* * *
ఈ సంవత్సరం కూడా ఎటైనా వెళ్లి రావాలని, ఏదైనా క్రొత్త ప్రదేశం చూడాలని ప్రయాణం పెట్టుకున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నధర్మశాల చూడాలని ఆశ. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాజధానికి దలైలామా వచ్చి వెళ్లారు. మా ఆశ మరింత బలపడింది. అంత దూరం వెళ్తున్నాం కదా మరోసారి అమృతసర్ కూడా చూద్దామని ముందుగా అక్కడకి బయలుదేరేం. విజయవాడ నుంచి దిల్లీ వరకూ పొద్దున్న 9 గంటల ఫ్లైట్ పట్టుకుని దిల్లీ చేరేసరికి 11.30 అయింది. మార్చి నెల పగటి ఉష్ణోగ్రతలు గట్టిగా ఉన్నాయని చెబుతున్నా, విశాలమైన విమానాశ్రయంలోంచి బయటకొచ్చి నిలబడేసరికి చల్లని గాలి చురుక్కున తగిలింది.
ఐదారేళ్ల క్రితం అక్కడున్న రోజుల్ని తలుచుకుంటూ స్నేహితులతో కాసేపు గడిపి, సాయంత్రం అమృతసర్ వెళ్లే శతాబ్ది అందుకుందుకు న్యూదిల్లీ స్టేషన్ చేరేం. నగరంలో పెద్దగా మార్పు లేదు. అదే ట్రాఫిక్ జామ్, వాహనాలు చేసే శబ్ద కాలుష్యం దిల్లీ ప్రజల అసహనం గురించి చెబుతూ, అక్కడి పొల్యూషన్ ని మరింత పోగుచేస్తోంది. దేశ రాజధాని వాసులు మిగిలిన దేశంలోని ప్రజల కంటే మరింత విశిష్టమైన వారు కాబోలు మరి. అక్కడ రోడ్ ట్రాఫిక్ నుండి విముక్తి మాత్రం ఒక్క మెట్రో రైలు ప్రయాణమే. కేజ్రీవాల్ పరిపాలన గుర్తు చేసుకుని చుట్టూ పరికించాను.
న్యూదిల్లీ స్టేషన్ లో చెత్తా చెదారం, అశుభ్రం అలాగే ఉంది. రైల్వే వారు నడుపుతున్న భోజన శాల బయట వారి ఉద్యోగులు స్టేషన్ లో అటుగా వెళ్తున్న యాత్రికుల్ని భోజనానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. రెస్టొరెంట్ లోపల ఒక్క మనిషీ లేడు. ఆర్డర్ మీద భోజనం తయారుచేస్తామని నమ్మకంగానే చెబుతున్నారు. ప్రభుత్వం వారిదనేసరికే ఒక నిరుత్సాహపూరితమైన వాతావరణం, ఎందుకో ఆ అలసత్వం!
*
అమృతసర్ వెళ్లే శతాబ్ది సరిగ్గా నాలుగున్నర కి బయలుదేరింది. బోగీలు చాలా మురికిగా ఉన్నాయి. రైల్లో మాత్రం ఎలాటి అసౌకర్యం ఉన్నా దయచేసి చెప్పండి అంటూ పదే పదే ప్రకటనలు వినవస్తున్నాయి. టీ, బిస్కెట్లు, ఆపైన సూప్, ఆపైన భోజనం అన్నీ సమకూర్చారు. ఆహార ప్రమాణాల గురించి చెప్పుకుందుకు ఏమీ లేదు. ఆ భోజనం తప్పించుకున్నా మనం కోల్పోయేదేమీ ఉండదు. టాయిలెట్ల గురించి మరింత తక్కువగానే చెప్పుకుందాం. రైలు వాతావరణం ఒక పాత, వెలిసిపోయిన చిత్రం లా కనిపించింది. ట్రాక్ సమస్యో, రైలు సమస్యో కాని వెళ్లవలసిన దానికంటే గంట ఆలస్యంగా రాత్రి 11.30కి చేరేం. స్టేషన్ బయట ట్రాఫిక్ అంత రాత్రి కూడా హోరెత్తిపోతూ ఉంది. చెవులు గళ్లు పడేలా వాహనాల రొద. నెట్ లో తళతళలాడుతూ కనిపించిన హోటల్ రిపేర్ పనులమధ్య లిఫ్ట్ ని ప్రక్కన పెట్టేసింది. సణుక్కుంటూ రెండు అంతస్థులు ఎక్కేం.
పంజాబ్ భారత దేశం ఉత్తర భాగాన ఉన్న సంపన్నవంతమైన రాష్ట్రం. దీనికి ఉత్తరాన జమ్ము, కాశ్మీర్, దక్షిణాన హర్యానా రాష్ట్రం, వాయవ్యాన రాజస్థాన్, తూర్పున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమాన విభజించబడిన పంజాబ్ పాకిస్థాన్ లో భాగమై ఉంది. విభజన సమయంలో అనేక మంది పంజాబీలు భారత దేశానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
మేము దిల్లీలో ఉన్న సమయంలో మా కాలనీలో మెజారిటీ పంజాబీ కుటుంబాలుండేవి. ఒకసారి ఒక పంజాబీ మహిళతో మాట్లాడినప్పుడు ఆమె నిస్పృహతో చెప్పింది, మేమంతా దేశ విభజన సమయంలో ఇక్కడికి వచ్చినవాళ్లం. ఇప్పుడు అసలైన పంజాబీలు ఎవరున్నారు అని.
పంజాబ్ లో ఇప్పుడిప్పుడు తమ ప్రధాన వృత్తి వ్యవసాయం లాభదాయకంగా లేదని అక్కడి వారు చెబుతున్నారు. మనందరికి పంజాబ్ రాష్ట్రం అంటే భాంగ్రా డ్యాన్స్, రుచికరమైన పరాఠాలు, లస్సీ, ఆలూ కుల్చా, రాజ్ మా, షాహి పన్నీర్, చాట్, జలేబీ, పాపడ్, వడియా లాటి పదార్థాలు జ్ఞాపకం వస్తాయి. వ్యవసాయమే కాకుండా పంజాబ్ రవాణా వ్యాపారానికి పసిధ్ధి. ఇంకా కార్పెట్లు, వస్త్ర వ్యాపారం, వ్యవసాయ పనిముట్లు, చేతివృత్తులు, ఎలెక్ట్రికల్ వస్తువులు కు సంబంధించి అనేక పరిశ్రమలు ప్రసిధ్ధి చెందాయి.
ఇక్కడి చెప్పులు, ఎంబ్రాయిడరీ, పాటియాలా సల్వార్స్, షాల్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అనేక మంది వస్త్ర వ్యాపారులు తమ షాపులను సందర్శించి వెళ్లమని సందర్శకులని ఆహ్వానిస్తుండటం కనిపిస్తుంది.
*
తెలవారి స్వర్ణ దేవాలయం చూసేందుకు బయలుదేరేం. అమృతసర్ నగరం అమృత సర్ జిల్లాలో ఉంది. ఇది పంజాబ్ మాంఝా ప్రాంతంలో ఉంది. 2011 లెక్కల ప్రకారం దాదాపు 15 లక్షల జనాభా. స్వర్ణ దేవాలయం ఉన్న కారణంగా అమృతసర్ నగరం సిక్కు మతస్థులకి అత్యంత పవిత్రమైనది. దేవాలయం చుట్టూ ఉన్న రహదారులు బయట ట్రాఫిక్ కి మూసివేసి ఉంచారు. విశాలమైన రోడ్లు, రకరకాల వస్తువులతో కనులపండుగగా కనిపిస్తున్న దుకాణాలు, అక్కడి పెద్ద క్లాక్ టవర్…………..ఏదో మరో ప్రపంచంలో ఉన్నట్టుంది. ఇదివరకు చూసిన జ్ఞాపకాలేవీ మనసులోకి రాలేదు. దేవాలయ పరిసరాల్లో మన సోదర పంజాబీల మధ్య నడవటం ఆహ్లాదకరంగా ఉంది. ఈ దేవాలయాన్ని ‘హర్ మందిర్ సాహిబ్’ అని కూడా అంటారు. అంటే దేవుడు నివసించే దేవాలయం. దేవుడు అందరికీ ఒక్కడే అని వ్యాఖ్యానం చెబుతారు. ఈ దేవాలయానికి నాలుగువైపులా ద్వారాలు ఉన్నాయి. ఇది అన్ని మతాల వారికీ తెరిచే ఉంటుందనే సూచన ఉందని చెబుతారు. అసలు ఈ దేవాలయానికి ఒక ముస్లిమ్ గురువు ‘మియాన్ మీర్’ శంకుస్థాపన చేసారని చెబుతారు.
*
ఈ దేవాలయం ఒక సరస్సు లో ఉంది. అది అమృత సరస్సు అని చెబుతారు. ఈ నగరం పేరుకి అర్థం కూడా అమృత సరస్సుగా చెబుతారు. పూర్వం ఈ సరస్సు వర్షపు నీటి మీద ఆధార పడినా ప్రస్తుతం రావి నది నీరు దీనికి కావలసిన నీటిని అందిస్తుంది. దేవాలయం మార్బుల్ తో కట్టి పైన బంగారం తాపడం చేసినట్టు చెబుతారు. దేవుణ్ణి చేరేందుకు మనిషి వినమ్రంగా ఉండాలని సూచిస్తూ దేవాలయం భూ ఉపరితలానికి దిగువగా కట్టారు. ఇది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. దీని నిర్మాణంలో 700 కేజీల బంగారం ఉపయోగించారు. ఇది రోజులో 24 గంటలూ తెరిచే ఉంటుంది. ఇక్కడి లంగర్, అంటే భోజన శాల నిత్యం దాదాపు 35 వేల మందికి భోజనాన్ని అందిస్తుంది. ఆహారం అత్యంత సాత్వికంగా ఉంటుంది. స్వర్ణ దేవాలయాన్ని నిత్యం 3 లక్షల మంది దర్శిస్తారు. పండుగ రోజుల్లో దాదాపు పది లక్షలు దర్శిస్తారని చెప్పారు. దీని వార్షికాదాయం 500 కోట్లు. దేవాలయ సంపద వెయ్యికోట్ల పైగా ఉంటుంది.
ఈ దేవాలయ ఆవరణలో సిక్కుల అత్యున్నత అధికార పీఠం అఖల్ తఖ్త్ ఉంది.
*
సమీపంలోని రామ్ తీర్థ దేవాలయం వాల్మీకి ఆశ్రమమని చెప్పారు. ఇక్కడే సీతాదేవి లవ, కుశులకి జన్మనిచ్చిందిట. ఇక్కడి లాహోర్, కసూర్ పట్టణాల్ని లవకుశులు ఏర్పాటు చేసారని చరిత్ర. ఎన్నెన్నోదాడులను ఎదుర్కొన్నాఅన్నిసార్లూ దేవాలయం పూర్వ వైభవాన్ని పొందుతూనే ఉంది. ఆధునిక చరిత్రలో 1984లో సిక్కు తీవ్రవాదుల్ని ఏరివేసేందుకు ఈ దేవాలయంలో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్, అది అప్పటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ హత్యకి దారితీసిన విషయం మన జ్ఞాపకాల్లో సజీవంగానే ఉంది.
*
ఇక్కణ్ణుంచి దుర్జియానా ఆలయం కి వెళ్లేం. ఇది హిందువులకి పవిత్రమైనదని చెబుతారు. ఈ నగరంలో హిందువులు, సిక్కులు దాదాపు సమాన నిష్పత్తిలో ఉన్నారు. కొద్ది సంఖ్యలో క్రిస్టియన్లు, ముస్లిమ్లు కూడా ఉన్నారు. ఈ దేవాలయం దేవి దుర్గ పేరుమీదుగా నిర్మించబడింది. ఈ దేవాలయం స్వర్ణ దేవాలయం నమూనాలోనే ఉంటుంది. దీనినే లక్ష్మి,నారాయణ దేవాలయమని కూడా పిలుస్తారు. ఇది లోహగఢ్ గేటు దగ్గర ఉంది. ఈ దేవాలయం కూడా పవిత్రమైన సరస్సు మధ్య నిర్మించడం జరిగింది. దీనిని వెండి దేవాలయం అనికూడా అంటారు. దీనికి కారణం ఈ దేవాలయ తలుపులు వెండితో చేసి ఉండటమే. ఇక్కడ దసరా, జన్మాష్టమి, రామనవమి, దీపావళి పండుగలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
*
ఈ దేవాలయం సమీపంలో ఉన్న జలియన్ వాలా బాగ్ ప్రాంతం, దాని ముందున్న చిన్న గేట్ చూసినప్పుడు అప్పటి సంఘటనలు మన కళ్ల ముందు కనిపించక మానవు. అక్కడ జనరల్ డయ్యర్ జరిపిన మారణకాండ, దానిని తప్పించుకునే క్రమంలో అక్కడి బావిలో పడిన భారతీయులు, వారి పై జరిగిన కాల్పులకి సాక్షిగా ఆ బావి లోపల గోడల మీద బుల్లెట్ల గుర్తులు స్పష్టంగా చూడవచ్చు. ఆ బావి పైన ఒక స్టీల్ నెట్ ని చూస్తాము. ఆ ప్రాంతం చుట్టూ ఒక ఉద్యానవనం లా తయారుచేశారు.
*
అమృతసర్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పాఠాలు మనసులో కదిలి ఒక రకమైన ఉద్వేగానికి గురి అవుతాము. అక్కడి ప్రజల్లో తమ పూర్వీకులు వీరోచితంగా విదేశీ దాడుల్ని ఎదుర్కొన్నారన్న ఒక గర్వం కనిపిస్తుంది. అక్కడి క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు చెప్పే మాటల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది.షేర్ షా సూరి కాలంలో నిర్మించిన గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద ఉన్నదీ నగరం. ఈ రోడ్డు ఉత్తర భారతదేశమంతా విస్తరించి ఉంది.
*
మేము చూసిన ప్రదేశం మరొకటి పంజాబ్ హీరోస్ వార్ మెమోరియల్. ఇది ఒక్క నెల క్రితమే ప్రారంభించారు. చాలా శ్రమ, ఖర్చులకోర్చి తీర్చిదిద్దిన మ్యూజియం చాలా విశాలమైన ఆవరణలో కట్టారు. మన దేశం మీద జరిగిన దాడుల్లో పంజాబీ వీరులు ఏ విధంగా ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నారో తెలియజేసే ఒక లఘు చిత్రం కూడా 7D టెక్నిక్ లో చూబిస్తున్నారు. విదేశాలు చూసివచ్చిన వారికి కాకపోయినా మనదేశంలో ఇదొక క్రొత్త అనుభవం.
*
అమృతసర్ అంటేనే మరొక ముఖ్య విషయం జ్ఞాపకం వస్తుంది. అది పాకిస్థాన్ తో మనదేశానికున్న వాఘా సరిహద్దు. మనదేశానికి పాకిస్థాన్ తో తెరిచి ఉన్నసరిహద్దు ప్రాంతం ఇదొక్కటే. 1999 లో కాశ్మీరులోని అమన్ సేతు ప్రాంతం కూడా సరిహద్దుగా తెరిచారు. వాఘా సరిహద్దు అమృతసర్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో అటారి గ్రామంలో ఉంది. ఈ సరిహద్దు నుండి లాహోర్ నగరం కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.
*
ఇక్కడ ప్రతి సాయంత్రం ‘బీటింగ్ ది రిట్రీట్’ అంటే ఒక ముగింపు వేడుక జరుగుతుంది. ఒక అరగంట పాటు సరిహద్దున ఉన్న రెండు దేశాల గేట్లకు ఇరుప్రక్కల ఉన్నభారతసైన్యం, పాకిస్థాన్ సైన్యం చేసే విన్యాసాలు చూడదగ్గవి. ఇది చూసేందుకు నిత్యం వందలు, వేల సంఖ్యలో ప్రజలు చేరతారు. సాయంత్రం 5 గంటలకు మొదలై ఒక అరగంట పాటు ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనకోసం కొందరు సైనికులకి ప్రత్యేక శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. వీరిలో ఇద్దరు మహిళా ఉద్యోగులూ ఉన్నారు. ఇది మొదలయ్యే ముందు హిందీ సినిమాల్లోని దేశభక్తి గీతాలతో ఈ ప్రాంతమంతా హోరెత్తిపోతుంది. చేతిసంచులు, మంచినీళ్లు ఏవీ కూడా సెక్యూరిటీని దాటి లోపలికి తీసుకెళ్ళకూడదు. కానీ గ్యాలరీ దగ్గర మాత్రం ప్రదర్శన మొదలయ్యేవరకు మంచినీళ్ళు, చిరుతిళ్లు, కూల్ డ్రింకులు అమ్మకం జరుగుతూనే ఉంది.
*
ప్రదర్శన మొదలయ్యే ముందుగా అక్కడ విధుల్లో ఉన్న సైన్యం సందర్శకులని జాతీయ జెండా పుచ్చుకుని ఆ ప్రాంతంలో కొద్ది దూరం పరుగెత్తేందుకు, డ్యాన్స్ చేసేందుకు ప్రోత్సహిస్తారు. ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. కానీ అక్కడ ఒక సైనికోద్యోగి సందర్శకులని గట్టిగట్టిగా భారత్ మాతా కి జై అని పదేపదే నినదించమని, సరిహద్దు గేటుకు ఆవల జరిగే పాకిస్థానీయుల సంబరం, ఉత్సాహం మనకు వినపడనంత గట్టిగా కేరింతలు కొట్టమని ప్రదర్శనకు ముందు బాగా ఉద్రేక పరచటం ఆమోదయోగ్యం గా కనిపించలేదు. ఇలాటి ప్రేరేపణ ఎంతవరకు సమర్థనీయమో అర్థం కాలేదు.
*
ఇన్ని వేల మంది ఆసక్తిగా చూసే ప్రదర్శన ఇంతకంటే ఉదాత్తంగా ఉండేలా చూడవలసిన బాధ్యత రెండు దేశాల మీదా ఉంది. సెలవురోజుల్లో ప్రదర్శకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రదర్శనను వివరంగా, దగ్గరగా చూడదలిస్తే ప్రారంభానికి గంట ముందు అక్కడికి చేరి గ్యాలరీలో కూర్చోవలసిన అవసరం ఉంది. రెండు దేశాల ప్రజలు పూర్వం ఒక్క దేశప్రజలే అని, మనమంతా ఒక్కటే అన్న భావన పెంచి మన దేశాల మధ్య చెదురుమదురుగా జరుగుతున్న కవ్వింపు చర్యలకు ముగింపు పలకవలసిన అవసరం ఉంది.
*
ప్రదర్శనలో వాళ్లు చేసిన కవాతు కూడా స్నేహపూర్వకంగా కనిపించలేదు. అసలు ఇలా ప్రతిరోజూ రెచ్చగొట్టుకోవటం అవసరమా అనిపించింది. మన దేశాలమధ్య శాంతిని ప్రేరేపించేదిగా మాత్రం ఈ ప్రదర్శన కనిపించలేదు. అరగంట పాటు జరిగే ఈ విన్యాసాలు రెండు వైపులా కొంత టెన్షన్ ని సృష్టించేవిగా ఉన్నాయనిపించింది. ఆఖరుగా రెండు దేశాల జాతీయ జెండాలనూ క్రిందకి దించి, ప్రదర్శనకు ముందు తెరిచిన ఇరు దేశాల గేట్లను యధాప్రకారం మూసివేస్తారు. ఈ ప్రదర్శన, ఈ ప్రాంతం సందర్శించటం ఒక గొప్ప అనుభవం.
*
పంజాబ్ పేరు చెబితే మనకి బిషన్ సింగ్ బేడీ, నవజ్యోత్ సింగ్ సిధ్ధూ, దారాసింగ్ లాటి క్రీడాకారులు, దీపామెహతా లాటి సినీ ప్రముఖులు, భీష్మ సహానీ లాటి రచయితలు, ఇంకా కపిల్ శర్మ, కిరణ్ బేడీ, మహేంద్ర కపూర్, నరేంద్ర చంచల్, మన్మోహన్ సింగ్, మీరా నాయర్ జ్ఞాపకం వస్తారు.
మనవైపు పంజాబీ లంటే వ్యాపార నిమిత్తం వచ్చి స్థిరపడిన ధనవంతులని మాత్రమే చూస్తాం. కానీ పంజాబ్ గడ్డ మీద పేద పంజాబీలు, భిక్షాటన చేసే స్థానికులని చూడటం కాస్త క్రొత్తగా అనిపించింది. పంజాబ్ రాష్టం మన దేశానికి ఎందరో వీరులను అందించింది. అది మనకందరికీ గర్వకారణం.
వ్యాసం ఆరంభంలో ఉన్న ఫోటో అమృతసర్ లోని ఖాల్సా యూనివర్సిటీ.
Continued in Part II
Reading this travelogue is equally enjoyable as experiencing physically.. Let people see more and more amazing India through your columns…
LikeLiked by 1 person
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike