అమ్మమ్మ ఊళ్లో దావీదు – బిట్టు కథలు – రెండో భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Nov, 2017

* * *

ఆంధ్రలో ఉండే అమ్మమ్మ ఊరికి ప్రయాణమయ్యాడు బిట్టూ, అమ్మ సునందతోపాటు. మూడేళ్లైంది, వాడు అమ్మమ్మ ఊరికి రాక! అందుకని ఈ సారి వాళ్లకి ఇంకెక్కడికీ వెళ్ళే పని లేదు: అమ్మమ్మ ఊరొక్కటే.

అమ్మమ్మ వాళ్ల ఊరు పేరు పోరంకి. ఊరు చిన్నదే, ఐనా పట్టణానికి బాగా దగ్గర. అందుకే అక్కడ పల్లె అందాలూ కనిపిస్తాయి; పట్టణ సౌకర్యాలూ ఉంటాయి: రెండు ప్రపంచాలన్నమాట.

అమ్మమ్మ, తాతయ్య కాకుండా ఆ ఇంట్లో తాతమ్మ కూడా ఉంటుంది. ఆవిడకి తొంభై రెండు సంవత్సరాలు. ఆవిడ బిట్టుని చూసి తెగ మురిసిపోయింది. మనవరాలి కొడుకు కదా, ఢిల్లీ నుంచి వచ్చాడు! ‘దగ్గర కూర్చోరా, కబుర్లు చెబుతా, రా’ అని పిలుస్తుండేది. తాతమ్మకి ఒక్క పన్నూ లేదు. బిట్టూకేమో విచిత్రంగా ఉంది- ఆవిడ తింటున్నా, మాట్లాడుతున్నా! కొడుకుని అక్కడ వదిలి పెట్టి, సునంద మళ్ళీ‌ ఢిల్లీ‌ వెళ్ళిపోయింది: ‘సెలవులు చక్కగా గడుపు; అమ్మ-నాన్న లేరు కదా అని అల్లరి చెయ్యకు; అమ్మమ్మని విసిగించకు; తాతయ్య ఆఫీసునుంచి వచ్చాక రోజూ ఆయనతో ఛెస్ ఆడు; ఆయనతోపాటు ఉదయపు నడకకి వెళ్తూండు; తాతయ్య దగ్గర కూర్చుని లెక్కలు, తెలుగు నేర్చుకో; చుట్టుప్రక్కల అందరితో స్నేహంగా ఉండు’ లాంటి జాగ్రత్తలు అన్నీ చెప్పేసి.

మామూలుగా ఐతే పెద్ద అల్లరి చేసే అబ్బాయి కాదు బిట్టూ. కానీ అమ్మమ్మ, తాతయ్య గారాబం చేస్త్రారు కదా, అందుకని ఢిల్లీలో కంటే కాస్త ఎక్కువ స్వేచ్ఛగానే మసలుతున్నాడు. ఎటొచ్చీ వాడి తెలుగుతోటే కాస్త ఇబ్బంది అక్కడ అందరికీ.

బిట్టూ తెలుగులోనే మాట్లాడతాడు. కానీ ఆ మధ్యలోనే హిందీ పదాలు చేర్చేస్తుంటాడు. కొన్ని వాక్యాలనైతే అసలు పూర్తిగా ఏ హిందీలోనో, ఇంగ్లేషులోనో చెప్పేస్తాడు.

ఒకరోజు తమాషా సంఘటన ఒకటి జరిగింది: ఆఫీసునుండి వస్తూ తాతయ్య పాలకోవా తెచ్చారు. బిట్టూకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ‘ఐ లైక్ పేడా- ఐ లైక్ పేడా’ అని అరిచాడు ఆనందంగా.

అయితే అక్కడ ఉన్నవాళ్ళంతా కంగారు పడుతూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు: “వీడు పేడ ఎక్కడ చూసాడబ్బా, అది వీడికి ఎందుకు ఇష్టం అయ్యింది?” అని, బిక్క మొహాలు వేసారు వాళ్ళు.

కానీ అసలు సంగతేంటంటే, పాలకోవాని హిందీలో ‘పేడా’ అంటారు! చివరికి అమ్మమ్మకు ఆ సంగతి గుర్తొచ్చి, అందరికీ చెప్పేసింది; అందరూ గొల్లున నవ్వారు. బిట్టు మటుకు ఉడుక్కున్నాడు: ‘నాకు తెలుగు నేర్పండి’ అని మూతి ముడుచుకొని కూర్చున్నాడు.

‘ప్రత్యేకంగా నేర్పే అవసరం లేదురా, ఇది నీ మాతృభాష. తెలుగు మాట్లాడే వాళ్ల మధ్య ఉంటూ, వాళ్ల మాటలు వింటూ, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది’ బుజ్జగించి చెప్పారు తాతయ్య.

‘అసలు నా తెలుగుని చూసి మీరంతా ఇంత నవ్వుతున్నారు కానీ, దిల్లీ వెళ్తే నేను ఎవ్వరితో మాట్లాడతాను తెలుగు? నాకు ఒక్క తెలుగు ఫ్రెండ్ కూడా లేడు! ఇంక నేర్చుకొని ఏం లాభం?’ అన్నాడు బిట్టూ, నిరాశ పడుతూ.

‘లేదురా, ‘మాతృభాష రావటం’ అనేదే నీకు ఒక అదనపు అర్హత అవుతుంది- తెలుసా, పై చదువుల కోసం వెళ్ళినప్పుడు కొన్ని విశ్వవిద్యాలయాల్లో ‘నీకు మాతృభాష వచ్చా?’ అని ప్రత్యేకంగా అడుగుతారు.

అదీ కాక నువ్వు కవితలు రాస్తావు కదా; ఆలోచనల్ని నీ సొంత భాషలో చెప్పటం ఇంకా బాగుంటుంది’ చెప్పాడు తాతయ్య. దాంతో బిట్టు కొంచెం సమాధాన పడ్డాడు. ‘తెలుగు బాగా నేర్చుకోవాలి’ అనుకున్నాడు. అప్పటి నుంచి ఎవరు తెలుగులో మాట్లాడినా, పనిపడా వినటం మొదలు పెట్టాడు. తన కవితా రచనని కూడా కొనసాగించాడు.

ఇంటికి వచ్చిన వాళ్లందరికీ వాడి కవిత్వం చదివి చెప్పేవాళ్ళు అమ్మమ్మ, తాతయ్య. దాంతో తను కూడా జావేద్ అంకుల్ లాగా పెద్ద కవి అవుతాననీ, పెద్దయ్యాక తన కోసం బోలెడు మంది రోజూ వస్తారని చెప్పటం మొదలెట్టాడు బిట్టూ. అమ్మమ్మ వాడికి మంచి స్నేహితురాలైపోయింది- కానీ తను కవిత్వం రాసినందుకు లెక్కల టీచరు ఏమందో మాత్రం అమ్మమ్మకి కూడా చెప్పలేదు వాడు! *

తాతయ్య రోజూ ప్రొద్దున్నే కాస్సేపు సైకిల్ తొక్కుతుండేవారు. సైకిల్ మీద తాతయ్య, వెనుక తను కూర్చుని వెళ్లటం తెగ నచ్చేసింది బిట్టూకి. ఒకరోజున అట్లా సైకిల్ మీద ఒక రౌండ్ వేసి, పనిలో పనిగా కాసిని కూరలు తెద్దామని ఇద్దరూ బయలుదేరారు. ఆదివారం కనుక తొందరలేదు. ‘ఇంకా దూరం! ఇంకా!‌ ఇంకా!’ అంటూ తాతయ్యని బాగానే సైకిల్ తొక్కించాడు బిట్టూ.

‘అసలు తను కూడా సైకిల్ తొక్కటం నేర్చుకుంటే ఎంత బావుంటుంది?! తాతయ్యని అడగాలి!’ అనుకున్నాడు కూడా. అయితే అంతలోనే సైకిల్ చెయిన్ తెగిపోయింది. ఇప్పుడిక తొక్కినా సైకిల్ కదలదు.

దాన్ని నెమ్మదిగా తోసుకుంటూ బిట్టుతో చెప్పారు తాతయ్య, విచారంగా- ‘సైకిల్ కూడా నాలాగే పెద్దదైపోయిందిరా, బిట్టూ! ఓపిక తగ్గిపోయింది. నీకు నచ్చేట్టు ఎంతంటే అంత దూరం వెళ్ళటం ఇక కుదరదు, దీనితో’ అని.

ఇద్దరూ అట్లా మాట్లాడుకుంటూ వీరబాబు సైకిల్ రిపేర్ షాప్‌కి చేరుకున్నారు. తాతయ్య అలవాటుగా వీరబాబు కోసం చూసారు- కానీ అక్కడ కొట్లో పెద్దవాళ్లెవరూ లేరు: వీరబాబు మనవడు- పద్నాలుగేళ్ల దావీదు- ఉన్నాడక్కడ. ‘ఏం చెయ్యాలో చెప్పండి- మాతాత లేడు’ అంటూ వచ్చి, సైకిల్‌కి అవసరమైన రిపేరు చేసేసేడు.

తాతయ్య పదిరూపాయలు ఇవ్వబోతే, ‘ఇంత పనికి పదిరూపాయలా? ముందే చెబితే అసలు చేసే ఉండేవాణ్ణి కాదు! ఇరవై ఇవ్వండి!’ అంటూ దురుసుగా మాట్లాడి, ఇరవై రూపాయలు తీసుకున్నాడు.

తాతయ్య కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ డబ్బు ఇచ్చారు కానీ, బిట్టుకి మటుకు దావీదు మీద చాలా కోపం వచ్చింది.

ఇంటికొస్తూ దారిలో అడిగేసాడు- ‘తాతయ్యా, ఆ అబ్బాయి అట్లా మాట్లాడితే నీకు కోపం రాలేదా?’అని.

‘కోపం ఎందుకు బిట్టూ? వాడు పేదవాడు- ఇంకో పది రూపాయలు కావాలని అడిగాడు; అంతేగా?’

‘మరి ఆ సంగతే వాడు మర్యాదగా అడగచ్చుగా? నువ్వు అలవాటుగా వెళ్లే దుకాణమే అది! అదీకాక, పెద్దవాళ్లను గౌరవించాలని కదా, అమ్మ చెప్పింది?!’

తాతయ్య చిన్నగా నవ్వారు.

‘అవును- నిజమే, కానీ ఈ దావీదు కుర్రాడున్నాడే, వాడు ఈ మధ్యే కొత్తగా వచ్చాడు. ఇంకా మాట్లాడటం తెలియదు వాడికి; నేర్చుకుంటాడు. అయినా వాడి పని తీరు చూసావా? ఎంత చక్కగా చేసాడో చూడు! చాలా త్వరగా నేర్చుకున్నాడు! బలే చురుకైనవాడు’ అంటూ వాడిని మెచ్చుకున్నారు.

తాతయ్య అట్లాంటి వాడిని మెచ్చుకుంటున్నారని బిట్టుకి దావీదు మీద ఇంకా కోపం వచ్చేసింది. వాడిమీద ఒక కవిత రాయాలని నిర్ణయించేసుకున్నాడు. ఈ- మధ్య బిట్టు తనకి ఎవరైనా నచ్చినా, లేదా ఎవరిమీదైనా కోపం వచ్చినా సరే, వాళ్ళమీద కవితలు రాసేస్తున్నాడు. ఆరోజు రాత్రి తన కవితల పుస్తకంలో ఇలా వ్రాసుకున్నాడు:

వీరబాబు మనవడు దావీదు,
సైకిల్ రిపేర్లన్నీ ఇట్టే చేసే దావీదు,
మర్యాద తెలియని దావీదు,
నాకు నచ్చలేదు దావీదు!

ఇక ఆ తర్వాతినుండీ తాతయ్యతో సైకిల్‌ రైడ్‌కి వెళ్లినా, వీరబాబు దుకాణం దగ్గరకి మటుకు వెళ్లేవాడు కాదు బిట్టు. గాలి కొట్టించేందుకు తాతయ్య అక్కడ ఆగినా, బిట్టు నాలుగు అడుగులు దూరంగా, అటు తిరిగి నిలబడేవాడు.

వీరబాబుకి ఇవేమీ తెలియదుగా, ఎంచక్కా ‘ఏం బిట్టూ బాబూ, మా ఊరు నచ్చిందా? మీకో సైకిల్ ఇమ్మంటారా, తొక్కుకుందుకు?’అంటూ పలకరించేవాడు.

అతను అట్లా అడిగితే సైకిల్ నేర్చుకోవాలనిపించేది బిట్టూకి. అయినా మళ్ళీ ‘అమ్మ-నాన్న ఏమంటారో?’ అని అనుమానం వేసేది. “దిల్లీ వెళ్ళాక తనకి సైకిల్ కొనిస్తారా? అసలు తను సైకిల్ మీద ఎక్కడికి వెళ్లగలడు, ఆ నగరంలో? స్కూలుకేమో బస్సు ఉంది.. ఇంకెక్కడికి వెళ్లొచ్చు సైకిల్ మీద? ఊరికే ఇంటి దగ్గర తొక్కుదామంటే ఎక్కువ చోటు లేదు- అన్నీ అపార్టుమెంట్లు. చుట్టూ కార్లు పార్క్ చేసి ఉంటాయి..”

***

ఆ రోజు అమ్మమ్మ ‘పని ఏమాత్రం తెమలటం లేదు- ఎందుకనో ఈ కమలమ్మ పనిలోకి రావటం లేదు, రెండు రోజులుగా’ అనుకోవటం విన్నాడు బిట్టూ. అమ్మమ్మకి సాయం చెయ్యాలని ఉత్సాహపడ్డాడు- ‘అమ్మమ్మా, నాకు చెప్పు, నేను చేస్తాను పని!’ అడిగాడు ఆవిడని.

‘నువ్వేం చేస్తావురా? ఇక్కడి పనులు వేరు- నీకు తెలీదులే’ అన్నది అమ్మమ్మ.

బిట్టు ఊరుకోలేదు. ‘నువ్వు చెప్పు; నేను ఎలా చేస్తానో చూడు’ అంటూ సవాలు విసిరాడు. ఉతికిన చొక్కాలు, ప్యాంట్లు హ్యాంగర్లకి తగిలించబోతున్న అమ్మమ్మ, “కాస్త ఈ పని చేసిపెడతావా?” అని అడిగింది. వాడు సంతోషంగా పని అందుకున్నాడు.

పనిలోకి రాని ఈ కమలమ్మ అసలు దావీదు వాళ్ల అమ్మమ్మే! “దావీదు స్కూలుకి వెళ్లకుండా, చదువు లేకుండా, అల్లరిగా తిరుగుతూన్నాడు; మాట వినట్లేదు” అని వాళ్ళ అమ్మ తీసుకొచ్చి వాణ్ణి కమలమ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్లింది. ఇప్పుడు వాడు తాత వీరబాబు చేతికింద సాయంగా సైకిల్ షాపులో కూర్చుంటున్నాడు.

బిట్టు, అమ్మమ్మ బట్టలు ఆరేస్తుండగా వచ్చాడు దావీదు: ‘మా అమ్మమ్మ ఇంకా రెండు రోజులు రాదండి. జ్వరంగా ఉంది’ అని చెప్పేసి వెళ్లిపోబోయాడు. అమ్మమ్మ వాణ్ణి వెనక్కి పిలిచి ‘ఒరే, కాస్త ఆగు! కొంచెం కూర, పులుసు ఇస్తాను.. ఇంతకీ అన్నం వండుకున్నారా లేదా?’ అడిగింది అనుమానంగా.

‘లేదండి, తాత కొట్లో ఉన్నాడు. అవ్వ రాదని మీకు చెప్పి రమ్మంటే, వచ్చాను.’

‘ఉండు, మీ అమ్మమ్మ మందు వేసుకుందా? కాస్త నయం అయిందా? పోనీ మీ అమ్మని సాయంగా రమ్మని కబురంపలేకపోయారా?’ అంటూనే వాడికోసం అన్నం, కూర, పులుసు క్యారేజీ గిన్నెల్లో సర్దింది అమ్మమ్మ.

‘మా అమ్మ రాదండీ, మా నాన్న, ఆవిడ రోజూ పోట్లాడుకుందుకే సరిపోదండీ’ అన్నాడు వాడు ఆరిందాలాగా.

అమ్మమ్మ క్యారేజీ చేతికిస్తే, వాడు ‘వద్దండీ, బిరియానీ ప్యాకెట్టు తెచ్చిపెడతానన్నాడు తాత!’ అన్నాడు నిర్లక్ష్యంగా.

‘నీ మొహం! మీ అమ్మమ్మకి తగ్గేవరకు నేను ఇస్తాలే! రోజూ వచ్చి క్యారేజీ పట్టుకెళ్ళు!’ అంటూ అమ్మమ్మే బలవంతంగా వాడికి క్యారేజీ అందించింది.

బిట్టు ఒకవైపున బట్టలు ఆరేస్తూనే మరో వైపున ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. ‘అమ్మమ్మా, దావీదు అలా మాట్లాడుతుంటే నువ్వు భోజనం ఎందుకు ఇస్తున్నావ్? బిర్యానీ కొనుక్కుంటానన్నాడుగా?’ అన్నాడు బుంగమూతి పెట్టి.

‘కమలమ్మ-వీరబాబు మనకి ఎన్నో ఏళ్ళ పరిచయంరా, బిట్టూ; ఇద్దరూ చాలా మంచివాళ్లు. కమలమ్మ సాధారణంగా పని మానదు; ఇంక వీరబాబేమో అక్కడ రిపేర్ షాపు పెట్టుకొని కూడా అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి మన పెరట్లో తోటపని చేసి పెడుతుంటాడు. ఇప్పుడు పాపం కమలమ్మకి ఆరోగ్యం బాలేదు కదా; వాళ్లకి ఇంట్లో వంట చేసి పెట్టేవాళ్లు ఎవ్వరూ లేరు. ఏదో మనం వండుకున్నదే, ఒక రెండు రోజులు వాళ్లకీ ఇస్తే సరిపోతుంది. కమలమ్మ బాగైతే తనే చేసుకుంటుందిగా, మళ్ళీ?!’ అంటూ తమ కోసం మళ్లీ అన్నం వండి పెట్టింది అమ్మమ్మ.

(ఇంకా ఉంది..)

* * *

One thought on “అమ్మమ్మ ఊళ్లో దావీదు – బిట్టు కథలు – రెండో భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Nov, 2017

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.