* * *
దీర్ఘ తపస్సులో ఉన్న కోటేశ్వర్రావుకి హఠాత్తుగా చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు తెలిసింది. ఎక్కడినుంచో చల్లని, సువాసనలు వెదజల్లే గాలులు అతని శరీరాన్ని తాకాయి. తన తపస్సు ఫలించి దేవుడు స్వర్గంలోంచి దిగి వస్తున్నట్టున్నాడు.
ఇంతలో చెవులకింపైన స్వరం ఒకటి వినిపించి కళ్లు తెరిచాడు.
‘చెప్పు కోటీ, నీకేంకావాలో’ ఎదురుగా కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉన్న దేవుణ్ణి చూసి, ఒక్కసారిగా ఆనందబాష్పాలుతో నమస్కరించాడు కోటేశ్వర్రావు.
‘స్వామీ, నేను నగరంలో ఉన్న ధనవంతుల్లో ఒకణ్ణని నీకు తెలుసు కదా,’ అన్నాడు కోటీ తను చెప్పదలచుకున్న దానికి ఉపోద్ఘాతంగా. దేవుడి మందహాసం చూసి,
‘స్వామీ, నాదొక కోరిక, మీకు విన్నవించుకుందుకే ఇంత తపస్సు చేసాను’
‘చెప్పు, కోటీ, భక్తుల కోర్కెలు తీర్చేందుకే నేనున్నది’
‘స్వామీ, నేను రాత్రనక, పగలనక కష్టపడి ఈ స్థాయికి చేరాను. …’
‘ఇంకా సంపాదించాలనుకుంటున్నావా? నగరంలో అందరిలోకీ నువ్వే ధనవంతుడి వయ్యేలా చెయ్యమంటావా? ‘
‘స్వామీ, అది నేను కావాలనుకుంటే సాధించగలను. నేను కోరుకునేది అది కాదు’
‘మరి నీ కోరికేమిటో త్వరగా చెప్పు కోటీ’ దేవుడి మాటలకి కోటి చిన్నబుచ్చుకున్నాడు.
’స్వామీ నేను అంత తపస్సు చేసి నీ దర్శనం చేసుకుంటే నువ్వు విసుక్కుంటున్నావు’ అన్నాడు బాధగా.
‘కోటీ నువ్వు అర్థం చేసుకోవాలి. నేను నీలాటి భక్తులెందరినో కలవాలి, ఎందరి కోర్కెలో తీర్చాలి. ఇల్లు ఎప్పటికి చేరాలి చెప్పు. లక్ష్మీదేవి రోజూ నా ఆలస్యానికి అలుగుతుందే కానీ అలిసిపోయి వచ్చిన నన్ను అర్థం చేసుకోదు.’ ఆయన తన గోడు వెళ్లబుచ్చుకున్నాడు. కోటి ఆశ్చర్య పోయాడు, మనుషుల్లాగే దేవుళ్లకి కూడా ఇలాటి కష్టాలుంటాయి కాబోలు.
‘భక్తా…’అంటూ దేవుడు మరో మారు హెచ్చరించాక ఉలిక్కిపడి కోటి తన కోర్కెను దేవుడి ముందు పెట్టేసాడు……..
‘స్వామీ, నేను కష్టపడి సంపాదిస్తుంటే నా భార్య, పిల్లలు ఎలాటి కష్టం లేకుండా హాయిగా ఆ డబ్బుని అనుభవిస్తున్నారు. వాళ్లకి నా మీద కాస్త కూడా ప్రేమ లేదు. వాళ్లలా బ్రతికే తీరిక నాకు లేదు. కనీసం నేను చనిపోయాకైనా నేనుసంపాదించుకున్ననా ధనాన్ని నాక్కావలసినట్టు తీరిగ్గా అనుభవించే వరాన్నివ్వు స్వామీ’ తన గుండెలో ఎప్పట్నుంచో దినదిన ప్రవర్థ మానంగా పెరుగుతున్న కోర్కెని దేవుడికి చెప్పేసాడు కోటి.
దేవుడికి నోట మాట రాలేదు. ఇదేం కోర్కే? ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ కోర్కెని కోరలేదే. ఇదెలా సాధ్యం? ‘భక్తా, నీకు తెలుసు, చనిపోయిన మనిషి తనతో ఏమీ వెంట తీసుకెళ్లలేడు. తాను అన్నాళ్ళూ మోసిన శరీరాన్ని కూడా వదిలే వెళ్లాలి. నువ్వు ఎంత సంపాదించినా, ఏమి దాచుకున్నా అది బ్రతికుండగానే అనుభవించాలి. అంతే.’
‘అందుకే కదా స్వామీ ఇంత తపస్సు………….’మరింకేదో చెప్పబోతున్న కోటిని ఆపి, ‘అది కాకుండా ఇంకేదైనా కోరుకో’ అన్నాడు దేవుడు.
‘నాకు మరింకేం కోర్కెలు లేవు స్వామీ. ఈ వరాన్నివ్వు. చాలు’ వినయంగా చెప్పేడు.
‘నువ్వు ఇకపైన సంపాదన వెంట పరుగులు ఆపి, హాయిగా జీవితాన్ని అనుభవించు. నీ డబ్బుతో కావలసిన సుఖాల్ని పొందు.’
‘లేదు స్వామీ, బ్రతికున్నన్నాళ్లూ నాకు సంపాదించటంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ లేదు. సంపాదన లేకుండా ఒక్క రోజు గడపలేను.’
‘నువ్వు పెట్టిన ఫ్యాక్టరీలు, నీ బ్యాంకు డిపాజిట్లు నీకు నిత్యం ఆదాయాన్ని తెస్తూనే ఉన్నాయికదా. అది సంపాదన కాదా వెర్రివాడా? ఇంకా సంపదించాలన్న తాపత్రయం ఎందుకు’
‘సంపాదించటం నా బలహీనత స్వామీ, అర్థం చేసుకో’ అన్నాడు కోటి.
‘కానీ ఇది ఇంతవరకు ఎవరూ అడగాలేదు, నేను ఇవ్వాలేదు, అయినా దానిలో ఉండే లాభనష్టాలు నువ్వు చూసుకునే అడుగుతున్నావా?’ అనుమానంగా అడిగేడు దేవుడు.
‘ఆలోచించుకున్నాను స్వామీ. ఇలాటి వరం పొందితే ఒక చరిత్రని సృష్టించినవాడినవు తాను.’ గర్వంగా చెప్పాడు. దేవుడు ఒక్కసారి కోటి వైపు చూసి,
‘సరే, మరోసారి నిన్ను ఆలోచించుకోమని మాత్రం సలహా ఇవ్వగలను. కాదు, నీ మాట ప్రకారం వరం కావాలంటే సరే, ఇస్తాను. మళ్లీ ఈ వరం వద్దని తపస్సుచెయ్యనని మాటివ్వు నాకు’ అన్నడు దేవుడు.
ఆనందంగా దేవుడి మీద ప్రేమతో తనకొచ్చిన శ్లోకాలన్నీ చదివి కోటి తన కృతజ్ఞతను తెలుపుకున్నాడు.
***********
ఎవరికీ చెప్పకుండా హిమాలయాల్లో కెళ్లి తపస్సు చేసి సాధించిన వరం గురించి ఆలోచించుకుంటూ ఆనందంగా ఇల్లు చేరాడు కోటి. ఎప్పటికన్నా చాలా హుషారుగా ఉన్న భర్తను చూసి ఈ వయసులో మరో పెళ్లి చేసుకు రాలేదు కదా అని వరలక్ష్మి కాస్త అనుమాన పడింది. తండ్రి హిమాలయాల్లో కెళ్లి వచ్చేక మరింత ఆదర్శతండ్రి అయి పోయాడని పిల్లలు సంతోషించారు.
ఆరోజు రాత్రి చాలా అలిసి పోయి ఇంటికొచ్చాడు కోటేశ్వర్రావు. భార్య హాల్లో కూర్చుని టి.వి. చూడటంలో మునిగిపోయింది. భోజనానికి కూర్చుంటూ భార్య వచ్చి వడ్డిస్తుందేమో నని చూసి తనే వడ్డించు కున్నాడు. ఆవిడ తమ క్లబ్ తరఫున సభ్యులు అందరినీ సింగపూర్ తీసుకెళ్ళాలనుకుంటు న్నాననీ, అలా తీసుకెళితే ఇంకో నాలుగు నెలల్లో జరిగే క్లబ్ ప్రెసిడెంటు ఎన్నికలు తనకు అనుకూ లంగా జరిగే అవకాశాలున్నాయనిచెప్పి భర్తతో కాదనిపించుకుని కోపంతో సాధిస్తోంది.
భోజనం ముగించి, నిద్రపోయే ముందు కూతురు గదిలోకి చూస్తే ఫోన్ లో ‘మా డాడీ బోలెడు సంపాదిస్తున్నాడే గీతా, అదంతా మాకోసమే కాదూ’ అంటోంది. కొడుకు గదిలోకి చూస్తే ఖాళీగా కనిపించింది. స్నేహితుల్ని వెంట వేసుకుని రాత్రి, పగలు బిజీగా గడిపెయ్యటం మినహా, తన బిజినెస్ పనులు అప్పగించాలని ఎంత ప్రయత్నించినా పట్టించుకోడు.‘అప్పుడే నన్ను బాధ్యతలంటూ విసిగించకు’ అంటూ తనకే చెబుతాడు. బ్రతికున్నన్నాళ్లూ ఇలా తనని వేధించి మరీ ఖర్చులకి అలవాటు పడుతున్నారు. తను పోయాక తెలుస్తుంది వీళ్లకి అసలు విషయం అని కోటి నిట్టూర్చాడు.
ఆరోజు ప్రొద్దున్నే కుటుంబమంతా కలిసి కూర్చుని ఫలహారాలు చేస్తుండగా ‘ఇకపైన నేను మీకు నెలకింతని లెక్కగా మాత్రమే ఇస్తాను.’ అన్నాడు.
‘డాడీ, ఎటూ మీరు సంపాదించేదంతా మాకోసమే. మీ కళ్ల ముందు మేం కావలసినట్టు ఖర్చు పెట్టుకుంటూ, ఆనందంగా ఉండటం చూసి సంతోషించండి’ అన్నాడు కొడుకు.
కోటి కోపంతో తను చనిపోయాక జరగబోయే విషయాన్ని వాళ్లకి చెప్పేసాడు. అందరూ మాట రానట్టు ఉండిపోయారు. భార్య, పిల్లలు తెల్లబోయారు.
‘మీరు మర్చిపోయినట్టున్నారు, మాపేరు మీద బోలెడు ఆస్తులున్నాయి.సంపాదించింది మీరే అయినా అవన్నీ మా అధీనంలో ఉన్నాయి’ భార్య తెలివిగా చెప్పింది.
కోటి నవ్వాడు, ‘నీ తెలివికి నాకు గర్వంగా ఉంది, వరలక్ష్మీ, కానీ నేను పోయాక మీపేరు మీద ఉన్నా కూడా నాతో పాటే వస్తాయి ఆ ఆస్తులన్నీ. అది నా సంపాదన . తెలుసుకో ’ అన్నాడు. మర్నాటి నుంచి భార్య, పిల్లల్లో మార్పు కనిపించింది కోటికి. తన మాటలతో దారిలోకి వచ్చారని సంతోషించాడు.
భార్యా,పిల్లలూ కోటి శాశ్వతంగా బ్రతికి ఉండేందుకు మార్గాల్ని అన్వేషించే పనిలో అనేక మంది శాస్త్రజ్ఞుల్ని,డాక్టర్లని సంప్రదిస్తున్నారని అతనికి తెలియదు. ఆయన పోయాక తాము రోడ్డున పడకుండా ముందు జాగ్రత్తగా తమ ప్రయత్నాలు ఆరంభించారు.
ఇహలోక జీవితం చాలించి, మరోలోకంలో కేవలం తనదైన జీవితం ఎప్పుడు అనుభవించ గలుగుతాడో అని ఆలోచనలెక్కువైపోయాయి కోటికి. దేవుడు ఆత్మహత్య లాటిదేదీ చేసుకోకూడదని ముందే షరతు పెట్టాడు.
కోరుకున్నట్టుగానే ఒకరోజు కోటి జీవితం సమాప్తమైపోయింది. అతని భార్యా పిల్లల ప్రయత్నాలు ఏ ఫలితాన్ని ఇవ్వనే లేదు. ప్రాణం పోయిన కోటికి చాలా ఆనందంగా ఉంది. ఇంకెంత కొన్ని గంటలు. తనక్కావలసినట్టు తను సంపాదించుకున్న సొమ్ముని అనుభవించే ఘడియలు దగ్గరకొచ్చాయి. అతడికి తన వెనుక ఉన్న డబ్బు స్పష్టంగా కనిపిస్తోంది.
కోటి చనిపోయాక శరీరం శ్మశానికి తరలించే ప్రయత్నాలేవీ జరగ లేదు. అది అయితేనే విముక్తుడై తను కోరుకున్నసంపద, తను కోరుకున్న సుఖాలు పొందచ్చు. ఒకరోజు గడిచింది. అలాగే మర్నాడు గడిచింది. కుటుంబ సభ్యులెవరూ కనిపించ లేదు దరిదాపు ల్లో. తనతో పాటు రక్తం పంచుకుని పుట్టిన వాళ్లు, తన పిల్లలూ, భార్య ఎవరూ తన గురించి పట్టించుకోలేదు.
చుట్టుప్రక్కల వాళ్లు అతని శరీరం అలా పడి ఉండటం చూసి పోలీసుల దృష్టికి తెచ్చారు. ‘వాళ్ల కుటుంబీకులకు చెప్పండి, అది వాళ్ల బాధ్యత కానీ, మేము ఏం చెయ్యగలం.’ అనేసారు వాళ్లు.
దేవుడారోజు చెప్పాడు, శరీరం విడిచిన మూడు రోజుల లోపు తన ఆఖరి యాత్ర పూర్తి అవ్వాలని. ఇప్పుడెలా, సమయం గడిచిపోతోంది. శరీరాన్ని అంటి పెట్టుకున్న కోటి ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. చుట్టుప్రక్కల వాళ్ల గోల ఎక్కువవుతుండటంతో కోటి కుటుంబ సభ్యుల్ని ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్లని నిలదీసారు పోలీసులు.
‘మా చేతిలో పైసా లేదు. అనాథ ప్రేత సంస్కారం మీరే చేసెయ్యండి’ అని నడిరోడ్డు మీద ఆకలితో ఆర్చుకుపోతున్న కొడుకు పోలీసులతో చెప్పటం కోటికి తెలుస్తూనే ఉంది. కొడుకు మాటలకి కోటికి అంతులేని దుఃఖం కలిగింది. తల్లి గుర్తొచ్చింది. కోటి భోరుమని ఏడ్వటం మొదలెట్టాడు. ఎవరో చేతిమీద తట్టినట్టైంది కోటికి. చనిపోయిన తర్వాత కూడా స్పర్శ! ఆశ్చర్యంతో కళ్లు విప్పాడు, కళ్లు కూడా చూడగలుగుతున్నాడు.
ఎదురుగా వరలక్ష్మి.‘ ఏమైంది. ఎందుకా ఏడుపులు? ప్రక్కన వాళ్లని నిద్ర కూడా పోనివ్వరా?’ ఆవిడ విసుక్కుంది. తను ఎక్కడున్నాడు, బ్రతికే ఉన్నాడా? చుట్టూ చూస్తే తన మంచం మీద, తన గదిలోనే ఉన్నాడు. తను చచ్చిపోలేదా, అయితే తన తపస్సు,వరం, చనిపోవటం అంతా కలే?! ఎప్పుడోచనిపోయిన తల్లి జ్ఞాపకం మాత్రం నిజం. కోటేశ్వరరావు తండ్రి అతని చిన్నప్పుడే పోయాడు. తల్లి కష్టపడి పిల్లల్ని పెంచుకొచ్చింది. ఉన్నంతలో తల్లి ఇరుగుపొరుగు వాళ్లకి సాయం చేస్తుండేది. మనకే ఒక ఆధారం లేదు, అందరి సంగతి నీకెందుకంటూ తల్లితో పోట్లాడేవాడు.
‘మనకేం తక్కువరా కోటీ. మీ నాన్న లేకపోయినా, ఆయన కట్టించిన ఇల్లుంది. అంతో ఇంతో తినేందుకుంది. ఆమాత్రం తోటి వాళ్లకు చేతనైన సాయం చేస్తేయేం? ఉన్నదేదో నలుగురు కలిసి తినాలి, కానీ కట్టుకుపోతామా?’ అంటూ కొడుక్కి హితబోధ చేసేది. కానీ అతనికి ఆ మాటలు చెవికెక్కేవి కావు.
‘ఆ, నేను కట్టుకుపోతానే’ అంటూ విసుక్కునేవాడు. డబ్బున్న వాళ్లని చూసి, ‘ఏం, వాళ్లకి అంతంత డబ్బుంది కదా, వాళ్ళు చెయ్యచ్చుగా పేదవాళ్లకి సాయం’ అంటూ తల్లితో వాదనకి దిగేవాడు.
‘డబ్బున్నా ఎలా ఖర్చు చెయ్యాలన్న ఆలోచన ఎవరిది వాళ్లకుంటుంది. నువ్వు సంపాదించిన నాడు అలాగే చేద్దువుగానిలే’ అని కొడుకు మాటలకి నవ్వేది. ఆ తర్వాత అతను డబ్బు సంపాదించటం మొదలెట్టాక దాన్నిదాచుకోవాలనుకునేవాడు కాని ఎవరికైనా ఇవ్వాలంటే ప్రాణ సంకటంగా ఉండేది. కొడుకు ధోరణి చూసి అతని తల్లి బాధ పడుతుండేది. ఎలాగైనా కొడుకులో పరోపకార బుధ్ధి కలిగించాలని బ్రతికున్నన్నాళ్లూ ప్రయత్నించింది. ఆవిడ ప్రయత్నాలు ఫలించకుండానే వెళ్లిపోయింది.
తెలవారుతున్నట్టు సూచనగా తూరుపు దిక్కు ఎరుపు రంగుని పులుముకుని ప్రపంచాన్ని నిద్ర లేపుతోంది. ఏమీ ఆశించకుండానే నిత్యం లోకానికి మేలు చేసే సూర్యుణ్ణి చూసేందుకు అతనికి ఏదో అపరాధ భావం అడ్డొచ్చింది. తనకున్న దాన్నినలగురితో కాదు, భార్యాబిడ్డలతో కూడా పంచుకునేందుకు ఇష్టపడని స్వార్థపరుడు మరి.
తన ఆలోచనల్లో ఉన్నదోషం అర్థమైంది ఆ క్షణాన. కాని తనలో వచ్చిన పశ్చాత్తాపం క్షణికమని కోటికి తెలుసు.
* * *
wow!! what a story I got goosebumps 😦
Every human being must read this story. I felt like that this is not only just with money it applies to all material things in life.
I hope this will win an award for 2017 story
LikeLiked by 1 person