* * *
రూసో 18 వ శతాబ్దంలో రాసిన సోషల్ కాంట్రాక్ట్ పుస్తకం అనువదించే అవకాశం నాకు చాలా థ్రిల్లిచ్చింది. కాలేజీ రోజుల్లో చదువుకున్న రాజనీతి శాస్త్ర పాఠాలు జ్ఞాపకానికొచ్చాయి.
‘మనిషి పుట్టుకతో స్వేచ్చాజీవి అయినా సర్వత్రా సంకెళ్ల మధ్య జీవిస్తున్నాడన్న’ రూసో ప్రతిపాదన అప్పటి సమాజాన్ని ఒక కుదుపు కుదిపింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి సూత్రాల ఆధారంగా ఏర్పడిన ఫ్రెంచి విప్లవాన్ని ఇది అమితంగా ప్రభావితం చేసింది.
స్వేచ్ఛ వ్యక్తికి ప్రాణవాయువు. సమాజంలోని ఇతర వ్యక్తులతో కలిసి శాంతియుత వాతావరణంలో భద్రంగా జీవించేందుకు ఇలాటి స్వేచ్ఛని, తన ప్రయోజనాల్ని వదులుకుని సమిష్టి ప్రయాజనాలకోసం ఒక ఒప్పందానికి వస్తాడు. సహజంగానే తను వదులుకున్న వాటికంటే ఉత్తమమైన ప్రయోజనాన్నే పొందదలచుకుంటాడు.
వ్యక్తులు, ప్రభుత్వాలు, సమాజాలు వీటన్నిటి మధ్యా ఉన్న సంబంధాలను రూసో చర్చించాడు. అదే ఈ పుస్తకానికి ప్రత్యేక అస్తిత్వాన్ని ఇచ్చింది. క్రొత్త ఆలోచనలు రేకెత్తించింది.
రూసో వ్యక్తిగత జీవితంలో పదేళ్ల పిల్లవాడుగా తల్లిదండ్రుల ఆదరణ కోల్పోయి, పరుగు పందెంలాటి జీవితాన్ని గడపవలసి రావటం స్వేచ్ఛ, సంకెళ్ల మధ్య సంబంధాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందుకు దారితీసిందేమో అనిపిస్తుంది.
ఏ విషయాన్నైనా మెదడుతో కాక మనసుతో మాత్రమే చూసే అలవాటు వల్ల నేను ఇంతకు మించి ఈ పుస్తకం గురించి చెప్పను.
ఈ అనువాదం ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ గా మాత్రం చెప్పగలను.