బిట్టు- కవిత్వం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Sep, 2017

* * *

 

బిట్టుకవిత్వం

బిట్టు వాళ్లు ఢిల్లీలో ఉంటారు. వాడికి తొమ్మిదేళ్ళు. వాళ్ళ అమ్మ సునంద ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంది; నాన్న శివ బ్యాంకులో.

బిట్టు మరీ పసివాడుగా ఉన్నప్పుడంతా వాడి అమ్మమ్మ, నానమ్మ వంతులు వేసుకుని వచ్చి ఉండేవాళ్ళు. కాస్త ఊహ తెలిసాక వాణ్ణి ‘క్రెష్’ లో అలవాటు చేసేరు అమ్మానాన్నలు.

“తీరికలేని ఉద్యోగాలలో పడి, పిల్లవాణ్ని సరిగా పెంచుకోలేక పోతున్నామేమో” అని ఒక్కోసారి బాధ పడుతుంటారు వాళ్ళు. అట్లాంటప్పుడే, సాధారణంగా తల్లులు ఉద్యోగం మానేసేది! కానీ అట్లా ఉద్యోగం మానేసి పిల్లవాణ్ణి చూసుకుందామని అనుకోలేదు సునంద. ‘చదువుకున్న చదువుకు సార్థకత ఉండాలంటే తను ఉద్యోగం చేయాల్సిందే’ అని ఆమె నమ్మేది. “ఆడవాళ్ళు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి” అని ఆమె ఎప్పుడూ చెబుతుండేది.

బిట్టు ఐదో క్లాసుకొచ్చాడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటమంటే వాడికి చాలా ఇష్టం. అందరు పిల్లల్లాగా వాడు నిద్ర లేచేందుకు మారాం చేసేవాడు కాదు;. అమ్మ లేపగానే ఛెంగున లేచేవాడు; నవ్వు ముఖంతో మంచం దిగేవాడు. చక్కగా బడికి రెడీ అయిపోయేవాడు. అందరితోటీ మాట్లాడాలనీ, అవసరమున్న వారికి సాయం చెయ్యాలనీ ఉత్సాహం వాడికి. కానీ అమ్మ, నాన్న మటుకు వాడిని అతి జాగ్రత్తగా చూసుకునే వాళ్లు. తమ కనుసన్నల్లోంచి వాడిని ఎటూ పోనిచ్చేవాళ్ళు కాదు.

ఆరోజు తను ఆఫీసు నుంచి వస్తూ వస్తూ, క్రెష్‌కి వెళ్ళి బిట్టూని ఇంటికి తీసుకొచ్చింది సునంద. వాడికి పాలు కలిపి ఇచ్చి, తను కాఫీ తాగుతూ, రాబోయే వేసవి శెలవుల గురించి ఆలోచించింది: ‘ఇవాళ్ల శివ రాగానే బిట్టూ కోసం ఏదైనా మంచి ట్రిప్ ప్లాన్ చెయ్యాలి’ అనుకున్నది.

బిట్టూ పాలు త్రాగేసి ‘మామ్, జావేద్ అంకుల్ దగ్గరకి వెళ్తున్నా!’ అని అరిచి, సమాధానం కోసం చూడకుండా పరుగెత్తాడు.

ప్రక్క ఇంట్లో ఉంటారు జావేద్‌గారు. ఆయన రిటైర్డు టీచర్; కవి కూడా.

ఆయన కవిత్వాన్ని వినేందుకు, రకరకాల చర్చలు జరిపేందుకు రోజూ సాయంత్రం అవుతూనే ఎవరో ఒకరు వస్తూంటారు ఆయన దగ్గరికి. బడినుండి ఇంటికి వచ్చాక, ఒంటరిగా తనంతట తాను కొద్దిసేపు ఆడుకునే బిట్టూకి, జావేద్‌గారి ఇంట్లో జరిగే హడావుడిని రోజూ బాల్కనీలోంచి గమనించటం ఇష్టమైంది.

వాళ్ల సంభాషణలేవీ వీడికి పూర్తిగా అర్థమయ్యేవి కావు; కానీ వాళ్ల కేరింతలు, వాహ్వాలు వినటం, వాళ్ళు బిగ్గరగా నవ్వినప్పుడు తనూ నవ్వటం‌ వీడికీ అలవాటైంది. అట్లా అని వీడు వాళ్లతో ఏమీ మాట్లాడేవాడు కాదు.

ఒకరోజు జావేద్ ఒంటరిగా ఏదో రాసుకుంటూ ఉన్నారు. బిట్టూ ఆయనకేసే చూస్తూ కూర్చున్నాడు. కొద్ది సేపటికి బిట్టూని చూసి, దగ్గరకి పిలిచారు జావేద్‌గారు. ‘తనేదైనా తప్పు చేసేడేమో’ అని కొంచెం భయపడ్డాడు బిట్టూ:

అమ్మ చెబుతుంటుంది, “అలా ఇతరుల ఇళ్లల్లోకి చూడకూడదు, వేరే వాళ్ల ప్రైవసీకి భంగం కల్గించకూడదు” అని.

“అయినా ‘ప్రైవసీ’ అంటే ఏమిటి?” అని అడిగాడు అర్థం కాక.

“ప్రైవసీ అంటే…, ఊఁ… ప్రైవసీ అంటే ‘నువ్వు ఒక్కడివే ఉండాలని, ఎవరూ నిన్ను పట్టించుకోకుండా ఉండాలనీ’ అనుకోవటం. ఒక్కోసారి అలా అన్పిస్తుంది కదా, ఉదాహరణకి- నువ్వు మామిడిపండు తింటున్నావనుకో, ఎలా తింటావు? చెయ్యి, నోరు అంతా పూసుకుని ఇష్టంగా తింటూంటావు కదా. అలాంటప్పుడు ఎవరైనా నీకేసే తేరిపార చూస్తుంటే నీకు ఇబ్బందిగా ఉండదూ? అలాగే మన పనులు మనం చేసుకునేప్పుడు ఎవరైనా అదేపనిగా గమనిస్తూ ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా, అదన్న మాట!” చెప్పింది అమ్మ.

అది జ్ఞాపకం వచ్చింది బిట్టూకి. అందుకని జావేద్ పిలిచినప్పుడు కాస్త సంకోచంగానే వాళ్ల ఇంటికి వెళ్లి, ఆయన మాట్లాడకముందే ‘సారీ అంకుల్’ అనేసాడు. “వాళ్లింట్లో జరుగుతున్న చర్చలు, మాటలు తను రోజూ వింటూ, చూస్తూ ఉంటాడు కదా, జావేద్ అంకుల్ ప్రైవసీకి తను ఇబ్బంది కలిగిస్తున్నాడు. అందుకే పిలిచి ఉంటారు” అనుకున్నాడు వాడు.

ఆయన నవ్వి,’ ఏమైంది, సారీ ఎందుకు చెబుతున్నావ్?’ అని అడిగారు.

అమ్మ చెప్పిన ‘ప్రైవసీ’ విషయం చెప్పాడు బిట్టూ.

ఆయన గట్టిగా నవ్వేసి, ‘నిజమే. అమ్మ చెప్పిన మాట గుర్తుంచుకోదగ్గదే. కానీ రోజూ నిన్ను గమనిస్తున్నాను- నువ్వు మా ఇంటికేసి చూస్తుంటావు; నా స్నేహితులు, నేను మాట్లాడుకుంటూంటే శ్రద్ధగా వింటుంటావు. కానీ నీకు ఏం అర్థమవుతోందో నాకు తెలీదు కదా, అది కనుక్కుందామని పిలిచాను..’ అన్నారు, బిట్టును తన ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టుకుని. ‘అంకుల్, మీరు కవిత్వం రాస్తారట కదా, కవిత్వం అంటే ఏమిటి?’ ఎప్పటినుండో అడగాలనుకుంటున్నది అడిగేసాడు బిట్టు.

జావేద్ అంకుల్ మళ్ళీ ఒకసారి నవ్వేసి. ‘కవిత్వం అంటే.. చెబుతాను- నీ ఇంగ్లీషు వాచకంలోనూ, హిందీ వాచకంలోనూ పద్యాల లాంటివి-అంటే పాఠాలగా చదివేవి కాకుండా, పాడుకునేలాంటివి- ఏమైనా ఉన్నాయా?’ అని అడిగారు.

‘ఉన్నాయంకుల్. అవంటే నాకు చాలా ఇష్టం. పాఠాలకంటే బాగుంటాయవి. వాటినే నేను పాటలుగా పాడుతుంటాను’ ఉత్సాహంగా చెప్పాడు బిట్టూ.

జావేద్ అంకుల్ కళ్లు మెరిశాయి. ‘ఏదీ, ఒక కవిత పాడు!’ అన్నారు.బిట్టూకి అకస్మాత్తుగా తనకు ఎవరో కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు అనిపించింది. బాగా గుర్తున్న ఒక పద్యాన్ని చక్కగా ఒక పాటలాగా పాడాడు. పాట పూర్తవుతూనే జావేద్ లేచి బిట్టూని కౌగిలించుకున్నారు. ‘కవితని ఇట్లా- ఇంత చక్కగా పాడటం ఎవరు నేర్పారు బిట్టూ, నీకు?’ అంటూ.

‘నేనే పాడుకుంటాను. టీచర్ రెసిటేషన్‌కి ఇచ్చిన పద్యాల్ని ఇట్లా పాటలాగా పాడుకుంటూ నేర్చుకుంటాను. నాకు అలా బావుంటుంది. మా టీచర్ కూడా నా చేత పాడిస్తారు అప్పుడప్పుడు.’

జావేద్ లేచి వెళ్లి అలమరలో ఉన్న ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి వాడి చేతిలో పెడుతూ ‘బిట్టూ, నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నీకు కనిపించే వాటిని గురించి, వినిపించే వాటిని గురించి నువ్వు మనసులో ఏమని ఆలోచిస్తూ ఉంటావో, దాన్నంతా నీ భాషలో నువ్వు అందంగా వ్రాయటమే కవిత్వం అంటే. అర్థం అయిందా? కొందరికి అట్లా వ్రాయటం ఇష్టంగా ఉంటుంది.

రోజూ నువ్వు నా దగ్గరకొచ్చి క్రొత్త క్రొత్త పాటలు పాడుతూ ఉండాలి- సరేనా? మరి మీ అమ్మ నీకోసం ఎదురుచూస్తుంటుంది, వెళ్లు’ అంటూ గుమ్మం వరకూ వచ్చి సాగనంపారు. అలా మొదలైన స్నేహం వాళ్ళిద్దరి మధ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది.

రోజూ ఒక అరగంట పాటు బిట్టూ హోం వర్క్ చేసుకుంటాడు. ‘అది అయిపోయాక వాడికి వేరే కాలక్షేపం ఏం కల్పించాలి?’ అని సునంద తెగ కష్టపడేది. ఇప్పుడు ఆమెకు ఆ బెంగ తీరిపోయింది.

ఒక రోజు రోజూ కంటే ఉత్సాహంగా జావేద్ అంకుల్ దగ్గరకి పరుగు పెట్టాడు బిట్టు- ‘అంకుల్, ఈ రోజు మీకు ఒక క్రొత్త విషయం చూపిస్తాను’ అంటూ తన నోటు పుస్తకంలో రాసిన కవితను ఒకదాన్ని చూపించాడు ఆయనకి.

అది చదివిన జావేద్ ఆశ్చర్యంతో చాలాసేపు అలా కూర్చుండిపోయారు- “ఇంత పసివాడు ఇలాటి సంఘటన గురించి అర్థం చేసుకోవటమే కష్టం! అలాటిది, ఆ సంఘటన మీద ఒక పద్యం అల్లుకొచ్చాడు! ప్రతిభకి వయసుతో పని లేదు, నిజంగానే!” అనుకున్నారు ఆయన.

అంతకు ముందు రోజున ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉన్న ఓ పూల దుకాణం ముందు ఒక బాంబు ప్రేలింది.

ప్రేలుడులో దుకాణదారుతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. దాన్ని గురించి ఆరోజు న్యూస్ పేపర్లలో చాలా వివరాలు వచ్చాయి. చనిపోయిన ఆ పిల్లలిద్దరూ కూడా అంతవరకూ తాము పోటీలు పడి కట్టిన పూల దండల మధ్యే మిగిలిపోయారు. ఈ సంఘటన బిట్టూని కదిలించి ఉండాలి- వాడు ఈ కవితని అల్లాడు:

తెల్లవారితే జెండా పండుగ!
రాత్రి నిద్రని ఆవులింతలో దాచాను!
పూలహారాల్ని అల్లుతూనే ఉన్నాను!
ఎదురుగా ఇండియా గేట్!
చలిని ఓడించేందుకు మేజోళ్లు కొనిస్తానంది అమ్మ!
అల్లికలో చెల్లిని ఓడిస్తానని పందెం కట్టాను!
నా ఒడిలో, నా ప్రక్కన, నా చుట్టూ పూల దండలే దండలు!
ఎర్రెర్రని, తెల్లతెల్లని పూల దండలు!
అన్ని పూల దండల మధ్య నేను!’
నిద్రని ఆవులింతలో దాచటం ఏమిటి? ఇదెవరు చెప్పారు?’ అడిగారు జావేద్.

‘శెలవురోజున అమ్మతో పాటు రాత్రిపూట ఆలస్యంగా కూర్చుని టి.వి. చూస్తాను కదా, అప్పుడు అమ్మ అలాగే అంటుంది అంకుల్!’ అసలు విషయం చెప్పాడు బిట్టూ.

ఎంత అమ్మ చెప్పినదైనా, ఆ భావనని అంత శ్రధ్ధగా తీసుకొచ్చి తన కవితలో పొదిగిన తీరు జావేద్‌కి చాలా నచ్చింది. ‘అద్భుతం బిట్టూ! నువ్వు పెద్ద కవివి అవుతావు!’ అంటూ దీవించారు.

బిట్టూ ఆనందానికి అంతులేదు. ఆరోజు రాత్రి పడుకుంటే నిద్ర పట్టలేదు వాడికి. ఏవేవో కలలు: తను ఒక పెద్ద సింహాసనం మీద ఠీవిగా, రాజులాగా కూర్చుని ఉన్నాడు.

సినిమాల్లో చూసినట్టు పెద్ద సభ. తన చుట్టూ మంత్రులు కూర్చొని ఉన్నారు. తర్వాత వాళ్ళు ఒక్కొక్కళ్ళూ లేచి, తనని పొగుడుతూ, పూలమాలలు వేసి సత్కరిస్తున్నారు!

“బిట్టూ! తెల్లవారిపోయింది. లే! చాలా ఆలస్యమైంది ఇవాళ్ల” నిద్రలేపింది అమ్మ. ఎన్నడూ లేనిది, ఈ రోజున చాలా బద్ధకంగా లేచాడు బిట్టూ. సునంద ఆశ్చర్యపోయింది.

‘ఏమైంది బిట్టూ, అలా వున్నావేం?’ అంటూ ఒళ్లు వెచ్చ చేసిందేమో చూసి, ‘హమ్మయ్య, జ్వరమేమీ లేదులే!’ అన్నది.

‘తన కవిత గురించి అమ్మకి, నాన్నకి చెప్పాలా, వద్దా?’ అని ఆలోచిస్తూ, ప్రత్యేకంగా ఏమీ చెప్పకనే స్కూలుకు వెళ్ళిపోయాడు బిట్టూ.

ఆ రోజున బిట్టూ హోంవర్కు పుస్తకం చూసిన లెక్కల టీచర్ మిస్ మార్గరెట్‌కి అందులో‌ హోంవర్కు బదులు ఏదో కవిత్వం లాటి పదార్థం కనిపించి తిక్కరేగింది: “హోంవర్కు, ఎందుకు చెయ్యాలి?!” అని ఒక ఐదు నిముషాల పాటు ఉద్వేగంగా చెప్పేసి, బిట్టూని క్లాసు బయట నుంచోబెట్టింది ఆవిడ!

బిట్టూకి అర్థం కాలేదు. ‘ఇలా ఎలా అయింది? తను హోమ్ వర్క్ చెయ్యలేదా? చేసాననుకున్నాడే?! మరి తను రాసిన కవిత్వం ఈ నోట్సులోకి ఎలా వచ్చింది?!’

సాయంత్రం ఇంటికొచ్చేప్పుడు లెక్కల టీచర్ ఒక ‘నోట్’ రాసి ఇచ్చింది. రేపు అమ్మని కానీ, నాన్నని కానీ తీసుకు రావాలి. లేకపోతే ప్రిన్సిపల్‌ సార్‌కి ఫిర్యాదు చేస్తారు.

ఎప్పుడూ “బిట్టూ గుడ్ బాయ్” అని చెబుతుంటారు అందరూ. కానీ ఈ రోజు క్లాసు బయట నుంచో పెట్టటమే కాక, ఇంటికి కూడా ఉత్తరం పంపారు! ఇంకా అమ్మని కూడా స్కూలుకి తీసుకు రమ్మన్నారు, అల్లరి పిల్లలకు చెప్పినట్లు!

ఆరోజు సాయంత్రం బిట్టూని పిల్చుకొచ్చేందుకు క్రష్‌కు వెళ్ళిన సునందకు ‘బిట్టూ ఇంటికి వెళ్ళిపోయాడు’ అని చెప్పారు వాళ్ళు. చూడగా ఇంటి బయట, మెట్ల మీద దిగులుగా కూర్చుని ఉన్నాడు బిట్టూ.

‘ఏరా, ప్రొద్దున్న కూడా కాస్త తేడాగా ఉన్నావ్. జ్వరం వచ్చిందేమిటి?’ అన్నది సునంద, ఇల్లు తాళం తీస్తూ. ‘అదీ కాక నేను లేకుండా నిన్ను ఒక్కడినే ఇంటికి పంపదుగా, రేణు ఆంటీ? మరి ఎలా వచ్చావ్?’

‘జాగ్రత్తగా వెళ్లిపోతా ఆంటీ!’ అని చెప్పి వచ్చాను. అయినా ఇవాళ్ల ఎందుకనో పిల్లలందరూ త్వరగా వెళ్లిపోయారు; ఆంటీ ఏమో ఎవరినో చూసేందుకు ఆసుపత్రికి వెళ్ళాలని అనుకుంటోంది- అందుకే వచ్చేసాను’ చెప్పాడు బిట్టూ. ‘తన కొడుకు అట్లా ఎదుటివాళ్లని అర్థం చేసుకుంటాడు’ అని సునందకి మరీ ముద్దు.

హోమ్‌వర్క్ అయ్యాక, కథల పుస్తకం ఒకటి తీసుకుని చదువుకుంటూ కూర్చున్న కొడుకుని చూస్తూ ‘ఇవాళ్ల మీ కవి గారింటికి వెళ్లవా ఏమి?’ అంటూ వేళాకోళం చేసింది సునంద.

‘రేపు స్కూలుకి రమ్మని అమ్మకు ఎలా చెప్పాలి?’ అని ఆలోచిస్తూ కథల పుస్తకం తిరగేస్తున్న బిట్టు, అమ్మ ప్రశ్నకి గంభీరంగా ’వెళ్లను’ అనేశాడు. వ్యవహారం ఏదో కొంచెం తేడాగా ఉందని గ్రహించిన సునంద “శివని రానీ, ఇద్దరం కలిసి బుజ్జగిస్తే అప్పుడు చెబుతాడు విషయం ఏమిటో” అనుకొని, అప్పటికి ఊరుకున్నది.

శివ వచ్చాడు. భోజనాల దగ్గర ఇద్దరూ కలిసి కొడుకుని మరీమరీ అడిగారు- ‘ఏమీ లేదమ్మా, నిద్రవస్తోంది. ఈరోజు త్వరగా పడుకుంటా!’ అని భోజనం అవుతూనే పక్క ఎక్కేసాడు బిట్టు.

హోమ్ వర్క్ పూర్తి చేసాక రోజూ తన డైరీలో అమ్మ చేత సంతకం చేయించుకునేవాడు వాడు. ఇవాళ్ల మటుకు డైరీ అలాగే పుస్తకాల బల్ల మీద ఉండిపోయింది. తను నిద్రపోబోతూ ఒకసారి వాడి గదిలోకి తొంగి చూసింది సునంద. బిట్టు మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు. వాడి పుస్తకాలు ఎక్కడివక్కడే ఉన్నై. వాటిని సరిగా సర్దేందుకని బల్ల దగ్గరకొచ్చిన సునందకు తను డైరీలో సంతకం చెయ్యలేదని గుర్తొచ్చింది. డైరీ తెరిచి చూసి, ఉలిక్కిపడ్డది: డైరీలో తనకి ఒక నోట్ ఉంది. ‘రేపు స్కూలుకొచ్చి లెక్కల టీచర్ని కలుసుకోవాలి’ అని!

“ఎందుకు?” అని ఆశ్చర్యపోయిన సునంద వాడి పుస్తకాల సంచీని మొత్తాన్నీ ముందుగదిలోకి తీసుకెళ్ళింది. తను, శివ ఇద్దరూ బిట్టూ పుస్తకాల్ని తెరిచి చూసారు- చూస్తే ఏముంది, లెక్కల నోట్‌బుక్‌లో వాడు రాసిన కవిత కనిపించింది! “ఓహో! వీడు తెలుగు పాఠాన్ని తీసుకొచ్చి పొరబాటుగా లెక్కల పుస్తకంలో రాసినట్లున్నాడు” అనుకున్నారు వాళ్ళు!

కానీ మళ్లీ చదివి, రఫ్ నోట్‌బుక్ తీస్తే అప్పుడు అర్థమైంది: వాడు అంతకు ముందు రోజు రాసిన కవిత రఫ్ కాపీ, ఆ తర్వాత దాని ఫెయిర్ కాపీ, అటుపైన జావేద్ అంకుల్ రాసిన ‘కంగ్రాట్యులేషన్స్, మై డియర్ యంగ్ పోయెట్!’ కనబడ్డాయి!

సునంద, శివ ఇద్దరూ తమ కళ్లను తాము నమ్మలేక పోయారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకోకుండా కూర్చుండిపోయారు. ఆపైన సునంద అంది, ‘మా తాతగారు పెద్ద కవి- తెలుసా, ఆయన ఒక పద్యాల పుస్తకం కూడా అచ్చు వేయించుకున్నారు. జీన్స్ ఎక్కడికి పోతాయి!’ అని, గర్వంగా.

‘హలో!- నేను కాలేజీలో ఉండగా మా కల్చరల్ యూనిట్‌కి, కాలేజీ మ్యాగజైనుకి సెక్రటరీని- తెలుసుగా, బోలెడు కవితలు రాసాను! నా జీన్స్ వాడిలో పుష్కలంగా ఉన్నాయి. అది తెలుసుకో!’ అంటూ మొదలెట్టాడు శివ.

కాస్సేపు అట్లా మురిసిపోతూ వాదించుకున్నాక, “అందుకేననమాట, మన కవిగారు అంత చిన్నబోయి ఉన్నారు ఇవాళ్ల” అన్నది సునంద. “రేపు మనం వెళ్ళి ఆ బడి వాళ్లకు ఏవో కథలు చెప్పాలన్నమాట!”

“ఏమీ లేదు- ‘మా వాడిని గొప్ప కవి చేద్దామనుకుంటున్నాం; వాడిని మీరు ఊరికే ఏమీ అనకండి’ అని చెబుదాం. దానిదేముంది?!” నిశ్చయంగా అన్నాడు శివ.

“అంతే మరి! కాబోయే కవుల్ని ఆపే హక్కు వాళ్లకెవరిచ్చారు? అయినా వాడి కవిత చూసావుగా, ఎంత బాగుందో?!” అన్నది సునంద, మురిసిపోతూ.

“అవునవును- ఎవరి జీన్స్..” మొదలెట్టాడు శివ.

ఆ రాత్రి కూడా బిట్టుకి కలత నిద్రే అయింది… తనేమో కవితలు రాసేస్తున్నాడు. లెక్కల హోమ్ వర్క్ అస్సలు చెయ్యట్లేదు. చూసి చూసి, టీచర్ ఒక్కసారిగా గట్టిగా అరిచేసింది! ఆపైన స్కేలుతో ఒక దెబ్బ వేసింది. ‘నా లెక్కల పుస్తకంలో కవితలు రాస్తావా?’ అంటూ మరో దెబ్బ వెయ్యబోతుంటే బిట్టుకి మెలకువ వచ్చేసింది!

తనకు చెరో ప్రక్కనా కూర్చొని చిన్నగా నవ్వుతున్నారు అమ్మా, నాన్నా. “కవితలు రాసుకునేందుకు నాకు వేరే నోట్సు కావాలి!” అన్నాడు బిట్టూ, క్లుప్తంగా.

“ఓఁ, తప్పకుండా! నువ్వు రాసిన కవిత బలే బాగుంది. నిజంగానే నువ్వు గొప్ప కవివౌతావు!” మురిపెంగా నవ్వారు సునంద, శివ వాడి తల నిమురుతూ. బిట్టూ సంతోషంగా నవ్వి, వెంటనే మళ్ళీ నిద్రపోయాడు.

* * *

2 thoughts on “బిట్టు- కవిత్వం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Sep, 2017

  1. D G SEKHAR

    It’s very nice. If parents encourage children like the parents in the story the real inherent talents will come out which are very useful for the world and also there won’t be any stress on the children.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: