* * *
ఆ రోజు స్కూల్లో నందు హోమ్ వర్క్ చెయ్యలేదని చెప్పగానే అసహనాన్ని అణుచుకోలేక పోయేను. చదివే పిల్లవాడు కూడా మిగిలిన వాళ్లతో చేరి చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడన్న బాధ, పిల్లలని సరిగా మలుచుకోలేక పోతున్నానన్న ఉక్రోషం ఒక్కసారి నన్నువివశను చేసేయి. వాడిమీద గట్టిగా విసుక్కున్నాను. మరునాడు క్లాసుకే రావద్దన్నాను. పెద్దవాళ్లని తీసుకొస్తేనే రానిస్తానని చెప్పేను. వాడు బిక్కమొహం పెట్టి నిలబడిపోయేడు . జవాబు చెప్పలేదు .
మరునాడు ఒక్కడే వచ్చేడు. పెద్దవాళ్లు పనిలోకి వెళ్ళేరని చెప్పేడు. క్లాసు బయటే నిలబెట్టేను వాడిని. ఆరోజూ హోంవర్క్ చెయ్యనేలేదు. ఒళ్లు మండింది . వాడిని పట్టించుకోకుండా నా మానాన నేను పాఠం చెప్పుకుపోయేను. ఆ మరునాడు అదే తీరు.
మూడోనాడు మొదటి పీరియడ్ ఆరో తరగతిలో ఉండగా నాకోసం ఎవరో బయట ఎదురుచూస్తున్నారని కబురు. క్లాసు అయిన వెంటనే ఆఫీసు రూమ్ దగ్గరకు వెళ్లేను. ఎవరో ముసలావిడ. చాలా జీవితాన్నే చూసిందని ఆమెని చూస్తే తెలుస్తోంది. ఆమెకి స్కూల్లో, అదీ నాతో పని ఏమిటబ్బా అనుకున్నాను.
నన్ను చూస్తూనే ‘నమస్కారం మేష్టరమ్మా!’ అంది చిన్న నవ్వుతో.
‘ నమస్కారం. మీకు ఎవరు కావాలి? ’ నా ప్రశ్నకి బదులుగా, ‘నువ్వే మేష్టరమ్మా’ అంటూ చిలిపిగా నవ్వింది బోసినోరు పూర్తిగా తెరిచి .
‘ మా నందూని క్లాసులోకి రానివ్వనన్నావంటగా’ అప్పుడు అర్థమైంది ఆమె నందూ తాలూకు అని.
‘ అవును, అంతో ఇంతో కాస్త చదివే పిల్లాడు, రెండు రోజులుగా హోంవర్క్ రాసుకురావటంలేదు. వాడు కూడా అల్లరి పిల్లలతో చేరేడు’ కాస్త గంభీరంగానే చెప్పేను. ఆ వయసువాళ్లని చూస్తే అప్రయత్నంగానే మృదువుగా మాట్లాడే అలవాటున్నా నందు చేసిన పని నచ్చలేదని గట్టిగానే చెప్పాలని అనుకున్నాను .
ఆ మాటలు ఆమె చిరునవ్వుతోనే వింది. ‘ మేష్టరమ్మా, మా ఇంట్లో కరెంటు దీపం లేదు. బిల్లు కట్టక చానా రోజులైపోయిందని కనెక్షన్ తీపించేసేరు . నందు నా మనవరాలి కొడుకు. ఇంట్లో తినే నోళ్లు పది దాకా ఉన్నాయి . సూస్తున్నావుగా నేను పనికి పోలేను. నాకూతురు బయటికెళ్లి పనులు చేసే తీరు లేదు. అల్లుడుకి ఇంటి సంగతి పట్టదు. తినేటందుకే ఇల్లు గుర్తొస్తుంది. నా మనవరాలు ఒక్కదాని కష్టం ఇందరం తింటన్నాం. దాని మొగుడు కి గరానాగా కర్సు పెట్టడం ఒక్కటే తెలుసు . పెద్దపిల్లోడిని కాలేజీలో సదివిస్తంది .
నందు మా ప్రక్కనుండే రాజులయ్య ఇంటికాడ రోజూ సదూకునేవోడే. ఆళ్లింటో కరెంటు లైటు ఉంది. అదీగాక ఆళ్లు సెప్పిన పని అందుకుంటాడని నందూ అంటే ఆపేక్షగా ఉంటారు. ఆళ్ళు నాలుగు రోజులుగా వూరెళ్లేరు. ఇంకెక్కడికైనా ఎళ్ళి సదూకోమంటే ఈడికి మా సెడ్డ సిగ్గు.
తెల్లారి ఇంటిపనుల్లో తల్లికి సాయం చేస్తాడు. మంచం మీదుండే తాతకి అన్నీ అందిస్తాడు. సదూకుందుకు పొద్దున్న టయిముండట్లా. ఇంకెంతలే పక్కింటోళ్లు రేపో,మాపో వచ్చేస్తారు. పిల్లడి సదువు గురించి దిగుల్లేదు. ‘
తమ స్థితిని వివరంగా చెప్పి , అర్థం చేసుకోమన్నట్లు చూసిందామె.
’ఇయ్యాళ నుంచి క్లాసులోకి రానీయమ్మా పిల్లోడిన’ అర్థించింది చేతులు ఎత్తి నమస్కరిస్తూ. అర్థమైంది అన్నట్లు తలూపేను.
నందు సమస్య నాకు తెలియదు, వాడూ చెప్పలేదు. వాడి పసిమనసుకి చెప్పుకోవాలంటే మొహమాటం కాబోలు. ఈ పిల్లలని నేను మరింత దగ్గరగా తెలుసుకోవాలి. వీళ్ల జీవితాలు పసివయస్సులోనే ఇంత కఠినంగా ఉన్నాయెందుకో!