ఒడిషా రాష్ట్రం మూడురోజుల్లో…చూడవలసింది చాలా ఉంది!

* * *IMG_20181207_164850652భారతదేశం లోని వైవిధ్యాన్ని కళ్లారా చూసేందుకు తరచూ వివిధ ప్రాంతాలకు ప్రయాణమవుతూనే ఉన్నాం. నైసిర్గక స్థితిగతులు, ఉష్ణోగ్రతలు, భాష, భోజనం, దుస్తులూ ఇలా ఎన్ని వైరుధ్యాలున్నా, దేశంలో ఎక్కడైనా మన భారతీయత కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఎవరిని చూసినా మనకు పరిచయం ఉన్నట్టే ఒక దగ్గరితనం అనిపిస్తుంటుంది. ఒడిషా మన ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్నాకూడా ఇన్నాళ్లూ చూడనేలేదు.

IMG_20181206_102532178ఒడిషా అంటే బంగాళాఖాతం ఒడ్డున ఉన్న చిన్నరాష్ట్రం, తరచూ తుఫానులకి ఒణుకుతో కష్ట, నష్టాలకు గురవుతున్న రాష్ట్రం జ్ఞాపకానికొస్తుంది. విస్తీర్ణం దృష్ట్యా దేశంలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇక్కడి ముఖ్యమంత్రి ప్రాంతీయ భాష తెలియని వ్యక్తి అని చెప్పుకున్నా, అత్యున్నత విద్యార్హతలున్న వ్యక్తి. ఒడిషా రాష్ట్రపు పరిస్థితుల్ని చక్కదిద్దుతూ అక్కడి ప్రజల మన్ననలను అందుకుంటున్న వ్యక్తిగా కూడా వింటాము. పూర్వపు ఒరిస్సా ఇప్పటి ఒడిషా. ఇది 2011 సంవత్సరంలో తన పేరును మార్చుకుంది. IMG_20181206_141920031ఈ రాష్ట్రపు పేరు వింటే పిపిలీ హస్తకళ, కటక్ వెండి నగిషీలు ఇంకా జనాభాలో 24శాతమున్న ఆదివాసీలు, వారిలోని వివిధ తెగలు, వారి జీవన వైవిధ్యం, ప్రత్యేక సంస్కృతీ సంప్రదాయాలు జ్ఞాపకానికొస్తాయి. రైల్వేలు, ఆనకట్టలు కట్టడం, ఖనిజాలతవ్వకం వంటివి వారి జీవితాల్లో తెస్తున్న సమస్యలు కూడా జ్ఞాపకానికి రాకమానవు.IMG_20181207_131951290IMG_20181207_132005113విశాలమైన మహానది ఈ రాష్ట్రమంతా ప్రవహిస్తోంది.

ఇటీవల ఒక మూడు రోజులు ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలు చూసేందుకు బయలుదేరేం. ఈ ప్రాంతం పేరు తలుచుకుంటే ‘అమృత సంతానం’ నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ మొట్టమొదటి అవార్డును అందుకున్న గోపీనాథ మొహంతీ జ్ఞాపకానికొస్తారు. అలాగే ప్రతిభారే వంటి రచయిత్రులు కూడా.

ఈప్రాంతపు ప్రత్యేకమైన ఒడిస్సీ నృత్యం, ఆ కళాకారులు కేలుచరణ్ మొహాపాత్ర, సోనాల్ మాన్సింగ్, ప్రోతిమా బేడి జ్ఞాపకానికొస్తారు. అలాగే సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కూడా. ప్రత్యేక నేతచీరలకు ప్రసిద్ధి చెందిన సంభల్ పూర్ జ్ఞాపకానికొస్తుంది. అలాగే ప్రపంచ ప్రసిద్ధిపొందిన కోణార్క్ దేవాలయం, పూరీ జగన్నాథ ఆలయం కూడా. ఇక్కడి ప్రత్యేకతలు ఇంకెన్నో ఉన్నాయి.

పన్నెండు గంటల ప్రయాణం చేసి భువనేశ్వర్ లో దిగినపుడు రాష్ట్ర రాజధాని నగరపు రైలు స్టేషన్ ఎలాటి ప్రత్యేకతా లేనట్టే కనిపించింది. ఇలాటి యాత్రలకి రైలు ప్రయాణమే ఇప్పటికీ అభిలషణీయంగా ఉంటుంది.

మొదటిరోజు ప్రొద్దున్నే అల్పాహారం తింటూ ఆ ప్రాంతపు ప్ర్రత్యేకతీపి వంటకం గురించి అడిగినపుడు ‘చెనాపోడా’ పేరు చెప్పారు. అక్కడినుంచి దాదాపు30కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్ వెళ్లి, ‘గోల్డెన్ స్పూన్’ రెస్టోరెంట్ లో చక్కని భోజనం చేసి, మరొక 100 కిలో మీటర్ల దూరంలో ఉన్నశక్తిపీఠం జాజ్పూర్ బయలుదేరాం. అక్కడి దేవాలయం అతి పురాతనమైనది. ఇది 13వ శతాబ్దంలో కట్టబడింది. దేవాలయ నిర్మాణం ఆప్రాంతపు ప్రత్యేక శైలితో ఎంతో సుందరంగా ఉంది. కానీ ఫోటోగ్రఫీ ని అక్కడ అనుమతించకపోవటంతో ఆ అందమైన పరిసరాలను ఫోటో రూపంలో తెచ్చుకోలేకపోయాం. ఇక్కడి బిరజ లేదా గిరిజ అమ్మవారు పార్వతి దేవిగా చెబుతారు. దేవాలయం ఎంతో ప్రశాంతంగా ఉంది, ప్రక్కనే వైతరిణి నది ప్రవహిస్తూంది. దేవాలయం చుట్టుప్రక్కల జనం బయటినుంచి వచ్చే యాత్రికుల్ని చూస్తూ నిశ్శబ్దంగా తమతమ జీవన వ్యాపారాల్లో మునిగిపోయి ఉన్నారు. జాజ్పూర్ లో కోటి శివలింగాలున్నాయని చెప్పారు. ఆదిశంకరాచార్యుడు తన అష్టాదశ శక్తిపీఠస్తుతిలో ఈ గిరిజను వర్ణించారు. శ్రావణమాసం, దసరా నవరాత్రులు ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు.IMG_20181206_162223296కటక్ లోని స్నేహితుల్ని చూసేందుకు వెళ్లాం. చాయ్ తో పాటు ‘చెనాపోడా’ తినిపించారు వాళ్లు. పాలను విరిగేలా చేసి, పంచదార వగైరాలు వేసి బేక్ చేసే పదార్థమది. రుచిగా బావుంది. సాయంకాలపు వేళలో కటక్ పట్టణం జనసమ్మర్దంతో క్రిక్కిరిసిపోయి ఉంది. రకరకాల వ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయి. పూర్వమెప్పుడొ చరిత్ర పాఠాల్లో చదువుకున్న కటకం పట్టణం మంచి వాణిజ్యకేంద్రమన్నది ఇప్పటికి ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది. ప్రజలంతా చేతినిండా వృత్తివ్యాపారాలతో సంతృప్తిగా కనిపించారు. శాంత స్వభావులు అనిపించింది. కటక్ పట్టణంలో తిరుగుతుంటే మనవెంటే మహానది తూర్పు, పడమరలుగా ప్రవహిస్తుండటం చూస్తాం. అస్సాంలో గౌహతి నగరంలో తిరుగుతున్నప్పుడు బ్రహ్మపుత్ర ప్రవహించటం జ్ఞాపకమొచ్చింది.

కటక్ చండీ దేవాలయం కూడా చూడదగ్గది. ఈ దేవత కటక్ పట్టణాన్ని రక్షించే దేవతని ఇక్కడి వారి నమ్మకం. మనవైపులా కాక అమ్మవారిని స్వేచ్ఛగా, తీరిగ్గా చూసే అవకాశం ఈ దేవాలయంలో కనిపించింది.

రాత్రికి భువనేశ్వర్లోని మా బసకి చేరుకున్నాం. మాక్యాబ్ డ్రైవర్ ఉత్సాహంగా కబుర్లు చెప్పాడు. ఆ సమయంలో భువనేశ్వర్ లో జరుగుతున్న ప్రపంచ హాకీపోటీల హడావుడి నగరమంతా కనిపించింది. దేదీప్యమానమైన వెలుగులతో, అందమైన భవంతులు, హోటళ్లతో నూతనంగా అభివృధ్ధి చేసిన భువనేశ్వర్ ని చూశాం. రోడ్లు విశాలంగా ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రపు రాజధాని ఇంత విలాసవంతంగా, అందంగా అభివృద్ధి చెయ్యబడిందా అని విప్పార్చుకున్న కళ్లతో చూస్తుంటే క్యాబ్ డ్రైవర్ అసలు విషయం చెప్పేసేడు, తమ రాష్ట్ర ముఖ్యమంత్రికి కుటుంబం అంటూ ప్రత్యేకంగా లేదని, ఆయన సర్వ శక్తులతో తన ప్రాంతాన్ని అభివృధ్ధి చెయ్యటంలోనే మునిగిఉన్నాడని. తమ అధినేత పట్ల సంతృప్తిగా మాట్లాడాడు.

భువనేశ్వర్ ను దేవాలయాల నగరంగా చెబుతారు. ఇక్కడ ఉత్కళ విశ్వవిద్యాలయం చూశాం. దగ్గర్లోనే ఉన్నలింగరాజ దేవాలయం చూసాం. ఇది కూడా అతి ప్రాచీన దేవాలయం. 11వ శతాబ్దం లో నిర్మించబడింది. ఎర్రరాయితో నిర్మించిన ఈ దేవాలయం కళింగుల శిల్పసంస్కృతిని ప్రతిఫలిస్తుంది. ఫోటోగ్రఫీ అనుమతి లేదు. దేవాలయం ముందు పండాలు యాత్రికులకి అవసరమైన పూజలు జరిపిస్తామంటూ పదేపదే అడగటం కనిపించింది. ఇది పూరీ జగన్నాథ దేవాలయం కంటే పురాతనమైన దేవాలయం.

దేవాలయంలోకి లెదర్ వస్తువులను అనుమతించరు. దేవాలయం విశాలంగా ఉండి, దాదాపు 50 వరకు చిన్నచిన్న దేవాలయాలతో, విష్ణు, పార్వతి మొదలైన దేవుళ్లను కలిగిఉంది. ముఖ్య దేవాలయపు శిఖరం 180 అడుగుల ఎత్తు కలిగి ఉంది. లింగరాజు అంటే శివుడు. అయినా శివ, విష్ణు రూపాల్లో ఇక్కడ కొలుస్తారు. శివలింగం భూమి అడుగున ఉండి కేవలం ఏడెనిమిది అంగుళాల ఎత్తున మాత్రం కనిపిస్తుంది. శివుడు స్వయంభువుగా చెబుతారు. గర్భగుడి కాక యజ్ఞశాల, విశాలమైన నాట్యశాల, భోగశాల ఉన్నాయి. శివరాత్రికి ప్రత్యేకమైన ఉత్సవం జరుగుతుంది.

ప్రక్కనే ఉన్న ‘బిందుసాగర్’ సరస్సు విశాలమైనది. ఈ సరస్సులో దేశంలోని అన్ని పవిత్రమైన నదులనీటిని చేర్చినట్టు చెబుతారు. చరిత్రలో వర్తకవాణిజ్యాలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. దీనిని పురస్కరించుకుని ‘బొయిట బందన’ అన్న పేరుతో ప్రజలు ఈ సరస్సులో చిన్నచిన్న బొమ్మపడవలను అలంకరించి, దీపాల మధ్య వదిలి తమ భక్తి గౌరవాలను చాటుకుంటారు. అదొక అందమైన, చూడదగిన దృశ్యమని చెబుతారు.IMG_20181207_110807783ధౌళి శాంతి స్తూపం చెప్పుకోదగ్గ పర్యాటక ప్రదేశం. ఇక్కడి ‘దయా’నది భువనేశ్వర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. అశోకుడు కళింగ యుధ్ధం చేసిన ప్రదేశం ఇది. యుధ్ధం తరువాత ‘దయా’నది అంతా రక్తపు ప్రవాహంతో నిండిపోయింది. ఆ దృశ్యం అశోకుడి మనసుని యుధ్ధాలపట్ల విముఖుడిని చేసి శాంతి వైపు, బౌధ్ధమతం వైపు మళ్లించింది. ధౌళి శాంతి స్తూపం తెల్లని పాలరాయి కట్టడం. ఇది కట్టబడిన కొండ కూడా ధౌళికొండగా చెబుతారు. ఈ స్తూపాన్ని 1972 సంవత్సరంలో కట్టారు. జపాన్ బౌధ్ధ సంఘం, కళింగ నిస్పాన్ బౌధ్ధ సంఘం కలిసి దీనిని నిర్మించారు. ఇక్కడ అనేక రూపాలలో అందమైన నిలువెత్తు బుధ్ధ ప్రతిమలను చూస్తాం.IMG_20181207_111309018IMG_20181207_112231634IMG_20181207_112549174భువనేశ్వర్ లోని ‘నందన్ కానన్’ అభయారణ్యం చూడలేకపోయాం. ఇక్కడొక ప్రత్యేకత ఉంది. ఎవరైనా ఒక జంతువును దత్తత తీసుకుని దాని పోషణకు కావలసిన వ్యయాన్ని భరించవచ్చు.IMG_20181207_132819652IMG_20181207_133811859క్కడనుంచి కోణార్క్ బయలుదేరాం. కోణార్క్ సూర్య దేవాలయం గురించి పాఠశాల పుస్తకాల్లో చదువుకున్నప్పటి నుంచి ఒక ఆకర్షణ. కోణార్క్ చంద్రభాగ నదీతీరాన ఉంది. ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు.IMG_20181207_134225481IMG_20181207_134329757దీనిని ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శించవచ్చు. దీని ఎత్తు 230 అడుగులు. ఈ దేవాలయం అనేక దాడులకి గురైంది. దేవాలయ గోడల మీద ఉన్న అత్యద్భుతమైన శిల్పకళ, నాట్యభంగిమల్లో ఉన్న స్త్రీమూర్తుల సౌందర్యం కొంతవరకు ధ్వంసం అయింది. శృంగారభరిత శిల్పాలు కూడా ఉన్నాయి.  13 వ శతాబ్దపు గంగరాజ వంశానికి చెందిన నరసింహదేవుడు దీనిని నిర్మించాడు. మేగ్నటైట్ రాళ్లతో నిర్మించారు. దేవాలయపు ప్రధాన భాగం పైకప్పులో బలమైన మేగ్నెట్ ను ఉంచి దానిక్రింద సూర్య విగ్రహాన్నిఉంచినట్టు, ఆ మేగ్నెట్ కారణంగా లోహపు విగ్రహం భూమి పైన ఆనుకుని కాక గాలిలో తేలుతున్నట్టు ఉంటుందని చెప్పారు. కానీ దేశ, విదేశాలనుంచి వచ్చిన సందర్శకులందరూ నిరాశ చెందేలా ముఖ్య దేవాలయం రిపేరు పనుల నిమిత్తం దశాబ్దాలుగా మూసివేయబడిఉంది. కేవలం ఆ దేవాలయ ప్రాంగణంలో తిరిగి ఫోటోలను తీసుకునే వెసులుబాటు మాత్రం ఉంది.IMG_20181207_134815611IMG_20181207_135330982చుట్టూ ఆకుపచ్చని లాన్ లు. ఆలయముఖద్వారం, గోపురం అత్యంత సుందరమైన పనితనంతో ఉంది. ఆలయ ప్రాకారం 30 మీటర్ల ఎత్తు ఉంది. ఆలయ క్రింద భాగాన రథచక్రాలున్నాయి. ప్రవేశద్వారం వద్ద రెండువైపులా రెండు సింహాలు రెండు ఏనుగులను తమ కాళ్లక్రింద తొక్కిపెట్టినట్లు ఉన్న శిల్పాలు మనిషిలోని అహంకారాన్ని ధ్వంసం చెయ్యాలన్న దానికి ప్రతీకగా చెబుతారు. ప్రాంగణంలోనే ధ్వంసమైన శిల్పపు అవశేషాలు దయనీయంగా పడిఉన్నాయి. సమీపంలో ఉన్న కోణార్క్ మ్యూజియంలో అనేక ధ్వంసమైన శిల్పాలను భద్రపరిచారు.IMG_20181207_13530361316సంవత్సరాలపాటు 1200 మంది శిల్పులు శ్రమించి సృష్టించిన అపురూప సంపద ఈ దేవాలయం. కానీ ప్రపంచవారసత్వ సంపదైన దీనిని సందర్శకులకు దర్శనీయం చెయ్యాలన్న స్పృహ ఏ ప్రభుత్వానికీ ఉన్నట్టు లేదు. ఎంతెంతో దూరం నుంచి ఆశగా వచ్చినవారిని మూసిఉన్న దేవాలయం నిస్పృహకు, వేదనకు గురిచేస్తుంది. కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు పూర్తి బాధ్యత తీసుకుని దేవాలయాన్ని తిరిగి తెరిచేవిధంగా వెంటనే చర్యలు తీసుకోవలసిన అవసరం చాలా ఉంది.IMG_20181207_154833604సమీపంలో ఉన్న రామచండీ దేవాలయం కూడా దర్శించదగ్గది. ఈప్రాంత ప్రజలను కాపాడే దేవతగా ఇక్కడివారు కొలుస్తారు.కోణార్క్ నుంచి పూరీ రోడ్డుమార్గం అందమైన మెరైన్ డ్రైవ్. దారిపొడవునా రాష్ట్రంలోని నదులు క్రమంగా వచ్చి సముద్రంలో కలుస్తుండటం చూస్తాం.IMG_20181208_094657394IMG_20181208_113325494IMG_20181208_113352959పూరీ పట్టణం అసలైన పుణ్యక్షేత్రంలాగే ఉంది. యాత్రీకుల రద్దీతో పట్టణమంతా హడావుడిగా కనిపించినా, అతి సాధారణంగా ఉంది. జగన్నాథుని దేవాలయం తరువాత ఇక్కడి బీచ్ పరిసరాలు చెప్పుకోదగ్గవి. అందమైన ఉత్తరాది రెస్టొరెంట్లు, కామత్ లాటి దక్షిణభారత దేశపు వంటకాలను వడ్డిస్తున్న రెస్టొరెంట్లు కూడా ఉన్నాయి. బీచ్ రోడ్డంతా చక్కని ధరల్లో దొరికే బట్టల దుకాణాలు, అనేక రకాల చేతి కళాకృతులు అమ్ముతున్న దుకాణాలు విరివిగా ఉన్నాయి. సంభల్ పూర్ చీరలు ప్రత్యేక ఆకర్షణ.

బీచ్ రోడ్డులోని మా హోటల్ బాల్కనీలో కూర్చుంటే ఎదురుగా బంగాళాఖాతం. బీచ్ ఒడ్డున రాత్రివరకూ జన సందోహం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం బెంగాలీ యాత్రీకులతో కళకళలాడుతూ కనిపించింది. క్యాబ్ డ్రైవర్ చెప్పిన ప్రకారం, ఇక్కడి చవకైన బస, భోజన వసతి ప్రక్కనే ఉన్న బెంగాలీలకు చక్కని ఆటవిడుపుగా, వారాంతపు పిక్నిక్ గానూ ఆకర్షిస్తుంటుంది. నిజంగానే మేమున్న రెండు రోజులు బీచ్ కిటకిటలాడుతూనే ఉంది. సూర్యోదయ వేళలోనూ, సూర్యాస్తమయ వేళలోనూ మరింతమంది కనిపించారు. బీచ్ ఒడ్డున వరసల్లో వేసిన కుర్చీలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఒంటెలపై సవారీలున్నాయిక్కడ.IMG_20181209_063955143IMG_20181208_095602702పూరీ జగన్నాథ దేవాలయం నాలుగువైపులా ప్రవేశద్వారాలతో అందమైన నిర్మాణపు శోభతో ఉంది. ఐతే, మిగిలిన న్ని దేవాలయాల్లో లాగా నల్లరాతి లేదా పాలరాతి లేదా లోహపు విగ్రహాలు కాక చెక్కతో చేసిన విగ్రహాల్ని చూడటం కొత్తగా అనిపించింది. నగలు, బంగారం కాక రంగులమధ్య ఉన్న ఆ దేవతావిగ్రహాలు ఎంతో గంభీరంగా, అందంగా,  ఉన్నాయి. జగమంతటికీ నాథుడే అయినా ఎంతో సామాన్యంగా, శాంతంగా కనిపించాడు. దేవాలయ నిర్మాణాలు అత్యంత సౌందర్యంతో మనలను కట్టిపడేస్తాయి. మన తిరుపతి వైభవంతో పోల్చేందుకేం లేదు ఒక్క ప్రాముఖ్యత మినహా. పేదవాడి దేవుడనిపించింది. కొన్ని సమయాల్లో కొంత రద్దీ ఉన్నా, సాధారణంగా దైవదర్శనం ఎంతో సులువుగా, సంతృప్తిగా అనిపించింది. చల్లని అందమైన ఆ దేవాలయ ప్రాంగణం చాలా విశాలమైనది. కోతులు ప్రాంగణమంతా తిరుగుతున్నాయి.IMG_20181208_180717250దేవాలయ ప్రాంగణమంతా చిన్నచిన్న కుండల్లో అన్నప్రసాదాన్ని అమ్ముతున్న వారు అనేక మంది కనిపించారు. ప్రాంగణంలో శుభ్రత పట్ల ఎక్కువ శ్రధ్ధ కనిపించలేదు. పూరీ పట్టణమంతా పెద్దపెద్ద తీపి కాజాలు రాసులు పోసి అమ్ముతున్నారు. ప్రజలు కూడా కేజీలు, కేజీలు కొనుక్కుని వెళ్తున్నారు.

ఇంతకీ ప్రపంచ ప్రసిధ్ధమైన జగన్నాథ రథ యాత్ర గురించి చెప్పుకోవాలంటే ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలల్లో జరుగుతుంది. ఇది భారత దేశపు అతి పెద్ద పండుగ. అనేక మంది దేశ, విదేశ యాత్రికులతో పట్టణమంతా నిండిపోతుంది. మంత్రోచ్చారణ, శంఖనాదాల మధ్య జగన్నాథుడిని, బలభద్రుణ్ణి, సుభద్రను పూరీ దేవాలయం   నుంచి, గుండిచ వరకు రథంపైన ఊరేగింపుగా ఈ యాత్ర సాగుతుంది. గుండిచలో 9 రోజులు మకాం చేసిన తరువాత ‘బహుద’ యాత్ర పేరుతో తిరిగి పూరీలోని దేవాలయానికి తీసుకొస్తారు. మార్గ మధ్యంలో మౌసిమా దేవాలయంలో ఆగి తీపి మిఠాయిలను ఆరగింపచేసి పూరీ చేరతారు. జగన్నాథుడి రథం 46 అడుగుల ఎత్తున, 18చక్రాలతో ఉంటుంది. అది ‘నంది ఘోష’. బలరాముడి రథం 45 అడుగుల ఎత్తున, 16 చక్రాలతో ఉండే ‘తలధ్వజ’. సుభద్ర రథం 44అడుగుల ఎత్తున, 14 చక్రాలతో ఉండే ‘దేవదళన’.

సాధారణ రోజుల్లో హిందువులకు మాత్రమే ప్రవేశమున్న దేవాలయమైనప్పటీకీ, రథయాత్రలో అన్ని మతాల వారు పాల్గొనవచ్చు.  రథాన్ని ముందుగా శుభ్రం చేసి, దానిని యాత్రకు సన్నధ్ధం చెయ్యవలసిన బాథ్యత ఇక్కడి రాజవంశీకులది.

ఆషాఢమాసంలో రెండు పౌర్ణములు వచ్చిన సంవత్సరం ‘నవకళేబర’ అన్న ఒక ప్రక్రియను చేపడతారు. దీనిని అనుసరించి పూరీ దేవాలయంలోని చెక్కతో చేసిన విగ్రహాలను పాత వాటి స్థానంలో క్రొత్త వాటిని తయారుచేస్తారు. ఇది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. ఇది చైత్రమాసంలో మొదలవుతుంది. విగ్రహాలను తయారుచేసేందుకు అనువైన వేప చెట్లను ఒక ప్రత్యేక నిపుణుల బృందం అడవిలోకి వెళ్లి పరిశీలించి, వాటిని గుర్తిస్తుంది. తర్వాత ఆయా చెట్లను నరికి ఒక వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లి ఒక చోట భద్ర పరిచి విగ్రహాల తయారీకి ఉపక్రమిస్తారు. విగ్రహాలను సృష్టించేందుకు వాడబడతాయి కనుక ఆ చెట్లను దారుబ్రహ్మగా పిలుస్తారు. మూడు విగ్రహాల తయారీకీ మూడు ప్రత్యేకమైన లక్షణాలున్న చెట్లు అవసరం. క్రొత్త విగ్రహాల తయారీ పూర్తైన తర్వాత, పాతవాటిలోని బ్రహ్మపదార్థాన్ని లేదా ప్రాణశక్తిని క్రొత్తవాటిలోకి మారుస్తారు.

చతుర్దశినాటి అర్థరాత్రి పాతవిగ్రహాలను ఇసుకలో పూడ్చివేస్తారు. రథ యాత్రకు మూడురోజుల ముందు నూతన విగ్రహావిష్కరణ చేస్తారు. సాధారణంగా ఈ విగ్రహాలను 8,12, లేదా 19సంవత్సరాలకొకసారి మారుస్తారు. 1996 తర్వాత 19సంవత్సరాల గడువు తర్వాత 2015 సంవత్సరంలో ‘నవకళేబర’ జరిగింది.IMG_20181208_145316709IMG_20181208_134052969ప్రపంచంలోనే రెండవ పెద్దదైన సరస్సు చిల్కా సరస్సు. ఇది పూరీ, ఖుర్దా, గంజాం జిల్లాల్లో విస్తరించింది. దీనిపై ఆధారపడి దాదాపు 2లక్షలమంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. దీనికి దక్షింఅదిశగానూ, పశ్చిమ దిశగానూ తూర్పు కనుమలున్నాయి. గంజాం లో పశ్చిమ సరిహద్దును కల్గిఉన్న ఈ సరస్సు ఉత్తర సరిహద్దు ఖుర్దా జిల్లాలో ఉంది. అరఖుడ గ్రామం వద్ద ఇది బంగాళా ఖాతంలో కలుస్తోంది. 64కిలోమీటర్ల పొడవు, 18కిలోమీటర్ల వెడల్పు కలిగిఉంది. చిల్కా సరస్సు అనేక దేశ, విదేశ జాతుల పక్షులకు విడిదిగా, రక్షిత ప్రదేశంగా ఉంది. ఇక్కడ అనేక వేల జాతుల పక్షులు ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఆవాసాన్ని పొందుతున్నాయి.IMG_20181208_141420544ఇక్కడ యాత్రికులకోసం నడిపే మోటారు పడవ విహారం ద్వారా దాదాపు 300 మంది పడవల వాళ్లు జీవిక పొందుతున్నారు. ఈ విహారంలో డాల్ఫిన్స్ ని చూడవచ్చు. రకరకాల పక్షులను వాటి జీవన విధానాన్ని భంగం చెయ్యకుండా దూరంనుంచి మాత్రమే చూడవచ్చు. ఎర్ర పీతలను చూడచ్చు. ముత్యాలను ఒలిచి చూపి, అమ్మే వర్తకులను చూడవచ్చు. మన కళ్లముందే ముత్యపు చిప్పలను విరిచి ముత్యాలను తియ్యటం సరదాగా ఉంటుంది.IMG_20181208_135039509IMG_20181208_135451952ఒరిస్సాలో  మూడు రోజుల్లో చూసిన విశేషాలు అతి స్వల్పమైనవే. ఇంకా ఎన్నో చూడవలసిన వింతలు, విశేషాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మళ్లీ మళ్లీ మరి కొన్ని యాత్రలు చెయ్యవలసిన అవసరం తలుచుకుంటూ తిరుగుప్రయాణానికి పూరీ రైల్వే స్టేషన్ కి వచ్చాం. స్టేషన్ చాలా పెద్దది. అందంగా ఉంది. ముంబై ఛత్రపతి శివాజీ స్టేషన్ లాగా ప్లాట్ ఫారాలన్నీ ఒకే వరుసలో ఉన్నాయి. చక్కని భోజన శాల ఉంది. సుఖవంతమైన వెయిటింగ్ హాళ్లున్నాయి. ప్రయాణమై వెళ్లేముందు ఒరిస్సాని ఈ విధంగా మాత్రం ఊహించలేదు. చిన్న యాత్రే అయినా చాలా సంతృప్తినిచ్చింది.IMG_20181209_161713964IMG_20181209_161719055ఈ రాష్ట్ర పర్యటనకు నవంబరు ఆఖరు నుంచి ఫిబ్రవరి వరకు అనువైనది. ముఖ్యంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండే డిసెంబరు, జనవరి నెలలు శ్రేష్టం అని చెబుతారు.

* * *

4 thoughts on “ఒడిషా రాష్ట్రం మూడురోజుల్లో…చూడవలసింది చాలా ఉంది!

  1. SC

    Very well written!! I experienced Orissa through this beautiful journey of yours. I definitely want to visit and will try to observe all these details! Thanks and keep writing to inspire us.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.