రం అన్నాడు. సాయంకాలం అవుతూనే దావీదు, చిట్టి చదువుకునేందుకు వచ్చారు. ‘జయమ్మమ్మ రెయిన్బో గాణ్ణి విసుక్కుంది’ అని దావీదుతో చెప్పేసాడు బిట్టు.

‘ఫర్వాలేదులే, వాడి బిహేవర్ చూస్తే జయమ్మమ్మ కూడా వాణ్ణి ఇష్టపడుతుంది’ అని దావీదు బిట్టుకి ధైర్యం చెప్పాడు.

ఇంగ్లీషు మాటలు ఉపయోగించటం అంటే దావీదుకు సరదాగా ఉందని బిట్టు అర్థం చేసుకున్నాడు. ‘కానీ దావీద్, బిహేవర్ కాదు బిహేవియర్ అనాలి’ అని సరిచేసాడు. ఆ పదాన్ని పదే పదే దావీదు తనలో తాను అనుకున్నాడు గుర్తు పెట్టుకుందుకు- ‘నేర్చుకునేప్పుడు ఒకటికి రెండు సార్లు తలుచుకోవాలి’ అని తాతయ్య చెప్పారు కదా.

తాతయ్య ఆఫీసు నుంచి వచ్చి వీళ్లందర్నీ చదివించటం చూసి జయమ్మమ్మ రమ్యనీ, రాహుల్ని కూడా చదువుకుందుకు పంపింది. వాళ్లు కొంచెం బిడియంగా ఉన్నారు. ఎక్కువగా ఏమీ మాట్లాడటం లేదు. ‘క్రొత్త కదా’ అనుకున్నారు అందరూ.

‘ఇద్దరికీ తెలుగు రాదు’ అని చెప్పేసరికి, “అయ్యో! నేను నేర్పిస్తానులెండి తెలుగు” అన్నారు తాతయ్య. కానీ వాళ్లిద్దరూ అయిష్టంగా ముఖాలు పెట్టారు. జయమ్మమ్మ కూడా ‘తెలుగు ఎందుకు, వాళ్లిద్దరూ ఇంగ్లీషు మీడియమే. హిందీ, సంస్కృతం కూడా నేర్చుకుంటు-న్నారు. తెలుగు అవసరం లేదు’ అని చెప్పింది.
కానీ తాతయ్య ‘అయ్యో, మాతృభాష కొంచెం కూడా రాకపోతే వికారంగా ఉండదూ? మర్యాద ఏముంటుంది? వాళ్లు తెలుగులో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడలేక పోతున్నారు చూసారా? చదవటం, రాయటం నేర్చుకుంటే పలుకులో‌ కూడా స్పష్టత వస్తుంది” అని చెప్పాక రమ్య, రాహుల్ కూడా తెలుగు నేర్చుకోవటం మొదలెట్టారు.

ఆ రాత్రి బిట్టు తన పుస్తకంలో ఇలా రాసుకున్నాడో కవిత….

పచ్చ, తెలుపు, కాషాయం,
మూడు రంగులు మన జెండా!
తెలుగు, హిందీ, ఇంగ్లీషు
మూడు భాషలూ మనకొచ్చు!

జయమ్మమ్మ పిలిచిందని ఒక రోజు రమ్య వాళ్లింటికి వెళ్లాడు బిట్టు. రమ్య, రాహుల్ అలా మౌనంగా సోఫాలో కూర్చుని టి.వి. చూస్తున్నారు- ఏమీ మాట్లాడనే లేదు! ఏదైనా మాట్లాడబోయినా జయమ్మమ్మ వాళ్లని కోప్పడుతోంది: ‘ఎందుకు ఆ పనికి మాలిన కబుర్లు? కాస్సేపు టి.వి. చూడండి!’ అంటూ. బిట్టు ఆశ్చర్య పోయాడు. ఎందుకంటే బిట్టు అసలు టి.వి. చూడనే చూడడు! అమ్మమ్మ వాళ్ల ఇంట్లో టి.వి ఎక్కడో ఒక మూలకి ఉంటుంది. దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. తాతమ్మ మటుకు ఒక్కోసారి భక్తి టి.వి. పెట్టుకుని చూస్తుంది.

జయమ్మమ్మ బిస్కెట్లు తెచ్చి పెట్టింది. పళ్లెం చేతిలో పెడుతూ: ‘క్రింద పడకుండా తినండి. పడిందంటే ఇంక మీరే తుడవాలి’ అని హెచ్చరిక చేసింది. ఆ తర్వాత బిట్టుకి పెద్దగా తినాలని అనిపించలేదు. కానీ మర్యాదకి ఒకటి తిని ‘ఇంక ఇంటికెళ్తా’ అంటూ లేచాడు. అదే అవకాశం కోసం చూస్తున్న రమ్య, రాహుల్ కూడా బిట్టుతో పాటు వాళ్లింటికి బయలుదేరారు.

బిట్టు, రాహుల్ ఇద్దరూ క్రికెట్ గురించి మాట్లాడుతుంటే రమ్య ‘బోర్’ అంది. అమ్మమ్మ స్వెటర్ అల్లుకుంటూ తాతమ్మతో ఏవో కబుర్లు చెబుతుంటే అక్కడకి వెళ్లింది. అంతలో తాతమ్మ రమ్యతో కబుర్లు మొదలెట్టింది. ఆవిడకి సరిగ్గా వినపడదు కదా, దాంతో ఒక్కో ప్రశ్ననీ రెండు సార్లు అడగటంతో ఆమెకేసి విచిత్రంగా చూసింది రమ్య.

కొంచెంసేపు ఆవిడని మాట్లాడనిచ్చాక, ఇంక అమ్మమ్మ లేచి, “పిల్లలకి నేను కథ చెబుతాను” అంటూ తన దగ్గర కూర్చోబెట్టుకుంది. ఇక ఆ కథల్లోను, ఆటల్లోను మునిగి సాయంకాలం ఎప్పుడైందో కూడా గమనించలేదు పిల్లలు.

రమ్యకి మణి అమ్మమ్మ తెగ నచ్చింది. రాహుల్‌కి బిట్టుతో‌ ముచ్చట్లు నచ్చాయి. ‘ఇంట్లో అమ్మ, అమ్మమ్మ వాళ్లకి వాళ్ళు టి.వి. చూస్తూ కూర్చుంటారు. ఊరికే మమ్మల్ని కూడా టివి ముందు కూర్చోబెదతారు. మాతో అసలు మాట్లాడనే మాట్లాడరు! కథలైతే ఎప్పుడూ చెప్పనే లేదు!’ అనుకున్నారు రమ్య, రాహుల్. ఆరోజు జయమ్మమ్మ డాబామీద వడియాలు ఆరబెట్టి, పిల్లల్ని కాపలా ఉంచింది: ‘ఉడతలు తిని పాడుచేస్తాయి- జాగ్రత్తగా గమనించు-కోండి’ అని పురమాయించింది. రమ్యకి విసుగ్గా ఉంది, ఎండలో డాబా మీదకి, క్రిందకి తిరగటం. అమ్మమ్మకి చెప్పి మర్నాడు వడియాలు వాకిట్లోనే ఎండ బెట్టించింది.

బిట్టు వెనుకే ఆ రెయిన్బో కుక్క ఉంటుంది కదా, అది వడియాలు ముట్టుకొని పాడు-చేస్తుంది. అందుకని బిట్టుని వడియాల వైపుకు రానివ్వకు” అని రాహుల్‌తో‌ చెప్పింది జయమ్మమ్మ. సరేనని బిట్టు, రాహుల్ ఛెస్ ఆడుతూ దూరంగా, పెరట్లో చెట్టు క్రింద కూర్చున్నారు. రమ్య ఎండకి ఒకటే ఆపసోపాలు పడుతూ ఇల్లంతా తిరుగుతోంది.

అకస్మాత్తుగా రెయిన్బో అరవటం మొదలెట్టాడు. ‘ఆగు! అరవకు! జయమ్మ-మ్మ కోప్పడుతుంది’ అని బిట్టు రెయిన్బోని హెచ్చరిస్తున్నాడు కానీ, అది మాత్రం ఆగటం లేదు!

అంతలో జయమ్మమ్మ బయటకు వచ్చి, గోడ మీద ఉన్న రెండు కోతుల్ని చూసి, కర్ర పుచ్చుకుని తరిమేసింది వాటిని! అప్పుడు అర్థమైంది అందరికీ- రెయిన్బో అరిచిన కారణం! వాడు హెచ్చరిక చెయ్యకపోతే కోతులు వడియాల్ని పాడుచేసి ఉండేవి!!

ఆ రోజున జయమ్మమ్మ ఒక కప్పులో పాలు పోసి తెచ్చి, రెయిన్బోగాణ్ణి త్రాగమంది. బిట్టుకి గర్వంగా ఉంది- ‘మా రెయిన్బోగాడు ఎంత చురుకైనవాడో, ఎంత మంచివాడో జయమ్మమ్మకి ఇప్పటికైనా తెలిసింది కదా’ అనుకున్నాడు.

కోతుల్ని చూడటం కూడా అదే మొదటిసారి బిట్టుకి! ఆ రోజున వాడికి నిజంగా ఏదో క్రొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఉంది. ‘సాయంకాలం దావీదు వచ్చాక ఈ విషయం చెప్పాలి’ అనుకున్నాడు.

కానీ సాయంకాలం దావీదు, చిట్టి చదువుకుందుకు రాలేదు! ఇట్లా అవటం ఇదే మొదటిసారి. అందుకని తాతయ్య ఆఫీసు నుంచి రాగానే అందరూ బయలుదేరారు. సైకెల్ షాపు దగ్గరకెళ్తే అది కట్టేసి ఉంది. అలా నడుచుకుంటూ దావీదు ఇంటికి వెళ్ళారు అందరూ.

దావీదు చేతికి చిన్నకట్టు కట్టుకుని కూర్చుని ఉన్నాడు. వాడి ముఖం మీద, చేతుల మీదా కూడా గీరుకు పోయి, ఎండిపోయిన సన్నని రక్తం చారికలు ఉన్నాయి. కళ్లు ఉబ్బి ఉన్నాయి. అలా ఎప్పుడూ ఎవరినీ చూడని బిట్టు నిజంగా జడుసుకున్నాడు- తాతయ్య వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు.

వీరబాబు వాకిట్లోకి వచ్చి, ‘ఈ రోజు చాలా ప్రమాదం తప్పిపోయింది సారూ, ప్రొద్దున్నే న్యూస్ పేపరు వేసేందుకు వెళ్తున్నాడు పిల్లాడు- వద్దంటే వినడు! ‘నేనూ కొంచెం సంపాదించాలి’ అంటాడు. ఈ రోజు వీధి మలుపులో ఎవరో స్కూటరాయన వీడి సైకిల్ని గుద్ది వెళ్లిపోయాడు! పిల్లాడు క్రింద పడిపోయాడు;

స్కూటరాయన ఆగనైనా ఆగలేదు! రోడ్డుమీద చూసినవాళ్ళే పిల్లాడిని, సైకిల్ని ఇంటివరకూ తీసుకొచ్చారు. వాడు బాగా భయపడిపోయాడు. అయితే నేనే ఈ సంగతులేవీ అమ్మ గారితో చెప్పద్దన్నాను కమలమ్మని!’ అన్నాడు తలవంచుకుని.

తాతయ్య దావీదు ప్రక్కన కూర్చుని, ‘దావీదూ, నీకు ఏదైనా ప్రమాదం అయితే ఇంక నువ్వు అమ్మకి, నాన్నకి, తమ్ముళ్లకి, చెల్లెళ్లకి ఎలా సాయం చేస్తావురా, చెప్పు?! నీది ఇంకా చిన్న వయసే కదా; సంపాదన పని ఇప్పుడే వద్దు. మీ తాతయ్య, నేను చెప్పిన మాట విను. ఈ పనులు కొంచెం‌ పెద్దయ్యాక చెయ్యచ్చులే’ అన్నారు అనునయంగా.

దావీదు తల వంచుకున్నాడు. వాడి కళ్లల్లో నీళ్ళు. బిట్టు, రమ్య, రాహుల్, చిట్టీ దూరంగా నిలబడి చూస్తున్నారు. ‘అమ్మమ్మ, తాతయ్య మాకోసం ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నా కదా తాతగారూ, నేను సోమరిగా కూర్చోలేను. మేము వచ్చాక అమ్మమ్మకి పని ఎక్కువైంది; తాతయ్య కూడా కొట్లో ఎక్కువ సేపు కూర్చుంటున్నాడు. అందుకని నాకు చేతనైంది నేను చెయ్యాలని అనుకున్నాను’ అన్నాడు దిగులుగా.

తాతయ్య వాడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని చెప్పారు, ‘అమ్మమ్మ, తాతయ్య ఇద్దరూ ఇంకా కొంచెం ఓపికగానే ఉన్నారు దావీదూ. వాళ్లకి మిమ్మల్ని పెంచటం కొంచెం శ్రమే; కానీ అంత కష్టం ఏమీ కాదు. నిన్ను, చిట్టిని మేమంతా చదివిస్తాం. మీరు బాగా చదువుకోండి- అది చాలు మాకు. పెద్దయ్యాక మీరే మా అందరినీ చూసుకుందురు గాని, ఇప్పటికి నామాట వింటావా మరి?’ దావీదు తలూపాడు.

ఇంటికొచ్చే దారిలో కొద్దిసేపు అందరూ మౌనంగా ఉన్నారు. రాహుల్‌కి తాతయ్య బాగా నచ్చారు. ‘తాతగారూ, మీరు దావీదుకి ధైర్యం చెప్పి, ‘నేను చదివిస్తా; అని చెప్పారు కదా, నాకు ఆ మాట చాలా నచ్చింది. పెద్దయ్యాక నేను కూడా మీలాగానే ఎవరికైనా సహాయం చేస్తాను’ అన్నాడు ఎనిమిదో తరగతి రాహుల్. ‘నేను కూడా’ అన్నారు బిట్టు, రమ్య.

‘అందుకే అందరూ బాగా చదువుకోవాలి. అప్పుడే మరొకరికి సహాయం చేసే అవకాశం వస్తుంది. మానాన్నగారు ఇలాంటి మంచి పనులు చాలా చేసేవారు. నాకు ఆయనే ఆదర్శం. అవునూ, ఇంతకీ మీకు ‘ఆదర్శం’ అంటే తెలుసా?’ అని అడిగారు తాతయ్య. అందరూ ముఖాలు చూసుకున్నారు.

‘ఆదర్శం అంటే అందరికీ నచ్చే పని!’

* * *

One thought on “ఆదర్శం – బిట్టు కథ, పదవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Apr, 2019

Leave a Reply to seshu chebolu Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: