* * *
అశోక మిత్రన్ గారి కథల సంపుటి ‘నాన్నగారి స్నేహితుడు’ గురించి చెప్పుకుందాం. ఈ పుస్తకం 1991లో ‘అప్పావిన్ స్నేగిదర్’ అనే పేరుతో తమిళంలో వచ్చింది. సాహిత్యంతో పరిచయమున్న పాఠకులంతా ‘అశోక మిత్రన్’ పేరు వినే ఉంటారు. తమిళ సాహిత్యంలో ప్రముఖ కథా రచయితల్లో వీరు ఒకరు.
వీరి రచనలు అతి సరళమైన శైలిలో, సున్నితమైన మనో విశ్లేషణతో ఉంటాయి. వీరి కథల్లోని పాత్రలు ఎక్కణ్ణుంచో ఊడిపడ్డట్టు కాక అతి సహజంగా సాధారణ మునుష్యులను, వారి ప్రవర్తనలను ప్రతిబింబిస్తాయి. మన దైనందిన జీవితపు వాస్తవ నడవడి ఈ పాత్రల్లో చూడగలం. ఈ పుస్తకాన్ని సాహిత్య అకాడమీ వారు 2004 సంవత్సరంలో ముద్రించడం జరిగింది. దీనిని తెలుగులోకి అనువదించిన వారు శ్రీ జి. చిరంజీవి గారు. ఈ పుస్తకంలో 11 కథలున్నాయి. ఇందులో రెండు పెద్ద కథలు. మిగిలినవి చిన్న కథలు. ఇది సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కథా సంపుటి.
మొట్టమొదటి కథ ఫిల్మోత్సవ్. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవం గురించి చాలా విపులంగా, నిజాయితీగా, విమర్శనాత్మకంగా ఒక దృశ్య కావ్యంలా చెప్పిన ఈ కథ చదువరులను ఆకర్షిస్తుంది. పుస్తకం వెనుక రచయిత గురించి ఇచ్చిన వివరాలలో వీరు కొంతకాలం సినీరంగంలో పనిచేసినట్లు చెప్పారు. ఆ అనుభవం ఈ కథను ఇంత వాస్తవంగా చిత్రీకరించేందుకు తోడ్పడి ఉంటుంది.
ఇక కథ విషయానికి వస్తే,
హైదరాబాదు లో 15 రోజుల పాటు జరిగే ఫిల్మోత్సవ్ గురించి ఒక ఆంగ్ల పత్రికకి అనుబంధంగా వచ్చే ఫిల్మోత్సవ్ విశేష సంచిక తయారీకి వార్తా విశేషాల్ని అందించవలసిన బాధ్యత ఈ కథలో ప్రధాన పాత్ర సుందరం మీద పడుతుంది. అతనికి ఈ చిత్రోత్సవాల పట్ల ఎలాటి ఆసక్తి ఉండదు. కథ అంతా ఉత్తమ పురుషలో సాగుతుంది.
సుందరం తన కళ్లెదుటే కాలంతో మార్పులు సంతరించుకుంటున్న మీనంబాకం విమానాశ్రయం గురించి ఆలోచిస్తూ అకస్మాత్తుగా తండ్రి తనకు ఇచ్చిన ఇత్తడి రేజరు గురించిన జ్ఞాపకంలో పడతాడు. ఆ రేజరుతో ముఖమంతా గాట్లు పెట్టుకున్న మొదటి అనుభవాన్ని, ఆ విషయం మీద తాను తండ్రి మీద విరుచుకు పడటాన్ని, ఆ తర్వాత తండ్రి పోయిన జ్ఞాపకం…………. ఒకదాని వెనుక ఒకటిగా చదువుతుంటే చదువరుల మనసును అవన్నీ సున్నితంగా స్పృశిస్తాయి. తాను మాత్రం ఇంకా ఆ రేజరును ఆప్యాయంగా వాడుతుండటం కూడా తలుచుకుంటాడు సుందరం.
ఆ తర్వాత విమానంలో కూర్చున్న సుందరం ఆలోచనలు మరోవిధంగా సాగుతాయి. తనకు ప్రమాదం జరిగితే తన తల్లికి బోలెడు డబ్బు అందుతుంది కదా అనుకుంటూ, ప్రక్క సీట్లో కూర్చున్న పాలుగారే పాతికేళ్ల అబ్బాయి మాత్రం ఏ హానీ జరక్కుండా గమ్యం చేరుకోవాలని కోరుకుంటాడు. విమానంలో పెట్టిన బిస్కెట్లు తింటూ తన చెల్లెలి పెళ్లి చూపుల గురించి తలుచుకోవటం అతి సహజంగా అనిపిస్తుంది.
కానీ ఇంత వేదాంత ధోరణిలో తన గతాన్ని కథలో చెప్పుకుంటున్న సుందరం పాత్ర సున్నితమైన హస్య ధోరణిని అనేక చోట్ల ప్రదర్శిస్తాడు. ముఖ్యంగా కథ ప్రారంభంలో అనంతుతో సంభాషణలోనూ, ఎయిర్పోర్ట్లో రామారావుతో సంభాషణలోనూ, ఆపైన తనతో పాటు ఫిల్మోత్సవ్ విశేషాల్ని పత్ర్రికకి అందించేందుకు వచ్చిన కరీంచంద్ తో జరిపిన సంభాషణలోనూ స్పష్టమవుతుంది.
వర్కింగ్ ఎడిటర్ శ్రీపతి పరిచయ సమయంలో అతని సంభాషణల ఆధారంగా అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ప్రయత్నం మానవ మనస్తత్వలోతుల విశ్లేషణ పై రచయితకున్న అధికారం స్పష్టం అవుతుంది. హోటల్ రిసెప్షన్ హాల్లో అలంకరణ వివరించిన తీరు రచయిత సునిశిత పరిశీలనను తెలుపుతుంది. ఆ హాల్లో తమకోసం అమర్చిన తళుకుబెళుకుని, వైభోగాన్ని అక్కడికొచ్చిన చిత్ర ప్రముఖులు ఎందరు గమనిస్తారో అని సందేహ పడతాడు. అంతలోనే అక్కడ వేలాడుతున్న ఒక్క దీపం ఖరీదు తన వద్ద ఉండి ఉంటే తన చెల్లి పెళ్లి జరిగి ఉండేది కదా అని వ్యాకుల పడతాడు సుందరం.
కథ పొడవునా చెల్లి పెళ్లి చెయ్యలేకపోవటం, ఆమె అవివాహితగా ఆత్మహత్య చేసుకోవటం కథానాయకుడు సుందరాన్ని ఎంతగా కృంగదీసిందో తలుచుకుంటూనే ఉంటాడు. అలాగే తను ప్రేమించిన రేఖ ఆమె తల్లి ఒత్తిడితో సినీలోకం లోకి ఎలా ప్రవేశించిందో, ఆమెతో కలిసి జీవించాలన్న తన కలలు ఎలా ఆవిరైపోయాయో తలుచుకుంటాడు.
ఫిల్మోత్సవ్ పురస్కరించుకుని ముఖ్య అతిథిగా వచ్చిన జయదేవి తన స్నేహితురాలు రేఖ అని తెలిసినప్పటికీ ఎలాటి భావ సంచలనానికీ లోనవడు. ‘ఇక నుంచైనా మనం కలిసి జీవిద్దామన్న’ ఆమె మాటల్ని సునితంగా తిరస్కరిస్తాడు.
సినిమా పబ్లిసిటీకి సంబంధించిన తన ఉద్యోగం, అది చెల్లి పెళ్లి సంబంధాల మీద చూబించిన వ్యతిరేక ప్రభావం, సినిమా వాళ్లమీద ప్రజల్లో ఉండే దురభిప్రాయం ఇలా అన్నీ విపులంగా, చాలా సహజమైన రీతిలో వివరిస్తాడు. ఇవన్నీ చెప్పుకున్న తరువాత ఆఖరున ఒక పదిహేను రోజులు తన సొంత వేదనలకి ఆటవిడుపు ఈ ఉత్సవం అనుకుంటాడు సుందరం.
‘ఏది నిజం’ అన్న కథ అకస్మాత్తుగా ఒక రోడ్డుమీద ప్రారంభం అవుతుంది. ఒక యువకుడు ఒక హోటల్ ముందు అడుక్కుంటూ కనిపిస్తాడు. అతన్ని వెతుకుతూ వచ్చిన మరోవ్యక్తి ఆ యువకుణ్ణి కొట్టడం అంతా కంటిముందు ఒక దృశ్యంలా తోస్తుంది. కథా ప్రారంభంలో పాఠకుడి మనసులో వచ్చిన సందేహాలు కథ ముగింపుకి కూడా తీరవు. ‘ఏది నిజం’ అన్న శీర్షికతో వచ్చిన ఈ కథ ఏది నిజమో పాఠకులకి తేటతెల్లం కాకుండా ముగుస్తుంది.ఏదినిజం అన్నది పాఠకుడి ఆలోచనలకే రచయిత వదిలేస్తారు. ఇలాటి సంఘటనలు చుట్టు ప్రపంచంలో మనం వింటూ, చూస్తూ ఉంటాం. ప్రతి మనిషీ తన ప్రవర్తన సపోర్ట్ చేసుకుందుకు ఎన్నో వాదనలు వినిపిస్తూంటాడు. తాను చేస్తున్నది సరైనదే అని నమ్మి చుట్టు ప్రపంచానికీ నమ్మజూపుతుంటాడు. నిత్య జీవితంలో ఇలాటి సన్నివేశాలు తారసపడుతూనే ఉంటాయి. మనల్ని అయోమయంలో పడేస్తూనే ఉంటాయి.
‘నాన్నగారి స్నేహితుడు’ ఈ కథ పేరే పుస్తకానికి ఇచ్చిన శీర్షిక కూడా. ఈ కథలో నారాయణ తండ్రిని పోగొట్టుకుని, కుటుంబ బాధ్యత మీద పడటంతో తల్లినీ, తమ్ముడినీ తీసుకుని మద్రాసు వస్తాడు.
ఉన్న ఊరు వదిలి, నగరంలో జీవిక వెతుక్కుని తమ బ్రతుకు తాము బ్రతుకుతున్న అతనికి అకస్మాత్తుగా తండ్రి స్నేహితుడు తారసపడతాడు. ఆయన ఎవరో కాదు, తండ్రి మరణం తరువాత నిలువ నీడ లేనప్పుడు ‘మీకోసం ఒక ఇల్లు చూసి ఉంచేను’ అని భరోసా ఇచ్చిన పెద్దమనిషి సయ్యద్. కానీ ఆయన మాటల్లో నిజం ఎంతో అర్థం అయ్యాక తన తండ్రి స్నేహితుడిపై ద్వేషంతో, విరక్తితో కుటుంబాన్ని నగరానికి మారుస్తాడు. తల్లికి జరిగిన విషయం చెబుతాడు. అతని తల్లి కూడా సయ్యద్ ని కసితీరా తిడుతుంది. నగరంలో ఎదురైన సయ్యదుమామ నారాయణతో ఇంటికి వస్తానంటాడు. ఆయన్ని ఇంటికి తీసుకువెళ్తే తల్లి ఆయన్ని చీవాట్లు పెట్టి, ఆయన్ని తీసుకొచ్చినందుకు తననీ తిడుతుందని నారాయణ ఆలోచిస్తాడు. తీరా సయ్యదుమామను ఇంటికి తీసుకెళ్లాక అతని తల్లి ప్రవర్తనకి నారాయణ తెల్లబోతాడు. అతని తల్లి నాలుగు నెలల క్రితం పోయిన భర్తను తల్చుకుని సయ్యదు మామ దగ్గర కన్నీరు పెట్టడంతో కథ ముగుస్తుంది.
మనిషిలో ఆవేశకావేషాలు, ద్వేషం వంటివి తాత్కాలికంగా కలిగే భావనలేననీ, ఆయా సందర్భాన్ని, సంఘటననీ సానుభూతితో అర్థం చేసుకునే క్షమాగుణం ఎదుటి మనిషి పట్ల మానవత్వంతో ప్రవర్తించేలా చేస్తుందని ఈ కథ స్పష్టంగా చెబుతుంది. ఏవ్యక్తీ కూడా ద్వేషాన్ని ఎక్కువకాలం మనసులో ఉంచుకోలేడు. తోటి మనుష్యుల పట్ల దయ, ప్రేమ, క్షమ లాటి గుణాలు ప్రతి మనిషికీ సహజ లక్షణాలు అన్న అద్భుతమైన వాస్తవాన్ని ఈ కథ చెబుతుంది.
‘నిరీక్షణ’ కథలో ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కథా నాయకి శకుంతల తన అక్క పెళ్ళి అయితే తను ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుందామని నిరీక్షిస్తుంటుంది. కుటుంబం పట్ల, అక్కపట్ల తన బాధ్యత మాత్రం ఆమె విస్మరించదు. తాను ప్రేమించిన వాణ్ణి కులాంతర వివాహం చేసుకు తన దారి తాను చూసుకుంటే సరైన చదువు కాని, ఉద్యోగం కాని లేని అక్క పెళ్లి పూర్తిగా ఎండమావి అవుతుందని ఆమెకు తెలుసు. అందుకే నిరీక్షణతో విసిగి ఉన్న ప్రేమికుణ్ణి ఇంకా ఇంకా నిరీక్షించమని మాత్రమే చుబుతూంటుంది. ఇటువంటి కథా వస్తువుతో కథలు చదివే ఉన్నా ఈ కథ చెప్పిన తీరు అతి సహజంగా ఉంది. మైకెలాంజిలో చిత్రించిన కళాఖండం గురించి చెబుతూ ఆయన తన విమర్శకులతో అన్న మాటలు,’ పరిశుధ్ధాత్ములకి వృధ్ధాప్యం లేదు’ తలుచుకుంటుంది. మరి తన ఇంట్లో ఎవరు పరిశుధ్ధంగా లేరని ఆలోచిస్తూ, అక్క సగం ముసలిదైపోయింది, తనకూ ఆ రోజు ఎంతో దూరంలో లేదు అని నిట్టూరుస్తుంది కథానాయిక. అక్క పెళ్లి త్వరగా జరగాలని కోరుకుంటూ, ప్రేమించిన యువకుడితో తన వివాహం కోసం నిరీక్షిస్తూ నిద్రకు ఉపక్రమిస్తుంది శకుంతల.
‘రంగు’ కథలో చెన్నై దూరదర్శన్ లో ఒక మంత్రిగారు తమిళనాడులో పర్యటించటం పై ఒక కార్యక్రమాన్ని చూస్తాడు ఈ కథలోని నాయకుడు. అందులో మంత్రిగారు పోలీసు శాఖాధికార్లని కలుసుకుంటారు. వారందరి నల్లని మీసాలు అతణ్ణి ఆకర్షిస్తాయి. రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఆఫీసర్లకు కూడా అంత చిక్కని నల్లని మీసాలకు కారణం బహుశా వాళ్లు వాడే హెయిర్ డై అని అభిప్రాయపడతాడు.
చిన్నప్పుడు తనకు పోలీసులతో ఉన్నపరిచయం తలుచుకుంటాడు. అతనే గాంధీరాం అనే ఇనస్పెక్టర్. పిల్లలు లేని ఆ ఇనస్పెక్టర్ మన కథానాయకుణ్ణి కొడుకులాగా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఒకసారి కథానాయకుడి ఇంట్లో వెండిగిన్నె దొంగిలించబడుతుంది. అది వాళ్ల పశువుల కాపరి చేసినపనే. పోలీసులు నేరస్థుణ్ణి పట్టుకుని కొట్టి, హింసించి నిజం చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఆ సంఘటన తరువాత గాంధీరాం పట్ల భయం మొదలవుతుంది మన కథానాయకుడిలో. దొంగల చేత నిజం చెప్పించటానికి అలాటి శిక్షలు తప్పని సరి అని చెబుతాడు గాంధీరాం. అకస్మాత్తుగా ఆ పోలీసాఫీసరు చనిపోతాడు. అతను బ్రతికి ఉంటే మరో పదేళ్లకి బట్టతల మీద మిగిలిన వెండ్రుకలకి, మీసాలకి రంగు వేసి ఉండేవాడు అని కథానాయకుడు ఆలోచిస్తాడు.
‘బిప్లవ చౌదరి ఋణ దరఖాస్తు’ కథలో ఈ చౌదరికి ఋణ దరఖాస్తు వ్రాసిపెట్టిన పరిచయాన్ని పురస్కరించుకుని అతన్నోమారు కలుసుకోవాలనుకుంటాడు కథానాయకుడు. చాలాకాలం తర్వాత గతంలో తాను నివాసం ఉన్న ఊరు ఒక శుభకార్యం నిమిత్తం వచ్చి, చౌదరిని కలుసుకుందుకు అతని ఇంటికి వెళ్తాడు. కానీ ఆ ఇల్లు కోర్టు కేసులో ఉన్నట్లు అర్థం అవుతుంది. కలుసుకోదలచిన వ్యక్తిని కలుసుకోలేక పోయినందుకు నిరాశగా వెనుతిరుగుతాడు.
‘రోషం’ కథ ఒక అత్తాకోడళ్ల కథ. వారిద్దరి మధ్య ఆప్యాయత, అవగాహనల్ని అత్యంత సహజంగా చెబుతుందీ కథ. ప్రతిరోజూ అలవాటుగా పాలు పొంగించి వృధా చేస్తున్న కోడల్ని ఒక రోజు ‘మొద్దు’ అంటూ అత్తగారు కసురుకుంటుంది. కోడలు కాస్త బుధ్ధి మాంద్యం ఉన్న పిల్ల అని అత్తగారు ఆ రోజు గ్రహిస్తుంది.
ఆ తరువాత భోజన సమయంలో కోడలు ఏడుస్తూండటం చూసి ఏడ్వద్దంటూ అనునయిస్తుంది. మరికాసేపటికి కోడలు తిరిగి ఏడవటం గమనించి అత్తగారు పొన్నమ్మ విసుక్కుంటుంది. ఏడుపుకి కారణం చెప్పమని నిలదీస్తుంది. అప్పుడు అసలు కారణం చెబుతుంది కోడలు, ‘చిన్నప్పట్నుంచీ అందరూ ‘మొద్దు’ అని పిలిచేవారు. కానీ అత్తవారింటికి వచ్చాక ఎవరూ నన్ను అట్లా పిలవలేదు, ఇకపైన ఇక్కడ కూడా ‘మొద్దు’ అనే పిలుస్తారని’ వెక్కిళ్లమధ్య చెబుతుంది కోడలు అమాయకంగా.
‘మునీర్ స్పానర్లు’ అనే కథలో నాయకుడు లారీ క్లీనరుగా పనిచేస్తున్నఒక పన్నెండేళ్ల పిల్లవాడు మునీర్ తో స్నేహం చేస్తాడు. మునీర్ పనినీ, అతను శుభ్రం చేసే లారీని ఆరాధనగా చూస్తూండేవాడు. తండ్రిపోయాక ఊరు విడిచి వెళ్లిపోతూ సామానంతా గూడ్సు వేగన్ లో వేసేందుకు మునీర్ లారీ యజమాని సహాయాన్ని తీసుకుంటాడు.
తీరా ఊరు వదిలి వెళ్లేముందు మునీర్ ఏడుస్తూ వచ్చి స్పానర్లు కనిపించనందున యజమాని తనని పనిలోంచి తీసేసేడని చెబుతాడు. చెన్నై చేరాక గూడ్సు వేగన్ లో సామాను తీసి బండిలో చేర్చే ప్రక్రియలో మునీర్ వెతుక్కున్న స్పానర్లు ను కూడా గమనిస్తాడు కథానాయకుడు. తనను సాగనంపేందుకు వచ్చినట్లుగా బయల్దేరే సమయంలో వచ్చిన మునీర్ ను చూసి ఆనంద పడినా వాడు పని పోగొట్టుకున్నాడని బాథ పడతాడు. చిన్నవిగా కనిపించే పొరపాట్లు కొన్ని సార్లు కొందరి జీవితాల్లో ఎంత కల్లోలం రేపుతుందో ఈ కథ చెబుతుంది.
‘సిల్వియా’ కథలో నాయకుడు ఒక చిన్న కుర్రాడు. అతని స్నేహితుడు మారిస్ అక్క సిల్వియా గురించిన కథ ఇది. యుధ్ధ సమయంలో ఒక బ్రిటిష్ సైనికుడు జార్జి కోరి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆరునెలల తర్వాత యుధ్ధం ముగిసి జార్జి ఇంగ్లండు వెళ్లి పోతాడు. అతని రాక కోసం ఎదురుచూసి చూసి జబ్బు పడి సిల్వియా చనిపోతుంది. మనం పురాణాల్లో చెప్పుకునే ఏ పతివ్రతకీ సిల్వియా తీసిపోదు అంటూ కథ ముగుస్తుంది. ఏ కాలంలో అయినా ఆడపిల్లల జీవితాలు అన్నీ ఒకేరకమైన చట్రంలో బంధించబడి ఉన్నాయని ఈ కథ చెబుతుంది.
‘ఇప్పుడు పేలింది’ కథ టెర్రరిస్ట్ కార్యకలాపాల్ని ప్రత్యక్ష్యంగా చూబిస్తుంది. కిట్టూ అనే తీవ్రవాది తను మూడో సారి పెట్టిన బాంబు కూడా పేలలేదని తెలుసుకుంటాడు. చెత్తబుట్టలోకి పారవేయబడిన ఆ రేడియో బాంబును మరోసారి ప్రయోగించే ప్రయత్నంలో ఆ బాంబు పేలుతుంది. తీవ్రవాద కార్యకలాపాలు ఎప్పటికైనా ఆత్మహత్యా సదృశ్యాలని మరోసారి హెచ్చరిస్తుంది ఈ కథ.
‘ఇనస్పెక్టర్ సెనబగరామన్’ ఈ కథ మరొక పోలీస్ ఇనస్పెక్టర్ కథ. ఇందులో కూడా ఒక చిన్నపిల్లవాడితో ఆ ఇనస్పెక్టర్ స్నేహం, అది పెరిగి ఒక ఆత్మీయతానుబంధంగా మారటం చూస్తాం. ఈ ఇనస్పెక్టర్కీ పిల్లలు లేరు. తన మేనల్లుడి స్నేహితుణ్ణి అంటే మన కథానాయకుణ్ణి ఆప్యాయంగా చూసుకుంటాడు. సినిమాలకి తీసుకెళ్తాడు. తను ఇష్టపడిన మరో స్త్రీ ఇంటికి కూడా తీసుకెళ్తాడు. ఆ ఇంటికి వెళ్లటం గురించి స్కూల్లో అందరూ చంద్రాన్ని వేళాకోళం చేస్తారు. అది అతని పసిమనసుకు అర్థం కాదు. కాని అలా ఆ ఇంటికి వెళ్లటం సరైన పని కాదు అన్న సంగతి అర్థం అవుతుంది. ఇనస్పెక్టర్ జబ్బుపడి, ఆ ఇంట్లోని స్త్రీని చూడాలని ఉందని చంద్ర దగ్గర చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు. ఆమెకు అందజేయమని కొంత డబ్బు చంద్రం చేతికిస్తాడు. ఆమె సక్కు. సక్కు తల్లి ఇనస్పెక్టర్ మరింత డబ్బు ఇవ్వలేదని ఈసడించుకుంటుంది. ఇనస్పెక్టర్ ప్రేమను అర్థం చేసుకున్న సక్కు మాత్రం అతను మరణిస్తూ తనని చూడాలని తహతహ లాడాడని విని ఆవేదనకు గురి అవుతుంది. పసివాడైన చంద్రం మనసులో ఇనస్పెక్టర్, సక్కుల మధ్య ఉన్నఅనురాగం పట్ల సానుభూతి ఉంది.
ఈ కథలన్నింటిలోనూ రచయితే ముందుమాటలో చెప్పినట్లుగా కొన్నికొన్ని పాత్రలు, పేర్లు, సన్నివేశాలు, సంఘటనలు పునరావృతం అవుతుంటాయి.
ఉదాహరణకు చంద్రం అనే బాలుడు, పసివాడైన కథానాయకుడు, తండ్రి చనిపోయి, ఇంటి బాధ్యత పైన పడిన పాత్ర, ఉన్న ఊరు విడిచి చెన్నై మకాం మార్చటం, వృత్తిరీత్యా కఠినమైనా మానవత్వంతో పరిమళించే స్వభావం ఉన్న పోలీస్ ఇనస్పెక్టర్ పాత్ర మొదలైనవి.
జీవితాల్లో ఎంతో చిన్నవే అనుకునే సందర్భాలు, సంఘటనలు, సన్నివేశాల్ని కథలుగా మలచి, వాటిలో సహజత్వంతో తొణికేలా ఆయా పాత్రల్ని సజీవంగా సృష్టించినందుకు ఈ సంపుటం సాహిత్య అకాడమీ పురస్కారానికి అర్హత పొందింది.
* * *
It feels like I just read the book itself – అశోక మిత్రన్ గారి కథల సంపుటి ‘నాన్నగారి స్నేహితుడు’
However, I really want to read the actual book because of Sahithya Academy award.
LikeLike