తాతమ్మ పళ్లు – బిట్టు కథలు – నాలుగవ భాగం – కొత్తపల్లి కథల పుస్తకం – Jan, 2018

* * *

ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. అక్కడ తాతయ్య వాళ్ళ అమ్మ- ‘తాతమ్మ’ కూడా ఉంది. బిట్టుకు తాతమ్మని చూస్తే ఆశ్చర్యం. మరి తాతమ్మ ఎప్పుడూ పళ్ళు తింటుంది!

తాతమ్మ కబుర్లు చెబుతుంది, కానీ బిట్టుకి మటుకు ఆ కబుర్లు అన్నీ అర్థం కావు.

వాడికి చాలా అనుమానాలు: ‘ఆవిడ తాతయ్య దగ్గర చంటిపిల్లలా ప్రవర్తిస్తుందేమిటి? తాతయ్యకి అమ్మ కదా, అయినా అన్ని విషయాలు తాతయ్యనే అడుగుతుంది ఎందుకు? చేతికర్ర ఉన్నది కదా, అయినా తాతయ్య చెయ్యి పట్టుకుని నడుస్తుంది ఎందుకు?

చేతికర్ర ఎప్పుడూ వదలదేమి? చిన్నపిల్లలాగా తప్పటడుగులు వేస్తుంది ఎందుకనో? ఒక్క పన్నూ లేదు; అయినా ఎప్పుడూ నోరు కదుపుతూనే ఉంటుంది- ఏం తింటుంది, అస్తమానూ?’ అని బిట్టుకి ప్రశ్నలు.

అయినా తాతమ్మని అడగలేదు. ‘అడిగితే ఏమనుకుంటుందో!’ అని అనుమానపడ్డాడు వాడు. ‘చిన్నప్పుడు చాలా ఎక్కువ స్వీట్లు తినేసి ఉంటుంది! అమ్మ చెబుతుందిగా, ‘స్వీట్లు ఎక్కువ తింటే పళ్లు పాడైపోతై; ఊడిపోతై’ అని; బహుశ: తాతమ్మకి ఎవ్వరూ చెప్పలేదేమో, ఆ సంగతి!’

ఒక రోజు తాతమ్మ మరీ వింతగా చేసింది. “నాకు అన్నం తినాలని లేదురా, నిద్రవస్తోంది” అని చెప్పేసి, అట్లాగే పడుకొని నిద్రపోయింది. అమ్మమ్మ వచ్చి ఎన్నిసార్లు లేపినా లేవదు! “నన్ను లేపకే మణీ! నాకు ఆకలి వేసినప్పుడు లేచి తింటాను. మీరంతా తినెయ్యండి!’ అనేసి ఒత్తిగిలి, మరోప్రక్కకి తిరిగి, పడుకుంది.

‘ఆరోగ్యం బాగాలేదో, ఏమో. మనం తినేద్దాం. సాయంత్రానికి కూడా లేవకపోతే అప్పుడు తాతయ్య డాక్టరును పిలుచుకువస్తారు’ అంది అమ్మమ్మ.

మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి, పడుకుని, లేచి, చూస్తే ఇంకా తాతమ్మ నిద్రపోతూనే ఉంది.

తాతయ్య వెళ్ళి ఆవిడ దగ్గరగా కూర్చుని,’అమ్మా, నీరసం వస్తుంది- లే, లేచి ఏదైనా తిని, మళ్లీ పడుకో!’ అన్నారు. ఆవిడ అతి కష్టం మీద కళ్లు తెరిచి, లేచి కూర్చుంది. “ఇప్పుడు అన్నం తినలేనురా; వేడిగా వేడిగా కాస్తంత కాఫీ త్రాగి, ఇట్లా కాసిని పళ్లు తింటా’ అంది.

తాతయ్య ప్రక్కనే కూర్చుని ఇదంతా గమనిస్తున్నాడు బిట్టు. తాతమ్మ మాటలకి వాడు ఉలిక్కిపడ్డాడు. వాడి మనసులోకి ఒక్కసారిగా మళ్ళీ ప్రశ్నలు వచ్చేసాయి. ముఖాన్ని ప్రశ్నార్థకంలాగా మార్చి, తాతయ్యవైపు తిరిగి, ఆయన్ని ఏదో అడగాలని అనుకున్నాడు. అయితే తాతయ్య ఆ సరికే లేచి వెళ్ళిపోయారు: “ఇదిగో, మణీ! వేడి వేడిగా కాస్త కాఫీ అట, ఇవ్వు. ఆ తర్వాత కొంతసేపటికి పళ్ళు తింటుందట!” అంటున్నారు అమ్మమ్మతో.

పోయిన ఏడాదంతా బిట్టూ పళ్ళు ఒక్కటొక్కటిగా ఊడాయి. అవన్నీ నెమ్మదిగా మళ్ళీ వచ్చేసాయి. బిట్టూ ఆ సంగతిని తలచుకుంటూ, నిన్ననే అడిగాడు తాతమ్మని: “ఎప్పుడొస్తాయి నీ పళ్ళు?” అని.తాతమ్మ బోసి నోరు తెరిచి భలే నవ్వింది.

“నా పళ్లు ఎప్పుడొస్తాయా? నీ అంత అయ్యాక వస్తాయిలే, మళ్లీ!” అంది.

తాతమ్మ మళ్లీ తనంత ఎలా అవుతుందో అర్థం కాలేదు బిట్టూకి. అమ్మమ్మని అడుగుదామంటే పనిలో ఉంది. ‘కాల్షియం బాగా తింటే, నాకు వచ్చేసినట్లు తొందర తొందరగా, గట్టి పళ్లు మళ్ళీ వచ్చేస్తాయి! ఆ సంగతి తాతమ్మకు తెలుసో, మరి తెలీదో’ అనుకున్నాడు. “ఫ్రూట్స్, నట్స్ ఎక్కువగా తినాలని చెప్పాలి, తాతమ్మకి!” అని కూడా అనుకున్నాడు.

ఇంతలో తాతయ్య వచ్చారు గదిలోకి. ’బిట్టూ, అమ్మమ్మని కాఫీ పెట్టమన్నాను. ఎంతవరకు వచ్చిందో, ఏంటో ఓసారి వెళ్ళి చూడు! తాతమ్మకి కాఫీ పట్టుకురా, కొంచెం’ అనేసరికి అమ్మమ్మ దగ్గరకి వెళ్లాడు.

అమ్మమ్మ కాఫీ కాచే పనిలోనే ఉంది. తన సందేహం ఎవరు తీరుస్తారో తెలియలేదు బిట్టూకు. వెనక్కి తిరిగి మళ్లీ తాతమ్మ గదిలోకి వెళ్లాడు, ‘సంగతేంటో మొత్తం తనే తేల్చుకోవాలి’ అని నిర్ణయించుకుంటూ. అంతలోనే అమ్మమ్మ కాఫీ పట్టుకొని వచ్చింది. తాతమ్మకి కాఫీ ఇచ్చి, తను మళ్ళీ వంట గదిలోకి వెళ్ళింది. బిట్టు కూడా అక్కడే, కొంచెం దూరంగా కుర్చీ మీద కూర్చున్నాడు.

తాతమ్మ కాఫీ త్రాగటం పూర్తయింది. ‘ఇప్పుడు ఇంక ఏమి చేస్తుందా’ అని కనిపెట్టుకుని కూర్చున్నాడు బిట్టు.

ఆలోగా అమ్మమ్మ ఆపిల్ చెక్కు తీసి, చిన్న చిన్న ముక్కలు కోసి, దానితో పాటు అరటిపండు కూడా ఒకటి తొక్క తీసి, పళ్లెంలో పెట్టి, తీసుకొచ్చింది. తాతయ్య ఏవో కబుర్లు చెబుతూ తాతమ్మ ప్రక్కనే కూర్చుంటే, తాతమ్మ తినటం మొదలు పెట్టింది. అమ్మమ్మ వంటింట్లో పని చూసుకుంటోంది. బిట్టు బుర్ర్రలో ప్రశ్నలు వాడిని స్థిమితంగా కూర్చోనివ్వటం లేదు. లేచి అమ్మమ్మ వెనకే వంటింట్లోకి వెళ్లాడు: ‘అమ్మమ్మా, పళ్లు ఎలా తింటారు?!’ అని అడిగేసాడు.

అమ్మమ్మకి వాడి ప్రశ్న అర్థం కాలేదు.

‘ఏం తినాలన్నా నోటితోనే కదరా, ఇంకెలా తింటారు?!’ అంది, ‘అసలు మనవడి ప్రశ్న ఏమిటా’ అని ఆలోచిస్తూ.

‘కాదు- ముందు ఇది చెప్పు- పళ్లు ఎందుకు తింటారు?’ అడిగాడు బిట్టు.

‘’ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం’ అని మీ టీచర్ చెప్పారన్నావు కదా!’ చేతిలోని పనిని ఆపి వాడివైపు చూసింది అమ్మమ్మ.

‘అవుననుకో, ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం. కానీ మరి, పళ్లు ఎందుకు తినటం? అసలు పళ్లు ఎలా…ఎలా తింటారసలు? తాతమ్మకి పళ్లు లేవు కదా, ఆవిడ పళ్లు తినాలంటే ఎక్కడినుండి తెచ్చిస్తారు?

పళ్ళు తింటే మళ్లీ పళ్ళు వచ్చేస్తాయా?’ వరస ప్రశ్నలు వేసాడు బిట్టు.

అప్పుడు అర్థం అయింది అమ్మమ్మకి! బిట్టుకి తెలుగులో కొన్ని పదాలు మాత్రమే తెలుసు. ‘పళ్లు’ అంటే ‘నోట్లో పళ్లు’ అనుకుంటున్నాడు వాడు!

“ఫ్రూట్స్ ని కూడా తెలుగులో పళ్ళు అనే అంటారు” అని వాడికి తెలిసినట్లు లేదు! ‘అరటి పండు’ అంటాడు; కానీ ‘అరటి పళ్లు’ అని బహువచనం వాడుక తెలీదన్నమాట, వాడికి!

అమ్మమ్మకు చెప్పలేనంత నవ్వొచ్చింది. కానీ తను నవ్వితే వాడు ఉక్రోషపడతాడు. అందుకని బలవంతంగా నవ్వు ఆపుకున్నది. వాడిని దగ్గరకి పిలిచి, పెరట్లో జామ చెట్టు క్రిందకి తీసుకెళ్లింది. అక్కడ తీరిగ్గా కూర్చుని, వాడికి ‘పళ్లు’ అనే మాటకు ఉన్న మరో అర్థం కూడా చెప్పింది, అర్థం అయ్యేట్లు.

బిట్టు ఆశ్చర్యానికి అంతు లేదు. “ఓహ్! నేను ఇంకా నేర్చుకోవలసిన తెలుగు చాలానే ఉంది” అన్నాడు. “తెలుగు రాయటం, చదవటం నేర్చుకుంటాను అమ్మమ్మా! అప్పుడు ఇంక అన్నీ నేనే చదువుకోవచ్చు. నిన్నో, తాతయ్యనో అడగాల్సిన అవసరం ఉండదు!” అన్నాడు.

“అవునురా! కొంచెం‌ భాష రాగానే అక్షరాలు నేర్చుకోవాలి. బాగుంటుంది” అంటూ అమ్మమ్మ తాతయ్యని పలక తెమ్మన్నది. “ఆలస్యం ఎందుకు? వెంటనే తెచ్చుకుందాం, రా!” అంటూ బిట్టుని తీసుకొని బయలుదేరాడు తాతయ్య.

* * *

2 thoughts on “తాతమ్మ పళ్లు – బిట్టు కథలు – నాలుగవ భాగం – కొత్తపల్లి కథల పుస్తకం – Jan, 2018

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: