* * *
ప్రొద్దున్నే శారద తయారవుతున్నంతసేపూ ఆరాటంగా ఇల్లంతా తిరుగాడుతున్న సరస్వతమ్మ, ‘వెళ్లొస్తానమ్మా, జాగ్రత్త. భోజనం చేసి కాస్సేపు నిద్రపో. ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి’ అంటూ ఆమె ఆఫీసుకి వెళ్లిపోయాక వరండాలో కాస్సేపు కూర్చుని ఆనాటి దిన పత్రికను చదివే ప్రయత్నం చేసింది. మనసు నిమగ్నం కాలేదు.
కొన్నాళ్లుగా ఆవిడకి ఆరోగ్యం బావుండటంలేదు. ఎప్పుడూ కడుపునొప్పనో,కడుపులో మంటనో బాధపడుతోంది. తన పనులు తను చేసుకుందుకు కూడా ఓపిక లేనట్టు తల్లి పడుతున్న అవస్థ శారద చూస్తూనే ఉంది. ఆవిడకి అలవాటైన డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి అన్నిపరీక్షలూ చేయించింది. ఎక్కడా ఏ సమస్యా లేదని చెప్పి, ఆకలి వెయ్యటానికి, నిద్రపట్టటానికీ మందులు ఇచ్చేడు ఆయన. సరస్వతమ్మకి డాక్టర్ మీద నమ్మకం పోయింది. తను పడుతున్న బాధ ఏమిటో ఆయన పట్టుకోలేకపోయాడు అనుకుంది.
శారద ఏం చెయ్యాలో తోచక తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి ఢిల్లీలో ఉన్న అన్నగారితోనూ, హైదరాబాదులో ఉన్న అక్కయ్యలతోనూ ఫోన్ లో మాట్లాడింది.
‘ ఆవిడ బాధ పడుతుంటే ఇన్నాళ్లు ఆలస్యం చేసేవెందుకు శారదా, వెంటనే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి చూబించు.’
‘ తీసుకెళ్లానన్నయ్యా, డాక్టర్ దగ్గరకి వెళ్దాం అంటే వద్దంటుంది. ఆయన సరిగా చూడట్లేదు అంటుంది. పోనీ మరొకరి
దగ్గరకి వెళ్దాం అంటే రాదు. తిండి బాగా తగ్గించేసింది. నీరసపడిపోయింది. తెల్లవార్లూ నిద్రపట్టదంటుంది.
* * *
Nice article …. Keep up the work
LikeLike