* * *
ఈ కిటికీ పక్క ఆకాశం ఇన్నాళ్లూ నాదే!
ఆకాశం మిద్దె క్రింద అడవిలాటి ఆకుపచ్చకి
మెలకువతో ఉన్న నా క్షణాలన్నీ ఇచ్చేసేను
నిజం చెప్పేస్తున్నా
ఇటుగా ఒంగిన ఆకాశంతో ఎప్పుడో ప్రేమలో పడ్డాను.
ఆ మూలగా గడ్డి చెదిరిన పాకలో రెండు ఆవులు
విలాసంగా మేస్తున్నాయి, అరమూత కళ్లతో
ఆకాశాన్ని చూస్తూ ఆనక నెమరేస్తున్నాయి.
ఎవరెవరో వచ్చారు, ఏవో కొలతలు వేశారు!
ఇసుక లారీలొచ్చాయి
ఇనుప చువ్వలొచ్చాయి
మోడువారిన చెట్లొచ్చాయి.
కరకరమంటూ కంకర నలుగుతోంది
అడవి కరిగి ఆవిరయిపోతోంది.
ఒకటొకటిగా నిటారుగా నిలబడ్డ
అంతస్తుల వరుసలకు అందకుండా
ఆకాశం కనిపించని ఎత్తుకు ఎగిరిపోయింది!
పచ్చదనంతో దోబూచులాడే కువకువలన్నీ
ఎటో వలస పోయాయి
పాకలో ఆవులు నెమరేయటం మరిచిపోయాయి.
లోలోపల ఊపిరాడనితనం.
పున్నమి నాటి ఆకాశం పాత చుట్టరికం కలిపి
నన్ను పలకరించబోతుంది
ఇక్కడి మట్టిహృదయం మాయమైందని తెలియదు పాపం!
ఈ ఆకాశం నాది కాదు! నాది కాదు!
Beautiful poem!! I like the concept of falling in love the “Aakaasam”
LikeLiked by 1 person
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike